జీవితానురక్తి
(కె.వరలక్ష్మి ఆత్మకథ “తొలిజాడలు” పుస్తక సమీక్ష)
-లలిత గోటేటి
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన కె. వరలక్ష్మి గారి ఆత్మ కధ ‘’తొలిజాడలు’’ చదవడానికి నాకు వారం రోజులు పట్టింది. ఇంత మంచి కధారచయితగా ఆమెను ఎదిగించిన ఆ నేపధ్యం ఆమె బాల్యం ఎటువంటివి అన్న కుతూహలంతో నేను ఈ పుస్తకాన్ని చదివాను.
‘’జగ్గంపేట’’ గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరు. ఇది రచయిత పుట్టి పెరిగిన, చాలా సంవత్సరాలు ఇక్కడే గడిపిన ప్రాంతం. ఆమె బాల్యం, కుటుంబం మనుషులు,పరిసరాలు, పరిస్థితులు, వీటన్నింటినీ ఒక సాక్షిగా పరిశీలించే ఆమె లోపలి రచయిత, ఆమె అవగాహన, పరిణతి, ఇవన్నీ ఆమెకు ఒనగూడిన ప్రాంతం ఇది. చిన్న వయసులోనే వివాహం జరగటం, ఎదగని మనసు,శరీరం, విఫలమైన వైవాహిక జీవితం,ఈ గాయాలకు నవనీతం పూసినట్లు ఆమెకు లభించిన అపారమైన కన్నతండ్రి ప్రేమ,నానమ్మ ప్రేమ పాఠశాలలో ఆమె ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయుల ఆదరణ,,ప్రోత్సాహం, ఇలా ఎన్నో అనుభూతులను,ఆనందాలను వ్యధలను, బాధలను అనుభవిస్తూనే తాను వీటన్నిటినీ మించిన వ్యక్తినని,తాను వేరనే ఓ ఎరుక, అరుదైన పరిణతితో మొత్తం జీవితాన్ని ఒక సాక్షిగా చూసిన చూపు….. ఇలా కె.వరలక్ష్మి గారిని గొప్ప కధారచయితగా మన ముందు నిలబెట్టింది.
బహుజన మహిళల జీవితాల్లోని వ్యధలను ,తమ కధలలో దృశ్యమానం చేశారు రచయిత్రి. ఆయా పాత్రలు మన కళ్ళముందు సజీవంగా కదలుతాయి. మనల్ని వెంటాడి వేధిస్తాయి.వారివారి జీవన హేలనంతా మన ముందు పరుస్తాయి. మనతో చెలిమి చేస్తాయి. ఆ పాత్రలను ఆ స్త్రీ మూర్తులను మనం ప్రేమిస్తాం. సానుభూతి చూపిస్తాం. శివంగి కధలోని దుర్గ పాత్ర, సహచరి కధలోని నేను పాత్ర ,మట్టి బంగారం కధలో శ్రీ లక్షమ్మ చెప్పిన గొల్ల వారి జీవన చిత్రణ, స్వస్తి కధలోని సీతమ్మ పాత్ర, మంత్రసాని కధలోని లోవ పాత్ర, ఖాళీ సంచులు కధలోని దుర్గ పాత్ర, సువాసిని పూజ కధలో రాజేశ్వరి పాత్ర, ఇలా వరలక్ష్మి కధల్లోని …….. ముఖ్యంగా స్త్రీ పాత్రలు సజీవ శిల్పాలు. వారి దయనీయమైన జీవితాలను పాఠకులకు చూపించటంలో రచయిత ఫోటో గ్రాఫిక్ మెమొరీ,ప్రాంతీయత ,వాస్తవికత,గ్రామీణ సంస్కృతి,వాటితో మమేకం అయి జీవించిన ఆమె అనుభవం, ఇలాంటి కధాకావ్యాలను సృస్థించింది. కధ పొడుగునా పాఠకులు నడుస్తారు.ఆయా పాత్రల పట్ల గౌరవ భావంతో సానుభూతితో మన గుండె నిండిపోతుంది. వాళ్లెవరో మన చుట్టూ ఉన్నట్లు భావన కలుగుతుంది. అలాంటి వారికి ఆపన్నహస్తం అందివ్వాలని మనసు తొందరపెడుతుంది .మొత్తంగా వరలక్ష్మిగారి కధలన్నింటిలోనూ అలముకున్న మానవీయ సౌగంధంతో మన మనసులు నిండి పోతాయి. మనం దీనజన ప్రేమికులం అయిపోతాం. ఇంత గొప్ప సాహిత్య ప్రయోజనం సిద్దించటం కంటే కావలసింది ఏముంది రచయితకు అనిపిస్తుంది.
