యుద్ధం ఒక గుండె కోత-9

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

నాగరికతల మధ్య భాస్వరమై మండుతున్న ఘర్షణ

లోయల గుండా లావా ప్రవాహమై

దేశాల మధ్య చేరి రాతిగోడగా ఎప్పుడైంది?

సంస్కృతిని కాల్చేస్తున్న నిప్పురవ్వ

రాజ్యాల్ని రగిల్చే కుంపటిగా ఎప్పుడు మారింది?

అభిప్రాయాల్ని చీల్చేస్తున్న కత్తుల బారకేడులు విరిగి

పౌరగుండెల్లో ఎప్పుడు గుచ్చుకొన్నాయి?

ఉన్నచోటునే గింగరాలు తిరిగే బొంగరంలా

అంతర్గతంగా సాగే వర్ణపోరాటం

అంతకంతకూ పెరిగి పెరిగి

సామాజికాన్ని, జాతీయాన్ని దాటి

మూడోపాదాన్ని అంతర్జాతీయం మీద ఎప్పుడు మోపింది?

చూస్తూ చూస్తూ ఉండగానే

ప్రపంచాన్ని మింగే కొండచిలువైంది ఎప్పుడు?

దేశమంటే ఏమిటో తెలుసుకోటానికి

చరిత్రని తిరిగి నిర్వచించాలి

దేశానికి పర్యాయపదం 

మనుషులు కాకుండాపోయిందెప్పుడో

తేల్చుకోవాలి

ప్రపంచాన్ని పాలిస్తున్నది ఇప్పుడు మతమే

సంస్కృతీ ప్రవాహంలో అంతర్వాహినిగా ఉండేది కాస్తా

నిలువెత్తు భూతమై నియంతగా మారింది

మతం మనిషిని శాసించినపుడే

యుద్ధాలు పడగ విప్పుతాయ్‌

ఇవాళ పోరు జరిగేది రెండు దేశాల మధ్య కాదు

ఇప్పుడు పరదాలు వాలుతున్నవి

స్త్రీ మానసంరక్షణ కోసం కాదు

ఈనాడు కనిపిస్తోన్న విస్ఫోటన దృశ్యం

ప్రపంచమంతటిదీని

ప్రజలిప్పుడు అనకొండ గర్భంలో ఉన్నారుకదా

*   *   *

భూ అవరణం అంతటా పులిజూదం మొదలైంది

ఇక్కడ పులెవరో మేక ఎవరో!?

మేకలు ఉండుండి గర్జిస్తూ కొమ్ములు విసురుతూ

పులుల పొగరణుస్తున్నాయి

చస్తున్నవి పులులో మేకలో!

జూదం మాత్రం ఆగటం లేదు

ఇక్కడే పుట్టిందన్న మహాభారతం

జూదానికి బానిసకావద్దని నీతిపాఠాలు చెప్పినా

అంతా విన్నాక మంచిని నేల మీదే వదిలేసి

చెడునే తలకెత్తుకుంటాం

హరిశ్చంద్రుని కథ విన్నాక నీతి అడుగుతే

నిజం చెప్పటం వల్లే కష్టాలు వస్తాయని అంటాం

జూదం ఆగటంలేదు

పులులు మేకలు ఎదురుబొదురై

కదనరంగాన్ని దున్నుతూనే ఉన్నాయి

అధికారం, భుజబలం, అహంభావం ముప్పేటలై

స్వారీ చేస్తూనే ఉన్నాయి

జనాలు గొర్రెల మందలౌతూనే ఉన్నారు

పేర్చుకున్న పావులన్నీ పూర్తయ్యేదాకా

పులిజూదం సాగుతూనే ఉంటుంది

మేకలన్నీ కలిసికట్టుగా

పులినోట్లోకి దారితీస్తూనే ఉంటాయి

కక్షలూ కావేషాలూ, రోషాలూ, ద్వేషాలూ పులులౌతుంటాయి

అమాయక పౌర ప్రాణాలు మేకలౌతుంటాయి

యుద్ధక్రీడలో ఎత్తులూ పైఎత్తులూ

విప్పలేని ముడుల వ్యూహాలు అవుతుంటాయి

ఎక్కడ యుద్ధజ్వాల నింగికి ఎగసినా

జన హృదయాకాశం నిండా భయం ఛాయలే

మురిపించే నెలవంక సైతం

రక్తపిపాసి నోటిలో రక్తజీరల దృశ్యమై

భయవిహ్వలుల్ని చేసేస్తుంది

విజయాలు బలవంతుడివైతే

వీరమరణాలు మాత్రం

ఇనపకాళ్ళ అడుగున పడి చితుకుతూ

శాశ్వత నిద్రలో సైతం అమ్మ ఒడిని కలవరించే

భవిష్యత్తు కోల్పోయిన పసివారివే

మతం మత్తులోనో మదం ఎత్తుగడల్లోనో

వీరంగం చేసేవారివి కావు

*   *   *

అమ్మ గుండెల్లో దాగినట్లు

కొండ గుహల్లో రక్షణ పొందుతున్నా

భయంకర బాంబర్ల గునపాలతో

తల్లి గుండె లోతుల్ని సైతం చీల్చేస్తున్నారే!

అమ్మలా ఆవరించుకోవాల్సిన మల్లె సురభిళానికి బదులు

బీభత్సపూరిత జలిటిన్‌ ముక్కలు

జీవితాల్ని శకలాలు శకలాలుగా కోస్తూ

హృదయాల్ని మరింత క్షోభితం చేస్తున్నాయే!

అంధకార సమయంలో

వెలుగులు చిమ్మే పాలపుంత కూడా

అంతకంతకూ కుంచించుకుపోతూ

స్వార్థపు కక్ష్యలుగా రూపాంతరం చెందుతూ

తన చుట్టూ తానే పరిభ్రమిస్తోంది

పోరాటాలు మనిషి కన్నుతెరచిననాటివే కదా

జరిగిన ప్రతి యుద్ధం

నిజాల్ని చరిత్ర అద్దంలో ప్రతిబింబిస్తూనే ఉన్నాయ్‌కదా

ఒక మనిషి కోసం – ఒక రాజ్యం కోసం

జనాల్ని సమిధలు చేస్తూ సాగే

ఈ యాగాలన్నీ మనం ఎరిగున్నవేకదా

నిర్ధిష్ట ప్రయోజనం లేదని తెలిసీ

ప్రాపకం కోసం పరిభ్రమించే ఉపగ్రహాల్లా

బలవంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారుకదా

పదవుల్ని కాపాడుకోటానికో

రాజ్యాల్ని సాధించుకోటానికో

ప్రజల్ని బలిచేసే యాగాలు జరుగుతూనే ఉంటాయికదా

అయినా

తెలిసి తెలిసి మందలోపడి

గ్రహశకలాల్లా

దీపం చుట్టూ తిరిగే శలభాల్లా అయిపోతారేం జనం?

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.