గుడ్ నైట్

-అల్లూరి గౌరీలక్ష్మి

సైకియాట్రిస్ట్ రూమ్ ముందు కూర్చుని తన వంతు కోసం ఎదురుచూస్తోంది శ్రీ లక్ష్మి. తన సమస్య డాక్టర్ కి 

ఎలాచెప్పాలి ? సిల్లీ అనుకుంటాడేమో ! ఇలా అనుకునే కాస్త పెద్ద జరీ చీర కట్టుకొచ్చిందామె, వయస్సు యాభయ్యే అయినా అరవయ్యేళ్ళలా కనబడాలని. అక్కడికి అందరూ ఎవరో ఒకరిని తోడు తీసుకునే వచ్చారు. శ్రీలక్ష్మి భర్త ఆమె కంప్లైంట్ ని అసలు సీరియస్ గా తీసుకోలేదు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళతానంటే పడీ పడీ నవ్వాడు.రోజూ ఇదే నస పెట్టేసరికివెళ్తే వెళ్ళు గానీ నేను రాను. నా మీదైమైనా నేరాలుంటే కూడా డాక్టర్కి చెప్పుకో, నేనుంటే అడ్డం కదా!” అంటూ నవ్వేసాడు. అప్పాయింట్మెంట్ మాత్రం తనే తీసుకుని  వెళ్ళమన్నాడు సైకాలజీ లో డాక్టరేట్ చేసిన డాక్టర్ దగ్గరికి.

       ఓ నలుగురు పేషెంట్స్ అయ్యాక శ్రీలక్ష్మిని పిలిచాడు బాయ్.డాక్టర్ కి అరవయ్యేళ్లు ఉండొచ్చురండమ్మాఅన్నాడు పెద్దరికంగా ఆమెను చూస్తూనే. ఎదురుగా కూర్చుంది శ్రీలక్ష్మి. “చెప్పండమ్మా” స్నేహపూర్వకంగా అన్నాడు నవ్వుతూ. శ్రీలక్ష్మికి మనసులో ఉన్న బెరుకుపోయింది. పర్వాలేదు. అర్ధం చేసుకునేలాగే ఉన్నాడు అనుకుని మొదలుపెట్టింది.

 “రాత్రిళ్ళు నిద్రపట్టదండి. ప్రతిరోజూ ఒంటిగంటా, రెండవుతుందండి. సంవత్సరంనుంచీ ఇదే సమస్య డాక్టర్” చెప్పిందామె. 

 అతను కొంతసేపు మౌనంగా ఉండి, “మీకు ఆరోగ్యం ఎలా ఉంది ?” అడిగాడు.

“అంతా బావుందండీ ! బీపీ, షుగర్ ఏమీలేవు.మా అమ్మాయిలిద్దరికీ  పోయినేడాదే పెళ్లిళ్లయ్యాయి. వెంటనే ఒకరు ఆస్ట్రేలియా  మరొకరు  అమెరికా వెళ్లిపోయారు. ఉద్యోగాలు చేసుకుంటారు, కాబట్టి శని, ఆదివారాలు మాత్రమే ఫోన్ చేస్తారు. మా వారు బ్యాంకు ఆఫీసర్. ఆయనెప్పుడూ బిజీనే . పగలంతా ఎలాగో కాలక్షేపం చేస్తాను రాత్రి అవుతుందంటేనే భయంగా ఉంటుంది. అందరూ హాయిగా నిద్రపోతుంటే నేను నిద్రతో కుస్తీ పట్టాలి. సరైన నిద్ర లేక విసుగ్గా ఉంటోందండి. మీరేమైనా ట్రీట్మెంట్ చేస్తారేమో అని వచ్చానండిఅంది శ్రీలక్ష్మి.

“పగలంతా టైం ఎలాగడుపుతారు ?” అధిక బరువు లేకుండా సరిపడినంత మాత్రమే ఉన్న ఆమెని చూస్తూ అడిగాడు.

“తెలుగు టీవీ సీరియల్స్ నాలుగు చూస్తాను.ఫోన్స్ చేస్తాను.పక్క  ఫ్లాట్స్ లో ఉండే లేడీస్ తో మాట్లాడతాను. నాకింకేమీ బాధల్లేవండి. ఇదిగో నిద్రే పట్టి చావదు. కొట్టుకొని కొట్టుకొని, తర్వాత  లేచి అటూ ఇటూ తిరిగి ఎప్పటికో నిద్రపోతాను. ఒకో రోజు పక్షుల కూతలు కూడా మొదలుపెడతాయి తెల్లవారుజామున మూడింటికి.అప్పుడు పడుతుందండి నిద్ర.”

