నా జీవన యానంలో- రెండవభాగం- 28

‘అశాంతికి ఆహ్వానం ‘ – కథానేపధ్యం

-కె.వరలక్ష్మి

1981లో ఒకరోజు పేపరు చూస్తూంటే ఇల్లు కట్టుకోవడానికి అప్పు ఇస్తారనే ప్రకటన ఒకటి కనపడింది. అప్పటికే నా స్నేహితుల్లో, బంధువర్గంలో అందరికీ పెద్దలు ఇచ్చిందో, సొంతంగా కట్టుకున్నదో ఇళ్ళున్నాయి. నాకూ ఒక ఇల్లుంటే బావుండునని అనిపించింది. అప్పటికి ఏడేళ్ళ క్రితం ఐదువేలతో శ్రీరామ్ నగర్ లో కొన్న స్థలం అప్పు తీరలేదు. ఊళ్ళో ఉన్న రెండు బేంకులూ నెలనెలా కొంత చొప్పున పొదుపు చేస్తే కొన్నేళ్ళ తర్వాత దానికి రెట్టింపు అమౌంట్ అప్పుగా ఇస్తామని, తిరిగి దాన్ని నెలనెలా వాయిదాల పద్ధతిలో తీర్చేయొచ్చు అని అన్నారు. నాకు ఏదైనా అనుకుంటే అయ్యేవరకూ నిద్రపట్టేది కాదు. అలాంటిది, నా ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్టైపోయింది. “ఈ ఊళ్ళో మనకి ఇల్లెందుకు?” అంటూ నన్ను మరింత నిరుత్సాహపరిచేసాడు మా ఇంటాయన, ఇంకెక్కడో ఉన్నట్టు. సరే, ‘గుడ్డికన్నా మెల్ల మేలు కదా ‘ అని రెండు రోజులు ఆదాయం – ఖర్చు లెక్కలో కుస్తీపట్టి, నెలకి రెండు వందల యాభై రూపాయలు పొదుపు చెయ్యగలనని తేల్చుకున్నాను. వెంటనే ఆంధ్రాబేంక్ కి వెళ్ళి ఆ పథకంలో చేరిపోయాను. .

ఆత్రం ఆగక 1988 జనవరిలో బేంకులో డబ్బులు తీసేస్తే ప్లానింగ్, నోటరీ, పునాది అయ్యేసరి డబ్బులైపోయాయి. అప్పుడెప్పుడో చూసిన అప్పులిచ్చే సంస్థను వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్ళాం. ఆ అనుభవాలన్నీ ఈ కథలో రాసినవే.

అప్పటివరకూ ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా ఉండేదాన్ని, ఇల్లు పూర్తయ్యేసరికి హై బిపి పేషెంటునై పోయాను. ఎల్.ఐ.సి వాళ్ళ హౌసింగ్ లోన్ పాలసీవల్ల బైటి అప్పులనుంచి బైటపడి, కొంత మిగిలిపోయినా ఇంటిపని పూర్తి చేయగలిగాను. నెమ్మది నెమ్మదిగా చేతిలో డబ్బులున్నప్పుడల్లా ఒక్కో పనీ (ఫ్లోరింగ్ వగైరాలు) పూర్తి చేయించాను. నెలనెలా ఏడోతారీఖు లోపల కట్టవలసిన వడ్డీ మెడమీద కత్తిలా భయపెడుతూండేది.

1990లో స్వాతి వీక్లీ అష్టకష్టాల పోటీ పెట్టినప్పుడు ‘అప్పు ‘ అనే అంశం మీద ఈ కథ బహుమతి పొందింది. ఈ కథ చదివిన కొన్నేళ్ళపాటు మా తమ్ముడు నాతో మాట్లాడలేదు. అదీ కొసమెరుపు.

‘అశాంతికి ఆహ్వానం•

ఇప్పటి తరానికి టి.వీ చూస్తే కానీ పురాణ కథలు తెలియకపోవచ్చుకాని, మా చిన్నతనంలో అలాకాదు. ఏ ఉత్సవాల్లో ఏ పందిళ్ళలో చూసినా హరికథా కాలక్షేపాలు సాగుతూ ఉండేవి. కాళ్ళకు గజ్జెలో, మెడలో హారంతో, చేతిలో చిడతలతో, కథకు తగిన హావభావాల్ని ప్రదర్శిస్తూ అవసరమైన చోట నాట్యం చేస్తూ కమ్మని గాత్రంతో గానం చేస్తూ పురాణ కథల్నీ ఆ కథలలో లోతుపాతుల్నీ పాత్రల మనోభావాల్ని విడమరిచి, వివరించి చెప్పే హరికథల వల్ల ఆబాలగోపాలం ఎడ్యుకేట్ అయ్యేది.

