చాతకపక్షులు (భాగం-7)
(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల)
– నిడదవోలు మాలతి
కాలేజీలు తెరిచారు. గీత క్లాసుమేటుల్లో కొందరు అనుకున్నట్టు తమ తమ అభిమానవిషయాలు చదవడానికి కాలేజీలో చేరారు. సరోజకంటే ఎక్కువ మార్కులే వచ్చినా వెంకటసుబ్బయ్యకి బయాలజీలో సీటు రాలేదు. ఆర్ట్సులో చేరేడు. శ్రీనివాససుబ్బారావూ, బుచ్చిలక్ష్మీ, సుందరీ, జాన్ గోపాల్ – అందరూ తలో దారీ పట్టేరు.
గీత కూడా తమ పరిస్థితులకి అనుగుణంగా టైపుక్లాసులో చేరింది. కానీ ఎదలో చిన్న నొప్పి. తనకి మంచి మార్కులే వచ్చాయి. నాలుగేళ్లలో తనక్లాసుమేట్సులో కొందరికి డిగ్రీలు వస్తాయి. అందులో కొందరు తనకంటె చురుకైన వాళ్లేమీ కాదు. కేవలం తామున్న పరిస్థితుల బలంతో విద్యావంతులుగా స్థిరపడతారు. డజనుసార్లు డింకీ కొట్టీ, కాపీలు కొట్టీ డబ్బు పారేసి డిగ్రీలు తెచ్చుకోవచ్చు. కష్టపడి చదివి పరీక్షలు రాసి తెచ్చుకోవచ్చు. కానీ ,, కానీ … తను మాత్రం తెలివితేటలుండీ డిగ్రీ లేని ఆడపిల్లగా మిగిలిపోతుంది అనుకోకుండా వుండలేకపోయింది గీత.
కామాక్షి తమ్ముడిదగ్గరనుంచి వచ్చిన వుత్తరం మూడోసారి చదివి కింద పడేసింది. చిట్టి బిక్కమొహం వేసుకుని ఓమూల కూచున్నాడు.
టైపు క్లాసునించి తిరిగొచ్చిన గీత నేలమీద పడివున్న ఉత్తరం చూసింది.
“నువ్వు గానీ రాసేవా మామయ్యకి?” అంది ఆవిడ చిరాగ్గా.
“ఏమిటి రాయడం?”
“యస్సెల్సీ పరీక్ష పాసయినట్టు.”
“రాసేను. ఏం రాస్తే?”
గీతకి సందర్భం అర్థం కాలేదు. కామాక్షి జవాబు చెప్పకుండా వంటింట్లోకి వెళ్లిపోయింది.
గీత ఉత్తరం తీసి చదివింది. రమణమామయ్య రాసేడు. గీతని కావలిస్తే తనదగ్గర పెట్టుకుని చదివించగలనని అందులో ఒక భాగం తెలియజేస్తోంది. అదీ కంటకప్రాయమయిన విషయం.
“వాడో కిరస్తానీదాన్ని కట్టుకుని కులుకుతున్నాడు. వెళ్లు. నీక్కూడా ఓ తెల్లదొరని చూసి పెడతాడు,” అంది బామ్మగారు అక్కసుగా.
రమణ ఇరవైరెండేళ్ల వయసులో చదువుకోసం అమెరికా వెళ్లి, చదువు అయినతరవాత వుద్యోగం చూసుకుని, అమెరికనమ్మాయిని పెళ్లి చేసుకుని, సిటిజన్‌షిప్పు పుచ్చుకు స్థిరపడిపోయాడు.