“మీ వారు , మీరు ఎన్ని గంటలకి పడుకుంటారు?”

“ఇద్దరమూ పదింటికి పడుకుంటామండి.ఆయన వెంటనే రెండే నిమిషాల్లో స్విచ్ వేసినట్టు నిద్రపోతారండి. నేను లేస్తూ, బెడ్ రూమ్ బైటికి వస్తూ మళ్ళీ వెళ్లి పడుకుంటూ తెల్లవార్లూ తిరుగుతూ ఉంటానండి.” “మీ వారితో మీకు? అనుబంధం,అనురాగం మొదలైనవి ..”ఆతృతగా ముందుకు వంగి అడిగాడు డాక్టర్.

              -2-

ఆమె వెనక్కి జరుగుతూ “మేం ఇద్దరం బాగానే ఉంటామండీ.అలాంటి ఇబ్బందులేమీలేవండి“ అనగానే నిరాశ పడ్డాడతను. “మీ అమ్మాయిల కాపురాలు?” ఆశగా అడిగాడు .

ఓ..బ్రెమ్మాండం..వాళ్ళకేమండీ.. హనీమూన్ లూ ,పిక్నిక్ లూనూ“ అంది గల గలా నవ్వేస్తూ. అతను బిక్కమొహం వేసుకున్నాడు. రాగానే, వారించే దాకా కష్టాలు చెప్పే పేషెంట్లనే చూసాడతను ఇన్నాళ్లూ.

ఇన్నేళ్లూ అమ్మాయిల చదువులూ, పెళ్ళిళ్ళూ అంటూ బిజీగా ఉండేదాన్ని.ఒక్కసారిగా ఖాళీ అయిపోయానండీ. అందుకేనేమోనండీఅందామె డాక్టర్ తన కంప్లైంట్ ని అర్ధం చేసుకోవడానికి క్లూ ఇస్తూ.అది వింటూనే అతను మొహం చిన్నబోయింది. ఆడవాళ్లే గొప్ప సైకాలజిస్ట్ లు వాళ్లకి దునియా మొత్తం తెల్సు.కోపంగా మనసులో అనుకున్నాడు.

అయితే నేనేం చెయ్యాలి ? అన్నట్టు అసహనంగా చూడబోయి, ఏదో సలహా చెప్పమనే కదా ఆమె అయిదువందల రూపాయలు ఫీజు కట్టి వచ్చింది అని గుర్తొచ్చి సహనం తెచ్చుకున్నాడు. మా వైద్యులకు పేషేంట్లు అమాయకంగా, కాస్త మూర్ఖంగా ఉంటే నచ్చుతారు.మాకూ బోల్డు తెల్సు అన్నట్టు మొహం పెట్టి ఎదురుగా కూర్చుంటే వళ్ళు మండుతుంది. మధ్య అందరూ ఇలాగే నీకొక సవాల్ అన్నట్టు నిలబడుతున్నారు. మనసులో అనుకుంటూ కాస్త ఆలోచిస్తున్నట్టుగా తలపంకిస్తూ ఉండిపోయాడు. 

పడుకున్నతర్వాత  ఆలోచిస్తూ ఉంటారా ?” సమస్య కొస ఒకటి అందుకోవడానికి ఉద్యుక్తుడవుతూ అడిగాడు

తలూపిందామె. “ ఏమాలోచిస్తారు?” అడిగాడు, ఆమె బ్రెయిన్ వైపు అనుమానంగా చూస్తూ.

“నేను చదివిన ఆదివారం మ్యాగజైన్ కధో, చూసిన సినిమానో, సీరియల్ సస్పెన్సో, ఫోన్లో ఎవరో మాట్లాడిన మాటలో పదే పదే గుర్తొస్తాయి. పనమ్మాయి లీవ్ అడుగుతోంది. అది ఊరెప్పుడు వెళుతుందో, మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తుందో ఇలాంటి బెంగలు కొన్ని.ఇవి అందరికీ ఉంటాయనుకోండి.అందువల్ల నిద్ర రాకపోతుందా ఏంటి?” అది ఎదురు ప్రశ్నిస్తూ.

“నిద్ర రానప్పుడు ఏం చేస్తారు?” అడిగాడు, ఆమె ప్రశ్న విననట్టుగా.