ఇలాంటి కధాకావ్యాలను అందించిన వరలక్ష్మిగారి బాల్యం ఎలా గడిచింది ? విఫలమైన ఆమె వైవాహిక జీవితం నాటి కాలమాన పరిస్థితులు,తండ్రి ప్రేమ,నానమ్మ రక్ష,ఉపాధ్యాయుల ప్రోత్సాహం, ఆమెలో జీవితానురక్తిని ఎలా పాదుగొలిపాయి ? బాల్యావస్థ నుంచి ఆమెలో చిగురించిన పఠనాసక్తి, సునిశిత పరిశీలనాశక్తి, సౌందర్య దృష్టి , ఒక సాధారణ గొల్లవారి కుటుంబం నుంచి ఆమెను ఒక విలక్షణమైన వ్యక్తిగా ,రచయితగా ఎలా నిలబెట్టాయి అనే అంశాలు మనం తొలి జాడల్లో చదువుతాము. అంతేగాక ఈ పుస్తకాన్ని ఒక సామాజిక శాస్త్రం అధ్యయనం చేసే కోణం నుంచి , పిల్లల మనస్తత్వ శాస్త్ర అధ్యయన కోణం నుంచి కూడా పరిశీలించదగ్గ అంశాలు ఈ పుస్తకంలో వున్నాయనిపించింది. బాల్యంలో సంవృద్దిగా ప్రేమను పొందినవారికి జీవితంపట్ల దృక్పధం ఎలా వుంటుంది,ఆ ప్రేమ వారికి ఒక షాక్ ఎబ్ జార్బార్ లాగా కష్టాలను అధిక మించే శక్తిని ఎలా ఇవ్వగలుగుతుంది అన్న విషయం ఈ పుస్తకంలో రుజువు చేయబడింది.
కధకురాలిలోని నిజాయితీ స్పష్టమైన అవగాహన ,భావుకతాదృష్టి ,మనుషుల్లో వుండే సార్వత్రిక లక్షణాలను వ్యక్తులలో వుండే ప్రత్యేక లక్షణాలను,ఈ రెండింటినీ చూడగల నైపుణ్యం, ఆమెను రచయితగా ఎలా తీర్చిదిద్దాయో మనకు తెలుస్తుంది. తొలిజాడల కాలం మానవ నాగరికత పూర్తిగా యాంత్రికంగా మారని కాలంగా చెప్పుకోవచ్చు. సెల్ ఫోన్ లకు ,కంప్యూటర్ లకు ,కాస్త ముందు కాలం అది. గోదావరి జిల్లాల పల్లెటూర్ల అందాలు, రంగురంగుల అడవి పువ్వుల లాంటి మనుషుల జీవన శైలిని చూపించిన చిత్రపటం తొలిజాడలు. చిన్న చిన్న సంతోషాలు, సుడులు తిప్పే దుఖాలు అజ్ణానము , అమాయకత్వం,పేదరికం అనే చీకట్లో ,చుక్కల్లా మెరిసే కొందరు మనుషుల వ్యక్తిత్వాలను మనకు దృశ్యమానం చేస్తారు రచయిత్రి తొలిజాడలలో.
