కథన కుతూహలం -4
– అనిల్ రాయల్
పూర్వనీడలు పరుద్దాం రా!
“పొదల మాటునుండి రెండు కళ్లు తననే గమనిస్తున్నాయని అప్పుడతనికి తెలీదు”
యండమూరి వీరేంద్రనాధ్ నవలలు విచ్చలవిడిగా చదివిన వాళ్లందరికీ చిరపరిచితమైన వాక్యమిది. అచ్చంగా ఇదే కాకపోయినా, ఇంచుమించు ఇటువంటి వాక్యాలు ఆయన నవలల్లో తరచుగా ఎదురవుతుంటాయి. నాకు తెలిసినంతవరకూ తెలుగులో ఫోర్ షాడోయింగ్ ప్రక్రియని ప్రభావశీలంగా వాడుకున్న- కొండొకచో దుర్వినియోగ పరచిన – రచయితల్లో అగ్రగణ్యుడు యండమూరి (నా పరిజ్ఞానం అంతవరకే పరిమితం. పాపము శమించుగాక!)
పందొమ్మిదో శతాబ్దపు ప్రముఖ కథా రచయిత ఆంటన్ చెకోవ్ కథల్లో క్లుప్తత ఆవశ్యకత గురించి నొక్కివక్కాణిస్తూ ఓ మాటన్నాడు: “మీ కథలో తుపాకీ ప్రస్తావన గనుక వచ్చిందంటే, కథ పూర్తయ్యే లోపు అది పేలి తీరాలి!”. కథలో అనవసరమైన ముచ్చట్లేమీ ఉండకూడదని చెకోవ్ ఉద్దేశం. ఇదే ‘చెకోవ్స్ గన్’ ఉపమానాన్ని తిరగేసి మరోరకంగానూ చెప్పొచ్చు: “మీ కథ చివర్లో తుపాకీ పేలిందంటే అంతకు ముందే దాని ప్రస్తావన వచ్చి తీరాలి!”. ఇదే ఫోర్ షాడోయింగ్, లేదా తేటతెలుగులో ‘పూర్వనీడలు పరవటం’. దీనికి బ్రహ్మాండమైన ఉదాహరణ ‘అతడు’ సినిమాలో కనిపిస్తుంది. ఆల్రెడీ గుర్తొచ్చేసుండాలి మీకు.
కథకుల తూణీరాల్లో ఉండాల్సిన బాణాల్లో ఫోర్ షాడోయింగ్ ఒకటి. కొన్ని రకాల కథనాలని పదునెక్కించాలంటే దీన్నెలా వాడాలో తెలిసుండటం అవసరం.
ఇంతకీ కథనం అంటే ఏమిటి?
చాలా తేలిగ్గా చెప్పాలంటే – ‘కథనం’ అంటే కథలో సంఘటనలు జరిగే క్రమం. ‘ఓస్, అంతేనా’ అంటే ఇంకా చాలా చాలా చెప్పొచ్చు. కానీ మన ప్రస్తుత అవసరానికి ఈ నిర్వచనం సరిపోతుంది.
మొదట్లో జరిగే ఓ సంఘటన, ముగింపులో జరిగే మరో సంఘటన, ఆ రెండింటి మధ్యా జరిగే ఇతర ఘటనలు. ఏ కథలోనైనా ఉండేవి ఇవే. ఆయా సంఘటనల్ని వరుసగా చెప్పుకుంటూ పోవచ్చు, లేదా ముందువెనకలుగానూ చెప్పుకు రావచ్చు. ఎలా చెప్పినా, ఆ కథనం పాఠకుడిలో కుతూహలాన్ని కలగజేయాలి. తెలివైన కథకుడు ఏ వివరాన్ని ఎప్పుడు ఏ మోతాదులో బయటపెట్టాలో తెలిసినవాడై ఉంటాడు. కథలోని సంఘటనల కాలక్రమంతో కబడ్డీ ఆడుతూ దాన్ని రక్తి కట్టిస్తాడు. ఈ కబడ్డీలో కొన్ని పట్లున్నాయి. వాటిలో అందరికీ తెలిసినది ‘ఫ్లాష్‌బాక్’ అయితే, మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్న ‘ఫోర్ షాడోయింగ్’ అనేది మరో పట్టు. ఇవి రెండే కాక మరో మూడ్నాలుగు ‘కాలక్రమ కబడ్డీ పట్లు’ కూడా ఉన్నాయి. వాటి గురించి వీలునుబట్టి మరెప్పుడైనా ముచ్చటించుకుందాం.