    “కొంతసేపు అటూ ఇటూ కదిలి విసుగొచ్చి, బైటికొచ్చి పక్క గదిలో కూర్చుని అవీ ఇవీ సర్దుతాను. అరగంట తర్వాత పడుకోవాలనిపించి వెళ్లిపడుకుంటాను. నిద్ర రాదు.మళ్ళీ బైటికొస్తాను. ఇలా అయిదారు సార్లు తిరిగేసరికి ఒంటిగంటవుతుందండి అప్పుడింక తిరగడానికి ఓపికలేక నిద్రోతానండి. సంవత్సరం నుంచీ ఇలాగే ఉందండి. గుడ్ నైట్ అని ఎవరైనా అంటే నా మట్టుకు నాకు అది ఒక గొప్ప దీవెనెమో అనిపిస్తుందండిఅందామె తన అవస్థ వివరిస్తూ. 

డాక్టర్ కొంతసేపు మందుల చీటీ రాసే పాడ్ వైపు చూస్తూ ఉండిపోయాడు.మందుల స్పెల్లింగ్ మర్చిపోయాడేమో అనుకుందామె. తర్వాత మెల్లగా తలెత్తి “ఒక పని చెయ్యండి.ఏమీ ఆలోచించకండిఅన్నాడు కాస్త తేటపడి.

        “ఆలోచిద్దాం అని ఆలోచించం కదండీ,అలా వస్తాయంతే ఆలోచనలుఅంది శ్రీ లక్ష్మి మీకీమాత్రం తెలీదా అన్నట్టు.

“అవున్నిజమేలెండి“ఒప్పుకున్నాడతను.“మీకు నమ్ముకముంటే దేవుడి నామ పారాయణం చేస్తూపడుకోండిఅన్నాడు.

-3-

“నోట్లో పారాయణం జరుగుతుండగానే ఆలోచనలు సాగుతాయండి. ఆలోచన ఎక్కడికైనా వెళుతుందండి. అలా అలా గంటలు గంటలు గడిచిపోతాయండి”

“ పుస్తకాలేమైనా చదివిచూశారా?”

“అదీ అయిందండి. పుస్తకం చదివితే నిద్ర వస్తుందంటారు కదా, అని చదువుతూ కూర్చుంటే నిద్ర పూర్తిగా తేలిపోయి ఎంతసేపైనా చదువుకుంటాను.ఏ రెండుగంటలకో పడుకుంటే నిద్ర సరిపోక మర్నాడు మధ్యాహ్నం పడుకుంటాననుకోండి. ఆ రాత్రి  తెల్లవార్లూ ఇంక జాగారమే చెయ్యాలి.నిద్ర నా చుట్టుపక్కలకే రాదు.”

డాక్టర్ ఇంకా ఇలాంటివే మరో రెండు సూచనలు చేసాడు.ఆమె క్యారమ్స్ బోర్డులో కాయిన్ కొట్టినట్టు జవాబులు చెప్పింది. ఆరోగ్యభవ టీవీ లో మానసిక సమస్యలతో సహా అన్ని సమస్యలకీ విరుగుళ్లు వినేస్తూ, వైద్యుల్ని మించిపోయి  బోలెడు నాలెడ్జితో ఉంటారీ ఆడవాళ్లు అనుకున్నాడతను కోపంగా.   

 ఆ తర్వాత దీర్ఘంగా  నిట్టూర్చి, “మీకు నేను టాబ్లెట్స్ రాస్తానుఅనగానే అదిరిపడినట్టు చూసిన ఆమె చూపుకి సమాధానంగాఅవి నిద్రమాత్రలు కావమ్మా ! కాస్త ఆలోచనలు తగ్గి ప్రశాంతంగా ఉంటుందన్నమాట అన్నాడు.

“అవి ఎల్లకాలమూ మింగాలంటారా?” అమాయకంగా అడిగినా అతన్ని నిలదీసినట్టుందా ప్రశ్న 

“లేదమ్మా ! కొన్ని రోజులకి మీకు మనసు సర్దుకుంటుంది.అప్పుడక్కరలేదు” 

“ఎప్పటికంటారు ? “ ప్రశ్నకి అతనికి చిర్రెత్తుకొచ్చింది.చిరాకు దాచుకునిఒక నెలాగాక చూద్దాం”అన్నాడు.