ఈ పుస్తకానికి ముందు మాటలు వ్రాసిన ఓల్గా గారు ఇలా అంటారు’’ వరలక్ష్మి గారు ఎందువలనైనా గాని ఆ దుర్భర జీవితంలో పంకంలో పద్మం లా జీవించారు. ఆ బలం ఆవిడకు, ఆవిడలా జీవించే స్త్రీ లకు ఎక్కడి నుంచి వస్తుందో, ఆ జీవితానురక్తి గురించి ఆలోచించాలనిపిస్తుంది . ఇక అమ్మ గురించి గీతగారు ఇలా అంటారు ముందుమాటల్లో ‘’నాకు తెలిసిన మా అమ్మ ఒక సునిశిత పరిశీలనా శక్తి కల రచయిత్రి. గ్రామీణ జీవితంలో తనకి ఎదురైన ఎన్నో జీవితాలని తనదైన శైలిలో ప్రాణ ప్రతిష్ట చేసిన విశిష్ట స్రష్ట. ముఖ్యంగా పల్లెటూరి స్త్రీల సమస్యలు,జీవితాల్ని తనలా ఆవిష్కరించిన మరొక రచయిత్రి లేరంటే అతిశయోక్తి కాదు. ‘’
ఈ పుస్తకం లో నేను నా బాల్యం మొదలుకొని జ్నానోదయం వరకు నలభై నాలుగు ఆధ్యాయాలు వున్నాయి. తొలి జాడలు మధ్యలో ఆగిపోయినట్లు అనిపిస్తుంది . కారణం మరొక ముఖ్యమైన జీవనపార్శ్వం ,మలిజాడలకు ఇది తెర తీస్తొంది. ఇక రచయిత జీవన చిత్రణలో తండ్రి గురించి చెబుతూ పసిమి ఛాయాతో ఉంగరాల జుట్టుతో మంచి అందమైన వ్యక్తి మానాన్న. రూపానికి తగినట్టు సాత్వికత తో మెత్తని స్వభావం కలవాడు అంటారు. జగ్గంపేట లోని కాపుల వీధి ఎడ్లబండి లోపలికి ప్రవేశించేంత విశాలమైన ద్వారబంధం వున్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో తండ్రి నుంచి,నానమ్మ నుంచి లభించిన అపారమైన ప్రేమ, బాల్యంలోనే గుడి లాంటి గ్రంధాలయ పరిచయం ,మూడవ తరగతి చదువుతుండగా తండ్రి తో వెళ్ళి చూసిన రేణుకా మహత్యం సినిమా మరునాడు తండ్రి అడిగిన మీదట చూసిన సినిమాను కధగా అలవోకగా వ్రాసిన సందర్భం, వ్ర క్తుత్వ పోటీల్లో తాను మాట్లాడిన దానికి జిల్లాలోనే మొదటి బహుమతి రావటం ,దీనికి గాను జగ్గంపేట హైస్కూల్ స్టేజ్ మీద డి.ఈ.వో గారి పక్కన కూర్చోబెట్టి స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆమెను ఘనంగా సత్కరించటం, అంతేగాక ఎనిమిదవ తరగతిలోనే ఆమె వ్రాసిన ‘’కాఫీకాదు ’’అన్న ఆమె తొలికధ వినాయక చవితి ప్రత్యేక సంచికలో ప్రచురణ పొందటం ,దానికిగాను ఆమెకు తొమ్మిదన్నర రూపాయలు పారితోషికం లభించటం …ఇవన్నీ ఆమెలోని ఆత్మ విశ్వాసాన్ని మరింతగా పెంచాయి.కళా సాంస్కృతిక వైభవం అనేవి నాటి పల్లె జీవితాల్లో ఒక భాగంగా వుండేవి. ఇంట్లో గ్రామ ఫోన్ లో మంచి పాటలు వినడం, రెడీయో పాటలు,వాటికి అనుగుణంగా నృత్యం చేయటం ,సంగీతం,వీణా వాయిద్యం, వాటిల్లో రచయితకున్న అభినివేశం …ఇవన్నీ ఆమె బాల్య జీవితాన్ని సుసంపన్నం చేశాయి.
ఈ రోజుల్లో పిల్లలకు అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు అంటే అసలు లేకపోవటమో, లేదా చుట్టపు చూపుగా వచ్చి పోవటమనే తంతు తప్ప మరొక అనుభవం లేని స్థితిలో వున్నారు. వరలక్ష్మి గారి నానమ్మలో ప్రేమ,సమర్ధత కుటుంబాన్ని రెండు రెక్కల మధ్య పొదువుకున్న ఒక భద్రతాధికారిణి లా వుండేదని,ఒక యోగి పుంగవురాలి గా వుండేదని, రచయిత చెబుతారు. అలాంటి స్త్రీ కడుపున పుట్టిన తన తండ్రి లో ప్రేమించే గుణం సహజంగానే వచ్చింది అంటారు. తల్లులు ప్రేమతో సంస్కార భావాలు అలవరిచి పిల్లల్ని పెంచితే మనుషులు ఎలా వుంటారు అని చెప్పేందుకు ఇది ఒక తార్కాణం. సమిష్టి కుటుంబాలు,అట్లతద్ది భోజనాలు, పండిన గోరింట అందాలు,దాలి మీద ఎర్రగా కాలిన పాలల్లో అటుకులు,బెల్లం వేసుకుని తిన్న తీయని రుచులను పాఠకులు కూడా ఆస్వాదిస్తారు. ఇది గొల్లవారి జీవితం కనుక అక్కడక్కడ నాన్ వెజ్ వాసనలు కూడా వస్తాయి.