వంటింట్లో కూర తాలింపు పెడుతున్న కామాక్షికి అత్తగారి మాటలు వినిపించేయి. ఆవిడకి అరికాలిమంట నెత్తికెక్కింది. అయినా తమాయించుకుని, కూరగరిటెతో నడవలోకి వచ్చి, వీలయినంత సౌమ్యంగానే అంది, “వాడెవర్ని కట్టుకుంటే మనకేల? పన్నెండేళ్ల తరవాత దేశంకాని దేశంనించి ఇంటికొచ్చినవాడికి నట్టింట విస్తరేసి నాలుగుమెతుకులు పెట్టుకునే అర్హత లేకపోయింది నాకు. కానివాడికి వడ్డించినట్టు మధ్యగదిలో పెట్టమన్నారు. వాడు కనక అంత అవమానం భరించి మళ్లీ సాయం చేస్తానని ముందుకొచ్చాడు. వాడు అన్నంతమాత్రాన మనఁవే పిల్లని పంపించటానికి సిద్ధంగా లేం కదా. దీనికి తోచింది ఇది రాసింది. వాడికి తోచిందేదో వాడు చెప్పేడు. దానికింత రాద్ధాంతం ఎందుకూ?”
ఈమాటతో పెద్దావిడ మరీ రెచ్చిపోయింది. “నేనేం కానిమాట అన్నానా? ఇంతకీ మన బంగారం మంచిదయితే.”
ఈ రాద్ధాంతం అంతా తిలకిస్తున్న గీత ఇంకా నయం బాబాయి ఇక్కడ లేడు అనుకుంది. కానీ ఆయనగారు రాకపోతాడా, ఈభాగోతం కొనసాగకపోతుందా అని వెంటనే తోచింది. ఆ వెంటనే ఎక్కళ్లేని నీరసం ముంచుకొచ్చింది. ఆపిల్ల అంచనా తప్పలేదు.
ఆరాత్రి భోజనాలయేక భానుమూర్తి తీరిగ్గా గీత పరిచిన పక్కమీదకి ఒరిగి, అనుకున్నదానికంటె ఎక్కువే రభస చేసాడు. ′ఏరోగ్రాం కొనడానికి డబ్బులెక్కడివీ′ దగ్గరినుంచీ ′ఫారిన్ వెళ్లాలనే కోరిక మేనమామదగ్గర వెళ్లబోసుకోవటం ఎందుకూ′ వరకూ సాగింది చర్చ. వాచ్యం చెయ్యలేదు కానీ గీత మొహానికి అమెరికాయాత్ర కూడానా అని అతడి అభిప్రాయం.
“అసలు నువ్వేం రాసేవే?” పరమేశంగారు అడిగేరు. వాళ్లందరూ చర్చిస్తున్నది తనబిడ్డ విషయం అన్నసంగతి అప్పుడే తట్టినట్టుంది ఆయనకి.
ఆఖరికి అసలువిషయం చెప్పక తప్పలేదు. అసలు కథ ఏమిటంటే సరోజయింట్లో పార్టీవేళ రంగారావు మాటాడుతూ అమెరికాలో మనవాళ్లెవరేనా వుంటే వెళ్లడం చాలా తేలిక అన్నాడు. ఏమిటి తేలికో గీతకి సరీగా బోధపడలేదు కానీ యాదాలాపంగా తన మేనమామ అక్కడే వున్నాడని చెప్పింది.
“ఇంకేం మరి. ఆయనకి రాయి.” అని ఓ సలహా పారేసాడు రంగారావు.
గీతకి అదే యావ అయిపోయిందని చెప్పలేం కానీ మర్నాడు కామాక్షి తమ్ముడికి ఉత్తరం రాస్తూంటే తనకి కూడా ఓముక్క రాయాలనిపించింది. తల్లి గీతకి కొంచెం జాగా వదిలి, తను రాసేదేదో రాసి ఎడ్రెసు కూడా రాసి పోస్టు చెయ్యమని చెప్పి కవరు ఇచ్చింది. గీత తను యస్సెల్సీ పాసయినట్టు రాసి పోస్టులో పడేసింది. అంతేగానీ మామయ్య ఇలా తనని ఆహ్వానిస్తూ జవాబు ఇస్తాడని ఊహించలేదు. ఎదురు చూడ్డంమాట అసలే లేదు.
“చెప్పవేం మరి, వదినా, పిల్లదానికి బాగానే మాలీసు చేస్తున్నావు,” అన్నాడు భానుమూర్తి వెటకారంగా.