ఎడ్యుకేట్ అని ఎందుకన్నానంటే మన ప్రాచీన సాహిత్యం నుంచి నేర్చుకోవాల్సిందెంతో ఉందని విజ్ఞులంతా ఏక కంఠంతో ఒప్పుకున్న మాటేకదా!

చిన్నపిల్లలూ, పామరులూ అర్ధం చేసుకోలేనిది మన పురాణ భాష, దాన్ని అరటిపండు ఒలిచి అరచేతిలో పెట్టినట్లు చేసేవి హరికథలు.

ఇదేదో హరికథా కాలక్షేపం అనుకునేరు.

ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే అదిగో ఆ హరికథలు వినే బాల్యంలోనే నా మనసులోనే కొన్ని మనిషి తప్పనిసరిగా ఆచరించాల్సిన ధర్మాలు ముద్రపడిపోయాయి వాటిల్లో కొన్ని –

చేతనైతే ప్రేమించాలి తప్ప ఎదుటి ప్రాణిని కష్టపెట్టకూడదు, ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదు. ఋణగ్రస్తులు కాకూడదు, యాచన అసలు కూడదు. ఈ కథకు సంబంధించినవి అవే కాబట్టి మిగిలిన ధర్మాల మాట ఇక్కడ అప్రస్తుతం.

నా ఈ నమ్మకాలన్నీ పూర్వకాలానికి సంబంధించినవని మా పిల్లలూ, వాళ్ళ తండ్రీ కొట్టిపారేస్తూంటారు. వాళ్ళతో వాదించి వాదించి క్రమంగా నావైపు బలం తగ్గుతూ వస్తోంది.

అలాంటి సందర్భంలో… 

ఆరోజు పేపర్లో ఎడ్వర్టైజ్ మెంట్ చూసి మతిపోయింది నాకు.

స్థలం ఉంది చక్కని ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి తమ సంస్థ ఆర్థిక సాయం చేస్తుందని, వడ్డీరేటు చాలా తక్కువనీ, రీజనబుల్ ఇన్ స్టాల్ మెంట్లో అప్పు తీర్చేసుకోవచ్చనీ ఆ ప్రకటన సారాంశం.

అయిదారేళ్ళ క్రితం అమ్మకానికొస్తే మూడు వందల చదరపు గజాల స్థలం కొనడం జరిగింది. నేనూ, మావారు బడిపంతుళ్ళుగా ఇరవై ఏళ్ళు ఉద్యోగం చేసి సాధించిందేమిటా అని వెనక్కి తిరిగి చూసుకుంటే – ఇద్దరు పిల్లలూ, ఇరవై వేలు బేంక్ బేలన్సూ, ఆ స్థలం కనిపిస్తున్నాయి.

పిల్లలిద్దరూ కాలేజ్ చదువుల కొచ్చారు. ఖర్చూ పెరిగింది. ఈ రోజుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ డిగ్రీ కాబట్టి మరో నాలుగైదేళ్ళ వరకూ అమ్మాయి పెళ్ళి, అబ్బాయి పై చదువూ అని ఖంగారు పడక్కర్లేదు.

నిన్నగాక మొన్న ఉద్యోగాల్లో జాయినైన వాళ్ళంతా ఇళ్ళు కట్టేసుకుంటున్నారు. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నా ఇంతవరకు మాకు ఆ మాటే తట్టలేదు.

ఇప్పుడైనా ఆ ధ్యాస లేకపోను కానీ, ఆ మధ్య సెలవుల్లో నన్ను చూడటానికొచ్చిన నా ఫ్రెండ్ రజని నా తెలివితక్కువతనాన్ని తిట్టిపోసింది. ఇద్దరూ సంపాదిస్తూ ఇదేం పనంది. వాళ్ళాయనొక్కడే ఉద్యోగం చేస్తున్నా పోరి, పీకల మీద కూర్చుని ఆయన చేత సెలవు పెట్టించి, దీనికి నచ్చిన మంచి మోడల్ ఇల్లు కట్టించిందట. ఫోటోలు కూడా చూపించింది.

