వెనుతిరగని వెన్నెల(భాగం-28)
-డా|| కె.గీత
(ఆడియో ఇక్కడ వినండి)
వెనుతిరగని వెన్నెల(భాగం-28)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే చదువుతూ ఉంటుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు.
***
భానుమూర్తికి గుండె పోటు వచ్చింది. అదృష్టం కొద్దీ ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లడం వల్ల ప్రమాదం తప్పింది.
ఇక మీదట ఉద్వేగం, బాధా తెప్పించే విషయాలేవీ ప్రస్తావనకు తీసుకు రావొద్దని హెచ్చరించారు డాక్టర్.
ఎప్పుడూ ధీమాగా ఉండే తల్లి మొదటిసారి బాగా బెంబేలు పడడం చూసింది తన్మయి.
తండ్రి కొద్దిగా తేరుకోగానే ఇంటికి వచ్చేరు.
వస్తూనే జ్యోతి వంటింట్లో టీ పెట్టడానికి వెళ్లింది. రోజల్లా ఆడి అలిసిపోయి నిద్రపోతున్నాడు బాబు. ఆ పక్కనే మరో మంచమ్మీద బాగా నీరసించిపోయిన తండ్రి పడుకున్నాడు.
తన్మయికి తండ్రి ముఖంలో, మూసి ఉన్న కను రెప్పల కింద కదులుతున్న అవిశ్రాంత కనుపాపలలో అప్రశాంతత కొట్టొచ్చినట్లు కనిపించసాగింది. మనస్సులోని బాధ వొంటిమీద బాగా ప్రభావం చూపించింది.
సాయం సంధ్య కావస్తూంది.
తన్మయి విడాకుల నోటీసు పెట్టె లోంచి తీసి చూసింది. త్వరలో కోర్టుకి వెళ్ళి హాజరు కావాల్సి ఉంది.
తమకింత వరకూ కోర్టు , న్యాయ వ్యవస్థ ఏవీ తెలీదు. ఎప్పుడూ వాటి వెనక తిరగాల్సిన అవసరం తమ కుటుంబానికి రాలేదు.
తండ్రి అంతగా కుంగిపోవడానికి కారణం అదేనని తనకు తెలుసు. పరువూ, మర్యాద కలిగిన సగటు పల్లెటూరి కుటుంబం తమది. ఇప్పుడు మొదటిసారిగా తన వల్ల ఇటువంటి అగత్యం కలిగింది.
తన్మయి ఆలోచిస్తూన్న కొలదీ కలుగుతూన్న గిల్టీ కాన్షస్ తో కుంగిపోసాగింది.
చీకటి పడ్తూన్న వేళ డాబా మీదికి మెల్లగా వచ్చి తనకిష్టమైన పూల పొదరింటి దాపున కూచుంది.
ఒకప్పుడు ఎంత హాయిగా ఉండేది తన జీవితం!
తల్లిదండ్రుల గారాల పట్టి తను. అమ్మమ్మ, అమ్మ, నాన్న, స్నేహితురాళ్లు ..చుట్టూ అంతా ప్రేమించే వాళ్లే ఉండేవాళ్లు.
శేఖర్ తన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత మొదలైన అల్లకల్లోలం తన జీవితాన్ని తారుమారు చేసేసింది.
జీవితపు పోరులో మనశ్శాంతితో బాటూ అన్నీ కోల్పోయింది. తన ప్రాణ స్నేహితురాలైన వనజని కూడా పలకరించే అవకాశం లేని దౌర్భాగ్యపు బతుకు అయ్యింది.
వీధి మొదట్లో దుమ్ము రేపుకుంటూ వస్తున్న ఆవులు, మేకల గుంపులు , వాటి వెనకే భుజాన కర్రలకి తగిలించుకున్న సత్తు కేరియర్లు, అదిలింపుల వింత శబ్దాలు.
అనంతాకాశం నారింజ రంగులోకి మారి సమస్త ప్రపంచానికి విశ్రాంతిని కలగజేస్తోంది తన ఆలోచనలకి తప్ప.
తన్మయికి అనంత మాటలు జ్ఞాపకం వచ్చేయి. “శేఖర్ నిన్ను ప్రేమించేడు కాబట్టి ,అతన్ని ప్రేమిస్తున్నానన్న భ్రమలో బతికేవు నువ్వు. ఆ భ్రమలో అదిలింపుల చేతి కర్రని అతనికి నువ్వే స్వయంగా అందించేవు.”