ఒకరకంగా, ఫోర్ షాడోయింగ్ అనేది ఫ్లాష్‌బాక్‌కి వ్యతిరేక ప్రక్రియ. మతిమరపు కథానాయకుడి నెత్తిన ప్రతినాయకుడు కొట్టిన దెబ్బకి గతమెరుపు మెరవటం చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అద్గదిగో … ఆ రింగుల రంగులరాట్నమే ఫ్లాష్‌బాక్. ఈ విధానంలో – రచయిత గతంలో గడచిపోయిన కీలక ఘట్టాన్నొకదాన్ని కథలో అవసరమొచ్చినప్పుడు విప్పిచెబుతాడు. కథని ఆసక్తికరంగా మలచటానికి ఇదొక మార్గం. దానికి భిన్నంగా, ఫోర్ షాడోయింగ్ ప్రక్రియ ద్వారా రచయిత కథలో తర్వాతెప్పుడో ఎదురవబోయే సంఘటనలు, జరగబోయే పరిణామాలపై ముందస్తు అవగాహన కలగజేస్తూ పాఠకుల్లో ఉత్కంఠ, ఆసక్తి నింపుతాడు. సాధారణంగా, ఫ్లాష్‌బాక్‌లో పూర్తి స్థాయి సన్నివేశాలు దర్శనమిస్తాయి. ఫోర్ షాడోయింగ్ మాత్రం చిన్న చిన్న వాక్యాల ద్వారానే చేయొచ్చు.
ఈ ‘పూర్వనీడల’ ప్రక్రియని స్థూలంగా రెండు విధాలుగా వాడొచ్చు. అది ఫోర్ షాడోయింగ్ అని చూడగానే తెలిసిపోయేలా వాడటం ఒక రకం. ఇది ఉత్కంఠ పోషించటానికి పనికొచ్చే పద్ధతి. ఈ వ్యాసం మొదట్లో ఎదురైన యండమూరి శైలి వాక్యం దానికో ఉదాహరణ. ఈ విధమమైన పూర్వనీడలు పరవాలనుకునే కథకుడు గుప్పిట ఎంతవరకూ తెరవాలనేదీ బాగా కసరత్తు చేయాలి. “ఏం జరగబోతోంది?” అనేదీ ఉత్కంఠే, “ఎలా జరగబోతోంది?” అనేదీ ఉత్కంఠే. కాకపోతే మొదటిది కాస్త ఎక్కువ ఉత్కంఠ పుట్టించే విషయం. ఫోర్ షాడోయింగ్ మరీ ఎక్కువైపోతే ఉత్కంఠ స్థాయి పడిపోతుంది; తక్కువైతే ఉత్కంఠే ఉండదు. కాబట్టి సమతూకం సాధించటం ముఖ్యం.
అయితే, కొన్ని రకాల కథలకి ఉత్కంఠతో పనుండదు. ఇటువంటి కథల్లోనూ ఫోర్ షాడోయింగ్ చేస్తూ, కథ ఎటు దారితీస్తోందీ పాఠకులకి చూచాయగా తెలియజేయొచ్చు. ఇది రెండో పద్ధతి. ఈ తరహా పూర్వనీడలు అదృశ్య సిరాతో రాసిపెట్టిన వాక్యాల్లా కథలో దాక్కుని, రెండోమారు ‘వెలుగులో’ చదివినప్పుడు మాత్రమే కనబడి పాఠకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. నా ‘శిక్ష’ (goo.gl/kVEZ3S) కథలో ఈ రకమైన ఫోర్ షాడోయింగ్ కనబడుతుంది. ఇదే రకం అమాయకపు పూర్వనీడలు తొంగిచూసే మరో తెలుగు కథ, శివ సోమయాజుల (యాజి) రచించిన ‘పగడ మల్లెలు’ (goo.gl/2vlSb6).
