గాంధీజీ, గోరా (గోపరాజు రామచంద్రరావు)లను ఆదర్శంగా కొడాలి కమలమ్మ తన జీవితాన్ని గడిపిన స్వాతంత్య్ర సమర సైనికురాలు. కొడాలి కమలమ్మ త్యాగమయ జీవితాన్ని గడిపారు.
1916లో గోగినేని రామకోటయ్య, వెంకాయమ్మలకు జన్మించిన కమలమ్మ మోపర్రు గ్రామవాసి. తెనాలికి సమీపంలో ఉన్న ఆ గ్రామం. ఆనాడు స్వేచ్ఛా పిపాసతో పోరాటంలోకి దిగిన ప్రాంతం. చదువుకుంటుండగా గాంధీజీ స్వాతంత్ర్య పోరాటం పట్ల ఆకర్షితురాలై, పాల్గొన్నారు.
విద్య ఆట్టే సాగలేదు. హైస్కూలు చదువు కాకుండానే ఆపేసి, దేశం కోసం జరిగే కార్యక్రమాలలోకి దిగారు. గాంధీజీ సలహా మేరకు రాట్నం వడికి, ఖద్దరు తయారు చేశారు. శాకాహారిగా గడుపుతూ నిరాడంబరంగా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఒకసారి గాంధీజీ పర్యటనకు రాగా, అందులో పాల్గొని, స్వయంగా మహానాయకుడిని చూడగలిగాననే తృప్తి పొందారు. చదువుకు స్వస్తి పలికి, హిందీ నేర్చి ఖద్దరు ధరిస్తూ, శాకాహారిగా అతి సామాన్య జీవనం గడుపుతూ నిలిచారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. ఇంకొల్లు గ్రామంలో డాక్టర్ ప్రాక్టీసు పెట్టిన కుమారున వద్ద వుంటూ తన జీవన కార్యక్రమాలు సాగించారు. సరళ కుమార్తె గద్దె రామచంద్రరావుని పెళ్ళాడి అమెరికాలో స్థిరపడ్డారు.
కుమారుడు ధర్మానందనరావు తల్లిని అతిగారాబంగా చూచాడు. ఆ విధంగా ఆమె ఇంకొల్లు వాసి అయింది.
కొడాలి కమలమ్మ జీవితంలో మరో పెద్ద మలుపు గోరా శిష్యరికం. నాస్తికోద్యమంలో ప్రపంచ ఖ్యాతి పొందిన గోరా కేంద్రానికి ఏటా వెళ్ళండం, యధాశక్తి చందా యివ్వడం, కార్యక్రమాలలో పాల్గొనడం ఆమెకు ఆనవాయితీగా మారింది. ఎన్ని ఇబ్బందులున్నా గోరా నాస్తిక కేంద్ర దర్శనం మాత్రం ఆమె మానలేదు. చనిపోయే వరకూ యీ కార్యక్రమం సాగింది. గోరా నాస్తిక కేంద్రానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా చందా యివ్వడం కమల విధిగా భావించింది.
కమలమ్మ జీవితంలో ఢక్కా ముక్కీలు అనుభవించింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, 15 మాసాలపాటు జైలు శిక్ష అనుభవించారు. పట్టుదలగా ఆమె జైలులోనే జాతీయ జెండా ఎగురవేసింది.
తన భర్త చనిపోతే కమల ఎలాంటి కర్మకాండలు నిర్వహించలేదు. కమలమ్మ ఒకే ఒకసారి విదేశీపర్యటన చేశారు. అమెరికాలో ఉంటున్న కుమార్తె, అల్లుడు వద్దకు బఫెలోకి వెళ్ళారు. అది చలి ప్రాంతం. ఆమెకు యిష్టం లేని వాతావరణంలో గడిపి, నయాగరా చూచింది.
అమెరికాలో కమలమ్మ మిల్వాకి వెళ్ళారు. అక్కడ ఆలపాటి కృష్ణకుమార్, జ్యోతిర్మయిలతో గడిపారు. ఆ తరువాత న్యూజెర్సీ రాష్ట్రంలో గుత్తికొండ రవీంద్రనాథ్ దగ్గర గడిపి వెళ్ళారు.
కమలమ్మ తిరిగి స్వగ్రామానికి రాగా తీవ్ర తుఫాన వరదలు భీభత్సంగా వుండడం గమనించింది. మొత్తం మీద పరిమితమైన ఆమె అమెరికా ప్రయాణం సుఖంగానే ముగిసింది.
ఇంకొల్లులో వుంటున్న కమలమ్మ చెంతకు మానవవాదులు, నాస్తికులు వస్తుండేవారు. కమలమ్మ మితభాషి. నాస్తిక వాదిగానే చివర వరకు జీవనం సాగించి, 100 ఏళ్ళకు చనిపోయారు. స్త్రీలలో అటువంటి విశిష్ట వ్యక్తులు అరుదు.