ప్రియురాలి కోర్కె తీర్చని ప్రియుడూ ఒక ప్రియుడేనా?? వెంటనే ఆమె కోర్కెను తీర్చేందుకు గంధర్వుడు ఎటువంటి
ప్రయత్నాలు చేశాడు?? అతని ప్రయత్నాలకూ, చంద్రోత్సవానికీ లంకె ఏమిటి?? ఇదే ఆ చంద్రోత్సవ కావ్య కథావస్తువు.
ఈ కావ్యము మణిప్రవాళ శైలిలో ఉంటుందట!! కథలోని విశేషాలు చెబుతూనే భాషా,చారిత్రక సంబంధమైన విశేషాలు
విపులీకరించటం పుట్టపర్తి వ్యాసాలలోని ప్రత్యేకత. ఈ మణిప్రవాళ శైలి కావ్యపద్ధతిని సృష్టించినవారు నంబూద్రీలేనంటారు
వారు. నంబూద్రీలకు సెందమిళ్ భాషతో పొత్తు కుదరలేదు. తాము ఆర్యావర్తం నుంచీ వచ్చినవారమనీ, తమిళం ద్రావిడ
ప్రాంతం భాష అనీ వాళ్ళ అభిప్రాయమట!! అందుకని నంబూద్రీలు, దేశ భాషలోకాక సంస్కృతంలోనే రచనలు చేసేవారట!
ఈ మణిప్రవాళ శైలి కావ్యపద్ధతిని సృష్టించినవారు నంబూద్రీలేనంటారు పుట్టపర్తి వారు.
సంస్కృతంలో రచనలు చేస్తుండగా, క్రమ క్రమంగా పామర జనంతో నంబూద్రీలకు సంబంధాలు లేకుండా పోవటం
గమనించి యీ సమస్యను ఎదుర్కొనేందుకు నంబూద్రీలు, ‘కొడుందమిళ్’ ను సంస్కృతానికి చేర్చి, రచనలు చేయటం
మొదలెట్టారు. అదే మణిప్రవాళం గా తరువాతి కాలంలో పిలువబడిందట!!
ఈ చంద్రోత్సవ కావ్య కర్త విషయమై ఎన్నెన్నొ చర్చలు, పరిచర్చలూ ఉన్నా, కావ్య కర్త ఒక నంబూద్రి అని మాత్రం
స్పష్టమట! ఇటువంటి విశేషాలతోపాటు చంద్రోత్సవ కావ్యంలోని సొబగులను కూడా ఎప్పటికప్పుడు పుట్టపర్తి తన నోట్స్ లో
పొందుపరచుకుంటూ ఉండేవారనటానికి, వారు ఆ కాలంలో తయారు చేసుకున్న వ్రాత ప్రతులే తార్కాణాలు.
కార్యాలయంలో పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవటం వల్ల, పుట్టపర్తి తీరిక వేళనంతా ఇలా కేరళ సాహిత్యాధ్యయనంలో
గడిపివేస్తూ తీరికలేకుండ ఎప్పుడూ పనిలో నిమగ్నమైఉండేలా చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న యీ సమయంలో
మధునాపంతులవారికి తిరువాన్ కూరు వాసిగా మలయాళం లెగ్సికన్ ఆఫీస్ లో ఎటిమాలగిస్త్ హోదాలో వారు వ్రాసిన ఒక
లేఖలో (1-7-1955) అప్పటికి తాను జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, వ్రాసిన రచనలు, తన మానసిక స్థితీ అన్నీ వివరంగా
వ్రాశారు.అందులోనే, నిర్వేదంగా ‘నేడు తిరువాన్ కూరు, రేపేదో!’ అని కూడా వ్రాశారు. అలా ఎందుకు వ్రాశారో కానీ,
ఆ తరువాత కొన్ని రోజులకే ఒక లేఖ అందుకున్నారు, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారినుంచీ!! ఢిల్లీ కేంద్ర సాహిత్య
అకాడమీలో ఉత్తర భారత దక్షిణ భారత భాషలన్నిటిలో సమాన అధికారం ఉన్న గ్రంధాలయ అధికారి అన్వేషణలో ఉన్నట్టూ,
ఆ పోస్ట్ కు మీరే సరైనవారని నాకు తోచి, మీ పేరు వారికి తెలిపాననీ,త్వరలో వారినుండీ పిలుపు రావచ్చుననీ వ్రాశారు –
వారాలేఖలో!!
ఈ లేఖను చూసి సందిగ్ధంలో ఉన్నంతలోనే, ఢిల్లీ సాహిత్య అకాడమీ నుండీ, అధికారిక లేఖ వచ్చింది. అక్కడి భారతీయ భాషా గ్రంధాలయంలో ద్రవిడ, ఉత్తర భారత భాషలు తెలిసిన ఉద్యోగి కోసం వెదుకులాటలో, సలహా మండలి సూచన మేరకు, తనను ఆహ్వానిస్తున్నట్టుగా ఆ లేఖ లో ఉంది.
రోగి కోరుకున్నదీ – వైద్యుడు ఇచ్చినదీ ఒకటే అన్నసామెత చందాన, యీ వార్త పుట్టపర్తికి కాస్త నెమ్మదినే ఇచ్చింది.
కానీ, రాజీనామాచేసి మళ్ళీ రామకృష్ణా హైస్కూల్ లో మర్రిచెట్టుకింద పాఠాలు చెప్పుకుందామని ఆలోచిస్తున్న సమయంలో
యీ వార్త !! ఆలోచించుకునే సమయం కూడా లేదు. వెంటనే వెళ్ళీ చేరవలసి ఉంటుందేమోనన్న సూచన కూడా మల్లంపల్లి
వారు చేసి ఉండటం వల్ల, ఆ లేఖను తన రాజీనామా పత్రం తో పాటు సూరనాడ్ కుంజన్ పిళ్ళై వారి ముందు వుంచారు
పుట్టపర్తి. సూరనాడ్ కుంజన్ పిళ్ళై గారి సహాయం కూడ ఇందులో ఉందని తనకు లీలగా తోచిందట!!
పుట్టపర్తి పరిస్థితిని గమనిస్తున్న సూర్ నాడ్ కుంజన్ పిళ్ళై గారు కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టక, పుట్టపర్తి
రాజీనామాను అంగీకరిస్తూ, ఢిల్లీ వెళ్ళేందుకు అనుమతినిచ్చారట వెంటనే!!
అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతి. సర్వేపల్లి గారూ, రాళ్ళపల్లి గారూ, తన తండ్రి గారూ –
బెంగళూరులో కొన్ని రోజులు కలిసి పనిచేశారు. ఢిల్లీలో ఉంటే, రాధాకృష్ణన్ గారి వంటి తెలుగు ఉద్దండ
పండితోత్తమునితో పరిచయ భాగ్యం కలుగవచ్చునన్న ఉద్దేశంతో కూడా పుట్టపర్తి ఢిల్లీ ఉద్యోగానికి వెంటనే అంగీకారం
తెలిపారు!!
తాను అక్కడినుంచీ ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఏర్పాటు చేసిన సభలో సూరనాడ్ కుంజన్ పిళ్ళై ..’మీ తెలుగు వారు మిమ్ములను గుర్తించకున్నా, నేను, మిమ్ములను ఒక మళయాళ భాషా వేత్తగా సగౌరవంగా, కేంద్ర సాహిత్య అకాడమీకి మిమ్ములను ఇక్కడినుంచీ పంపుతున్నాను. మీరు వెళ్ళటం, నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు, కానీ, మీకు ఇది మరింత చక్కటి అవకాశం కాబట్టి ఇష్టం లేకున్నా, మిమ్ములను ఢిల్లీకి పంపుతున్నాను..’ అన్నారు !!
తప్పనిసరి పరిస్థితుల్లో , ఢిల్లీకి వెళ్ళేటప్పుడు సూరనాడ్ కుంజన్ పిళ్ళై గారు, గోపాల పిళ్ళై గారు ఇరువురూ, పుట్టపర్తి గారికి అద్భుతమైన యోగ్యతా పత్రములిచ్చారు కూడా!!
కొన్ని రోజుల్లోనే పుట్టపర్తి ఢిల్లీ వాసం మొదలైంది. అక్కడ చేరి కాస్త స్థిరపడిన తరువాతే కడపకు యీ విశేషాలన్నీ తెలుపుతూ లేఖ వ్రాశారు పుట్టపర్తి.
ఇక, ఢిల్లీ కార్యాలయం బాగానే ఉం ది.! హిందీ యే కాదు, భారతీయ భాషలలోని సువిఖ్యాత కవులందరూ అక్కడికి వచ్చి వెళ్తూనే ఉంటారు!! అందరినీ కలుసుకోవటం, ఎంతో బాగుంది !!
భోజనానికి ఇబ్బంది లేదు. !! ఒక తెలుగావిడ, షిర్దీ బాబా భక్తురాలు ఇంటిలో నివాసం. తన భోజనాదికాలు కూడా అక్కడే జరుగుతున్నాయి కాబట్టి, కేరళ లో కంటే, మన వంటలతో భోజనం తృప్తికరంగా ఉంది !!
అక్కడ పుట్టపర్తి ఉద్యోగ జీవితం కాస్త గాటిలో పడ్డట్టే స్థిమితంగా ఉండగా, ఇటు కడపలో కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
కరుణాదేవి, పట్టుపట్టి, హైద్రాబాద్ రెడ్డి కళాశాలలో డిగ్రీ చదివేందుకై వెళ్ళింది! ఆడపిల్లను, ఎక్కడో పెట్టి చదివించటం, ఫీజులు కట్టటం – ఇవన్నీ తనకు సాధ్యమయ్యే పనులు కావని ఎంతగా నచ్చజెప్పినా ఆమె పట్టు వదలనేలేదు. అక్కడ, అవ్వగారి ఇంట్లోనే ఆమె ఉండటం!! డిగ్రీ చదివించే ఆర్థిక స్తోమత లేదని చెప్పినా వినలేదామె!! ఆఖరికి, అవ్వ శేషమ్మ తనకు భరోసాగా నిలబడటంతో, కరుణాదేవి, హైద్రాబాద్ వాసం మొదలైంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలను కూడా చదివించవలెననే శేషమ్మగారి అభిమతం కూడా!! తల్లి కూడా మనుమరాలిని సమర్థించటంతో, కనకమ్మకు ఒప్పుకోక తప్పింది కాదు. కానీ, లోపల్లోపల, ఏదో భయం!! తండ్రి ఇటువంటి నిర్ణయాలు తీసుకొనటమే క్షేమదాయకం. అలా కాక, ఇటువంటి పరిస్థితుల్లో తల్లే నిర్ణయం తీసుకుంటే, ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు, మళ్ళీ ‘అంతా ఆడపెత్తనమైతే, ఇలాగే ఉంటుంది..’ అంటుంది సమాజం!! కానీ ఇప్పుడు, తమ కుటుంబ పరిస్థితి, అందరికీ తెలిసిందే కాబట్టి, మంచైనా చెడైనా, తానే ఎదురొడ్డి నిలవాలి, అంతే!!
ఈ విషయాలన్నీ లేఖల ద్వారా తెలుపుతూ, ఒంటరిగా సంసారాన్ని నడుపుతూ, పైకి ధైర్యంగా ఉన్నట్టే కనిపిస్తున్నా స్త్రీగా కనకమ్మ మనసు కుటుంబ పరిణామాల పట్ల కాస్త విచారంలోనే ఉం డేది. ఎక్కడి తిరువనంత పురం, ఎక్కడి కడప!! పైగా ఉద్యోగ వాతావరణo బాగాలేని చోట భర్త పనిచేస్తూ, నెల నెలా డబ్బులు పంపిస్తున్నా, ఒంటరిగా, అన్ని పరిస్థితులకూ జవాబుదారీతనంతో కుటుంబాన్ని నడపటం, అప్పటి సమాజంలో కష్టదాయకమైన విషయమే కదా!! తిరువనంత పురమే దూరమనుకుంటే, ఇప్పుడు ఏకంగా ఢిల్లీలో వాసం!! అసలే చలి ప్రదేశం!! సంవత్సరంలో ఎనిమిది నెలలు చలే రాజ్యం చేస్తుందని కథలు కథలుగా వింటూనే ఉండటం వల్ల భర్త ఆరోగ్యం గురించి కూడా ఒక కొత్త చింత ఆమె మనసులో తిష్ట వేసుకుంది.
