ఇవాల్టిదాకా నీవింకా నన్నర్థం చేసుకోలేదనుకున్నాను
ఇకనుంచి నేను నిన్నర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను
వంటగది తాలింపు వాసనలో
నీ చెమట సౌందర్యం కానరాలేదు
తలలోంచి గుప్పెడు మల్లెలు మత్తెక్కిస్తుంటే
నీవొక మాంసపు ముద్డగానే కనిపించావు
ఇంట్లో ఇంటిచుట్టూ పరుచుకున్న
లెక్కలేనన్ని నీ పాదముద్రల్లో
శ్రమ సౌందర్యాన్ని గుర్తుపట్టలేకపోయాను
ఇంట్లోని అన్ని అవసరాలను చూసుకునే
మరయంత్రంగానే భావిస్తూ
మాటల కీ ద్వారా నా అవసరాలను సమకూర్చుకున్నాను
విశ్రాంతి కోసమో
నిద్ర కోసమో
పడకమీద నడుం వాల్చితే
నాలోని కోర్కెకు అక్కరకొచ్చే
అపూర్వమైన కానుకగానే భావించాను
పురిటినొప్పులతో మెలికలు తిరుగుతుంటే
మొలక పూసిన ఆనందభాష్పాలు నీ కంటినుంచి రాలుతుంటే
స్త్రీగా నీ బాధ్యత తీరిందని కొట్టిపడేశాను
నీ ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా
గాల్లో గిరికీలు కొడుతున్న నన్ను
ఓ వేణునాదాన్ని చేద్దామన్న నీ కోరికను తిరస్కరించిన
జ్ఞాపకమిప్పటికీ నా కడుపులో దేవినట్లుగానేవుంది
అరవైలో పడీపడగానే వ్యసనాలన్నీ
పేగుల్ని నరాల్నీ ఊపిరితిత్తుల్నీ కాలేయాన్నీ మూత్రపిండాల్నీ
కొరుక్కుతింటూ శరీరాన్ని గుల్లబరిచింది
మంచానికి అతుక్కుపోయిన నాకు
ఆసుప్రతి గదిగోడలనిండా నీవే కనిపిస్తున్నావు
సెలైన్ బాటిల్లోంచి బొట్లు బొట్లుగా పడుతున్న నీ ఆరాటం
శరీరంలోకి ఇంకుతూ చైతన్యం ప్రవహిస్తోంది
అదుపులోకి వస్తున్న రక్తపోటు
నీ విశ్వాసం తెరలు తెరలుగా కదులుతోన్నది
సన్నగిల్లుతున్న నీ సహనం వెనుక
నా జీవితం పదునుదేరుతున్నది
ఇవాల్టిదాకా నీవింకా నన్నర్థం చేసుకోలేదనుకున్నాను
ఇప్పటినుంచీ నిన్నర్థం చేసుకుంటూనేవుంటాను
నా కనురెప్పలు మూతపడేవరకూ….