కథాకాహళి- 23
అసామాన్య వస్తు, శిల్పవైవిధ్యాలు సామాన్య కథలు
– ప్రొ|| కె.శ్రీదేవి
సామాన్య చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. నెల్లూరులో గ్రాడ్యుయేషన్ పూర్తయింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు చేసి స్వర్ణపతకం సాధించారు. అక్కడే ‘అంటరాని వసంతం – విమర్శనాత్మక పరిశీలన‘ పేరుతో ఎమ్.ఫిల్ చేశారు. “తెలుగు ముస్లిం రచయితలు-సమాజం, సంస్కృతి” అంశంపై పి.హెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. కథ, కవిత, వ్యాసం మొదలయిన ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. ఎక్కడ వున్నా, ఏం చేస్తున్నా చుట్టూ వున్న మనుషుల్లోని సృజనాత్మక కోణాల్ని దర్శించడం సామాన్య అభిరుచి. అసాధారణమైనవిగా వుండికూడా సాధారణంగా కనిపించే అంశాలల్లోని విలక్షణతల్ని కథలుగా మలచడం ఈమె ప్రత్యేకత. కథ కోసం కథ కాక తనకు తెలిసిన జీవితాన్ని చెప్పితీరాలన్న పట్టుదల ఈమె రచనలకు ప్రేరణ. ఈ సత్యం తెలిసిన రచయిత్రి అయినందున కథనరీతుల్లో అనేక ప్రయోగాలు చేశారు. తత్ఫలితంగా సామాన్య కథల్లోని పాత్రలు పాఠకులకు సన్నిహితంగా వచ్చి విభిన్న భావోద్వేగాలకు లోను చేస్తాయి. ఇటీవలే ఆమె రాసిన ’అంటరాని వసంతం విమర్శనాత్మక పరిశీలన‘ ఎమ్.ఫిల్ సిద్ధాంత గ్రంథం, ‘మహిత‘ కథాసంపుటి అచ్చయ్యాయి. ఇది సామాన్య మూడో పుస్తకం. తొలి కథా సంపుటి “కొత్తగూడెం పోరగాడికో ప్రేమలేఖ”.
ప్రకృతిని పరిశీలించడం, మనుషుల్ని చదవడం, స్త్రీల అంతర్గత సంఘర్షణలు, అవ్యక్త ఆకాంక్షల అభివ్యక్తికి ఈమె ఎంచుకున్న వాహిక. ప్రాంతం ఏదైనా ఆ పరిసరాలతో సంలీనం కావడం ఈమె స్వాభావిక లక్షణం. భాష ఏదైనా అందులోని సహజత్వాన్ని సంతరించుకోవడం ఈమె శైలికి అదనపు సోయగాన్ని అందించింది.
స్త్రీ తనకు మనసుకు నచ్చిన విషయాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు, పదే పదే అసంఘటనను మననం చేసుకున్నపుడు చాలా బలంగా వాళ్ళ మనో గమనంలో స్థిరపడుతుంది. ఆ బరువును మోయలేనప్పుడు లేక ఆభావ సంఘర్షణా స్థాయి గరిష్టంగా పెరిగినపుడు తన చుట్టూ వున్న సమాజం తనకు నచ్చకుండా పోతుంది. చివరికి పరిస్థితులలోని అననుకూలతలను సర్దుకు పోయేంతశక్తి కూడా పూర్తిగా నశించినప్పుడు మనస్సులో గూడు కట్టుకున్న సంఘటన ఒకస్పష్టమైన రూపం తీసుకుంటుంది. తనతో మాట్లాడుతుంది. సంఘర్షిస్తుంది. ఆ సంఘర్షణలోనే తాను స్వాంతన పొందగలుగుతుంది. ఆస్వాంతనలోనే సంతోషంగా జీవించగలుగు తుంది. ఇదేస్థితి “పుష్పవర్ణమాసం” కథలోని వీణాధారి జీవితంలో చిత్రించడం జరిగింది.