“నా మాలీసు ఏపాటిది నాయనా మీరందరూ ఇన్నివిధాల దానికి రక్షకులుండగా,” అంది కామాక్షి అటువేపుకి వొత్తిగిలి.
“పోనీలేవే గీతమ్మా! నువ్వక్కడికి వెళ్లింతరవాత ఈ బాబాయిని కూడా కాస్త కనిపెట్టుకుని వుండు. నాక్కూడా ఏదో ఓ చిన్న అవకాశం ఇప్పించేవంటే నాజన్మ కూడా తరిస్తుంది,” అన్నాడు భానుమూర్తి కొస వదలకుండా.
గీతకి మహ సంకటంగా వుంది ఈ రభస. బుద్ధి తక్కువయి రాసేనురా తండ్రీ అనుకుంటోంది మనసులో.
“ఎవరి రాతలు యెలా వుంటాయో ఎవరు చూసారు. నాయనా! నవ్విన నాపచేనే పండుతుందన్న సామెత ఊరికే రాలేదు,” అంది కామాక్షి.
శివరావూ పరమేశం చిరకాల మిత్రులు. ఓనమాలనించి బియే వరకూ ఒకే బంకులో టీ తాగి, ఒకే మిత్రుడిదగ్గర చీట్లాటా, సిగరెట్లూ నేర్చుకుని, ఒకే డాక్టరుదగ్గర మందులూ చీవాట్లూ తిని పాతికేళ్లు దాటేక వేరు వేరు జీవితాల్లో స్థిరపడిన నేస్తగాళ్లు. పరమేశం తల్లిదండ్రులు కుదిర్చిన కామాక్షిని పెళ్లి చేసుకుని విజయవాడలో స్కూలుమేష్టరుగా స్థిరపడ్డారు. శివరావు వాళ్లమ్మ ఇష్టప్రకారం మేనమామ కూతురు కనకమ్మని చేసుకుని మామగారి వ్యాపారం చూసుకుంటూ గుంటూరులోనే స్థిరపడ్డారు. ఎవరి వ్యాపకాలు వారివి అయి కొంతకాలంగా పలకరింపులు తగ్గిపోయేయి.
అలాటిది ఓ శుభోదయాన శివరావు పదకొండో తారీకు వస్తున్నానని ఓ కార్డు రాసి పారేసి, పదకొండో తారీకు మధ్యాన్నం ఇంటిముందు వాలేరు తమకారులో. పరమేశంగారు ఆ సమయాన ఇంట్లో లేరు.
కామాక్షి నవ్వుతూ, “రండి అన్నయ్యగారూ! వదినగారూ పిల్లలూ కులాసాయేనా” అంటూ పలకరిస్తూ ఆప్యాయంగా ఆహ్వానించింది. మనయిళ్లలో సర్వసాధారణంగా జరిగేదే. ఏళ్ల తరబడి కనుమరుగైనా మళ్లీ కనిపిస్తే ఆనాటి ఆప్యాయతలు ఇట్టే తన్నుకొస్తాయి పైకి.
“ఏమయ్యా, కనిపించడమే మానేశావు?” అంది బామ్మగారు.
శివరావుగారు ఈజీఛైరులో కూలబడి, వదినగారూ, పిల్లలూ కులాసాయే అని కామాక్షికి చెప్పి, బామ్మగారితో “తీరడంలేదు బామ్మగారూ! వ్యాపారం కదా ఆటూ పోటూను. ఓరోజు బాగుంటే ఓరోజు బాగుండదు. ఎవరినీ నమ్మడానికి వీల్లేని రోజులు. ఒక్క క్షణం ఏమరితే ఏం గలాటా అవుతుందో అని కనిపెట్టుకునుండాలి” అన్నారు.
“అబ్బాయిలు ఎదిగి వచ్చారు కదా. ఆమాతరం చూసుకోరా?” అందావిడ.