‘వీళ్ళు మళ్ళీ రారు. డాక్టర్ ఇలా అన్నాడు, అలా అన్నాడు  అని బంధుమిత్రులందరికీ చెప్పుకుని నవ్వుకుంటారు. మహా అయితే నిద్ర వచ్చే మాత్రలు కొని దగ్గరపెట్టుకుంటారు. అంతే. కేసు స్టడీ చేద్దామంటే, తనదగ్గరికి వచ్చిన పేషెంట్ స్థితి ఏంటి? అన్న ఫీడ్ బ్యాక్ ఉండదు. అదే నొప్పుల డాక్టరి దగ్గరికయితే, తగ్గకపోతే గోడక్కొట్టిన బంతిలా వారానికల్లా మళ్ళీ ఫీజు కట్టాల్సి వస్తుందని ఎగేసుకొస్తారుఅనుకున్నాడు అసహనంగా.

“అలాగేనండీ” అంటూ శ్రీలక్ష్మి మందుల చీటీ తీసుకుని నమస్కారం పెట్టి వచ్చేస్తుంటే,రాత్రి పడుకోగానే కళ్ళుమూసుకుని మెడిటేషన్ లాంటిది చేసుకోండి” అన్నాడు దయగా.

   “మెడిటేషన్ అంటే ఏంటండీ ?” ఆమె ప్రశ్నకి “ఏమో నాకూ తెలీదు. మీ ఇంట్లో వాళ్ళనెవరినైనా అడగండి” అనేసి అతను ఓ బుక్ తీసి చదవడం మొదలుపెట్టాడు ఇప్పుడా మెడిటేషన్ గురించి చెప్పబోతే ఇంకెన్ని ప్రశ్నలేస్తుందో అనుకుంటూ. 

నిరాశగా ఇంటికొచ్చింది శ్రీలక్ష్మి. భర్తకి విషయం అంతా చెప్పి మానసిక వైద్యంచేసే డాక్టర్లు శరీరాన్ని కోసి చదవరా?” కోపంగా అడిగింది.

“మనస్తత్వ శాస్త్రం చదువుతారు.మనసు ఎలా ప్రవర్తిస్తుందీ అన్నది తెలుసుకుని దానికేమైనా అనారోగ్యం ఉంటే  మంచిమాటలతో, చిన్న చిన్న మాత్రలతో మనసుకి ఉపశమనం కలిగించే చికిత్స చేస్తారు.

    -4-

“పొట్టలోని పేగులతో పనిలేదు. సరే తలలో నరాలగురించి చదవరా ?” ఆవేశంగా అడిగింది.

 “నరాల డాక్టర్స్ వేరే ఉంటారులే. ఎక్కువ ఆలోచించకు.యూట్యూబ్ లో నిద్ర రావడానికి మెడిటేషన్ లుంటాయి విను” అనేసి తనపనిలో పడిపోయాడతను. ‘మెడిటేషన్ అంటే నిద్రే కదా.అలా వళ్ళుమరిచి ధ్యానంలో పడిపోతే అట్నుంచటే నిద్రలోకి పోనా ఏంటి ?’ విసుగ్గా అనుకుంది.

వస్తూ, వస్తూ హాస్పిటల్ పక్కనే ఉన్న మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్స్ కూడా తెచ్చుకుంది. నాలుగు రోజులు వాడింది. అవి మాత్రమూ పనిచెయ్యలేదామెకి. వేసుకున్న రోజూ వేసుకోని రోజూ ఒకేలా ఉంది.  ఇలా కాదని ఒక రోజు  మధ్యాహ్నం భోంచేసి నెట్ లో నిద్రలేమికి పరిష్కారాల వీడియోలు ఓపెన్ చేసింది శ్రీలక్ష్మి.

ఒక సహజ డాక్టర్ గారు  నిద్రనేది మొబైల్ కి ఛార్జ్ లాంటిదనీ, అది తక్కువైతే ఏమేం అనారోగ్యాలు వస్తాయో చెప్పి బెదరగొట్టి,ఆపై పగలు పడుకోవద్దని చెబుతూ మూడొంతులు వీడియో నింపాక చివరగా రకరకాల జావలు తయారుచేసుకుని తాగి పడుకోమని చెప్పాడు రాత్రే సగ్గుబియ్యం కప్పుడు నానబెట్టి తెల్లారి ఒక గిన్నెడు సగ్గు జావ తయారు చేసింది శ్రీలక్ష్మి. మర్నాడు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ తాగి పడుకుంది.చాలా హెవీ గా, భారంగా అనిపిం చింది. ఆ జావ పూర్తిగా అరిగి అర్ధరాత్రి దాటేవరకూ నిద్రప్రట్టలేదామెకి. మర్నాడు జావని పనమ్మాయికివ్వబోతే యాక్ నాకొద్దంటూ, సింక్ పాడవకుండా వడకట్టి చెత్తబుట్టలో పారేస్తూఏంటమ్మా ఇది?” అందాపిల్ల పరిహాసంగా. శ్రీ లక్ష్మి గుర్రుమంటూ చూసింది పిల్ల వైపు. తర్వాత  రాగిజావ ప్రయోగం కూడా అలాగే సక్సెస్ ఫుల్ గా ఫెయిల్ అయ్యింది.   

