సాహిత్య రంగంలో సామాజిక మాధ్యమం
(నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)
-టి. హిమ బిందు
రోజు రోజుకు కొత్త మార్పులు కొత్త హంగులతో ఎంతో వేగంగా అందరికీ అందుబాటులోకి వస్తున్న సాంకేతికత దాని అంతర్భాగమైన సామాజిక మాధ్యమాలు సమాజంలో భౌతికంగా మానసికంగా ఎంతో భిన్నమైన ప్రపంచాన్ని సృష్టించాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనేకమంది రచయితలు తమ తమ రచనలను, భావాలను సామాజిక మాధ్యమాలలో పంచుకోవటం వలన అనేకమంది వీక్షించి చదివి చర్చించటానికి అనుకూలంగా ఉంటుంది.
తెలుగు సాహిత్యం మొదలయి కాలక్రమేణా ఎన్నో మార్పులు సంతరించుకుంది. తెలుగు సాహిత్య మార్పుల ఆధారంగా కాలాన్ని యుగాలుగా విభజించినట్టయితే నన్నయకు ముందు (క్రీ. శ. 1000), నన్నయ యుగం(1000 – 1100), శివకవి యుగం(1100 -1225), తిక్కన యుగం(1225 – 1320), ఎర్రన యుగం(1320 – 1400), శ్రీనాధ యుగం(1400 – 1500), రాయల యుగం(1500 -1600), దాక్షిణాత్య యుగం(1600 – 1775), క్షీణ యుగం(1775 – 1875), ఆధునిక యుగం(1875 – 2000). ఈ యుగం తొలినాళ్లలో సంపన్నుల సభలు, దర్బారులు, తరువాత కాలంలో పత్రికలు, రేడియోలు వాటి వల్ల సాహిత్యాన్ని పోషించారు. 19వ శతాబ్ధి ప్రారంభంలో కావ్యాలను రచన చేసి జమీందార్లకు, సంపన్నులకు అంకితం ఇవ్వడం, అష్టావధానాలు చేయడం ద్వారా కవులు డబ్బు గడించేవారు. అనంతర కాలంలో పత్రికలు సాహిత్యానికి ప్రధానమయిన వేదికగా, సాహితీవేత్తలకు సంపాదన మార్గంగా నిలిచాయి. అలాగే అచ్చు యంత్రపు వాడకం పెరిగిన కొద్దీ పుస్తక ప్రచురణ పెరిగి ప్రతుల అమ్మకం ద్వారా కూడా కవులు రచయితలకు ధన సంపాదన మార్గమయింది. ఈ యుగంలో తెలుగు సాహిత్యం ప్రక్రియ, వస్తువు, శైలి తదితర అంశాల పరంగా విప్లవాత్మకమయిన మార్పులకు లోనయింది. ఈ మార్పుల వెనుక పలు రాజకీయ, సామాజిక ఉద్యమాలు ప్రభావాలు ఉన్నాయి. ఆంగ్ల భాష అధ్యయనం, పాశ్చాత్య భావాలను తెలుగు సాహితీవేత్తలు తెలుసుకోవడం వంటివి కథ, నవల వంటి ప్రక్రియలను అభివృద్ది చేసేందుకు ఉపకరించాయి 5.
ఇలా సాహిత్యంలో చోటుచేసుకునే మార్పులకు సాంకేతిక అభివృద్ది తోడవడంతో నడిచే కాలుకు రెక్కలు మొలిచినట్టుగా ఇంకింత వేగాన్ని అందుకుంది.