స్త్రీల జీవితంలోని ఖాళీని, లేదా ప్రేమరాహిత్యం వలన కలిగిన అసంతృప్తిని అంగీకరించలేని పితృస్వామిక సమాజం గాలి, దూళి, దెయ్యం అనే పేర్లు పెట్టి స్త్రీలను మానసికక్షోభకు గురి చేసి, హింసిస్తుంటుంది. ఈవిషయంలో దీర్ఘకాలిక భ్రమల్లోనే ప్రత్యామ్నాయ జీవితాన్ని వెతుక్కొనే స్త్రీలు దాన్నే జీవితంగా భావించే స్త్రీలు అనేక మానసిక వైకల్యాలకు గురయ్యే అవకాశం వుంది. మరికొంతమందిలో ఈ భావతీవ్రత ఉన్మాదస్థాయికి, ప్రమాదస్థితికి చేరే అవకాశం వుంది.
కానీ ఈ కథలోని వీణాధారిలోని ప్రేమతత్వం, భావుకత అమెను ఆరాధనా స్థితిలోనే వుంచింది. ఆమె ఆరాధన, వివాహితగా వుండటంవల్ల సగటు సమాజం నుంచి ఆమోదం పొందలేక పోయింది. వింత ప్రవర్తనగా కనిపించింది. పరపురుషుడి గురించి ఆలోచించడానికి కూడా నిషిధాజ్~ఇలు జారీచేయబడ్డాయి. ఒక వ్యక్తి తనకు మాత్రమే కనిపించి తనతో మాట్లాడటం, ఆవ్యక్తి మరెవ్వరికి కనిపించకుండా, వినిపించకుండా వుండటం. అతనిపైన వీణాధారి ప్రగాఢమైన ఇష్టాన్ని పెంచుకోవడం, అతని కోసం తపనపడటం, తహతహలాడటం జరుగుతుంది. ఒంటరిగా తనలోతాను మాట్లాడుకుంటున్నట్లు గమనించిన వాళ్ళు ఆమెకు దెయ్యం ఆవహించిందని నిర్ధారించి తమ మూఢ నమ్మకాలను ఆమెపై అశాస్త్రీయ ప్రయోగాలు చెయ్యడంలో శ్రద్ధ చూపిస్తారు. అంతేతప్ప ఆమె మానసిక ప్రపంచంలోకి అడుగుపెట్టాలన్న అలోచనగానీ, ఆమె సమస్య మూలాలవరకు వెళ్ళాలన్న ఆలోచనగానీ, పరిష్కరించాలన్న శ్రద్ధ గానీ కనబరచరు. స్త్రీల పట్ల వాళ్ళ ప్రవర్తనపట్ల అమలులోవున్న మూస పితృస్వామిక రాజకీయాంశాల పరిధిదాటి ఆలోచించలేని కుటుంబసభ్యుల అవగాహనాలేమి, వీణాధారి భావుకత్వానికి గల కనిపించని సంబంధాన్ని (లిన్క్) “పుష్పవర్ణమాసం” కథలో చిత్రించబడింది.
స్త్రీలస్థితిని అర్థం చేసుకోలేని పితృస్వామిక మూర్ఖసమాజానికి అర్థం చేయించగల సామాజిక, జండర్ అవగాహనలు పెంపొందాల్సిన అవసరాన్ని పరోక్షంగా ఈకథ డిమాండ్ చేస్తుంది.
వీణాధారి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆవ్యక్తి వచ్చి పలకరించినట్లు తను భావించడం అలా తనకు మాత్రమే కనిపించడానికి గల కారణం ఆమె “పుష్పవర్ణమాసంలో” పుట్టడమేనని నమ్మినవాళ్ళు ఆమెకు దెయ్యం పట్టిందని నిర్ధారించారు. ఈవిషయాన్నే గుడికి వచ్చిన మరోస్త్రీతో వీణాధారి స్వయంగా చెప్తుంది.