“మగవాళ్ళకేముందీ, నోరు మూసుకుని కూర్చున్నామంటే సంపాదించిందంతా తగలెయ్యాలని చూస్తారు. వాళ్ళ జుట్టెప్పుడూ కొంత మన చేతుల్లో ఉండాలి గుర్తుంచుకో” అంది.

హైదరాబాదంతటి మహానగరంలో అంత మంచి ఇల్లు కట్టించేడంటే వాళ్ళాయన చాలా సంపాదనపరుడై ఉండాలి.

నిజానికి మావారి జుట్టు కొంతే, అంతా నా చేతుల్లోనే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే జీతం అందుకొని తెచ్చి నా చేతికే ఇస్తారు. నేనైనా దుబారా ఖర్చులేం చెయ్యను. ఇంట్లో చూద్దామంటే అవసరమైనవి తప్ప ఒక్క ఎక్సెస్ వస్తువు కనబడదు. టీ.వీ, ఫ్రిజ్ కొనకపోయి ఉంటే అవసరమైనవి తప్ప ఒక్క ఎక్సెస్ వస్తువు కనబడదు. టీ.వి, ఫ్రిజ్ కొనకపోయి ఉంటే మరో ఇరవైవేలు మిగిలి ఉండేవి కాని, ఈ రోజుల్లో అవి అత్యవసర వస్తువులు కదా! మా రజని నవ్వింది కూడా మా ఇంట్లో సోఫా సెట్టు, వి.సి.ఆర్, వాషింగ్ మెషిలాంటివి లేవని.

రజని వెళ్ళిన రాత్రి నాకు నిద్రపట్టలేదసలు. తెల్లవారుఝాము వరకు అటూఇటూ మసలుతూనే ఉన్నాను. తెలతెలవారుతుండగా కంటిమీది కొచ్చిన కాస్త నిద్రలోనూ చక్కని ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నట్లు కలకన్నాను. ఇంకేం ఉదయం లేచింది మొదలు నా మనసును ఇల్లు అనే పదం పట్టుకుంది. ఇంతవరకూ పల్లెల్లో ఏ సదుపాయము లేని అద్దె ఇళ్ళల్లో గడిపేస్తూ వచ్చాను. పిల్లల కాలేజ్ చదువుకి ఉపకరించేలా ఈ చిన్న పట్నానికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాం. ఇక్కడ మేం ఉంటున్న ఇల్లు బాగానే ఉంది కాని, నా జీతంలో సగం అద్దెకింద పోతుంది.

పెన్నూ పేపరూతీసుకుని గత ఇరవై ఏళ్ళుగా అద్దె రూపంలో ఎంత ఖర్చు చేశామో లెక్క కట్టి చూశాను. మైగాడ్ నా గుండె ఆగినంత పనైంది. ఆ డబ్బుతో ఒక ఇల్లు కట్టేసుకోవచ్చు.

ఇక నాలో ఆతృత మొదలైంది. ఎలా అయినా సొంత ఇల్లొకటి కట్టేసుకోవాలని కాఫీ ఇస్తూ ఆయనతో చెప్పాను. చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వేసి పేపరు చూసుకోవడంలో మునిగిపోయారు.

ఈయనెప్పుడూ ఇంతే, నా ఆతృత కొంచెం కూడా పట్టదు. 

ఆదివారం కావడంతో తీరిగ్గా తనతో వాదనకి కూర్చున్నాను.

“ఏవండీ, మాట్లాడరేం, ఇల్లు కట్టుకుందామంటే?” 

తాపీగా పేపర్లోంచి కళ్ళు పైకెత్తి “ఏం మాట్లాడమంటావ్, డబ్బెక్కడొస్తుంది.” అన్నారు. 

“తల్చుకుంటే ఎలాగైనా వస్తుంది, కట్టేవాళ్ళంతా ఎలా కడుతున్నారు?”

“అంటే?” 

“అప్పు చేద్దాం”

ఆయన ఆశ్చర్యంగా నా వైపు చూశారు. “అరె, ఏవైంది నీకు? అప్పుచెయ్యకూడదు, అసత్యమాడకూడదు అంటూ ఏవో ఆదర్శాలు వల్లిస్తావు కదా!”