మొదట ఆర్కుట్ బైకాటేన్ అనే అబ్బాయి, కనబడకుండా పోయిన తన ప్రియురాలును కనుగొనుటకు ఇంటర్నెట్ ఆధారంగా ఒక నెట్వర్కును తయారుచేసి ఆ అమ్మాయిని కనిపెట్టగలిగాడు. జనవరి 24, 2004 న అధికారికంగా ప్రారంభమైంది. అదే సంవత్సరం ఫిబ్రవరిలో ఫేస్బుక్ మొదలయింది. దీని వ్యవస్థాపకుడు 25 ఏళ్ల హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థి జుకేర్బర్గ్. అప్పట్లో తానొక ప్రపంచాన్ని సృష్టిస్తున్నా అని అతనికి తెలియక పోవచ్చు. కానీ అదే ఇప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. అలా ప్రారంభమయిన సోషల్ మీడియా మూడు డివైసులు ఆరు యాపులుగా విస్తరిస్తూ మన ప్రపంచ నలుమూలల్లో ఉన్న మన వాళ్ళందర్నీ సింపుల్గా అరచేతికి అందిస్తుంది. “కొత్త ఆలోచనయినా, ఆవేశమయినా, ఆవేదనయినా, కవిత్వమయినా కల్పితమయినా భరించడానికి ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది” అని చమత్కరించారు నగేష్ బీరెడ్డి1 గారు తమ ‘ఫేస్బుక్ గైడ్’ అనే పుస్తకంలో.
“గతంలోనూ వర్తమానంలోనూ ఎన్నో కలాలు, మరెన్నో గళాలు, ఎంతో అర్థవంతమైన సమాజహిత భావాలను తెలుగులో వెలువరించి సమాజాన్ని ప్రభావితం చేశాయి. వారి రచనల భావాలు నాలుగు గోడల మధ్యకే పరిమితమయితే, ఆయా రచనలకు సార్ధకత చేకూరదు . సమాజపు అంతరాలలోకి అవి చొచ్చుకెళ్లాలి. కుదుళ్లకు చికిత్స చేయాలి. అందుకు ఓ మాధ్యమం కావాలి. దిన, వార, మాస పత్రికలు అనాదిగా ఈ బాధ్యతను భుజాన మోస్తూ సాహిత్య వ్యాప్తికి వెన్నుముకగా నిలిచినా, వాటికి ఎన్నో పరిమితులు అడ్డంకులుగా ఉన్నాయి. పుస్తక ప్రచురణల ద్వారా కేవలం గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి భావాలే ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి తప్ప, సాధారణ ప్రజల, రచయితల మనోభావాలు చేరలేవు. ఇలాంటి పరిస్థితిలో దూరమయిన స్నేహితులను, బంధాలను ఒక చోటుకు చేర్చి, సమాచార మార్పిడికి ఓ వేదికగా ఏర్పడిన ముఖ పుస్తకం రచయితలకు సైతం ఒక సరికొత్త వేదికను ఏర్పరిచి, తమ భావాలను ప్రపంచంతో పంచుకునే వెసులుబాటును కల్పించింది”(విష్వక్సేన2, 2019). లబ్దప్రతిష్టను ఆశించక కేవలం సమాజ శ్రేయస్సు కాంక్షించే రచయితలకు పుస్తకాలు, కవితలు కథలు వంటివి అచ్చు వేయబడలేదు అనే బాధ లేకుండా ఫేస్ బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా యావత్ ప్రపంచానికి తమ భావాలను తీసుకు వెళ్లామనే తృప్తి మిగులుతుంది.
**కవిత **
చేతిలోని చరవాణి
అంతర్జాల వలలో చేరిఉండగ
కదులుతుండే కంటినిండా కవితలెన్నో
ముఖపుస్తక సమూహాల నిండుగ
పుస్తకమే స్నేహితుడైన రోజులన్నీ మారిపోయి
ముఖపుస్తక స్నేహితులతో నిండె మెండుగా …
అంకురించే ఆలోచనల తరంగాలెన్నో
సమయ రేఖల గోడలన్నీ సాహితీ కెరటాలుగా
అంతర్జాల సాగరాన
ఖండాలు దాటి ఖ్యాతి నొందుచునుండె
ప్రస్తుతం ప్రపంచ నలుమూలలలో తెలుగు సాహిత్యం ప్రాచుర్యం పొందుతున్నది అంటే ఇది కేవలం సామాజిక మాధ్యమాల వలననే. కారణం ఒక కవితనో, కథనో వ్రాసి ప్రచురణకోసం పత్రికలకు లేదా పుస్తక ప్రచురణకు పంపి అవి పత్రికల వారికి అందిన తరువాత వారు వాటిని పరిశీలించి నచ్చితే, మిగతా వారి పోటీని దృష్టిలో పెట్టుకుని ప్రచురించటానికి చాలా రోజులు పడుతుంది. అది ఆ సదరు పత్రికను చదివే వారు మాత్రమె చదువగలుగుతారు. అందులో కొంతమంది మాత్రమె స్పందించి విశ్లేషణను, విమర్షను అభిప్రాయాలను ఉత్తరాలు, కార్డులలో వ్రాసి పంపగలిగే వారు.
ఇటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా ఇప్పుడు సాంకేతిక అభివృద్ధి కారణంగా చరవాణులు, కంప్యూటర్లు, లాప్ టాప్లు, టాబ్ లు అంటూ ఎన్నో సాధనాలు మనకు అందుబాటులోనికి వచ్చాయి. వాటిలో వాట్సాప్, ఫేసుబుక్, ట్విట్టర్, పింట్రెస్ట్ , ఇంస్టాగ్రాం అంటూ ఎన్నో సామాజిక మాధ్యమ యాప్లు ఉన్నాయి. ఇలాంటి మాధ్యమాలన్నీ దేశ విదేశాలలోని వారందరినీ దగ్గర చేస్తూ వారి వారి మనో భావాలను వ్యక్తం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీనిని ప్రపంచం అంతా చదవటానికి అవకాశం ఉంటుంది. చదివిన వారు వెంటనే స్పందించి విశ్లేషించటం, విమర్శించటం జరుగుతుంది. తక్కువ సమయంలో, ఖర్చు లేకుండా ఎక్కువ మందికి మన ఆలోచనలను, అంతరంగ భావాలను, ఆవేదనలను, ఆక్రోశాన్ని పంచుకోవచ్చు. సాహిత్యాన్ని ప్రోత్సహించేవారు దానిపై మక్కువ కలిగినవారు వివిధ సమూహాలుగా ఏర్పడి సాహిత్య కార్యక్రమాలు, పోటీలు, వారి రచనలపై విశ్లేషనలు, అభినందనలు ప్రశంసలు, సూచనలు, సలహాలు ఇచ్చుకోవటం కూడా జరుగుతుంది. కొత్తగా రచనలు వ్రాసేవారు వారి రచనా నైపుణ్యాన్ని, మెళకువలను అనుభవజ్ఞుల రచనలను, శైలిని గమనిస్తూ, నేర్చుకోడానికి, సలహాలు తీసుకోడానికి సామాజిక మాధ్యమం ఒక మంచి వేదిక.
సాహిత్యం ఏదయినా అంటే కథలు, నవలలు, కవితలు, వివరణలు, విశ్లేషనలు, విమర్షలు వంటి వాటిలో ఎప్పటికప్పుడు వచ్చే ఆధునిక పరివర్తనలు ఈ సామాజిక మాధ్యమం ద్వారా త్వరగా తెలుసుకోవటం వాటికనుగునంగా రచనలను మలుచుకుంటూ సమాజంలో కూడా కొంతయినా మార్పు తీసుకు రావడానికి ఉపకరిస్తుంది. అయితే దేనికయినా షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా ఇంట్లోనో ఒక స్నేహితునితోనో మాట్లాడడం వేరు. ఇలాంటి సామాజిక మాధ్యమాలలో మన భావాలను పంచుకోవడం తోపాటు అందరి మనోభావాలను ధృష్టిలో ఉంచుకొని మాట్లాడటం వేరు.