వీణాధారి ఆవ్యక్తిపైన ఎంత ఇష్టాన్ని పెంచుకుందంటే, “మరుసటి రోజు నిదురలేచినప్పట్నుంచీ ఏదోదిగులు, ఒకచోట నిలువనీయని దిగులు నాకేదో కావాలి. ఏదో కాదు, నాకు అతను కావాలి, నాకు నాకే సొంతంగా అతను కావాలి అతను నావాడైపోయి నేను అతని దాన్నైపోవాలి.” అన్న ఉద్వేగంతో అమె హృదయంలోంచి లావాలా ఏడుపు పొంగుకొచ్చేసింది. ఆమె ఏడుస్తుంటే ఆ గదిలో గూడు కట్టుకున్న కోయిల ఆమెనే రెప్ప వేయకుండా చూడటం మొదలు పెట్టింది. చూసి చూసి చివరికి “అతనితో నేను చెప్తానులే ఏడవకు” అంటుంది. ఇలా ఒక పెళ్ళైన స్త్రీ పరాయి పురుషుణ్ణి ఆరాధించడం, కోరుకోవడం సమాజం జీర్ణించుకోలేదు. కాబట్టి బయటికి చెప్పలేక ఆ ఉధృతిని భరించలేక చివరికి ఊహల్లో బతకడం మొదలు పెట్టింది వీణాధారి. ఆమె దృష్టిలో అతను పరాయి కాదు. వీణాధారికి అతని పట్లగల ప్రేమ, భౌతికవాంఛను సైతం జయించగలిగిందనడానికి ఈక్రింది వాక్యాలే సాక్ష్యం.
“ఏం చేసుకుంటానతన్ని నేను, అతను నాకేం ఇవ్వగలడు? నాకు లేనిదేమిటి? మా మధ్యనున్న కిటికీని ఎవ్వరైనా తొలగించ గలరా? ఒకరికొకరం ఏం చేసుకోగలం? ఇదంతా సరే. అయినా అతను నాకు కావాలి. నువ్వు నాదానివని అతను నాకు చెప్పాలి”. దీని కోసం వీణాధారి తపించిపోయింది. తన ఇష్టాన్ని పెంచుకుంటూ పోయింది. కనుకనే భర్తకు, కుటుంబ సభ్యులకూ, సమాజాన్ని తాను ధిక్కరించి తనకు నచ్చినవాన్ని సహచరునిగా ఊహించుకుంటూ తన ఊహల్లోనే జీవిస్తూంది. ఆ విషయాన్ని జీర్ణించుకోలేని ఈ సమాజం అందరూ అంగీకరించే దెయ్యం,భూతం పేరుతో సంతృప్తి చెందింది. తమఇష్టాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనిచోట స్త్రీలు తమదైన ప్రపంచాన్ని సృష్టించుకొని బ్రతకడానికిగల కారణం పరుస్త్గుతులను ఎదిరించలేని మానసిక దుర్భలత్వం. తనలోతానుగా వెతుక్కుంటున్న ప్రత్యామ్నాయ క్రమాన్ని సామాన్య ఈకథలో బహిర్గతం చేశారు.
అందమైన ఇల్లు. ఇంట్లో ఆకర్షించే అమరికలు. అందులో అందమైన పడకగది. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో చిన్న ఎక్వేరియంలో చిరుచేప లంటి జీవితం నీలిమది. పడక గది మీదుగా అల్లుకున్న మల్లెతీగ కిటికీ దాటుకొని వెళ్లిపోయింది. గదిలో మంచంపై చిన్న ఎక్వేరియంలోని నీలిమను పరికిస్తూ, పలకరిస్తూ తను. ఎదురుగా జామ చెట్టుకొమ్మపైన అస్తిమితంగా అటూ ఇటూ దిక్కులు చూస్తున్న పసుపు రంగు పిట్ట. -వైవాహిక జీవితం స్త్రీకి పంజరపు బతుకులాంటిదన్న సూచన ఇక్కడ ఉంది. తరువాత కథకిది నేపథ్యాన్నందిస్తుంది. కథలలో అందమైన వర్ణనలు కనిపిస్తాయి. నెమళ్లు, కోయిలలు, రకరకాల పక్షులు, సంపెంగలు, మల్లెతీగెలు మామిడిచివుళ్లు, , రకరకాల రంగురంగుల కలయికలు. మేఘాలు మొదలైన ప్రకృతిగత అంశాలు కనిపిస్తాయి. అందమైన వాతావరణం వెనుక విషాదాన్ని వర్ణించడం రచయిత్రి అవలంభించిన పద్ధతులలో ఒకటి. కొన్ని కథలలోని సాహిత్య వాతావరణం కథోద్దేశ్యాన్ని ఉద్దీపింపజేస్తాయి. ప్రసిద్ధ కవుల కవితా పంక్తులు అలవోకగా కథలలో దొర్లుతాయి. కథాసందర్భంలో, కథనంలో కలిసిపోతాయి.
