మెరుపులు- కొరతలు

రుబీనా పర్వీన్ కథ ‘బుర్ఖా’

                                                                – డా.కే.వి.రమణరావు

తెలంగాణాలోని ఒక మారుమూల ప్రాంతం ఈ కథకు నేపథ్యం. ఇది ఉర్దు కలసిన తెలంగాణా మాండలీకం మాట్లాడే ముస్లిం పాత్రలమధ్య నడుస్తుంది. రచయిత్రి సర్వసాక్షి దృష్టికోణంలో చెప్పినా కథంతా ప్రధాన పాత్ర మెహర్ చుట్టూ తిరుగుతుంది.

స్థూలంగా కథాంశం ఇది.

మెహర్ బీద ముస్లిం కుటుంబంలోని పదో తరగతితోనే చదువాపేసిన అందమైన యువతి. ఆమె భర్త లతీఫ్ మంచి హస్తవాసిగలిగిన ఆరెంపి డాక్టరు. ఇద్దరు పిల్లలు. ఉండడానికైతే లతీఫ్ ‘హీరో సుమన్ లెక్క’ స్ఫురద్రూపిగా ఉంటాడుగాని బుద్ధి సరైందికాదు. అతను తన రూపాన్ని ఎరగావేసి దాదాపుగా సంవత్సరానికొకసారి చుట్టుపక్కల పల్లెల్లోని ఒక యువతిని లేపుకుపోయి ఎక్కడో గడిపి ఆర్నెల్లతరువాత తిరిగొస్తూంటాడు. అలా జరిగినప్పుడంతా మెహర్ మేనమామలు అతన్ని బెదిరిస్తూంటారు. అతను ఇంకెప్పుడూ వెళ్లనని హామీలిస్తూంటాడు. మళ్లీ మామూలే. 

మెహర్ ని చదివించకుండా అతనికిచ్చి పెళ్లిచేయడం నీతప్పంటే నీ తప్పని మెహర్ తల్లి ఖతీజా, తండ్రి ఖాసీం దెబ్బలాడుకుంటూంటారు. మెహర్ తన భర్తవాలకానికి సర్దుకుని పోతూంటుంది. 

అతను పారిపోయిన రోజుల్లో పొలాల్లో కూలికిపోయి ఆ సంపాదనతో ఇల్లు గడుపుతూంటుంది. మెహర్ పిన్ని సుల్తానా దగ్గరుండే టౌన్లో ప్రభుత్యోద్యోగి. ఇలాంటి ఒక సందర్భంలో ఆమె వచ్చినప్పుడు ‘భర్త వెంట తిరిగి అతని దగ్గర డాక్టరీ నేర్చుకోమనీ, అతను లేనప్పుడు కూలికి పోకుండా తనుకూడా డాక్టరీ పని చేసి సంపాయించుకోవచ్చని’ ఆమె తన అక్కకూతురు మెహర్ కి సలహా ఇస్తుంది. దాన్ని అమలులో పెట్టి ఆర్నెల్లలోనే మెహర్ ఆరెంపి డాక్టరౌతుంది. త్వరలోనే చుట్టుపక్కల తండాల్లో, గూడాల్లో మంచిపేరు తెచ్చుకుంటుంది. ఈసారి భర్త మళ్లీ మరొకరితో వెళ్లిపోయినా తొట్రుపడకుండా తనపని తాను చేసుకుపోతుంది.

అంతా ‘బాగానే’ నడుస్తూన్న సమయంలో క్రమంగా పరిస్థితులు మారతాయి. అన్నిమతాల్లో మతపెద్దల ఆధిక్యం పెరిగి అది సామాన్యప్రజల దైనందిన జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. ఆవూరి మౌల్విసాబ్ ఒకరోజు ఖాశీం ఇంటికొచ్చి మెహర్ బుర్ఖాలేకుండా తిరుగుతున్నదని అభ్యంతరం చెప్పి ఒక బుర్ఖా బహుమానంగా ఇచ్చి బయటికెళ్లినప్పుడంతా దాన్ని వేసుకోవాలని గట్టిగా చెప్పి వెళ్లాడు. 