“ఈజిప్టు రెవల్యుషన్ దగ్గిర నుండి మనదేశంలో అన్నా హజారే మూమెంట్ వరకు ఫేస్బుక్ మౌస్ అందించిందే. 2011లో ఐర్లాండ్ కొత్త రాజ్యాంగం రూపొందించటంలో భాగంగా ఆ ప్రభుత్వం ఫేస్బుక్ వినియోగదారుల నుండి సలహాలు, సూచనలు తీసుకుంది. దానికి అనుకూలంగానే రాజ్యాంగంలో మార్పులు చేసింది”1. సాంకేతికత పరిజ్ఞానం పెరిగిన క్రమంలో ప్రస్తుతం అందరూ ఎలక్ట్రానిక్ మీడియాకు చేరువవడం మొదలయింది. బ్లాగుల పుట్టుక, అంతర్జాల పత్రికలు, వెబ్సైట్లు, గ్రూపులు పుంఖాను పుంఖాలుగా మొదలయ్యాయి. ఫేస్బుక్ లో రాసే వారి సంఖ్య పెరిగింది. ఈ అంతర్జాల సాహిత్యాన్ని పరిశీలిస్తే 13 ఏళ్ల వారి దగ్గర నుండి తొంభై ఏళ్ల స్త్రీల వరకూ ఏక వేదికకగా ఫేస్బుక్ నిలిచింది. ఇంటికే పరిమితమయిన స్త్రీలు ఇందులో ఎక్కువగా రాస్తుండటం హర్షించదగ్గ విషయం. కవి సంగమం ఏర్పడిన తర్వాత కవయిత్రులు ఎంతో మంది వెలుగులోకి వచ్చారు(శిలాలోహిత3). ఎవరి అభిరుచి ప్రకారం వారు గ్రూపులుగా ఏర్పడి దానిలో రచనలను, అభిప్రాయాలను వెలువరించి సమాజంలో మార్పును ఆశించడం చాలా అభినందనీయం. సాహిత్య విశ్లేషణలు, సాహిత్య పాఠాలు, సూచనలు, సమాచారం అందిస్తూ ఎందరో యువ కవులకు మార్గదర్శకంగా ఒక కవిత్వ పాఠశాలగా పేరొందిన ముఖ పుస్తక సమూహం కవి యాకూబ్ గారు నిర్వహించే కవిసంగమం. దీనితో పాటు ఇంకా మరెన్నో సమూహాలు సాహిత్య సేవలో నిమగ్నమై ఉన్నాయి.
“Long live netted word” అంటూ హెచ్చార్కె4 గారు తమ పుస్తకం “విప్లవాలు అవార్డులు దేవుళ్లూ పుస్తకాలు ఫేస్బుక్ తో ఐదేళ్లు” లో ఫేస్బుక్ పై తమ అభిప్రాయాలు, అనుభవాలు పొందుపరిచారు. “Our posts in blogs have the same nature as the printed word. They remain out there forever for the world to discover even when we won’t be there. Removing them, of course, is easier than burning a printed book but of the effect. I cannot just burn my book if I feel I shouldn’t have written it. But I can remove it from my blog and get it removed from the e book store if it went there). Just a few clicks! I wish that the world becomes more tolerant soon and find a mechanism that the ‘netted’ word is preserved for ever unless the writer wants to remove it in his lifetime”. పుస్తకాల పేజీలు చినిగి కాల గర్భంలో కలిసిపోయి కనుమరుగయినవి ఎన్నో ఉన్నాయి. కాని ఈ ఫేస్ బుక్ లో పొందు పరిచిన పేజీలు మాత్రం ఎప్పటికీ చెరగవు. తప్పులు ఉన్నా సరిచేసుకునే అవకాశం ఉన్నటువంటి ఒక మంచి సాధనం అని కొనియాడారు.
ఫేస్బుక్ లో కవితలు కాని రచనలు కాని అభిప్రాయాలు గాని పోస్టు చేసినప్పుడు చదివిన వారి మధ్య చర్చ జరిగినప్పుడు ఎవరి నైజమేమిటో తెలుసుకోవడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఫేస్బుక్ రచనలు కవితలు చూసి ‘కడుపునిండా భోంచేసి కంప్యూటరు ముందు కూర్చొని ఎంచక్కా కవితలు వ్యాసాలు రాసి ఫేస్బుక్లో లైకులు కొట్టేయడం కాదు’ అని ఆగ్రహించి ఆవేదనను వ్యక్తం చేసిన వారూ ఉన్నారు. ఒక్కో సారి ఫేస్బుక్ విశ్లేషణలు విమర్శల వల్ల కొందరి అభిప్రాయాలు ఇతరుల అభిప్రాయాలతో విభేదించనూ వచ్చు. అలాంటి సందర్భాలలో ఇరు వర్గాల వారు సామరస్యంతో ప్రతిస్పందనలను డిబేట్ రూపంలో చర్చించుకోవచ్చు. దీని ద్వారా ఒకరిని ఒకరు ఎడ్యుకేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో అందరూ సంయమనం కోల్పోకుండా వ్యక్తిగత మర్యాదను పాటించటం అవసరం. ఆలోచనలలో ఏకీభావం కుదరవచ్చు, కుదరకపోవచ్చు. కానీ అభిప్రాయాలలో క్లారిటీ వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాము4.