అనంత అన్నది నిజమేనేమో, తనని కాచేవాడు ఎటు తోలుకెళ్తాడో పట్టని ఈ మూగ జీవాలకీ, తనకీ ఏవైనా తేడా ఉందా?!
కనీసం తనకంటూ బ్యాంకు అకౌంటు ఒకటుండాలని కూడా ఆలోచించని తను మూగమొద్దుగాక ఏమవుతుంది?
అక్కణ్నించి తెచ్చిన తన సామాన్లన్నీ కొన్ని ఇంకా సంచులలోనే ఉన్నాయి. గోనె సంచులకి చేరిన తన సంసారం చూస్తుంటే విరక్తి తన్నుకు వస్తోంది.
పుస్తకాల వరకూ బయటికి తీసి తన గదిలో సర్దుకుంది తన్మయి.
మంచమ్మీద పడుకున్నప్పుడల్లా ఆ మంచం కొనడం కోసం తల్లి, శేఖర్ ల మధ్య జరిగిన వాగ్వివాదాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి.
దిగులు చీకటిలా ముసురుకోసాగింది.
తన ఈడు వాళ్లు స్కూటర్ల మీద భర్త చుట్టూ చేతులు వేసి కూచుని ఆనందంగా ఎక్కడికో వెళ్తూంటే విపరీతమైన బాధ కలగ సాగింది.
ఇక తండ్రిని చూట్టానికి వచ్చిన బంధువుల సానుభూతి వచనాలు అసలే వినలేకపోతూంది.
“బంగారం లాంటి చంటి పిల్లోడు అన్యాయం అయిపోయేడు. మేం అప్పుడే చెప్పేం ఆ సంబంధం చేసుకోవద్దని” .
“మీ వంశం వాళ్లకి అది ఆనవాయితీ ఏమో. భాను చెల్లెలు కూడా ఇలాగే చిన్నతనం లోనే మొగుడొదిలేస్తే ఇంట్లోనే ఉండిపోయిందిగా“
“అతనికేవిటీ, మొగోడు ఎన్ని తిరుగుళ్లయినా తిరుగుతాడు, ఆడోళ్ళం మనవే సర్దుకుపోవాలి, తెగేదాకా లాక్కోకూడదు“
“ఇప్పుడేడ్చి ఏం లాభం? చదువులంటూ దేశమ్మీదికి బయలుదేరిన ఆడోళ్ళ గతి ఇంత కంటే ఏం బాగుపడతది?“
ఎవరైనా ఏదైనా అంటే చెంప దెబ్బకొట్టినట్టు సమాధానం చెప్పే తల్లి కూడా బంధువుల మాటలకి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడం మరింత న్యూనతా భావాన్ని కలగజేస్తోంది తన్మయికి.
జరిగిన, జరుగుతున్న సంగతుల కంటే మాటలు భరించలేకపోతూంది తన్మయి.
ఎవరు ఇంటికొచ్చినా గదిలోంచి బయటికి రావడం మానేసింది.
తన కన్నీళ్లకి అర్థం లేదు.
తన వ్యథలు ఎవరికీ అక్కరలేదు.
ఓడిపోయిన ఒంటరి బతుకు.
సామాన్ల లో నుంచి బాబు ఫోటో ఫ్రేము తీసి స్టడీ టేబుల్ మీద పెట్టుకుంది. తనకున్న ఒకే ఒక్క ఆధారం ఈ చంటిపిల్లాడు.
“మిత్రమా! నాకు ఈ ప్రపంచంలో బతికే స్థయిర్యాన్ని ప్రసాదించు. ఎక్కడ ఓడిపోయినా తల్లిగా నన్ను గెలిపించు.” అని కన్నీళ్లతో ప్రార్థించసాగింది.
—-
ఆ సాయంత్రం వనజ గేటు తీసుకుని వస్తూ కనిపించింది.
కిటికీలోంచి దిగులుగా ఆకాశాన్ని చూస్తున్న తన్మయి తన కళ్లని తనే నమ్మలేకపోయింది.
ఒక్క ఉదుటున పరుగెత్తుకెళ్ళి వాకిట్లోనే స్నేహితురాలి చేతినందుకుంది.