“అదా.. ఊరికే అనవసర ఖర్చులకోసం అప్పు చెయ్యకూడదు కానీ, ఇలాంటి అవసరాలకి చేస్తే ఏం? అయినా అప్పు చెయ్యకుండా మనలాంటి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం ఎలా వీలవుతుంది?”

“ఓహో, సందర్భాన్ని బట్టి ఆదర్శాల రూపాలు కూడా మారిపోతాయి కాబోలు” ఆయన నవ్వుతున్నారు. కానీ, ఉడుకుమోతుతనంతో నా కళ్ళల్లోకి నీళ్ళోచ్చాయి.

“ఇంతకీ ఏవంటారు, మనకి ఈ జన్మకి సొంత ఇంట్లో ఉండే యోగమే లేదంటారా?”

“తెలివైన వాళ్ళెప్పుడూ అద్దె ఇంట్లోనైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. అప్పు చేసి సొంత ఇంట్లో అగచాట్లు పడాలనుకోరు.”

“మీరు చెప్పేవన్నీ పూర్వకాలం కబుర్లు, ఇద్దరం సంపాదిస్తున్నాం, ఆ మాత్రం అప్పు తీర్చలేమా?”

“శాంతీ! ఇల్లు కట్టుకోవాలనే కోరిక నీచేత అలా మాట్లాడిస్తోంది కానీ ఇరవై ఏళ్ళుగా ఇద్దరం సంపాదిస్తూ ఎంత కూడబెట్టామో ఆలోచించు. పిల్లలు చిన్నవాళ్ళప్పుడే అది సాధ్యపడలేదు. ఇప్పుడెలా వీలవుతుంది? ఇల్లు కోసం అప్పు చేస్తే రాబోయే ఖర్చులన్నిటికి డబ్బెక్కడ్నుంచొస్తుంది.”

“అదే నా ఆతృతాను.. ఖర్చులింకా పెరిగిపోతే ఇంకెప్పటికీ ఇల్లు కట్టుకోలేం. ఇప్పుడే అది వీలవుతుంది. మనిద్దరికీ ఇంకా సర్వీసువుంది కదా. పి.యఫ్ వగైరాలున్నాయి. అప్పుడు చూసుకుందాం.”

నా హఠం వదిలేది కాదని ఆయనకి అర్థమైపోయింది. పేపరు మడిచి పక్కన పడేస్తూ – “అయితే ఇల్లు కట్టే తీరాలంటావ్. ఎంత ఖర్చవుతుందో ఏమైనా ఎస్టిమేషన్ వేశావా?”

“ఇంకా లేదు. మీరు ఓ.కే అనాలే కాని, అదెంత సేపు?”

“పెంకుటిల్లా, డాబా ఇల్లా?”

” ఛీ… ఈ రోజుల్లో పెంకుటిల్లే విటండి, ఒక్కసారే కదా లైలో ఇల్లు కట్టుకునేది, డాబా కట్టాలనుకునేవాళ్ళు వేలల్లో మాట్లాడకూడదు, లక్షల్లోనే గాని”

“మీరూరుకోండి, మరీ భయపెట్టేస్తున్నారు” 

“సరే ఈ రోజే ఎస్టిమేషన్ వేయిద్దాం, నీకే తెలుస్తుంది.”

ఇద్దరం కలిసే వెళ్ళాం ఇంజనీరు దగ్గరికి. నేను చెప్పిన రూమ్స్ అన్నీ వచ్చేలా ప్లాన్ గీసి చూపించాడాయన. పన్లో పనిగా ఇంటిముందు పోర్టికో, చిన్న గార్డెన్ కూడా గీశాడు. నాకా ప్లాన్ చూస్తేనే ఇల్లు కట్టేసుకున్నంత సంతోషమైంది. కానీ, ఆయన చెప్పిన ఎమౌంట్ వినేసరికి నా ఉత్సాహమంతా నీరుగారిపోయింది. ఎంత లేదన్నా మూడు లక్షలు అవుతుందట. మైగాడ్! మూడు లక్షలే.

“అలా నిరుత్సాహపడకండి. కావాలంటే ఇంకా తక్కువలో వేద్దాం కొన్ని రూమ్స్ తగ్గించి. అయినా ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం కష్టమేం కాదు. అప్పివ్వడానికి చాలా సంస్థలు ముందుకొస్తాయి. కాకపోతే మీ డాక్యుమెంట్స్ అప్పు తీరేవరకూ వాళ్ళ దగ్గరుంచుకుంటారు”

ఇంజనీరు మాటల్లో నాకు మళ్ళీ కొంత ధైర్యం వచ్చింది. ఆయనకో ఐదొందలు చెల్లించుకుని బైటపడ్డాం.