ఏ రచనైనా, భావమయినా, ఏ రూపంలో(కథ, వ్యాసం, కవిత, విశ్లేషణ, వివరణ) అయినా ఏ మీడియాలో అయినా మనం వ్రాయాలి అనుకున్నప్పుడు అవి పూర్తిగా మనం ఆచరించేవి, నమ్మినవి అయి ఉండాలి. తాను ఆచరించకుండా వేరే వారిని మాత్రం ఆచరించమని చెప్పే రచనలు కాకుండా అవగాహన చేసుకుని మన హితంతో పాటు అందరి హితం ఆశిస్తూ జీవితాచరణలో సరి చేసుకోవాలి అని అనుకున్నటువంటి విషయాలను మాత్రమే రాయాలి4.
అయితే ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఉపయోగాలు అనేకం ఉన్నా కొన్ని అనర్ధాలు కూడా పొంచి ఉన్నాయనే సంగతి విస్మరించకూడదు. విమర్షలు చేసేటప్పుడు తిట్టినట్టుగా చెప్పడం వల్ల కొంత ఎదుటివారు నొచ్చుకోవటం, ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలలో గడపటం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడటం, హ్యాకింగ్ వంటి వాటి వలన సమాచార భద్రత లేకపోవటం1 వంటి అవకాశాలున్నాయి. అలాగే అందరికీ సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం వల్ల గొప్పగా రచనలు చేసే వారు కూడా వెలుగులోనికి రాలేకపోతున్నారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాధ్యమాలను సాహిత్య రంగంలో వినియోగించుకోవాలి దీనినే ఇంకో రకంగా చెప్పాలంటే మాధ్యమాలను వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నమాట2.
మేధో మధనానికి కృత్రిమ మేధ తోడయితే ఇక కురిసిన సాహిత్యామృతం చిరకాలం నిలిచిపోయే చారిత్రక రచనలకు వేదికగా మిగులుతుంది. నవరస భరితమయిన తెలుగు సాహిత్యం తెలుగు ప్రజల అందరి హృదయాలకు చేరువవుతుంది.
ఉపయుక్త గ్రంధాలు :
- నగేష్ బీ రెడ్డి, 2014, ఫేస్ బుక్ గైడ్, వాసిరెడ్డి పబ్లికేషన్స్.
- పరవస్తు విష్వక్సేన, 28-01-2019, కవిత్వ పాఠశాల కవి సంగమం , ఆదాబ్ హైదరాబాద్(దిన పత్రిక).
- శిలాలోహిత, మార్చి,2020, పుట 44-47, తెలుగు వెలుగు(మాస పత్రిక).
- హెచ్చార్కె, విప్లవాలు అవార్డులు దేవుళ్లూ పుస్తకాలు ఫేస్బుక్తో ఐదేళ్లు,2016, చినుకు పబ్లికేషన్స్.
- te.m.wikipedia.org/wiki/తెలుగు సాహిత్యం.
*****
రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. స్వస్థలం భద్రాచలం. 2005 సం. లో కాకతీయ యూనివర్సిటీ , వరంగల్ లో పర్యావరణ శాస్త్రంలో నీటి కాలుష్యం పై పీ. హెచ్. డి. పూర్తయింది. పర్యావరణంపై పరిశోధన పత్రాలు, అనేక వ్యాసాలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. పండుగలు పర్యావరణంపై రాసిన పుస్తకము సుస్థిరోత్సవం. పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్దే మానవ మనుగడకు భరోసా అనే సత్యాన్ని అందరూ గ్రహించేట్టు చేయగలగాలని ఆకాంక్ష.