“నీ గురించి అమ్మ ఫోనులో చెప్పింది. ఒక్క క్షణం కూడా ఉండలేక, వెంటనే బయలుదేరి వచ్చేసేను.” అంది వనజ.
మామూలు పలకరింపులు కాగానే ఇద్దరి మధ్యా నిశ్శబ్దం అలుముకుంది.
తనకు గుర్తుండి ఇంత నిశ్శబ్దం ఇదే మొదటి సారి వనజకూ తనకూ మధ్య.
వనజ పెద్దగా నిట్టూరుస్తూ అంది.
“అధైర్యపడాల్సిన పనిలేదు, నువ్వు నిలబడాలి, నిలబడతావు, నాకు నీ మీద నమ్మకం ఉంది తన్మయీ!” అంది.
తన చేతిలో ఉన్న స్నేహితురాలి చెయ్యి తడిసేలా రోదించసాగింది తన్మయి.
తన్మయి దు:ఖం నించి తేరుకేనేదాకా ఆగింది వనజ. “నువ్వు ఏడవగలిగినంతా, హృదయంలో దు:ఖం తీరే వరకూ బాధపడు తన్మయీ! కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో. దు:ఖం నిన్ను దుర్బలం చేసి ఎటూ తేల్చుకోనివ్వని అశనిపాతమై ఒక్క అడుగు కూడా ముందుకు కదలనివ్వదు.”
ఇంకా తన్మయి మెల్లగా రోదిస్తూనే ఉంది.
ఒక విధంగా ఆలోచిస్తే, “అతన్ని నువ్వు వద్దనుకున్న రోజే ఈ నోటీసు అతనికి నువ్వు పంపించి ఉంటే బావుండేదేమో, అతనికి నువ్వు వద్దనుకునేంతవరకూ ఆగినందువల్ల నోటీసు నువ్వు అందుకోవాల్సి వచ్చింది.” అంది వనజ.
తన్మయి కన్నీళ్లు తుడుచుకుంటూ వనజ వైపు చూసింది.
ఇన్ని సంవత్సరాలు వనజకి ఉత్తరం కూడా రాయలేదు తను. అయినా తనని క్షమించి తన కోసమే పనిగట్టుకుని ఊరొచ్చింది.
తనని ఊరడించే పెద్ద మనసు, ఇంత విశ్లేషణాత్మకంగా అలోచన చెయ్యగలిగే పరిణతీ వనజకి వయసుతో వచ్చిందా?
తన కంటే కాస్తే పెద్దది వనజ. అయినా వనజకున్న ఆలోచన తనకెందుకు లేదు?
సంప్రదాయాల్ని పట్టుకుని వేళ్లాడే మూర్ఖత్వమా? పిరికితనమా? “ప్రేమించడం” అనే పదం వెనుక బందీ అయిపోయిన పసితనమా?
అదే అంది వనజతో.
“స్త్రీ పురుషులిద్దరూ సమానంగా సంప్రదాయాలకి, విలువలకీ, సమాజానికి కట్టుబడి ఉండాలి కదా! ఒకరికి అవసరం లేని న్యాయం మరొకరికి ఎందుకు? ఇక ప్రేమ అంటావా, ఏం చేసినా భరించడం ప్రేమెలా అవుతుంది తన్మయీ?! అతను నిన్ను ఇష్టపడ్డాడని నువ్వతన్ని ఇష్టపడినట్లు భావనలో పడ్డావు. ఆ భావనతోనే అతని హింసని మౌనంగా భరించేవు.”
అని చేతి సంచీ లోంచి “జానకి విముక్తి” నవల చేతిలో పెట్టింది. ఆశ్చర్యంగా చూసింది తన్మయి.
నీ కోసం ఈ పుస్తకం తెచ్చాను. నువ్వు తప్పకుండా చదవవలిసిన పుస్తకమిది. చదివి ప్రశాంతంగా ఆలోచించుకో.
ఇందులో మూర్తి సత్యంతో అన్న మాటలు నీతో చెపుతాను.