మళ్ళీ మళ్ళీ తీరిక ఉంటుందో లేదోనని దారిలో పురోహితుడి దగ్గరకి వెళ్ళాం శంకుస్థాపనకి మంచి ముహూర్తం ఎప్పుడో చూపించడానికి. మర్నాడే మంచిరోజని, అది తప్పితే పుష్కరాల మూలంగా సంవత్సరమంతా ఆగాలని అన్నాడాయన. నా గుండె గుభేలుమంది.

సంవత్సరం తర్వాత వరకూ ఈ ఉద్దేశ్యం నిలకడగా ఇలాగే నిలిచి ఉంటుందా?

చాలా తొందరగా డెసిషన్ తీసుకుంటూ “అయితే రేపు మీరు రావాలి శంకుస్థాపన పూజ చేయించడానికి” అనేశాను. మావారు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నారు నావైపు. ఆయన కళ్ళల్లోకి చూస్తే నా నిర్ణయం మారిపోతుందేమోనని నేను ముఖం తిప్పుకున్నాను.

నన్నింట్లో దించేసి, తన కొలీగ్స్ ఎవరికో తెలిసిన తాపీ మేస్త్రీతో మాట్లాడి వచ్చారాయన.

మర్నాడు తెల్లవారుఝామున శంకుస్థాపన జరిగిపోయింది. కాంట్రాక్టుకివ్వాలా దగ్గరుండి కట్టించుకోవాలా అనే విషయాన్ని పిల్లలూ, మేమూ కూర్చుని చర్చించుకుని దగ్గరుండి స్వయంగా కట్టించుకోవాలని నిర్ణయించుకున్నాం.

ఆ రోజే మావారు నెలరోజులకి సెలవు చీటీ పంపించేశారు. ఇసుక, సిమెంట్, రాయి, ఐరన్ వగైరాలు సమకూర్చడంలో పడ్డారు. సరిగ్గా పదిరోజుల్లో పునాది పూర్తయింది. బేంక్ నుంచి విత్ డ్రా చేసిన ఇరవైవేలు పునాది కట్టడానికి సరిపోయాయి.

ఇక అప్పుకోసం ఊళ్ళో ఉన్న బేంకులన్నీ తిరిగొచ్చాం. కనీసం అయిదారేళ్ళ ముందు గృహకల్ప స్కీంలో జాయినయితే తప్ప కేవలం ఇంటికోసం లోన్ ఇవడం జరగదని చెప్పేసారు బేంక్స్ వాళ్ళంతా.

బేస్ మెంట్ ఎలాగూ కొంత ఆరాలి కాబట్టి ఈలోగా హైదరాబాద్ వెళ్ళి మొన్న పేపర్లో చూసిన సంస్థను కన్సల్టు చేసి లోన్ తీసుకుందాం అనుకున్నాం.

పిల్లలకి ఇల్లు అప్పగించి హైదరాబాద్లో బిజినెస్ చూసుకుంటున్న మా తమ్ముడింటికి చేరుకున్నాం. వాడు ఇంట్లో లేడు. బిజినెస్ పనిమీదే బోంబే వెళ్ళాడట.

వాడు చేస్తున్న ఎక్స్పర్టు బిజినెస్ ఎంత బావుందో వాళ్ళిల్లు చూస్తే తెలుస్తుంది. క్రితం సంవత్సరం కట్టిన ఇంటికి అప్పుడే అప్ స్టెయిర్ వేసేశాడు. ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్, కాస్ట్ డెకరేషన్, పోర్టికోలో మారుతి.

మా తమ్ముడి భార్య చాలా మర్యాద చేసింది మాకు.

“అయ్యో, ఏ సలహా అడగాలనుకున్నా వాడింట్లో లేడే” అని దిగులేసింది నాకు. సరే, ఏం చేస్తాం. 

ప్రయాణపు బడిలికో, భరించరాని ఎక్సైట్మెంటో తెలీదు కానీ విపరీతమైన నీరసం ఆవహించింది నన్ను.