ఆతరువాతిరోజు (కథ ప్రారంభం ఇక్కడే, పైన జరిగిందంతా ఫ్లాష్ బ్యాక్) మెహర్ బుర్ఖా వేసుకుని ఒక కాన్పు చెయ్యడానికి పొలాలమీదుగా రెడ్యా తండాకు వెళ్తూండగా అక్కడి గొడ్లు కాచుకునే పిల్లలు దూరంనుంచి బుర్ఖాలోవున్న ఆమెను చూసి దెయ్యం అనుకుని రాళ్లతో కొట్టారు. ఆమెకు గాయాలయ్యాయి, వాళ్లే చూసి తప్పుతెలుసుకుని ఆమెను మంచంమీద వేసుకుని ఆమె ఇంటికి తెచ్చారు. 

కూతుర్ని ఆస్థితిలో చూసిన ఖతీజా, కడుపు కాలిపోయి మౌల్విసాబ్ వల్లే ఇలా అయిందని వాపోతుంది. అంతవకూ అలవాటులేని బుర్ఖా వేసుకోవాల్సిన అవసరం లేదని తల్లీ కూతుళ్లు తీర్మానించి ఆ బుర్ఖాను అప్పుడే వచ్చిన స్టీలుసామానుల అబ్బాయికి వేసేస్తారు.

ఈకథలో రచయిత్రి ప్రధానంగా ఇటీవలి కాలంలో దైనందిన జీవితంలో పెరుగుతున్న వివిధమతాల జోక్యాన్ని చూపే విషయాన్ని వస్తువుగా తీసుకుని, దానివలన బహుళత్వ సమాజంలో మొదలౌతున్న అంతరాన్ని ఫోకస్ చేస్తూ, అవసరమైన మేరకు దాన్ని వ్యతిరేకించడం సరైనదనే తీర్పుతో ముగించారు.

ఈవిషయాన్ని చెప్పడానికి మారుమూల గ్రామీణజీవితాన్ని నేపథ్యంగా తీసుకోవడమేకాక అక్కడి కొందరి స్త్రీల మరొక సమస్యను, భార్యకు భర్త విశ్వాసంగా ఉండకపోవడాన్ని, కూడా జోడించారు. ఈసమస్యకు ఈ కథ ప్రధాన సమస్యకూ సంబంధం లేదు. ఒక యువతి మతజోక్యంవల్ల పడే ఇబ్బంది చెప్పడానికి అది అవసరం లేదు. అయినా రచయిత్రి దాన్నికూడా బలంగా చిత్రించడమేకాక కథాగమనంలో దానికే ఎక్కువ చోటు కల్పించారు. గ్రామీణ యువతులకుండే సంసార అభద్రతను ఎత్తిచూపించడమే కాకుండా అక్కడి స్త్రీలు దానికి సర్దుకుని పోతూన్న దుస్థితిని కూడా తెలియజెప్పారు. పైగా భర్త నిర్వాకం  గురించిన ప్రసక్తి వచ్చినప్పుడు మెహర్ సిగ్గుపడి అతను తీసుకెళ్లిపోయినమనిషి పేరుకూడా చెప్తుంది. గ్రామీణ ఫ్యూడల్ సమాజంలోని పురుషాధిక్యత ఏస్థాయిలో ఉందో రచయిత్రి అర్థవంతంగా చూపించారు. 

ఇక మతపెద్దల జోక్యంవల్ల వస్తున్న మార్పులను ఖతీజా, సుల్తానాల మధ్య ఇలాంటి కొన్ని సంభాషణలద్వారా చూపించి రచయిత్రి తన ప్రతిభను ప్రదర్శించారు.

“నమాజ్ కు పోకపోతే మజీద్ మౌల్వీసాబ్ ఊకుంటలేడు. ఊల్లె ముసల్మాన్లందరు కట్టుమీదుండాలె”… “మా చిన్నప్పుడు అబ్బ, దాదా రంజాన్, బక్రిద్ కే నమాజుకు పొయ్యేటోళ్లు. ఊళ్లో మజీద్ గూడ లేకపోయె” 

“మారయ్య చిన్నాయన పండక్కి కొబ్బరికాయ గొట్టి పలారం బెట్టేటోడు … పండగెప్పుడొస్తదా అని జూసెటోళ్లం.. ఒకనాడు చిన్నాయన పలారం పంపిండు. మా అత్త “మనం ముసల్మాన్లం ఈ పలారం తినొద్దు” అన్నది… ఇంట్లో పనిచేస్తున్న మేరి కూడా “.. మా చర్చి అయ్యగారు గిట్లాంటివి తినొద్దని చెప్పిండు” అన్నది” 