“స్వతంత్ర ఆలోచన, ఎదిరించే చైతన్యం ఎదుటి వాళ్ళలో కలిగించకుండా, మన భావాలను వాళ్ళ మీద రుద్దితే అది సరైన ఫలితాన్ని ఇవ్వదు, పరిస్థితుల్ని ఎదిరించే చైతన్యాన్ని కలిగిస్తూ, వాళ్లకు అండగా నిలబడాలి” అని చిన్నగా నవ్వింది వనజ.
“ఒక పీడ వదిలిపోయింది అనుకో తన్మయీ. అతనే కావాలని దూరంగా వదిలి వెళ్లి, ఒక విధంగా అతను నీకు మంచి చేస్తున్నాడు, భార్యని వదిలి పెట్టకుండా జీవితాంతం హింసించే వాళ్ల పాలబడి నలిగిపోతున్న వారెందరో. ఇది నీకు లభించిన సదవకాశంగా భావించు. తప్పులు అందరం చేస్తాం. వాటిని సరిదిద్దుకోవడంలోనే మన విజ్ఞత దాగి ఉంటుంది. సగర్వంగా జీవితాన్ని కొనసాగించు. నీ లక్ష్యం ముందు ఏదీ తక్కువ కాదనే పట్టుదల నీకుందని నాకు తెలుసు. ఇక సమాజం, బంధువులంటావా, ఈ రోజు నేను చెప్తున్నాను చూడు. నువ్వు నిలబడ్డ రోజు వీళ్లంతా నువ్వు గొప్పదానివని నిన్ను పొగుడుతారు. నిన్ను అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్ల పొగడ్తలనూ లెక్క చేయవలసిన పని లేదనుకో.” అని తన్మయి ముఖం కాస్త కుదుట పడడం చూసి,
“మా చిన్నాన్న గారు విశాఖపట్నంలో మంచి లాయరు. నీకు ఉత్తరం రాసి ఇస్తాను. పట్టుకెళ్లు, ఆయన నీకు తప్పకుండా సాయం చేస్తారు. నేను కూడా వీలైతే ఫోను చేస్తాను నీ గురించి. ఆయన స్వయంగా నీ కేసు తీసుకోలేకపోతే తెలిసిన వారెవరికైనా అప్పజెపుతారు. ఫీజులో మినహాయింపూ ఇప్పిస్తారు. నేను రేపే వెళ్లిపోతున్నాను. ధైర్యంగా ఉండు తన్మయీ!” అంది వనజ.
జానకి విముక్తి ఒకటికి రెండు సార్లు చదివింది తన్మయి.
జానకి తన అన్న సత్యం మాటల్తో ప్రభావితమై తన చైతన్య స్థాయిని పెంచుకుంటూ, నికృష్టుడైన భర్త కబంధహస్తాల్లోంచి బయట పడి, స్వతంత్రంగా ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ళ మీద తను నిలబడి, పిల్లవాణ్ణి తనే పెంచుకుంటూ, తన భావాలను అభివృద్ధి చేసుకున్న విధానం ఎంతో బలాన్నిచ్చింది తన్మయికి.
మనసులో వనజకు ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పుకుందో లెక్కలేదు.
కుటుంబ దాష్టీకాలకు బలైపోతున్న తనలాంటి ప్రతీ యువతీ చదవాల్సిన పుస్తకమిది.
తన్మయికి కర్తవ్యం బోధపడింది.
——
తండ్రికి కాస్త త్వరగానే కుదుటపడడం వల్ల తన్మయి మరుసటి వారమే విశాఖపట్నానికి చేరింది.
తన జీవితంలో రోజుకొక రకంగా మారిన పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం కాలేజీలో సగ భాగం క్లాసులు పోయాయి.
అనంత, రాజుల నోట్సులు తీసుకుని రాత్రీ, పగలూ రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వస్తూనే తలదాచుకోవడానికి హాస్టలులో వెళ్లి అడిగినా ప్రయోజనం లేకపోయింది.
దిగులు ముఖంతో కూచుని ఉన్న తన్మయికి అచ్చు తనలాగే దిగాలు పడి నడుస్తూ వస్తూ కరుణ కనిపించాడు.
బాగా పెరిగిన గడ్డం, వాడిపోయిన ముఖం.
బెంచీకి ఆ చివర కాళ్ల వైపు చూసుకుంటూ కూచున్నాడు.
తన్మయికి అతనితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని సందిగ్ధత ఏర్పడింది.