పేపర్లో ఇచ్చిన ఎడ్రస్ పుచ్చుకుని ఈయన వెళ్ళారు. మధ్యాహ్నం భోజనం కూడా మానేసి, వాళ్ళు తిప్పిన సీటుకల్లా తిరిగి, సాయంత్రానికి ఆ ఆఫీసునుంచి ఈయన తెలుసుకున్నదేవిటంటే మా ఉద్యోగాలకి మాకు డాబా ఇల్లు కట్టుకునేంత డబ్బు అప్పుగా లభించదంట. చెరో పదిహేనువేలూ, అది కూడా మా ఉద్యోగాలను హామీగా పెట్టుకుని ఇస్తారట. దానికి కూడా తతంగాలున్నాయట. మేం వర్క్ చేసే ప్లేస్ నుంచి గెజిటెడ్ ఆఫీసర్ హామి, ఎమ్.ఆర్.ఓ హామీలతో బాటు డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి అప్పగించాలట. అదైనా వెంటనే ఇవ్వరట. వర్క్ బిగిన్ చేసి కొంత కట్టి చూపించాలట.

వాడిపోయిన ముఖంతో ఉన్న ఆయన్ని చూస్తే బాధేసింది నాకు. ఇదంతా నామూలానే కదా! 

అంతులేని నిస్సత్తువతో చేరబడిపోయిన నన్ను జాలిగా చూస్తున్నారాయన.

“నువ్వేం వర్రీకాకు. ఇదొక్కటే కాదుకదా, ఇక్కడే చాలానే సంస్థలున్నాయి. ఇటువంటివి. ఉయ్ విల్ ట్రై” అన్నారాయన నన్నూరడిస్తూ.

మూడు రోజులు సిటీ అంతా తిరిగినా పనికాలేదు.

కొన్ని సంస్థలు కేవలం సిటీకే కేటాయించబడినవి. మరికొన్ని సంస్థలకి చాలా పెద్ద ఆస్థిని హామీగా చూపించాలి. ఒక్కటీ ఇల్లు పూర్తిగా కట్టుకోడానికి ఉపకరించేవికావు.

ఇక నిరాశ చేసుకుని వచ్చేద్దామనుకుంటూండగా మా తమ్ముడొచ్చాడు. ‘ పెద్దక్కయ్యా” అంటూ కావలించుకున్నంత పని చేశాడు. “ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. సెలవలొచ్చినప్పుడైనా రారు” అంటూ నిష్ఠూరమాడాడు.

వాడు చూపిస్తున్న ఆప్యాయత చూసి నాలో ఏదో ఆశ చిగురించడం మొదలుపెట్టింది. అతని భార్య చెప్పినట్టుంది భోజనాల దగ్గర అడిగాడు “ఇల్లు కట్టాలనుకుంటున్నారట!”

“అవునోయ్, మీ అక్కయ్యకి ఏ ముహూర్తాన వచ్చిందో ఈ ఆలోచన పెరిగి పెరిగి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆవిడ బుర్రంతా ఆక్రమించుకుంది. ఈ సంవత్సరంలో ఎలాగైనా ఇల్లు కట్టెయ్యాలని అనుకుంటోంది. ”

“అదేమైనా తప్పటా తమ్ముడూ, ఎవరికుండదు సొంత ఇల్లొకటుండాలని”

“తప్పేం కాదుగానీ, డబ్బు సరిపడా ఉండాలి కదా చేతిలో, ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు” అన్నాడు వాడు. నా మనసు చివుక్కుమంది.

మావారు అమాయకంగా అడిగారు “అవునూ నువ్వెక్కడ లోన్ తీసుకున్నావు, ఇంటికోసం?” తాగుతున్న మంచినీళ్ళు కొరబోయేలా నవ్వాడు వాడు. ”లోనా, లోన్ నాకెందుకండీ, ఇదంతా నా సొంత ఆర్జితం” అన్నాడు వాడు కేజువల్ గా.

“అలా అయితే మాక్కూడా కొంత డబ్బు అప్పుగా సాయం చెయ్యరా’! అనేశాను నేను కళ్ళు పైకెత్తకుండానే. ఈమాట నా గొంతులోంచి రావడానికి నన్ను చాలా బాధపెట్టింది. కొంతసేపటికి నన్ను నేను అదుపులో పెట్టుకుంటూ తల పైకెత్తేసరికి మా వారు నిర్ఘాంతపోయి నావైపు చూస్తున్నారు.

