రాగో

భాగం-15

– సాధన 

“ఏయ్, జైని హుడా” (చూడు) అంటూ చెప్పితే బాగుండదన్నట్టు బుంగమూతి పెట్టింది ఇర్పి.

నువ్వే చెప్పు మరి” అంటూ గిరిజ ఇర్పినే ప్రోత్సహించింది.

“సిగ్గక్కా సిగ్గు. అది ఊల్లెకు వల వేస్తుంది. ఆ విషయం అదే ఎట్ల చెప్పుతుంది?” అంటూ జైని చెప్పేసింది.

“పచ్చబొట్లకు – మన ఊల్లెకు పోత్తేమిటి? అతనికి కూడ నుదుట ఉంది కదా! ఈవిడకుంటే వద్దంటాడా ఏంటి? ఎలాగు మనవాడికి ఈవిడగారు పుటులే కదా. అయినా ఉల్లెమీద మనసు పెట్టుకొని ఇంట్లో కూచుంటే ఎట్లవుతుంది” అని గిరిజ కొంటెగా ఇర్పిని పొడిచింది.

“అది కాదక్కా. పట్నం వాళ్ళని, దళం వాళ్ళని చూసేక మాక్కూడ అలాగే ఉండాలనిపిస్తుంది. దళంలోకే వచ్చి ఉల్లని కొంగున కట్టుకోవాలని ఇర్పి పచ్చబొట్లకి ఈ చిట్కాలు వేస్తుంది.” అంటూ జైని మొత్తం బయటపెట్టింది.

“పచ్చబొట్లుంటే దళంలో తీసుకోరనే రూలేమీ లేదుకదా” అనేసరికి ఇర్పి గిరిజ తుపాకీని పట్టుకుంటూ “నేను కూడ వస్తానక్కా” అంది.

ఇలా ఒక్కొక్కర్నే పరామర్శిస్తూ చనువుగా వారి వారి సంగతులు తెలుసుకుంటూ ఉండగా సీదో-మిన్కోలు కూడ వచ్చి చేరారు.

నెలకో, రెన్నెల్లకో ఓసారి వచ్చినా, ఒకే పూట ఉన్నా దళం అక్కలు ఊరందరికీ ఎవరికి వారికే తమ స్వంత చుట్టాలనిపిస్తారు. చెప్పుకోలేని రోగాలు నొప్పుల దగ్గర్నుండి సొలీలు, స్వంత వ్యవహారాల వరకూ ఏ సంగతయినా కడుపులో మాట మనసు విప్పి మాటాడుకుంటారు. ఊళ్ళోనికి దళం వస్తేనే అందరూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆ ఊర్లోని యువతీ యువకులందరూ దళంలోని సభ్యులను ఆదర్శంగా తీసుకొని వారిని అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ ఊళ్ళోకి దళం వచ్చిందంటేనే దళ సభ్యులందరితో పాటు ఊరి పిల్లలు ఎక్సర్ సైజు, డ్రిల్లు చేస్తారు. తుపాకులు భుజాలకు తగిలించుకొని మార్చింగ్ చేస్తారు. కిట్లు వేసుకుంటారు. పాటలు – డాన్సులు చేస్తుంటారు. దళ సభ్యులను పేరు పేరున పలకరిస్తారు.

“అక్కలూ! ఇంకా మీటింగ్ అయిపోలేదా, పాటలు పాడండి.” అంటూ ఊడిపోతున్న లాగు పైకి లాక్కుంటూ, గుండీలూడిపోయిన అంగీ రెండు చేతులా సవరించుకుంటూ బాల సంఘం ప్రతినిధి యంగ్ కామ్రేడ్ పొరియ తయారయ్యాడు. కారుతున్న చీమిడి మీద ధ్యాసే లేదు. నోటికి పులుపు తగిలితే తప్ప పట్టించుకోడు పొరియా.

“పొరియా నీకే నా ఓటు” అంది మిన్కో,

“ఎన్ని పాటలు పాడినా ఇంకా పాడమనడమే గానీ నువ్వు ఒక్కటీ నేర్చుకోవు కదా” అంటూ గిరిజ వెక్కిరించింది.

“నేర్చినక్కా. కానీ దీని యవ్వా యాదికుండదు అది” అంటూ బుంగమూతి పెట్టి “కమలక్క పాటే పాడండక్క అది పాడితే ముసలోల్లు ఉడుక్కుంటరు.” అంటూ పాటలు మొదలెట్టాలని పట్టేడు పొరియా.

పాటలనగానే జైని క్షణంలో నోటు బుక్కందుకుంది. అన్ని దళంలో పాడే పాటలు అందులో రాసుకుంది. ఏ దళం కలిసినా పాటలు సేకరించడం జైని పని. గాండో ఓపిగ్గా సాయం చేస్తుంటాడు. అందులో తెలుగు పాటలు కూడ ఉన్నాయి. తీరిక ఉన్న వేళల్లో వరుసగా అన్ని పాటలు పాడేస్తుంది దళం. కమలక్కపాట పాడటానికి జైని సిద్ధమవుతూంది.

రుషి అటువైపు రావడంతో పాటల కార్యక్రమం వెనక్కి పోయింది. దళం అక్కలతో పాటుగా కూచున్న రుషి మహిళా సంఘాల అవసరాన్ని చెప్పడంతో అక్కడున్న అక్కలందరూ సంఘాన్ని ఏర్పర్చుకొని ముగ్గురిని ముఖ్యులుగా ఎంచుకున్నరు. ఇర్పి, మెంతక్క పిల్లీబాయిలు సంఘంలో ముఖ్యులుగా పని చేస్తామని కిరియ (ప్రతిజ్ఞ) చేశారు.

దళ సభ్యులు పాటలు ప్రారంభించేసరికి దూరంగా ఉన్న వాళ్ళంతా కూడ అక్కడికి వచ్చి చేరారు. దళం పాడుతుంటే అందరూ కోరస్ కలిపారు. తర్వాత మీటింగ్ ముగిసిందని రుషి చెప్పడంతో అందరూ లేచి నిల్చున్నాడు. నినాదాలు నేర్పించాలని, రుషి తను అన్నదానికి ఏ జవాబు చెప్పాలో ముందుగా వివరించాడు.

“కమ్యూనిస్టు పార్టీ” అనడంతో అన్ని గొంతులు “జిందాబాద్” అన్నాయి.

“ఆదివాసీ మహిళా సంఘటన్ – వర్ధిల్లాలి”

“దండకారణ్య కిసాన్ మజ్జూర్ సంఘటన – జిందాబాద్”

“నవజనవాది క్రాంతి – జిందాబాద్”

“లాల్ సలాం కామ్రేడ్స్ – లాల్ సలాం కామ్రేడ్స్”

అంతే! జనాలందరూ ఆప్యాయంగా దళం వారికి చేతులు కలిపారు. మిగిలిన అన్నం తేవడానికి యువకులు గంజులు నెత్తిపై పెట్టుకున్నారు. ఎవరి దారిలో వారు ఊరి వైపు కదలారు. రుషి ఆగమనడంతో లెబుడు, డోలు, డోబిలు మాత్రం ఉండి పోయారు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.