“నన్ను క్షమించండి” అంది నెమ్మదిగా.
బదులుగా “ఎలా ఉన్నారు?” అన్నాడు ముభావంగా.
బేగులోంచి నోటీసు తీసి అతని చేతిలో పెట్టింది.
“ఇదంతా నా వల్లనేనా? మీరే నన్ను క్షమించాలి మయీ” అన్నాడు గద్గదంగా.
అతని తప్పు ఏం లేదని స్పష్టంగా తెలుసు తన్మయికి. అతని బదులు ఎవరు ఉన్నా, జరిగేదదే.
అదే చెప్పింది.
“మీరెంత చెప్పినా మీ జీవితం తలక్రిందులు కావడానికి నేను ఒక కారణమయ్యేనన్నది నాకు బాగా బాధని కలిగిస్తోంది. అసలే అనేక సమస్యలతో సతమతమవుతున్న నాకు ఇదొక కొత్త సమస్య తయారైంది.” అన్నాడు.
తన్మయి అతన్ని అర్థం చేసుకోగలదు. కానీ ఎవరి సమస్యలు ఎవరూ ఆర్చలేని, తీర్చలేని పరిస్థితి తామిద్దరిదీ.
కొద్దిసేపు మౌనం తర్వాత,
“మానసిక వేదన బొత్తిగా భరించలేకపోతున్నాను. వీటన్నిటి నుంచి బయటపడాలంటే పుస్తకం తప్ప వేరే సాధనం కనబడ్డం లేదు కరుణా! నాకు ఒక సాయం చేస్తారా?” అంది దీనంగా.
“చెప్పండి” గట్టిగా ఊపిరి పీల్చి అన్నాడు కరుణ.
“జే. ఆర్. ఎఫ్ కు సంబంధించి నాకు వీలయినన్ని పుస్తకాలు తెచ్చిస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లోఅదొక్కటే నాకు శరణ్యం” అంది.
“నాకు అదే చాలా అబ్బురంగా ఉంటుంది! ఇన్ని బాధల్లో ఎలా చదవగలుగుతారో మీరు! మీతో మాట్లాడుతుంటే నాకూ ఎక్కడలేని ఆశా కలుగుతుంది తన్మయీ. అయినదేదో అయిపోయింది ఇక మనం చదవడం కొనసాగించాలి. ఉండండి, దివా, రాజు వాళ్లనీ పిలుచుకొస్తాను” అని లేచేడు.
దివాకర్ వస్తూనే తన్మయితో “కా..కాత్యక్క మ్మి..మిమ్మల్ని తీసుకు రమ్మని ఏ..ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. మ్మ…మనందరి చదువూ మ్మా..మా ఇంటి అరుగు మీద పె..పెడదామా?” అన్నాడు.
అనంత “ఇక మీదట నువ్వు ఎక్కడ తలదాచుకోవాలా అని బాధ పడక్కరలేదు తన్మయీ. రాజు ఎంసెట్ కోచింగు సెంటర్లో సాయంత్రం పూట సంస్కృ తం క్లాసులు చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఇక్కణ్ణించి గంట దూరంలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. మాతో వచ్చేయి.” అంది అనంత.
తన్మయికి సంతోషం వెల్లువలా పెల్లుబికింది.
“మంచి సంతోషకరమైన వార్త చెప్పేవు అనంతా” అంటూ ఆనందంగా కౌగిలించుకుంది.
“ఆ మధ్య నేనొక రెసిడెన్షియల్ స్కూలులో ఉద్యోగాలకు ప్రకటన చూసేను. ఇప్పుడుంటాయో లేదో” అంది తన్మయి సాలోచనగా.
“విద్యా సంవత్సరం ప్రారంభమయిపోయింది కాబట్టి కష్టమే మరి, అయినా వెళ్లి చూద్దాంలే” అంది అనంత.
“వాళ్లకు సాయంత్రం పూట క్లాసులు ఉంటే నువ్వూ, నేనూ ట్యూటర్లు గా చేరొచ్చు” అంది తన్మయి.
“నాకు ఇప్పుడప్పుడే ఉద్యోగం చేసే ఉద్దేశ్యం లేదులే అని, చెవిలో మెల్లిగా“…..” చెప్పి, నవ్వింది అనంత.
అనంత నెల తప్పింది.
