కొత్త అడుగులు – 24
ఒక ఆదివాసీగళం కళ్యాణి కుంజ
– శిలాలోలిత
చదువులకు చాలా దూరంగా నెట్టబడిన ఆదీవాసిల్లోంచి ఈ నిప్పురవ్వ కల్యాణి. చదువుల తల్లిగా హెడ్ మిస్ట్రెస్ గా ఆమె ఎదిగిన తీరు ఒక పోరాటమే. కవిత్వం తానై తానే ఒక ప్రవాహమై పయనించింది.
చాలా నెమ్మదిగా, సున్నితంగా పైకి కన్పిస్తున్నప్పటికీ వజ్ర సంకల్పం ఆమెది. ఆమెను చూడగానే ఎంతో ముచ్చటగా అన్పించింది. ప్రస్తుతం మహబూబ్ బాద్ లో ఉద్యోగం చేస్తోంది. కవయిత్రి షాజహాన్ కళ్యాణి చిన్నతనంలో కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు.
కల్యాణి కవిత తనోసారి చదివితే ఆమె అంతరంగం స్పష్టంగా తెలుస్తుంది మనకు.
‘ఉత్సవం ఉబలాటంగా ఎలా జరుపుకోను?
ఆదివాసీ దశాబ్దంలోనే అనేక అకృత్యాలకు
బలైపోయిన శవాలం కదా!
అభివృద్ధి జరిగిందనుకోవాలా?
అంతం జరిగిందనుకోవాలా?
ఏ చట్టాలకు చుట్టంకాక వెలేయబడిన
అమాయక జీవులం కదా!
ఈ ఒక్కరోజు ఏమని పండుగ చేసుకోను
నా డోలు నేనే వాయించుకొని
నా అడుగుల నృత్యానికి నేనే మురిసిపోయీ
నాబుజం నేనే చరుచుకోనా?
ఏమని జరుపుకోను?
రోగం పాలైతే వైద్యం అందదు
నా ఆకు పసరు నేనే తయారు చేసుకుందునా అంటే
నేను నిలబడిన అడిగెడు నేల సుతా
నా నుంచి లాక్కుని అడవి నాది కాదని
నన్ను తరుముతున్నరు
ఇక ఏమని ఉత్సవం చేసుకోను
విద్య సంపూర్ణంగా అందిందా
అయితే ప్రబలుతున్న మూఢనమ్మకాల మాటేమిటో
అరకొరగా అందిన సౌకర్యాలతో సదువుతే
ఆ సదువుకి సార్థకత ఏది?
మళ్ళా ఎద్దెవుసమె సేత్తుంటిమి
పోనీ అట్టనన్నా మా బతుకు మమ్ముల
బతక నిత్తాండ్రా లేదే
గాసాన్నంతా గోసుకుపోయీ
మళ్ళా గవాళ్ళనే జతుకనిత్తుంట్రి
ఏమని గర్వపడి ఏల్పులు జరపనూ’
ఈ కవిత ఆసాంతం చదివితే వాళ్ళ జీవన స్థితిగతులూ, దోపిడీలు, ఇంకా మారని బతుకు కొయ్యలు, నేలకది కాదనీ, చెట్టుమది కాదనీ పుట్టమీదికాదని, బతుకమీది కాదంటున్న స్థితిని ఎంతో ఆవేదనల్లో ధర్మాగ్రహంతో ప్రశ్నించింది.
ప్రకృతిలో మమేకత్వం పొందిన ఈమె అడవిబిడ్డ. తన జాపకాల్ని నెమరేసుకొంటూ చిన్న అనుభూతి ఇలా..