పడుకునేముందు పళ్ళు తింటే హాయిగా నిద్రపడుతుందని ఇంటిప్స్ లో చదివి అరటిపండు తిని తెల్లార్లూ దగ్గింది. ఇంకెక్కడో చదివి ఇంకో రోజు వాల్ నట్స్ తినగానే గొంతంతా ఒకటే దురద, ఆపై ముక్కులో గుర గుర. రక రకాల ఫోజుల్లో పడుకోమని ఒక వీడియోలో ఉంది.అలా ప్రయత్నిస్తుంటేఏంటోయ్ చిన్నపిల్లలా?ఊరికే  కదలకు” అన్నాడు భర్త.ముద్రల మహత్యం అన్న వీడియో లో బొటనవేలు చూపుడు వేలు కలిపి పడుకుంటే చటుక్కున నిద్రొస్తుందని విని అలా  చేసింది. వేళ్ళు నొప్పి పుట్టాయి కానీ నిద్ర రాలేదు. వెల్లుల్లి రెబ్బలు దిండు కింద పెట్టుకుంటే నిద్రొస్తుందని సండే బుక్ లో చదివి అలాగే చేసింది.మర్నాడు భర్త, “రాత్రి బాగా నిద్ర పట్టిందా?” ఇవిగో నీ పిల్లో కింద మల్లెమొగ్గలు అని నవ్వాపుకుంటూ చేతిలో వేసి వెళ్ళిపోయాడు. ‘ఏమిటో పిచ్చిదానిలా చేస్తున్నాను’ అనుకుంటే ఆమెక్కూడా నవ్వొచ్చింది.

ఇంకా వెతగ్గా వెతగ్గా చక్కగా నిద్రపట్టే వీడియోలు దొరికాయి.భలే,భలే అనుకుని వాటిని చూసింది.సాఫ్ట్ పియానో మ్యూజిక్ ఒకటి, చిన్న నీళ్ల ధార ఒకటి ఇంకా మరికొన్ని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసిపెట్టుకుంది. రాత్రి ఇయర్ ఫోన్లు పెట్టుకుని వినడం మొదలుపెట్టింది. పియానో మ్యూజిక్ వింటుంటే చిరాకేసింది. నీటి ధార శబ్దం విసుగనిపించింది.మరొకటి మురళీ గానం. బానే ఉంది గానీ అదెప్పుడవుతుందో అప్పుడు కట్టేసి పడుకోవాలని ఆలోచిస్తూ నిద్ర పట్టలేదు.

      -5-

మర్నాడు ఇంకొక వీడియో పెట్టుకుంది చెవిలో. అది వెనక సముద్రం తోసుకువస్తున్న హోరు. అది వింటుంటే సముద్రం ఒడ్డున అర్ధరాత్రి  తను ఒంటరిగా ఉన్నట్టనిపించి భయమేసింది. మరోదాన్లో ఒకబ్బాయి హిందీలో అంకెలు యాభైనుంచి వెనక్కి చదువుతున్నాడు. గొంతు గంభీరంగా కాస్త భీతి గొలిపేదిగా ఉంది. అతను పాతిక అంకెలు లెక్కపెట్టేసరికి పాతాళభైరవి సినిమా గుర్తొచ్చి మూసేసింది.