హిందీ క్లాసునుండి అప్పుడే వస్తున్న గీత శివరావుగారిని చూసి గుమ్మందగ్గరే ఆగిపోయింది చిన్నగా నవ్వుతూ.
శివరావుగారు కూడా నవ్వుమొహంతో, “అబ్బే, వాళ్లింకా అంత ఎదగలేదు,” అని బామ్మగారికి చెప్పి, గీతవేపు తిరిగి, “కాలేజినించా? ఏం చదువుతున్నావు?” అన్నారు.
“లేదండీ, కాలేజీలో చేరలేదు. టైపు నేర్చుకున్నాను. ఇప్పుడు హిందీ విశారద పరీక్షకి చదువుతున్నాను” అంది గీత.
“ఇంతకీ అన్నయ్యగారికి ఇంతకాలానికి మామీద దయ కలిగింది. ఏమిటి విశేషాలు?” అంది కామాక్షి. కలగజేసుకుంటూ.
“ఏంలేదమ్మా, చెప్తున్నా కదా పనులు ఎప్పటికప్పుడే. ఇంతకీ అసలు మాట చెప్పనేలేదు. పెద్దబ్బాయికి పెళ్లి చేస్తున్నాం వచ్చే మాఘమాసంలో.”
“ఆలాగా, బాగుందండి. సంబంధం ఎవరేమిటి?” అనడిగింది కామాక్షి.
తాడిపత్రివారి ద్వితీయపుత్రిక అనీ పాతికవేలు కట్నం ఇచ్చి, అల్లుణ్ణి సొంత ఖర్చులతో అమెరికా పంపడానికి మాటలు జరుగుతున్నాయనీ చెప్పి, గీతవేపు తిరిగి, “అయితే నువ్వు ఎందుకు కాలేజీలో చేరలేదూ?” అన్నారాయన మళ్లీ.
వ్యాపారానికి చిన్నా, పెళ్లికి పెద్దా అయిన అబ్బాయి ఎలా వుంటాడో ఊహిస్తున్న గీత వులికిపడి, “విశారదకి చదువుతున్నానండీ,” అంది మళ్లీ.
“అదికాదమ్మా, కాలేజీలో ఎందుకు చేరలేదనీ¸” అని కామాక్షివేపు తిరిగి “ఏమ్మా! మీఆయన కూడబెట్టి ఇచ్చేఆస్తులంటూ ఎలాగా లేవు. కనీసం మంచిచదువులయినా చెప్పించవచ్చుకదా,” రెండో అమ్మాయి తెచ్చిన మంచినీళ్లు అందుకుంటూ చనువుగా ప్రశ్నించారు.
* * * * *
(ఇంకా ఉంది)
చిత్రకారుడు: ఆర్లె రాంబాబు
నిడదవోలు మాలతి ఏడు దశాబ్దాలుగా కథలు రాస్తున్నారు. 2001లో తూలిక.నెట్ ప్రారంభించి, మంచి కథలు ఇంగ్లీషులోకి అనువాదాలు చేసేరు.. ప్రధానంగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను విదేశీయులకి కథలద్వారా తెలియజేయాలన్న ఆశయంతో మొదలుపెట్టిన సైట్ అది. 2009లో తెలుగు తూలిక బ్లాగు ప్రారంభించి తమ కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు ప్రచురిస్తున్నారు. ఆమెసాహిత్యం ఆమెబ్లాగు www.tethulika.wordpress.comలో చూడవచ్చు. కథాసంకలనాలు, వ్యాససంకలనాలు అన్నీ తెలుగు తూలిక బ్లాగులో e-Book formatలో ఉచితంగా లభ్యం. స్వాతంత్ర్యానంతరం, తెలుగు రచయిత్రులు అసామాన్యమైన ప్రాముఖ్యం సంపాదించుకున్నారు. ఆ ప్రాముఖ్యతకి వెనుక గల సాహిత్య, సామాజిక, ఆర్థిక, కౌటుంబిక పరిస్థితులను విశ్లేషిస్తూ రాసిన పుస్తకం Women writers, 1950-1975. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ.