“మొహర్” 

  -పి.జ్యోతి      

తెలుగు సాహిత్యంలో సహేతుకమైన అస్థిత్వవాదానికి నిదర్శనం 

ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం గా మన ముందుకు వచ్చిన “మొహర్” కథా సంపుటి తెలుగు సాహిత్యంలో ఒక మంచి ప్రయోగం అనే చెప్పాలి. అస్థిత్వ వాదం నేపధ్యంలో తెలుగులో చాలా సాహిత్యం ఈ మధ్య వచ్చి చేరుతుంది. ఒక వర్గానికో, ఒక సమూహానికో కట్టుబడి ఉండి రాస్తూ, తమ సాహిత్యపు స్వార్దానికి, అవసరాల కోసం, తమ వ్యక్తిగత లాభాల కోసం,  ఆ పరిధి దాటి రాని వారు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో అస్థిత్వవాదాన్ని గౌరవిస్తూనే, దాని ప్రాముఖ్యతను అంగీకరిస్తూనే, అస్థిత్వవాదం ముసుగులో బట్టబయలవుతున్న మొండి పిడివాదాన్ని నేను సమర్ధించలేదు ఎప్పుడు. కాని ఆ పిడివాదాన్ని ఎక్కడా ప్రదర్శించకుండా సున్నితంగా ముస్లిం వర్గపు స్తీలందరూ ఒక సమూహంగా మారి తమ అనుభవాలని, తాము చూసిన తమ జాతిని, తమ జీవితపు గాధలను కలిసి కట్టుగా వినిపించడానికి చేసిన ఈ ప్రయత్నంలో ఎక్కడా అహంకారానికి, ఆభిజాత్యానికి, అనవసర కోపానికి, ఇతర వర్గాలపై మాటల వేటను ప్రదర్శించకుండా, ఎక్కడా పదాల తో దాడి చేయకుండా హుందాగా  తమ గొంతు వినిపించిన మహిళలను ఇక్కడ చూస్తూ, ఎంత కాలానికి ఒక పరిపక్వత కలిగిన అస్థిత్వవాదాన్ని చూసానో అన్న ఆనందంతో చేస్తున్న పుస్తక పరిచయం ఇది. 

ఈ సంకలనంలో కథలు రాసిన చాలా మంది రచయిత్రులు మొదటి సారి రాస్తున్నారు. కథలో కథనంలో త్రోటుపాటు కనిపిస్తూనే ఉంది. అయినా ఈ సంకలనం లోని కథలు మనసుకు హత్తుకుంటాయి. ఇరవై ఆరు కథల ఈ సంకలనంలో ఇరవై ఐదుగురు ముస్లిం రచయిత్రులు కనిపిస్తారు. వెనుక బడిన సమూహాలలో అక్షరాస్యత కలిగిన స్త్రీల శాతం ఎంతో అందరికీ తెలుసు. అందులో తమ అనుభవాలను ప్రపంచానికి వినిపించడానికి కావలసిన పారదర్శక గళాన్ని అక్షరాస్యత కలిగిన అందరూ ప్రదర్శించలేరు. ఆ పరిధులను అధిగమించి ఈ స్త్రీలు ఇలా ఒకటిగా తమ అనుభవాలను మనతో పంచుకున్నారు. వారి మనసులోతుల్లోని ప్రశ్నలని మనపై అంటే సమాజం పై సంధించారు. ముస్లిం కుటుంబాలలో వెతలను అనుభవించి, వాటిని దాటుకుని వచ్చి మిగతావారి బాగు కోసం అల్లాడుతూ వారి గొంతుకగా నిలిచారు. 

పరదేశంలో ఈద్ రోజున అనుభవిస్తున్న ప్రేమరాహిత్యాన్ని షంషాద్ మహమ్మద్ “యాదోం కే దిన్” లో రాస్తే, మేక తన మొక్కల్ని తినేస్తుందని ఒక పక్కన గొడవ పెట్టుకుంటూ అదే మేక కోసం దాన్ని సాకుతున్న పొరుగింటి వారి కోసం తపన పడే “అపా” ను పరిచయం చేసారు సయ్యద్ నజ్మా షమ్మీ.  బడీ అమ్మ పడుతున్న కష్టాల్ని దానికి కారణమయిన పేదరికాన్ని అర్ధం చేసుకునే మున్ని కథ షాజహానా రాసిన “సిల్ సిలా”. వివాహం అయి పిల్లల తల్లి అయ్యాక భర్తలో వచ్చిన మార్పు తో చదువుకు సిద్దమయి జీవితాన్ని నిర్మించుకునే ఆశతో ముందుకు నడిచే అఫ్రీన్ కథను అయీషా సిధిఖా తన “ఉనికి” లో వినిపిస్తారు. స్త్రీలు తాము చేస్తున్నచిన్న పనులలోనే తృప్తి ని వెతుక్కుంటూ పోనీలే ఇదయినా చేయనిచ్చారు అనుకుంటూ సంతోష పడడం వెనుక ఆలోచించలవలసిన విషయాల పై దృష్టి పెట్టమని హెచ్చరిస్తారు డా. జరీనా బేగం “పోనీలే” అనే కథలో. 

భర్త ఎక్కడ తలాఖ్ చెపుతాడొ అని భయపడే నూర్ చివరకి తానే తెగించి ఖులా చెప్పి జీవితాన్ని మళ్ళి మొదలెట్టడం చూస్తాం జరీన సయ్యద్ గారి “నూర్జహాహా” లో. ముస్లిం వివాహ వ్యవస్థ స్త్రీని ఎలా శాశ్వత బందీగా మారుస్తుందో చెపుతూ స్త్రీని ఇన్ని రకాలుగా కొలిచే సమాజంలో మగాడిని కొలవడానికి ఏ ప్రామాణీకతా లేదెందుకని? అని ప్రశ్నిస్తుంది నసీమా  జారా నాజ్ తన కథ “కొలతలు” లో. భర్త మరణించిన తరువాత తన పిల్లల కోసం, కుటుంబం కోసం పని చేస్తూ జీవితాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చిన షబానా కథ రోష్ని అనే రచయిత్రి రాసిన “రౌష్ణి”. జబ్బున్న వ్యక్తిని పెళ్ళి చేసుకుని ఆత్మహత్య చేసుకునే సబీహ కథ హసీనా బేగం రాసిన “జీవన సమరం”. రెండు పెళ్ళిళ్ళు చేసుకుని అది తన హక్కు అని వాదించే భర్తనుంచి తనకు ఖుల్లా చేయండి అని పెద్ద మనుషులను అడిగే జుబేద కథ రుబీనా పర్వీన్ రాసిన “ఖులా”. పట్నంలో అపార్ట్మెంట్లలో ఆప్యాయతను పంచిన ఫాతీమా బీ కథ “పలకరింపు”. సాయిబులు, దూదేకుల మధ్య దూరాన్నిచూపించిన కథ షాజీద రాసిన “అజ్ఞానపు రైలు”. ఒక భర్త అనుమానపు జబ్బుతో బలయిన తస్లీమ, రమేష్ ల జీవితాల కథ జరీనా ఉడుగుల రాసిన “తాలీమ్” బుర్ఖా తో ఇబ్బండి పడే ముస్లిం అమ్మాయిల గొంతును వినిపిస్తారు యాస్మీన్ బేగం తన “బుర్ఖా” కథలో. హైదరాబాద్ పాత బస్తీలో అమ్మాయిల వెతలను చెప్పిన కథ జాకెరా గారి “మునీమా కీ కహానీ”. గృహ హింస కు ఎదురు తిరిగి నిలవాలని నిశ్చయించుకున్న వహీదా కథ షేక్ నసీమా బేగం రాసిన “ఫైస్లా”

చదువురాని తల్లి జాన్బీ చూపిన దారిలో జీవితాన్ని, సమాజాన్ని అర్ధం చేసుకుని తనను తాను తీర్చిదిద్దుకున్న అంజు కథ సలీమా షేక్ రాసిన “అమ్మ దిద్దిన బిడ్డ”. కష్టమైన ఉద్యోగాన్ని కూడా తన జీవితంలో ఒక సవాలుగా తీసుకుంటూ దాని వెనుక తన పోరాటాన్ని నిరంతరం గుర్తుకు తెచ్చుకుంటూ ముందు కు సాగే ఉద్యోగిని కథ కరిష్మా మహమ్మద్ రాసిన “ఇట్శ్ మై లైఫ్”. ఒక పేద ముస్లిం స్త్రీ తో మరో స్త్రీకి ఏర్పడ్డ అపురూపమైన స్నేహాన్ని చెప్పిన కథ జవేరియా గారి “డికాషన్.” కశ్మీర్ లోని అల్లకల్లోలాన్ని ప్రశ్నించే కథ షాజహానా రాసిన “వూండేడ్ సోల్”. భార్య ను పోగొట్టుకున్నాక ఆమె విలువ తెలుసుకుని విలపించే ఒక సగటు భర్త కథ పి. షెహనాజ్ బేగం రాసిన “స్వయంకృతం” పరదేశంలో పని చేస్తూ కేవలం ఫోటో లలో, ఫోనులో మాత్రమే పలకరించే ఒక తండ్రి పరిస్థితులను అర్ధం చేసుకుంటూ తాను కోల్పోయిన బాల్యాన్ని ప్రేమని తలచుకుని కుమిలిపోయే సాబెర కథ డా. సాబీరా రాసిన “స్మృతి గీతం”. ఎక్కడో జరిగిన అల్లర్లకు ముక్కు పచ్చలారని బిడ్డలను పోలీసులు పట్టుకున్నప్పుడు ఒక తల్లిగా తాను పడిన బాధ మరే తల్లికి రాకూడదని అటువంటి స్థితిలో ఉన్న తల్లులకు బాసటగా నిలిచిన ఓ అమ్మ కథ నస్రీన్ ఖాన్ రాసిన “లాపతా”. విదేశాలలో కూడా మూఢమైన మత భక్తితో అహంకారంతో భర్త పెడుతున్న బాధల నుండి విముక్తి దిశగా  ప్రయాణించే ఒక ఇల్లాలి కథ షంషాద్ మహమ్మద్ రాసిన “పర్దా”. సమాజం కోసం జీవించాలని నిశ్చయించుకున్న ఒక యువతి కథ తస్లీమా మహమ్మద్ రాసిన “మన్నెం బిడ్డ” మతం కారణంగా సమాజంలో రేగుతున్న విద్వేషాలను చూస్తూ  మానవుడి స్వార్ధాన్ని, దానికి బలవుతున్న అమాయక జీవితాల గురించి షాజహానా చేసిన అంతర్మధనం “పరిందా”

సమాజంలోని మత వివక్ష, స్త్రీ పురుష వివక్ష, ఆర్ధిక అసమానతల కారణంగా జరుగుతున్న వర్గ వివక్ష, విద్య లేమి,  విద్యను అందుకేలేని పరిస్థితులు, వివాహమనే వ్యవస్థలో పురుషుని అధికారం, ఆ అధికారాన్ని అతనికి ఇచ్చిన మతం, సమాజం, వీటన్నిటి నుండి పుట్టిన కథలు ఇవి. ఇవి కేవలం ముస్లిం వర్గం వారి సమస్యలేనా, మరెవ్వరిలో ఇవి కనిపించవా అని ప్రశ్నించుకుంటే ,  ఈ సంఘర్ణణలు ఆర్ధికంగా వెనుకబడిన వారందరిలో చూస్తాం అనే చెప్పాల్సి వస్తుంది. కాని ముస్లిం స్త్రీలకు ఇవి అధిగమించడానికి మిగతా వర్గాలలో వారికున్న ఆ కాస్త వెసలుబాట్లు కూడా లేవు. స్త్రీలు పని చేసుకోవడానికి ముందుకు వచ్చినా అంక్షల నడుమ, పరదా నడుమ బ్రతకాలి. తలాఖ్, ఖులా ఇతర మతస్తుల కన్నా వీరిని ఇంకా సంక్షోభంలో నెట్టివేస్తాయి. చదువు, ఆర్ధిక సేచ్చ, తమ జీవితాల పట్ల నిర్ణయాధికారం వీరికి చాలా పెద్ద విషయాలు. పైగా బహుభార్యాతత్వం లాంటి సాంప్రదాయాలు వీరి జీవితాలను సజావుగా సాగనీయవు. ఈ కథలలో ని పాత్రల అనుభవాలు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో రచయిత్రుల స్వీయ అనుభవాలు అయి ఉండే అవకాశమే ఎక్కువ. సాధికారత సాధించిన ముస్లిం స్త్రీలు, దాని వెనుక వారు పడిన  శ్రమ పరిగణంలోకి తీసుకుంటే ముస్లిం స్త్రీలు అన్ని అంక్షల మధ్య, సామాజిక, ఆర్ధిక, లైంగిక, వివక్షల మధ్య ఇలా ఒక సమూహంగా ఏర్పడడం చూసి ఈ రచయిత్రుల పట్ల గౌరవభావం కలుగుతుంది. పోరాటాన్ని తమ మార్గంగా ఎన్నుకున్న వారెవరయినా సమాజం లో రాబోయే మార్పుకు మార్గదర్శకులే. ఆ మార్పు దిశగా ప్రయాణిస్తూ తమ తోటి సోదరులు ప్రయాణించవలసిన దూరాన్ని, అందులో వారికెదురవబోయే ఆటు పోట్లను పరిచయం చేస్తూ అవి దాటి ముందుకు తమను తాము నడిపించుకుంటూ తమ జీవితలానే మరో తరానికి ప్రేరణగా పరిచయం చేసుకుంటున్న ఈ రచయితులందరికీ అభినందనలు. 

ఈ పుస్తకాన్ని ప్రస్తుత అస్థిత్వవాదం చాటుకుంటున్న సాహిత్యం సరసన నిలిపి చూస్తే ఎక్కడా సమతుల్యం తప్పకుండా తమ సంఘర్షణకు తామే జవాబులుగా నిలవాలనే తపన తప్ప మరొకరిని భాద్యులుగా చేస్తూ నిరసనను తెలుపుతూ, కోపాన్ని వెళ్ళగక్కుతూ అసహనాన్ని ప్రదర్శించే తత్వం ఏ కథలోనూ కనిపించదు. తాము అభివృద్ది దిశగా అడుగులు వేయాలంటే తామేం చేయాలో, తాము ఏ నిర్ణయాలు తీసుకోవాలో, తాము ఎటు వంటి వాతావరణానికి రూప కల్పన చేసుకోవాలో ఆలోచించే పాత్రలు తప్ప, తన పరిస్థితికి  కారకులైన వారి పట్ల దూషణ తో కాలయాపన చేసే స్త్రీలు కనిపించరు. రచయిత్రులెవ్వరు కూడా తమ అసహాయ స్థితికి కారకులుగా మరొకరిని ఎంచి వారి పై తమ కోపాన్ని అక్షరాలతో వెళ్ళగక్కి అసలు సమస్యనుండి పలాయనం చూపరు. తమ స్థితిని మెరుగు పరుచుకోవడానికి సామాజిక దృక్పధాన్ని అలవర్చుకోవాలనే పరిపక్వత కలిగిన స్త్రీలు, సృష్టించిన పరిపక్వత కలిగిన పాత్రలే ప్రతి కథలో కనిపిస్తాయి. ముస్లిం లు అనే సాకుతో తమ పిల్లల్ని హింసించినా, వ్యవ్యస్థ ను దూషిస్తూ కాలయాపన చేయరు. ఒకరికొకరు తోడుగా కలిసి తామ పిల్లల కోసం పోరాడాలి అనే తపన మాత్రమే వారిలో కనిపిస్తుంది. వీరి పోరాటం వ్యకుల పై కాదు, వ్యవ్యస్థ పై. వివాహం అనే వ్యవ్యస్థ వారిని బానిసలుగా చేసినా పిల్లల బాగు కోసం వారికి కొంచెం మెరుగైన జీవితాలనివ్వడానికి తామేం చేయాలో ఆలోచించే తల్లులు కనిపిస్తారు. భర్తలను తిడుతూ స్త్రీవాదాన్ని ప్రచారం చెసే కథలు ఇందులో కనిపించవు, స్త్రీలు గా తామెలా మారాలో, తామెలా ఆలోచించాలో, భర్త అనే సమస్యను ఎదుర్కోవడానికి తామేం చేయాలో ఆలోచిస్తారు ఈ స్త్రీలు. ఇంతటి పరిపక్వతతో అస్థిత్వవాదపు సాహిత్యం తెలుగు లోఈ మధ్య కనిపించడం అరుదయింది. అందుకే ఈ పుస్తకాన్ని ఇందులో చిత్రించిన దుర్భల పరిస్థితులలో రచయిత్రులు వారి పాత్రల ద్వారా చూపిన ఆశావాహ దృక్పధాన్ని పాఠకులు గౌరవించాలి. వ్యక్తుల సమస్యలకు సామాజిక కారణాలను, సామాజిక పరిష్కారాలను వెతికే దిశగా అస్థిత్వ వాద సాహిత్యం రావాలని ఆకాంక్షంచే వారికి పెద్ద ఊరట ఇచ్చే కథాసంపుటి “మొహర్”         

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.