బహుశ ‘సొంతిల్లు’ అనే ప్రలోభం ఈమెనెంతగా దిగజార్చేసింది అని అనుకుంటున్నారనుకుంటా. 

మావాడు మౌనంగా ఉండిపోయాడు.

మౌనం అర్థాంగీకారమో, పూర్ణాంగీకారమో తెలీలేదు నాకు. 

భోజనాలయ్యాక చెయ్యి కడుక్కుంటూ “రాఘవా! మేం రాత్రి గౌతమికి వెళ్తాం మరి” అన్నారీయన అప్పుడూ మాట్లాడలేదు వాడు. 

అయిన వాళ్ళ దగ్గర డబ్బు ప్రస్తావన తేవడం ఎంత పొరపాటో అర్థమైంది నాకు. చాలా అశాంతిగా అనిపించింది. 

సాయంకాలం నిద్రపోయి లేచాక మేం ఉన్న గదిలోకి వచ్చాడు రాఘవ. 

“డబ్బు నా దగ్గర లేదు కానీ, నాకు తెలిసిన ఒకళ్ళ దగ్గర అప్పుగా ఇప్పిస్తాను. ఎంత అవసరమౌతుంది.” అన్నాడు. 

ఆ మాటకే నాకెంతో సంతోషమేసింది. మధ్యాహ్నం నుంచి పడిన బాధంతా ఎగిరిపోయింది. 

“ఎంత ఖర్చవుతుందో మాకైతే తెలీదు. లక్షపైనే కావచ్చు” అన్నాను నేను. 

“ఎలా తీరుస్తారు మరి?” అన్నాడు రాఘవ.

“అదేవిటి, ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం కదా. ఆ మాత్రం నమ్మకం లేకపోతే అప్పెందుకు చేస్తాం?”

”తీర్చరని కాదు. వెయ్యి, రెండువేలు పంపిస్తానంటే వీలుకాదు. పదివేలకు తక్కువ కాకుండా ఇవ్వాలి ఎప్పుడిచ్చినా. ఏ నెల కానెల వడ్డీ పంపించెయ్యాలి. నూటికి రెండు రూపాయలు వడ్డీ అవతల కంపెనీవాళ్ళడిగిన హామీలన్నీ నాకూ ఇవ్వాల్సుంటుంది.” నిర్మొహమాటంగా రాఘవ మాట్లాడుతున్న విధానానికి మా వారి ముఖంలో రంగులు మారడం స్పష్టంగా కనిపిస్తోంది.

నా ఒడిలో కూర్చుని ఆ ఆ లు దిద్దుకున్న చిన్న తమ్ముడేనా వీడు అని నాకూ ఆశ్చర్యంగా ఉంది ఉద్యోగాల రొటీన్లో గమనించుకోంగానీ, డబ్బెంత కార్యదక్షతను నేర్పిస్తుందీ.

బీరువా తాళం తీసి అయిదు పదివేల కట్టల్ని మా ముందుంచాడు. 

“ఇవి అయిపోయాక మళ్ళీ ఇస్తాను. ప్రస్తుతానికి పటుకెళ్ళండి. నా ఫ్రెండ్ డబ్బు నా దగ్గరే దాస్తాడు.” అన్నాడు. “డాక్యుమెంట్సేవీ?” అని అడిగి పట్టుకెళ్ళి బీరువాలో పెట్టుకున్నాడు.

ఉదయం వాడు చూపించిన ఆప్యాయతా మర్యాదా ఇప్పుడేవి? అప్పు తీసుకోవడంతో మేం వాడికెంత చులకనయ్యామంటే ఆ రాత్రికే బయలుదేరుతున్నాం అని తెలిసినా కూడా టైంకి వాడు ఇంటికి రాలేదు. “వెళ్ళొస్తాం” అని చెప్తున్నా మధ్యాహ్నం తలనొప్పి అని మంచమెక్కిన వాడి భార్య కిందకి దిగలేదు. చిటికెడు కుంకుమ నా నుదుటపెట్టలేదు.

అంతవరకూ ఉగ్గబట్టుకున్న దుఃఖం నాకు ట్రెయిన్ లో కూర్చున్నాక పొంగుకొచ్చింది. అప్పు చెయ్యకూడదనే నా నియమానికి నీళ్ళోదిలేసి నేనెంత అవమానం పొందాను.

