అవునమ్మా …నువ్వు ఆనాడే ఎందుకు చెప్పలేదూ ….
తాతయ్య వడిలో కూర్చుంటే తప్పని
బాబాయి భుజాలమీద ఊరేగవద్దని
ఆటో అంకులు ని ముట్టుకోనివ్వద్దని
పక్కింటికి పోవద్దని
దోస్తుల్ని నమ్మొద్దని
వెన్నెల్లో ఆడొద్దని
చుట్టమిచ్చిన చాకోలెట్ అయినా తినవద్దని …..
ఇల్లు దాటొద్దని !
ఎన్నో ఎన్నెన్నో ప్రతి బంధాల మధ్య నా బాల్యం ఛిద్రమవుతుంటే
దారిలేక కుమిలి కునారిల్లుతున్నాను
ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నది …
ప్రతిక్షణమూ నువ్వు నాకోసం పడుతున్న వేదన !
అనుక్షణమూ అనుభవిస్తున్న నరకం !
కంట్లో వత్తులేసుకుని నువ్వు కాసే కాపలా …..
..ఆఫీసునుండి ఇంటికి వచ్చాకా
నీ కళ్ళలో ప్రతిఫలించే ఆనందం !
అమ్మా ….ఎన్నాళ్లిలా …ఎన్నేళ్ళిలా …
అవునమ్మా …ఆనాడే ఎందుకు చెప్పలేదు
ఆడమాంసం మరిగిన తోడేళ్ళు అంతటా తిరుగుతున్నాయని
మనిషిని మించిన మృగం మరొకటి లేనేలేదని …. ….
అవునమ్మా ….
కడుపులో వున్నప్పుడే ఆ కఠిన విషం కక్కివుంటే
నన్ను నేను ఛిద్రం చేసుకుని నీకీ నరకం తప్పించి ఉండేదాన్ని !
అవునమ్మా ….నువ్వు ఆనాడే ఎందుకు ఈ నిజం చెప్పలేదు ???