అటు ఢిల్లీలో, పుట్టపర్తి ఎక్కడికో వెళ్ళీ, నడుస్తూ వెళ్తున్నారు, బస్ స్టాండ్ దగ్గరికి!! ఇంతలో, పక్కనే ఒక నల్లటి అంబాసిడర్ కార్ ఆగింది !! ముందు సీటులో ఉన్న ఒకతను దిగి తన దగ్గరకు వచ్చి, ‘సాబ్, ఆప్కో హమారే సాబ్ బులా రహే హైన్. కార్ మే చఢ్నే కే లియే..’ అని పిలుచుకుని వెళ్ళాడు . తననిక్కడ ‘ కార్లో వెళ్దాం.. రమ్మ’ని పిలిచేవారెవరై ఉంటారా? అని ఆశ్చర్యపోతూ, కార్ దగ్గరికి వెళ్తే, వెనుక సీట్లో, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూర్చుని వున్నారు!! ఆయన దేశ ఉప రాష్ట్ర పతి. మరో మాట లేకుండా, తాను కారెక్కి కూర్చుని ఆయనతో ప్రయాణించారు!! పుట్టపర్తి తండ్రి శ్రీనివాసాచార్యులవారిని గురించి అడిగి తెలుసుకుని (ఇరువురూ బెంగుళూరులో సైంట్ జోసెఫ్ కళాశాలలో కొన్ని రోజులు కలిసి పనిచేసిన సంగతి గుర్తు తెచ్చుకుంటూ)తరువాత, సాహిత్య అకాడమీలో తన ఉద్యోగ వివరాలూ, తన సాహిత్య వ్యవసాయం ఎలా నడుస్తున్నదో ఆప్యాయంగా కుశల ప్రశ్నలూ, కుటుంబ వివరాలూ తెలుసుకుని, తన నివాసానికి దగ్గర వదిలి వెళ్ళారు కూడా!!
అప్పుడు అక్కడ అనంతశయనం అయ్యంగార్ గారు లోకసభలో మంచి పదవిలో ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి గారితో ముచ్చటలాడుతున్న సందర్భంలో పుట్టపర్తి హిందీ భాషాయోష గురించీ, తులసీ రామాయణం పై వారికున్న పట్టుగురించీ ప్రత్యేకంగా చెప్పారట వారు!! ఎం.ఏ.పరీక్షకు వారూ మినహాయింపు ఇచ్చి మరీ, పుట్టపర్తిని తమ జాతియ గ్రంధాలయం లైబ్రేరియంగా నియమిస్తున్నట్టు వెంటనే వచ్చి ఉద్యోగంలో చేరవలసినదనీ ఆహ్వానం పంపారని, యీ వివరాలన్నీ ఢిల్లీలో ఉద్యోగంలో చేరిన తరువాత తెలిశాయని పుట్టపర్తి కడపకు వుత్తరంలో తెలుపగా
భర్త ప్రతిభా వ్యుత్పత్తులకు మురిసిపోయింది, కనకవల్లీమతల్లి!!
మరో ఉత్తరంలో పుట్టపర్తి అనుభవం చదివి ఆశ్చర్యపోయారందరూ!! తాను అధికారిగా ఉన్న గ్రంధాలయంలోకి ఒక విదేశీ పరిశోధక విద్యార్థి వచ్చాడట!! విదేశీ వారిని అనుమతించరట లోపలికి!! కానీ, ఆ వ్యక్తి, పేరొందిన ఒక ప్రొఫెసర్ నుంచీ రెకమెండేషన్ తీసుకుని వచ్చాడట!! తనకు చాలా అవసరమయ్యే గ్రంధాలు ఇక్కడి లైబ్రరీలో మాత్రమే ఉన్నాయి కాబట్టి, తాను ఇక్కడే కూర్చుని వ్రాసుకుని వెళ్ళేందుకు అనుమతించమని అతని ప్రార్థన!! పరిశోధనలో ఉన్న ఇబ్బందులు తెలిసిన వారు పుట్టపర్తి. పైగా, ఆ రెకమెండేషన్ లేఖ వ్రాసిన వారొక పేరొందిన ప్రొఫెసర్ కాబట్టి, ఆయన లేఖకు విలువిచ్చి, ఆ పరిశోధక విద్యార్థిని గ్రంధాలయంలోకి అనుమతించారట పుట్టపర్తి!! నాలుగైదు రోజులు క్రమంగా వచ్చి, చక్కగా వ్రాసుకున్నాడట అతను!! ఆఖరు రోజు, పుట్టపర్తికి ఎన్నెన్నో ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడట!! అతను వెళ్ళిపోయిన తరువాత కొన్ని రోజులకు అతగాడు నోట్స్ వ్రాసుకున్న గ్రంధాలను ఏ కారణంగానో సర్దుతూ ఉంటే, ఒకటి రెండు పుస్తకాలలో, కొన్ని పుటలు చక్కగా చింపి వేసిన గుర్తులు కనిపించి, తలపట్టుకు కూర్చున్నారట పుట్టపర్తి!!గ్రంధంలోని పుటలని దొంగిలించటం గ్రంధ చౌర్యం, కిందికే వస్తుందా రాదా?? అని ఆలోచిస్తూ !! ఆ నష్టాన్ని తన జీతం నుంచే చెల్లించవలసి వచ్చిందట కూడా!!