“మొన్న రంజాన్ నాడు రాంరెడ్డిమామ ఇంటికి బిర్యాని సేమ్యాలు పంపిన.. మీరు పెద్దది తింటరు, మాకొద్దని ఎనక్కి పంపిండు. మనమెక్కడ పెద్దది తిన్నామె…చిన్నప్పటికాంచి ఆవులు, ఎడ్లు పెంచినోళ్లం, వాటితోనే పెరిగినోళ్లం”

ఇలాంటి పరిణామాలు దెబ్బతింటున్న మానవసంబంధాలకు సంకేతాలుగా రచయిత్రి చక్కగా వివరించారు. ఈసమస్యకు పరిష్కారాన్నికూడా స్పష్టంగా ఇలా చూపుతారు. “మనరెక్కల కష్టంమీద బతుకుతున్నం ఏందీల్ల జబర్దస్తీ” అని తల్లి అంటే “ఈకొత్తలు మనకొద్దు ఎప్పుడెట్లున్నామో గట్లనే ఉందాం” అని కూతురు మెహర్ తేల్చి చెప్తుంది.

రచయిత్రి ఈకథద్వారా తన సందేశాన్ని వినిపించడానికి మారుమూల గ్రామీణప్రాంత నేపథ్యాన్ని ఎన్నుకుని అక్కడి వెనకబడిన పేద వాతావరణాన్ని చాలావరకూ సమర్థవంతంగా చూపించారు. పెద్దగా వర్ణనలు లేకుండా పాత్రల సంభాషణల ద్వారా కథంతా నడిపారు. ఉర్దూ కలసిన తెలంగాణా మాండలీకం హృద్యంగా ఉంది. పాత్రలు దాదాపుగా వాస్తవానికి దగ్గరగావుండి, ఉచ్చారణపరంగా లిపిలో కొంత తేడావున్నా పాత్రల మాటలు సహజంగా ఉన్నాయి. 

ప్రధాన సమస్యకు పరిష్కారం చూపించినా మెహర్ తన భర్త అవిశ్వాసం పట్ల వ్యతిరేకత చూపించకపోవడం ఒక ప్రధానలోపంగా కనిపిస్తుంది. దాన్నొక గ్రామీణప్రాంత సామాన్య సమస్యగా చూపించదలిస్తే కథలో దానికంత ప్రాధాన్యత ఇవ్వకూడదు, అలా ఇవ్వడంవల్ల సమతూకం దెబ్బతింది. లతీఫ్ తరచుగా ఇతరమతాలకు చెందిన స్త్రీలను లేవదీసుకుపోతూంటే మతపరమైన గొడవలు వస్తాయి. వాటిని ప్రస్తావించకపోవడం ఒక లోపమే. కొన్ని సంభాషణలు కథలో విషయం చెప్పడంకోసం కల్పించినట్టుగా ఉన్నాయి. ఒకటిరెండుచోట్ల దృష్టికోణం సడలింది. శిల్పంలో ఉండాల్సినంత బిగువులేదు. అయితే ఇవన్నీ చిన్నచిన్న లోపాలే. పరిశీలనగా చూస్తేనే తెలుస్తాయి. అనుభవంమీద రచయిత్రి ఇలాంటి చిన్నలోపాలుకూడా లేకుండా ఇంకా బాగారాయగలరని తెలుస్తోంది.

ఇతరులమీద ఆధారపడకుండా ఏవర్గపు ప్రజల సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలి అన్న వాదనను ఈ కథ బలపరుస్తుంది. భర్త ప్రవర్తనను వ్యతిరేకించడంకంటే తన వృత్తికి ఇబ్బందిని కలిగిస్తున్న బుర్ఖాను తీసేయడానికే మెహర్ ప్రాధాన్యత ఇవ్వడం స్త్రీకి ఆర్థిక స్వావలంబన ఎంత అవసరమో తెలుపుతుంది. 

కథ చదవడానికి, ఆస్వాదించడానికి చక్కగా ఉంది. భావోద్వేగాల పరంగా కాకుండా హేతువు ప్రధానంగా కథ నడిచింది. అయినా ఇది ఆలోచింపజేయడమే కాకుండా పాఠకుల మనస్సుకు హత్తుకుంటుందనడంలో సందేహం లేదు. 

ఈ రచయిత్రి నుంచి ముందు ముందు మంచి రచనలను ఆశించవచ్చు.

*****

సాక్షి ఆదివారం అనుబంధం (20 జూన్ 2021) ప్రచురణ-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.