ఇంకా జీవితాల్లో స్థిరపడకుండా అనంత పెళ్ళి ఎందుకు చేసుకుందో, ఇప్పుడే పిల్లలని కనడమేవిటో అర్థం కాలేదు తన్మయికి.
కానీ ఏదైనా జరగక ముందు ఆలోచించుకోవాలి ఎవరైనా. జరిగేక తప్పనిసరిగా ధైర్యంగా నెట్టుకు రావాలి. తన్మయికి తెలిసిందంతే.
అందుకే అనంత చేతిని తన చేతిలోకి తీసుకుని, “కంగ్రాట్స్, నీకేంకావాలో చెప్పు ఒండి పెడతాను” అంది తన్మయి.
బస్సులో అనంతతో బాటూ వెళ్తూ తమ బస్టాపు దాటగానే తన్మయికి దిగులు మళ్ళీ ఆవరించింది.
ఒకప్పుడు అనంత తమ ఇంట్లో ఉంటానని అడిగింది. ఇప్పుడు తను అనంత ఇంటికి వెళ్తూ ఉంది.
ఎంత సంక్లిష్టమైంది జీవితం! ఎప్పుడు తలకిందులై పోతుందో ఎవరికీ తెలియదు కదా!!
—-
వనజ ఇచ్చిన ఉత్తరం తీసుకుని లాయరు గారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లింది తన్మయి.
గేటు తీసుకుని లోపలికి వెళ్లి, కాలింగు బెల్లు కొట్టే ముందు గుమ్మం దగ్గర బోర్డు మీది పేరుతో కవరు మీది పేరుని సరిచూసుకుంది.
తలుపు తీస్తూనే వనజ పిన్ని “రామ్మా, వనజ ఫోను చేసింది మాకు” అంటూ ఆదరంగా లోపలికి తీసుకెళ్లింది.
తినడానికి, తాగడానికి ఇచ్చి, కాస్సేపు సేద తీరిన తర్వాత వనజ చిన్నాన్న గారిని పిలిచింది.
ముందు గదిలో ఆయన ఆఫీసులో కుర్చీ వెనక గోడ మీద “సత్యమేవజయతే” అని రాసి ఉంది.
ఆయన వనజ ఇచ్చిన ఉత్తరం తీసి చదువుకుని, అసలేం జరిగిందో వివరంగా చెప్పమన్నారు.
గుండె నిండుగా ఊపిరి పీల్చుకుని మొదలు పెడుతూ తన్మయి గోడ వైపు చూసింది.
అంతా విని తల పంకించి “ఒక్క నిమిషం“అంటూ ఫోను తీసి రింగ్ చేసి, “పది పదిహేను నిమిషాలలో రాగలరా?” అన్నారు ఎవరితోనో.
తన్మయి వైపు చూసి, “చూడమ్మా! మంచి వాడు, నిజాయితీ పరుడు అయిన లాయరు విశ్వని నీకప్పగిస్తున్నాను. నాకు జూనియర్, వృత్తికి కొత్త వాడే కానీ మంచి పట్టున్న వాడు. నీ కేసు ఆయనకు అప్పగిస్తున్నాను. ఇవేళ నిన్ను పరిచయం చేస్తాను” అని కుర్చీ లో నుంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ
“అతను నీ మీద అక్రమ ఆరోపణతో విడాకుల కేసు పెట్టేడు. అవన్నీ నిజాలు కావని నిరూపణ చేస్తూ, కేసు నించి బయట పడాలి. నిజానికి నువ్వు కావాలనుకుంటే విడాకులు వెంటనే వస్తాయి. అతను నిన్ను పెట్టిన హింస తక్కువేమీ కాదు. కుటుంబంలో అంతర్గతంగా ఉన్న శారీరక హింసని నువ్వు నిరూపణ చెయ్యలేకపోవచ్చు. మానసిక హింసని కూడా హింసగానే పరిగణిస్తాయి కోర్టులు. అన్నిటినీ తట్టుకుని ధైర్యంగా నిలబడగలిగినందుకు నిన్ను అభినందిస్తున్నాను.” అని ఒక్క నిమిషం ఆగి,
“మా వనజ అంటే నాకు, వాళ్ల పిన్నికి చాలా అభిమానం. తన స్నేహితురాలిగా నీకు అన్ని విధాలా సాయం చేస్తాను. ఫీజుల గురించి ఆలోచించకు. అవన్నీ నేను చూస్తాను. నీ చేతిలో డబ్బు ఉన్నపుడు తెచ్చి ఇద్దువుగాని.” అన్నాడు.