     మరొకటేదో ప్రయత్నిస్తే, అది చెవుల్లోంచి వైర్ ఊడి సౌండ్ బైటికొచ్చింది. భర్త మేలుకునిఇదేంటోయ్ గోల? నా నిద్ర చెడగొట్టావ్” అనడంతో చెవుల్లో ఫోన్లు పెట్టుకునే కార్యక్రమానికి స్వస్తి పలికింది. ఇక పడుకునేముందు వేడినీళ్ల స్నానాలూ,వెలుతురు రాకుండా కర్టెన్లు చిక్కగా వెయ్యడాలూ, చెవుల్లో పక్క ఫ్లాట్స్ వాళ్ళ లేట్ నైట్ కార్ల సౌండ్లు విన పడకుండా దూది పెట్టుకోవడాలూ మొదలైన పనులన్నీ చేస్తోంది.ఈ వ్యవహారాలన్నీ గమనిస్తున్న భర్తనాకేమో గట్టిగా తుమ్ముకోవడానికి టైం లేదు.ఈవిడకేమో ఖాళీ ఎక్కువయ్యి ఒక సమస్య అయింది’ అని నవ్వుకుంటున్నాడు. పడుకునే ముంది ఓంకారం చేస్తే శరీరంలోకి వైబ్రేషన్స్ వెళ్లి నిద్రొస్తుందని ఒక మిత్రురాలు చెబితే అది చేసిందొక రోజు. ఐదునిమిషాలు చెయ్యగానే తలంతా అదిరినట్టయి తలనొప్పొచ్చింది. మరో రోజు ఒక బాబా గారు చెప్తున్నశ్వాస మీద ధ్యాస ప్రోగ్రాం టీవీ లో చూసింది. ఆ రాత్రి శ్వాస మీద ధ్యాస పెట్టి తీవ్రంగా దాని గురించే ఆలోచించే సరికి తనకి సరిగా ఊపిరి అందడం లేదన్న అనుమానం వచ్చి, ఊపిరందక పోతానేమో బాబోయ్ అనుకుంటూ దాన్ని ఆపేసింది.

    ఓ పది రోజుల తర్వాత భర్త ”ఏమోయ్ భార్యామణీ ! సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళావు. మందులు తెచ్చుకున్నావు.ఇంకా బోలెడు ప్రయోగాలు చేసావు.ఏమన్నా ఫలితం ఉందా ?”అడిగాడు నవ్వుతూ. “ఏమీ లేదు” అంది చుర్రుమని   చూస్తూ.

“అసలు నువ్వు నిద్రమీద ఎన్ని ప్రయోగాలు చేసావో అన్నీ రాసిపెడితే పీ హెచ్ డీ ఇస్తారేమో నీకు”అన్నాడు వేళాకోళంగా.

“మీకన్నీ జోకులే.కొంచెం కూడా సానుభూతి ఉండదుఅంది ఉడుక్కుంటూ. మర్నాడు మధ్యాహ్నం కూర్చుని నిద్ర సమస్యకి నేనెన్నిరకాలుగా పరిష్కారం కోసం ప్రయత్నించానూ అనుకుంటూ అన్నీ ఆర్డర్ లో పేర్చుకుంటూ నవ్వుకుంది. 

ఆ రాత్రి నుండీ శ్రీలక్ష్మికి నిద్రలేమి సమస్య తొలగిపోయింది. ఆమె మంచంపై పడుకున్న వెంటనే ముందుగా తన సమస్య విని ఏం సలహా చెప్పాలో తెలీక బిక్క మొహం వేసుకున్న సైకియాట్రిస్ట్ ని గుర్తు చేసుకుని నవ్వుకుంటుంది. ఆ తర్వాత వరసగా తాను చూసిన వీడియోల్లో మాట్లాడిన వాళ్ల మొహాలు, ఆనక వాళ్ళు చెప్పిన చిట్కాలు,అవి విఫలమైన విధానాలూ ఆమె కళ్ళముందు  రీళ్లు, రీళ్ళుగా వరసగా  తలలో వస్తుంటాయి. అన్నీ అయ్యాక ఆఖర్న తల గిర్రున తిరిగినట్టయ్యి బుర్ర పని చెయ్యడం మానేసి, ఆలోచనలన్నీ బలహీనపడి సరిగ్గా అయిదంటే అయిదు నిమిషాల్లో  నిద్రలోకి జారిపోతోందిప్పుడు శ్రీలక్ష్మి.

****

Please follow and like us:

3 thoughts on “గుడ్ నైట్”

  1. మంచి పరిష్కారం చెప్పారు బుర్ర ని బిజీగా పెట్టండి అని సలహా కూడా చెప్పకనే చెప్పారు గౌరీ లక్ష్మి గారు

  2. చాలా మంది బాధపడుతున్న నిద్రలేమి సమస్యని.. చిత్రవిచిత్ర ప్రయోగాలతో..పరిష్కరించుకుందామని ఆశించిన.. అంశాన్ని తీసుకుని .. హాస్యం తో మేళవించి నవ్వుల పువ్వులు పూయించారు.. 😂🤣😅🤣🤣

Leave a Reply

Your email address will not be published.