గురజాడ, ఉమర్ అలీషా, శ్రీశ్రీ, బాలగంగాధర తిలక్, ఎంకిపాటలు, రావిశాస్త్రి, గద్దర్, గోరేటివెంకన్నలతోపాటు భవయ్య వంటి బెంగాలీ జానపద గీతాలు కథలలో సందర్భాను సారంగా ప్రసక్తమవుతాయి. బహువిధాలుగా సాహిత్యాన్ని ప్రస్తావించిన తీరు ఆధునిక తెలుగు సాహిత్యంపైన రచయిత్రికి గల ఆసక్తిని, అభిరుచిని తెలియజేస్తాయి.
తొలిదశలోనే తనదంటూ ఒక ప్రత్యేకమైనశైలిని రూపొందించుకుంది సామాన్య. నిరాడంబరమైన, సరళమైన శైలిలోనే ఈమె కథలు విషాదాన్నిపంచుతాయి. విషాద జీవితాలను చిత్రించే సందర్భాలలో కూడా భావోద్విగ్నతను ప్రదర్శించని సంయమనం కనిపిస్తుంది. సంఘటనలు సర్వసాధారణంగా జరిగిపోతున్నట్టు ఉంటాయి. అందులోనే గంభీరమైన జీవితం దర్శనమిస్తుంది.
ఈమె రచనలలో స్త్రీపరమైన కథలు ఎక్కువగానే కనిపిస్తాయి. కొన్ని కథలు ప్రత్యేకంగా ఒకస్త్రీ చుట్టూనే తిరుగుతాయి. స్త్రీ వ్యక్తిత్వం, అస్తిత్వం, స్వేచ్ఛ, జీవిత సంఘర్షణ, ఒంటరి పోరాటాలు, అసహాయత, అణచివేత, హింస ఈమె కథలలోని వస్తువులు. ఎక్కడా సిద్ధాంత ప్రవచనాలు కనపడవు. వ్యక్తుల అనుభవాలుంటాయి. సన్నివేశాలు, సంఘటనలలో జీవితం ఉంటుంది.
ఉత్తమ పురుష కథనంలో ప్రవాహంలాగా సాగిన విషాదగాధ ‘మహిత‘ కథాంశం. మహిత తన మరణానంతర వృత్తాంతాలను కూడా చెప్పడం కథాకథనంలోని వైవిధ్యం. స్థానీయ జీవితాన్ని చిత్రించడంలో మాండలికం నిర్వహించే పాత్రను ‘మహిత‘ కథ తెలియజేస్తుంది.
పితృస్వామ్య వ్యవస్థలో పురుషాధిపత్య భావజాలం కారణంగా ప్రాణాలు కోల్పోయిన మహిళ కథ ‘మహిత‘. ఈమెకు బాల్య వివాహం, అది కూడా రెండో పెళ్ళివాడు. ముప్పైయేళ్ళ వయస్సున్నవాడు. పదహారేళ్ళ పడుచు మహిళను కట్నం లేకుండా పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికి మహిత మనస్సులో పెళ్ళంటే ‘అప్పుడు చామంతి పూలతొట్లు నాకిష్టమైన చోట పెట్టగలను కదా అని నా ఉద్దేశ్యం‘ అందుకే పెళ్ళంటే ఇష్టమని అన్న ఆలోచనల్లో వున్నానని తన స్వగతాన్ని తెలుపుతుంది. పెళ్ళంటే సరైన అవగాహన లేని ఆమెకు పెళ్ళైన నాలుగు రోజులకే నరకం కనిపిస్తుంది. భర్త దుర్మార్గాన్ని భరించలేకపోతుంది. తల్లిదండ్రులతో చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. రెండేళ్ళ తరువాత మామయ్య చనిపోయాడని తెలిసి వాళ్లవాళ్ళే అందరూ కలిసి అక్కడే, మెట్టినింట్లోనే మహితను వుంచేశారు. అదే ఆమె మరణానికి కారణమైంది.