వ్యక్తిగతంగా, నాకు కథల్లో పూర్వనీడలు పరవటమంటే సరదా. నా కథలన్నిట్లోనూ ఫోర్ షాడోయింగ్ కనిపిస్తుంది. ఉదాహరణకి ‘ప్రళయం’ (goo.gl/8rqOLP) ప్రారంభ వాక్యాలు చూడండి:
“ఈ ద్వారము తెరచిన ఎడల అమ్మవారు ఆగ్రహించును. లోకమునకు అరిష్టము దాపురించుము. ఓ మానవా, వెనుకకు మరలుము”
కథ ఎత్తుగడలోనే ఈ వాక్యాలు కనబడటం వల్ల పాఠకుల్లో ఆసక్తి కలుగుతుంది. తర్వాత జరగబోయేదానిపై చూచాయగా ఓ అంచనా ఏర్పడుతుంది. అది వాళ్లు మిగతా కథ చదివేలా ప్రేరేపిస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఒకటుంది. పాఠకుడికి ఓ అంచనా కలిగించాక దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ చేరుకోవలసిందే. లేకపోతే అతన్ని మోసం చేయటమే అవుతుంది. ఉదాహరణకి, పై వాక్యాలు ఓ ద్వారమ్మీద కనబడే అక్షరాలు. కథ మొదట్లో వాటినంత ప్రముఖంగా చూపించి, తర్వాత కథంతా దానికి సంబంధం లేకుండా నడిపించేసి, ఆనక తీరిగ్గా “కథానాయకుడు దారిన పోతుంటే అతని కళ్లబడ్డ సవాలక్ష చిల్లర వివరాల్లో అదీ ఒకటి, అంతకు మించిన ప్రాముఖ్యత దానికి లేదు” అని చప్పరించేస్తే కుదరదు. అప్పుడది ఫోర్ షాడోయింగ్ అవదు. ఫోర్ ట్వంటీ యవ్వారం అవుతుంది. పూర్వ నీడల పేరుతో పాఠకుల్ని మోసబుచ్చజూస్తే కథకుడి క్రెడిబిలిటీపై క్రీనీడలు కమ్ముకుంటాయి.
‘ప్రళయం’ కథలోనే మొదటి చాప్టర్‌లో ఈ క్రింది వాక్యాలొస్తాయి:
***
ఈ మధ్య భారతదేశం ప్రయోగించిన తొలి వ్యోమనౌక కూడా ఇక్కడ దిష్టి తీయించుకున్నాకే పైకెగిరింది. శాస్త్రవేత్తలు సొంత శక్తియుక్తుల కన్నా శక్తిస్వరూపిణి మహిమల్నే నమ్ముకోవటం వింతే. నాకలాంటి మూఢనమ్మకాలేం లేవు. ఒకే ఒక గాఢ నమ్మకం మాత్రం ఉంది: డబ్బు.
***
ఇక్కడ వ్యోమనోక ప్రస్తావన వేరే contextలో ఉన్నట్లు కనిపించినా, దాని అసలు ప్రయోజనం కథ చివర్లో తెలుస్తుంది. ఇదొక రకం ఫోర్ షాడోయింగ్.
చివరగా – కథలో ఫోర్ షాడోయింగ్ దేనికి అవసరం, దేనికి అవసరం లేదు అనేది గుర్తెరగటం ముఖ్యం. సాధారణంగా కథకి అత్యంత కీలకమైన విషయానికి ఫోర్ షాడోయింగ్ వన్నె తెస్తుంది. ప్రతి చిన్న విషయానికీ పూర్వనీడలు పరుస్తూ పోతే కథ పొడుగు పెరగటం, పాఠకులకి చిర్రెత్తటం తప్ప ఒరిగే ప్రయోజనం ఉండదు.
*****
(సారంగ, తపన రచయితల కర్మాగారం ఫేస్ బుక్ గ్రూపు లలో ప్రచురితం-)
అనిల్ ఎస్. రాయల్ నివాసముండేది శాన్ ఫ్రాన్సిస్కో తీర ప్రాంతంలో. 2009లో ‘నాగరికథ’తో మొదలు పెట్టి 2021లో ‘Annie’ (ఆంగ్ల కథ) వరకూ పదకొండు కథలు రాశారు. అడపాదడపా మాత్రమే రాస్తుండే వీరి కథలు ఎక్కువగా సైన్స్, సస్పెన్స్ మేళవింపుతో నడుస్తుంటాయి. అనిల్ ఇతర కథల్లో కొన్ని: ‘రీబూట్’, ‘ప్రళయం’, ‘శిక్ష’, ”రాక్షస గీతం”.