‘నా కిష్టమైన రేలపూల వర్షంతో తడిసి అడవి తల్లిని తనివితీరా చూసుకొని, మల్లోపాలి తనికి ఆకుని ముద్దాడి అడివిల తిరిగిన పాత అడుగుల్ని వెతుక్కుని జ్ఞాపకాల్ని పయిలంగా తునికాకు మూటలా కట్టుకుని పట్టుకొని వచ్చా…’’
అడవితల్లి పదాలనెన్నింటితో మనం విభ్రమంగా చూసేట్లు చాలా రాసింది. పాత అడుగులు లాంటివి ఎన్నో కనబడతాయి. ఒక్కోచోట ఒక పదమే జీవితాన్ని మొత్తం మన కళ్ళముందు గుమ్మరించినట్లవుతుంది. అక్కడక్కడా చిన్న చన్న ఎడిటింగ్లు చేసుకుంటే, కళ్యాణి అడివిని భుజాన మోసుకొని నగరానికి వచ్చినట్లని పించింది.
ఆమె రాసిన కవితల్లో సాగితో చెట్టు, ‘దిశ’ మీద రాసింది ఇలాంటి వెన్నో తళుక్కున మెరుస్తున్నాయి.
మరో కవితలో –
‘రక్తం చెమట చుక్కై రాలిపడటం చూసాను
మొక్కలు వేలభాష్పాల్ని దిగమింగుకొని
వాడిన సమాజం నీడనీ కప్పుకొని
ప్రకృతి సహజత్వాన్ని కోల్పోయేలా
స్వార్థం బోర్డు తగిలించుకొని
నడుస్తున్న మొండాలు కొని’-
మరో కవితలో
‘‘మనుగడ లేకుంట మసిరాత్తాంటే
ఉత్సవం ఉబలాటంగ ఎలా చేయను
నా నీడను నేనే తడుముతున్నట్టు
జాడలైనా లేని తల్లిని గోడలమీద ప్రతీకగా
వెళ్ళగ గట్టిన చిగురించని మోడాలు’’
అంతర్గతవేదన, తనను తాను వ్యక్తీకరించాలన్న తపన, ఈ సమాజం మారదా అని అనేక ప్రశ్నలు వేసింది.
‘పేజి పేజికి పురుడు పోసుకునే, ఎన్ని భావాలను
కన్నదో మనసు అని నిర్లిప్తంగ అంటుందికొక చోట’
‘నేనొక రంగుల అగడాన్నీ
రాత్రికి నలుపు అద్దుతూ
మెలకువ తెలుపును పూస్తుంటాను
నేనొక నేతగాడిని
జ్ఞాపకాల దారాల్ని
మగ్గంలో పెట్టి జీవితాన్ని కాస్తుంటాను.
కవి సమ్మేళనాల్లో గిరిజన సదస్సులలో పాల్గొంటోంది.
ఇంకా తనకు రావాల్సిన గుర్తింపు రాలేదు. అమ్మ గురించి రాస్తు, ఒకచోట ‘అమ్మ గురించి రాయాలంటే అక్షరాలే కన్నీరు పెడుతున్నాయ్, క్లుప్తత, గాఢత, తీవ్రత, తక్షణ స్పందన, పోరాటపఠిమ, ప్రశ్నల అంబులపొది కల్యాణిని దగ్గర ఎప్పుడూ వుంటాయి
‘నాటు అస్త్రాల ప్రయోగ అల్లిక నాజాతి సాంకేతికత’
‘రతగని ఆస్తులు కవితా వస్తువులు
చిరగని కాగితాలు కవితాక్షరాలు
చెదరని సంకల్పాలు కవి హృదయాలు
- ఇలా చెప్పుకుంటూ పోతే అడవిపూలపరిమళం అడవి బిడ్డల నిజజీవితాలు, ఇలా ఎన్నెన్నింటినో రికార్డ్ చేసింది. నేనొక మంచి కవయిత్రిని, బతుకు బొమ్మను గీస్తున్న కళ్యాణి నీ పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా వుంది. సాహితీ ప్రపంచంలోని తొలి అడుగులు వేస్తున్నందుకు నిండు మనసుతో స్వగతిస్తూ…
*****