ట్రెయిన్ ఎక్కగానే జోలపాడినట్లు ముంచుకొచ్చే నిద్ర ఆ రాత్రి నా దరికి రాలేదు. 

పని మొదలైంది. సిమెంట్ బస్తాలు మంచినీళ్ళులా వాడేస్తున్నాడు మేస్త్రీ. నెలరోజుల్లో యాభైవేలూ అయిపోయాయి. ఇంటి గోడలు పూర్తయ్యాయి. పైన శ్లాబ్ వెయ్యాల్సి ఉంది. ఒక్కసారి పాతికవేలు కావాలి. రాఘవకు ఫోన్ చేశారీయన. మూడు రోజులపాటు ఫోన్లో దొరకలేదు వాడు. మూడోరోజు నిర్మొహమాటంగా చెప్పేశాడట. ఇలాంటి వ్యవహారాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేదు కాబట్టి డబ్బు పంపడం కుదరదని. మతిపోయినట్టైంది నాకు.

రెస్ట్ గా ఎండలో తిరగడం వల్ల కాబోలు జ్వరంతో మంచమెక్కేసారాయన. 

మేస్త్రీ తొందర ఎక్కువైంది ఒక పక్క.

నా గోల్డు మొత్తం తీసుకుని బేంకుకి పరిగెత్తాను. మార్చి, ఏప్రిల్ నెలలు వాళ్ళు లెడ్జర్లు చెక్ చేసే మంత్స్ కాబట్టి గోల్డ్ లోన్స్ ఇవ్వరట.

ఏం చెయ్యాలో తోచని అయోమయ స్థితి నన్నావహించింది.

మొదటి నెల వడ్డీ ఇంకా పంపలేదేవిటని రాఘవ దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది.

బంగారాన్ని అమ్మెయ్యడం తప్ప మరో మార్గం కనిపించలేదు. నేనెంతో ఇష్టపడి చేయించుకున్న నా నగల్ని ఒక్కసారి చేత్తో తాకి చూసుకున్నాను. మంగళసూత్రం తప్ప తక్కినవన్నీ సేర్ సున్నితపు త్రాసులో వేసి చూస్తూ నిలబడ్డాను. “భగవంతుడా! ఈ బంగారం ఖరీదు పాతికవేలకు తగ్గకుండా చెయ్యి” అని ప్రార్ధిస్తున్నాను.

నా ప్రార్ధన ఫలించి పాతికవేలొచ్చి శ్లాబ్ పడుతుంది సరే?

ఆ తర్వా త..? 

ఆలోచనల్తో నా తల పగిలిపోతుందేమో అనిపిస్తోంది.

నా చుట్టూ ఉన్న పరిసరాలన్నీ గిర్రున తిరుగుతున్నట్లనిపిస్తోంది. సేర్ ఎంతిచ్చాడో కూడా చూసుకోకుండా పర్స్ లో కుక్కుకుని, ఎలాగో వెళ్ళి రిక్షాలో కూర్చున్నాను. దగ్గర్లో ఉన్న నర్సింగ్ హోమ్ కి ఎలా వెళ్ళానో నాకే తెలియదు. ఎప్పుడూ రొటీన్ వర్క్ కి ఏ అంతరాయం రానీకుండా, నలభై ఏళ్ళోచ్చినా అతి ఏక్టివ్ గా నాతో సహకరించే నా దేహానికిప్పుడేమైందో అర్ధం కాలేదు.

టెస్ట్ పేరుతో నాలుగు గంటలూ, నాలుగు వందలూ ఆ హాస్పిటల్ కి చెల్లించుకుని బైటపడ్డాను. డాక్టరు వ్రాసిన ప్రిస్కిప్షన్ విప్పలేదు. డయాగ్నసిస్ రిపోర్టులో ఏవుందో అని చూస్తే హైపర్ టెన్షన్ 180 – 160, అంటే లైఫ్ లాంగ్ మందులు మింగాలన్నమాట.

అలసటగా రిక్షాలో వెనక్కి చేరబడి కళ్ళు మూసుకున్నాను. 

కోరి తెచ్చుకున్న శాంతి ఇది. 

హోరుమంటున్న నా చెవుల్లో ఎప్పుడో హరిదాసుగారు పాడిన పాట మార్మోగుతోంది. 

“యాచన చేయుట తప్పుర, నరుడా! 

అప్పులు చేయుట ముప్పురా….”

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.