తన్మయి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించింది.
లాయరు విశ్వ చురుకైన యువకుడు, మాట్లాడుతున్నప్పుడు ఎటో చూస్తూ ఉన్నా, నిశితమైన అతని వాగ్ధాటి అతని పట్ల విశ్వాసాన్ని కలుగజేస్తోంది.
పరిచయాలలో “మీ డిపార్టుమెటు హెడ్డు గారు నాకు స్వయానా మేనమామ” అన్నాడు విశ్వ .
తన పట్ల కాలానికి ఇంకా దయ ఉన్నందుకు తన్మయికి ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి.
వనజ చిన్నాన్న గారే అనుకుంటే ఆయన కంటే మంచి వ్యక్తి, పైగా మాస్టారికి మేనల్లుడు తన లాయరుగా లభించడం తన అదృష్టం.
—–
మర్నాడు లాయరు విశ్వ ను ఆఫీసులో కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుంది తన్మయి.
తన ముందు ఉన్న మరో రెండు కేసుల వాళ్ళు వెళ్ళేంత వరకూ బయట బెంచీ మీద కూర్చుంది తన్మయి.
తను ఎప్పుడూ ఇలా లాయర్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని కనీసం ఊహించుకోను కూడా లేదు.
తనకీ పరిస్థితి కల్పించిన శేఖర్ మీద ద్వేషం పుట్టుకు రాసాగింది.
లాయరు విశ్వ తన్మయి వైపు చూసి తల పంకించి, “కాగితాలన్నీ సిద్ధం చేస్తున్నాను.మీరు వివరాలన్నీ రాత పూర్వకంగా ఇవ్వండి. టీ తాగుతారా? ” అన్నాడు.
తన్మయి తల అడ్డంగా ఊపి, చేతికిచ్చిన పాడ్ అందుకుంది.
“మీరు నచ్చినంత సమయం తీసుకుని నిదానంగా జరిగినదంతా గుర్తు చేసుకుని రాయండి. మీకు తెలియకపోవచ్చు గానీ, ఒక లాయరుగా నాకు బాగా అర్థమవుతున్నదేవిటంటే, అతను ఇదంతా ఒక పథకం ప్రకారం చేసేడు. ఇదంతా చేసే ముందు అతను లాయరుతో సంప్రదించి సలహాలు తీసుకున్నాడని అర్థం అవుతూ ఉంది.” అన్నాడు విశ్వ.
తన్మయి ఆశ్చర్యంగా చూసింది.
“ముందుగా అతను మీరు వైజాగులో ఉన్నారన్న విషయం తెల్సినా, ఇంటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. మీ స్నేహితులు చదువుకుందుకు మీ ఇంటి దగ్గరికి ఎప్పుడూ వస్తారని అతనికి తెలుసు, కానీ అదే విషయాన్ని అతని బంధువులకు చెడ్డగా వివరించి, వెళ్లి చూడమని పంపించాడు. ఇక ఇంటిగల వాళ్ల ముందు రచ్చ పెట్టడానికి కారణమూ అదే, మీ ఇద్దరి మధ్యా ఏ గొడవ జరిగినా నలుగురికీ తెలిస్తేనే సాక్ష్యం ఉంటుంది. ఇక మీ స్నేహితుణ్ణి కొట్టి అతనితో సంతకం పెట్టించుకున్న ఖాళీ కాగితాల మీద, కోర్టు కోసం ఉత్తరాలేవో సృష్టించుతాడన్నమాట. మిమ్మల్ని, బాబునీ ఒంటరిగా వదిలేసినదీ, ఇంటిగలవాళ్లతో చెప్పి ఇల్లు ఖాళీ చేయించినదీ అన్నీ పథకాలే. అవన్నీ మీ అంతట మీరు గానే మీ తల్లిదండ్రుల దగ్గిరికి వెళ్లిపోయేరని నిరూపణ చెయ్యడానికే. మీ వైపు నించి మీ కథ ఎవరికి వినిపించినా నమ్మడానికి లేకుండా అన్ని సన్నివేశాలనీ అతని ముందుగానే కల్పించాడు. ఆడవాళ్లకి విడాకులు కావాలంటే భర్త హింసించాడని చెప్పినా చాలు. కానీ మగవాడికి విడాకులు కావాలంటే బలమైన కారణం లేకుండా అసాధ్యం. అందుకే అతనివన్నీ చేసేడు.” అన్నాడు.