మావిడాడ మాష్టారు,నూజిళ్ళ మాష్టారు వంటి ఉత్తమ ఉపాధ్యాయుల గుర్తింపు, ప్రోత్సాహం ఆమెను జీవన రంగానికి సన్నద్దం చేసిందనిపిస్తుంది. కేవలం పదకొండేళ్ళ వయసు నాటికే టాగూర్ గీతాంజలి ని బెల్లంకొండ రామదాసు గారి అనువాదం చదివి దాన్ని తన చేతి వ్రాత తో వ్రాసుకుని భద్రపరుచుకున్న అనుభవం. …ఇది ఆమె లోని భావుకతా శక్తికి బాటలు వేసింది. ఇంకా ఆమె నాటక రంగం లో నటించిన పాత్రలు గన్నయ్య,,శుక్రాచార్యుడు ,బృహస్పతి, ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాయి. మంచి స్నేహితురాళ్ళు లీల , రామలక్ష్మి,లంకా అన్నపూర్ణ లతో గడిపిన బాల్యం,ఆ తరువాత చక్కని సంగీతం లో ఓ అపశృతి లాగా దుర్భరమైన ఆమె వైవాహిక జీవితం, వీటన్నింటినీ ఎంతో నిజాయితీ తో చెబుతారు రచయిత్రి. ఆమె అపురూపమైన బాల్యం అత్తవారింటి కి వెళ్ళాక కుంపటిలో కుసుమం లాగా ఎలా పొగచూరిపోయిందో చదివినప్పుడు కళ్ళు చెమరుస్తాయి.అయితే ఆమె ఆ షాక్ ని, ఆ డిజప్పాయింట్ మెంట్ ని ఓ పక్క పెట్టేసి వేయవలసిన అడుగుల మీద దృష్టి నిలపగలగటం అంత చిన్న వయసులో అసామాన్యం అనిపిస్తుంది. ఆమె బేలన్సింగ్ మైండ్ ,సహనం ,పరిణతి నేటి యువ తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. చివరి క్షణం లో కూడా మారని సహచరుడు ఒక పక్కా, ముగ్గురు చంటి పిల్లలు ఒక పక్కా,తాను స్థాపించిన ,స్కూల్ ను ఆదర్శవంతంగా నడపాలనే పట్టుదల,పదవ క్లాసు లో ఆగిపోయిన చదువును ఎమ్మే వరకు కొనసాగించగలగటం ….ఇవి మాటలు చెప్పినంత తేలిక కావు. ఇలా వ్యక్తిగా ,తల్లిగా,రచయితగా,ఇంతటి జీవితానుభవాన్ని అనన్య సామాన్యమైన జ్నాపక శక్తితో,సునిశిత పరిశీలనతో,ఒక అందమైన వర్ణ చిత్రం లా తొలిజాడలు మనముందు వుంచారు కె.వరలక్ష్మి గారు. మనుషులు,భిన్న మనస్తత్వాలు, పేదరికం,అమాయకత్వం,మంచివాళ్లు,చెడ్డవాళ్లు…ఇలా జీవితం ఇచ్చే ఆటుపోట్లలో నావను నడుపుకుంటూ వ్యక్తిగా బాధ్యతలు విస్మరించకుండా ఒక సామాజిక బాధ్యతగా రచన చేసి , తనకు ఎదురుపడ్డ జీవితాలను కధాకావ్యాలుగా మలచి మన ముందు వుంచిన గొప్ప కధా రచయిత్రి, స్నేహశీలి,వినయశీలి వరలక్ష్మిగారు. ఆమెకు వేవేల అభినందనలు,శుభాకాంక్షలు తెలుపుతున్నాను .
****
పుస్తకాలు దొరుకు చోట్లు:
గోటేటి లలితా శేఖర్ జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామం. చదువు ఎం.ఎ, ఉద్యోగం గుంటూరు అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా 14 ఏళ్ల అనుభవం. ఇప్పటి వరకు వివిధ వారపత్రికల్లో వచ్చిన కథలు ముప్పై . ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయబడిన కథానికలు నాలుగు.“రాగ రంజిత” పేరుతో ఒక అనుబంధ నవల. “మూడో అందం” పేరుతో వచ్చిన కథల సంపుటి . “ఐదు కలాలు ఐదేసి కథలు” సంకలనం. పలు సభల్లో సాహిత్య ప్రసంగాలు. 2018 లో యువ కళావాహిని వారి “తెలుగు వెలుగులు” అవార్డ్ అందుకున్నారు. 2018 గుంటూరులో ఆదర్శ్ రోటరీ వారు “ది బెస్ట్ ఉమన్ రైటర్ ఆఫ్ గుంటూరు” తో సత్కరించారు.