రెండో పెళ్ళి చేసుకోవాలనే కోరికతో భర్తే బలవంతంగా ఆమెను చంపేశాడు. మహిత తల్లిదండ్రులు కేసు పెట్టారు. చివరికి కేసులో కూడా లంచాలిచ్చి గెలిచాడు. మహితలాంటి మరో అమ్మాయి తన కామవాంఛకు బలైపోవాల్సి వస్తుంది. న్యాయానికి చోటు లేని సమాజంలో ఇలాంటి ఆడపిల్లలకేం న్యాయం జరుగుతుందన్న వాస్తవాన్ని ఈ కథ మరోసారి నిరూపించింది.
పెళ్ళంటే, మొగుడంటే, ఒక బలత్కారానికి, దుర్మార్గానికి, అన్యాయానికి ప్రతీకలయ్యాయి ఈకథలో. ఈదుర్మార్గుడు మహితను చంపేసిన సంవత్సరానికే అలాంటి మరో అమ్మాయికి అపద్దాలు చెప్పి పెళ్ళి చేసుకొంటాడు. కేసు వెనక్కి తీసుకోమని బతిమలాడడానికి పురమాయించాడు. అంతటి దుర్మార్గమైన ఆలోచనలు పురుష అహంకారం మూర్తీభవించినవాడు మహిత భర్త. భార్యంటే తన లైంగిక వాంఛలు తీర్చుకోడానికి మాత్రమే ఉపయోగపడే ప్రాణమున్న బొమ్మ. కొట్టైనా కోరిక తీర్చుకోవాలనుకుంటాడు. బోర్ కొట్టిందని, చేతిలో వున్న బొమ్మను బద్దలు కొట్టి మరో బొమ్మను తెచ్చుకోవాలన్నంత సులభగామిత్వ (టేకిట్ ఈజీ అటిట్యూడ్ ) మనస్తత్వం .
మహిత భర్త లాంటి పురుషాధిపత్య భావజాలం కలిగిన సమాజ స్వభావాన్ని సామాన్యంగా జంతువులకు అనువర్తింపజేస్తుంటాం. చీటికీ, మాటికి “పశువులాగ మీద పడ్డాడు, ఎద్దు ముండాకొడుకు లాంటి మాటలు అంటుంటాం. కానీ అది చాలాతప్పు. అమానవీయంగా ప్రవర్తించే పురుషుల కంటే పశువులు చాలా మంచివని మహిత అభిప్రాయం. ఆ ఎద్దుకి ఉన్న బుద్ధి ” మాఆయనికి ఉండిందా మా ఆయనకంటే నేను పద్నాలుగేళ్ళు చిన్నదాన్ని కదా! నాదేం తప్పు? వాళ్ళమ్మోళ్ళు పెళ్ళి చేసుకోనీలేదని. ఆ కోపమంతా నా మీద చూపించొచ్చా? అసలు మనుష్యులేనా? కాదా” అని మహిత నిశ్శబ్దంగానే పురుష సమాజ అమానుషత్వాన్ని నిలదీస్తుంది. అందుకు తన జీవితమే ఒక పాఠంగా తనజీవితానుభవాన్ని తనలాంటి వాళ్ళందరికీ మహిత తెలియజేసింది. ఈకథను రచయిత్రి ఆత్మకథనాత్మక ధోరణిలో చిత్రించారు.
ఆడపిల్లకు ఎవరినో ఒకరినిచ్చి పెళ్ళి చేసి పంపేయడమే గొప్ప విషయంగా ఫీలయ్యే తల్లిదండ్రులకు ఈకథే ఒక గొప్ప గుణపాఠం. భార్యపాలిట భర్త యముడుగా మారినవైనం ఈకథలో కనిపిస్తుంది. “సీతకష్టాలు” కథలో కూడా భర్త కారణంగానే బాధలు పడిన భార్య జీవితం చిత్రించబడింది. ఈకథలో సీత కథను, పీత కథను అన్వయించి రాశారు రచయిత్రి. మ్యాజికల్ రియలిజం పద్ధతిలో రాయడానికి ప్రయత్నించిన ఈ కథలన్నిటిలోను రచయిత్రి ఆత్మీయ స్పర్శ కనిపిస్తుంది. స్వీయ వ్యక్తిత్వం దర్శనమిస్తుంది. ముఖ్యంగా ’పుష్పవర్ణమాసం‘’, కొత్తగూడెం పోరగాడికో ప్రేమలేఖ’ కథల్లో రచయిత్రి కంఠస్వరం స్పష్టంగా వినిపిస్తుంది.
‘కల్పన‘ కథను ఇద్దరు ఆడవాళ్ళ మధ్య జరిగే సంభాషణల రూపంలో చిత్రించారు. ఇద్దరూ కుటుంబ సమస్యలకు బలైపోయినవాళ్ళే, పిల్లలకోసం ఉద్యోగాలు మానేసినవాళ్ళే, ఇంటిపని, పిల్లల పెంపకం, ఆడవాళ్ళ పనిగా మారిపోయింది. మగవాళ్ళ పనెందుకు కాలేకపోతోంది. కుటుంబ బాధ్యతలు ఇద్దరివీ అయినప్పుడు ఇంటిపని, పిల్లల పెంపకం బాధ్యతలల్లో వాళ్ళు భాగంకాదా అని ఎవరి తరహాలో వాళ్ళు అన్వేషిస్తూనే వున్నారు. ఈ సమస్యలకు పరిష్కారాలను వెతుకుతూనే వున్నారు కల్పనలాంటి వాళ్ళు. పెళ్ళి తరువాత స్త్రీ జీవితాల్లో వచ్చే మార్పులు, శరీరాల్లో వచ్చే మార్పులు, ఇవన్నీ కాక మానసిక వికాసంతోపాటూ నేటి స్త్రీలు ప్రపంచాలను పరిపాలించగల ప్రవీణులుగా తయారవుతున్నారు. కానీ కుటుంబ వ్యవస్థలోని ఆధిపత్యాలను ఎందుకు జయించలేక పోతున్నామోనని ఆలోచిస్తూ గెలవడానికే నిశ్చయించుకున్నారు.
ఈ కథలోని పాత్రలు పోటీ ప్రపంచాన్ని వెనుకేసి మరీ గెలిచి సాధించుకున్న ఉద్యోగాలను వదిలేశారు. స్త్రీలకి ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడంవల్ల నచ్చని జీవితాల్లో కొనసాగుతున్నారు. దీనిని గురించి “నిజమేనమ్మా మీరు సంపాదిస్తున్నారు. కనుక విడిపోతారు. మేం సంపాదించటం లేదు. కనుక చక్కబెట్టుకుంటున్నామని అప్పుడు అనిపించింది. ఉద్యోగంలో కొలీగ్స్ నో, బాస్తోనో ఇబ్బందులొస్తే మనం ఉద్యోగం వదిలేయటం లేదు కదా అన్నీ డబ్బు చుట్టూనే కదా తిరుగుతాయి. పెళ్లి అనే బిజినెస్ సక్సెస్ ఎందుకు కాకూడదు” అని స్త్రీలు ఉద్యోగాలు, పిల్లల పెంపకం ఇంటి బాధ్యతలు అనే రెండు పడవలలో ప్రయాణం చేస్తున్నారని దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తలుస్తూ ఉద్యోగం లేకపోతే చేయిచాచి అడుక్కోకుండా ఉండాలని ఇంట్లో వుండే సంపాదించుకొనే మార్గాలను, ఇతర కోర్సులను అన్వేషిస్తున్నారు. అయినప్పటికీ జీవితం ఎప్పుడూ రెండు పడవల ప్రయాణమనే విషయాన్ని ఈకథలో సామాన్య తేల్చారు. చివరికి ఏపడవ కావాలో, ఏది వద్దో నిర్ణయించుకోవడానికైనా చదువు అనే సాధనం కావాలని ప్రతీస్త్రీ అందుకోసమైనా చదవాలని ఈ కథ ద్వారా సామాన్య బలంగా చెప్పారు.
వైవాహిక జీవితంలో స్వేచ్ఛ పరిమితమైపోయిన చదువుకున్న మధ్యతరగతి స్త్రీల నిర్వేదం వుంది. బతుకే నిరంతర పోరాటమైన జీవితాలున్నాయి. తమ నేలకోసం, ఉనికికోసం సామాన్యులు చేసే ఎడతెగని పోరాటాలున్నాయి. రాజ్యం ఉంది. పాలనా యంత్రాంగం ఉంది. బలహీనుల అసహాయతను ఉపయోగించుకుని మనుషుల్ని పీడించి, ఉపయోగించుకునే పోలీసు యంత్రాంగం వుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా సన్నిహితుల మధ్య ఏర్పడిన అపోహలకు సంబంధించిన అనేక అంశాలు ఈమె కథావస్తువులయ్యాయి.
వర్తమాన రచయితలు కొన్నిసమస్యలు ఎదుర్కొంటున్నారు. కళాత్మకత, బుద్ధి కుశలత గల రచయితలు సమాజంలో జరిగే మార్పుల్ని సూక్ష్మంగా గమనిస్తున్నారు. అవి వ్యక్తుల బ్రతుకుల్ని ఎలా అల్లకల్లోలం చేస్తున్నాయో లోతుగా చూడగలుగుతున్నారు. చూసిన దాన్ని వాస్తవికంగా చూపగలుగుతున్నారు. నిజాయితీగా మలచగలుగుతున్నారు. వాస్తవికత, నిజాయితీ గల రచనలు వాటంతట అవి గొప్ప రచనలు అవుతాయని కొంతమంది రచయితలు, పాఠకులు భ్రమపడటంలోనే ప్రమాదం ఉంది. మంచి కథావస్తువుతో కొనసాగే రచనలు కేవలం విషయప్రధానంగా, డాక్యుమెంటరీలుగా, లేదా పేలవంగా మిగిలి పోవటానికి కారణం కళాత్మకంగా రూపొందక పోవటమే. విషయాన్ని కొత్తగా, వైవిధ్యభరితంగా ఆవిష్కరించటం అవసరం. సన్నివేశకల్పనలో, సంభాషణ నిర్వహణలో, ప్రారంభంలో, ముగింపులో కళాత్మకత వుంటుంది. వైరుధ్యకల్పన, విలక్షణశైలి, మాంటేజ్, మాంత్రిక వాస్తవికత మొదలైన కళానిర్మాణ పద్ధతులతో కథలకు అన్వయం వుంటుంది.
మరోఅంశం తాత్వికతకి సంబంధించింది. మంచి కథలన్నీ ఉత్తమ కథలు కాలేవు. మంచి కథలు తత్కాల సమస్యల్ని వాస్తవికంగా విశ్లేషించటంలో సఫలమవుతాయి. ఆసమస్యకు సార్వకాలికత్వం ఉండదు. ఉత్తమ కథలు సమస్యల లోతుల్లోకి ప్రయాణించి వాటికి, సర్వమానవ సమూహాలకుగల సంబంధాన్ని ఆవిష్కరిస్తాయి. ఉన్నత స్థాయిలో వాటిని వ్యాఖ్యానిస్తాయి. ఆక్రమంలో సాధారణీకరణ చెందు తూ జీవన తాత్వికతని ప్రతిపాదిస్తాయి.
*****
కె.శ్రీదేవి ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. స్వస్థలం కడప. 12 పుస్తకాలు రాశారు. మూడు పుస్తకాలు ఎడిట్ చేశారు. ఆరు అవార్డులు అందుకున్నారు. 112 ఆర్టికల్స్ రాశారు.