వింటున్న తన్మయికి రక్తం మరిగిపోసాగింది.
ఎంత మోసం! ఎంత కుట్ర!!
తనస్సలు ఉహించలేకపోయింది, ఇవన్నీ కాకతాళీయంగా జరిగేయని గుడ్డిగా నమ్మింది.
అతనికి విడాకులే కావాలనుకుంటే ఇన్ని చెయ్యాలా? తనని అడిగితే తనే ఇచ్చేసేది కదా! అతని పట్ల తనకున్న కట్టుబాటు అలాంటిది. తనని అందరి ముందూ అవమానాల పాలు చేసి, ఇల్లూ, వాకిలీ లేకుండా చేసి, చేతిలో రూపాయి లేకుండా రోడ్డు మీద నిలబెట్టి, సొంత ఊరికి తరిమి కొట్టి అతను బావుకుంటున్నది ఏంటి?
తన పట్ల కించిత్ కూడా ఇష్టం లేదన్నది అతను ఎవరినో ఇంటికి తెచ్చుకున్నపుడే అర్థమైంది.
కానీ బాబు పట్ల కూడా ఇష్టం లేదా? ఇన్నాళ్లూ తను అతన్ని ఎందుకు భరించింది? పిల్లాడికి తల్లిదండ్రులిద్దరి ప్రేమ, ఆలనా పాలనా అవసరమనే కదా!
ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోయిందా అతనికి? బంగారం లాంటి పిల్లాడు ఏం పాపం చేసాడు? విడాకుల వల్ల వాడి పరిస్థితి ఏంటి?
అదే అడిగింది లాయరుని.
“తన్మయి గారూ, మీకున్న ఆప్షన్లు చెప్తాను–
ఒకటి –అతను ఆరోపించిన అక్రమత్వం నిజం కాదని నిరూపించుకుని విడాకులు ఇవ్వనని చెప్పడం. మీరు విడాకులు ఇవ్వక పోవడం వల్ల అతనితో తిరిగి కలిసి జీవించే అవకాశం ఉంటుంది.
రెండు –ఆరోపణలు అబద్ధం అని నిరూపించి, మానసిక హింస కేసు పెట్టి అతని మీద విడాకుల కేసు మీరు పెట్టడం.
మూడు- వాడి ఖర్మకి వాణ్ణి ఒక్క సంతకంతో వొదిలెయ్యడం.”
ఇక బాబు సంరక్షణ తల్లిగా మీకే వస్తుంది. అందుకు చింతపడాల్సిన పని లేదు…అతనింకా ఏదో చెప్తూ ఉన్నా తన్మయికి ఏవీ వినిపించడం లేదు.
తన్మయికి మనసంతా విపరీతమైన నిర్వేదం, వైరాగ్యం కలిగింది.
తనేం పాపం చేసింది! అతనికేం తక్కువ చేసింది? తనని ఎందుకు ఇంతగా హింసిస్తున్నాడు?
ఇప్పుడు తన రక్తం మరిగేటంత ద్వేషాన్ని కలిగిస్తున్న ఇతన్నా తన సంరక్షకుడని, తన జీవితాంతపు సహచరుడని నమ్మింది!
బయటికొచ్చి బెంచీ మీద కూలబడింది.
కళ్లు తెరిచినా, మూసుకున్నా కనుపాపల్లో కదులుతున్న దుఃఖపు చారికలు కళ్లలో నిప్పురవ్వల్ని వేసుకున్నట్లు మంట పుట్టిస్తున్నాయి.
ఆ మంటల వెలుగులో నుంచి ఉద్భవించినట్లు
నిత్య నూతనమై, ఒకే ఒక్క ప్రమాణంగా భువనాన్ని తేజోమయం చెయ్యగలిగిన గొప్ప వాక్యం స్ఫురించింది –
“సత్యమేవ జయతే“
అదే రాసింది మొదటి పేజీ మీద–
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.