కనక నారాయణీయం -26

పుట్టపర్తి నాగపద్మిని

ఇటువంటి అనుభవాలెన్నెన్నో పుట్టపర్తి వారి లేఖలలో చదివి, పోయేవారందరూ!!  

 పిల్లల ఆశ్చర్యం మాట అటుంచి, కనకవల్లి మనసునిండా కలవరమే ఎప్పుడూ!! అసలు పెండ్లైన నాటినుండీ, ఇల్లాలితో  కలవరాలకు దోస్తీ కుదిరిందేమో నన్నంతగా, సంసారంలో ఎప్పుడూ, ఏదో ఒక కలవరమే!!  కలవరానికి అలవాటైన  కనకమ్మ మనసు నిండా నిర్వేదమే!! కానున్నది కాకమానదు!! భారమంతా భగవంతునిమీదే వేసినప్పటికీ, ఏదో దిగులు!! ఆయన ఎలాగైనా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే బాగుండు..’ అనే అనిపిస్తున్నది.

   ఒకరోజు, తెల్లవారు ఝామున, 4.30 ప్రాంతంలో, ఇంటిముందు కసువు ఊడ్చి ముగ్గుపెట్టేందుకు లేచింది ఇల్లాలు!! రాత్రంతా ఆలోచనలతో, నిద్రేలేదు. అమ్మ లేచిన అలికిడి విని, రెండవ కూతురు తరులత ‘అమ్మా, ఇంత చలిలో ఎందుకమ్మా..’ అని గొణుగుతూనే, అమ్మకు తోడుగా అక్కడి అరుగులపై కూర్చుని జోగుతూ ఉంది . నిజమే, యీ చిరుచలికే తట్టుకోవటం కష్టంగా ఉంది!! మరక్కడ, ఢిల్లీ చలి !! నరాలు  కొంకరలు పోయే చలి!! రక్తం గడ్డగట్టుకు పోయే చలట!! భర్త ఎటువంటి పాట్లు పడుతున్నారో, అని గుర్తొచ్చి, కన్నీళ్ళు తన్నుకొచ్చాయి, కనకవల్లికి.

      మెలుకువలోనూ, నిద్ర లోనూ, పిల్లల గురించే ఆలోచనలు!! అక్కడ కరుణాదేవి ఎలా ఉందో!! ఇక్కడతరులత ఇప్పటికే పుష్పవతి అయింది. వీళ్ళకు పెళ్ళిల్లు చేయాలి. ఇంకా , తరులత.. తరువాత తులజ, ఆరేళ్ళది.కొడుకు అరవింద్ కు నాలుగున్నర ఏళ్ళు. అందరికంటే చిన్న పిల్ల నాగపద్మిని. (నేను) ఇంకా పసిది. భర్త ఎక్కడో !! ఒంటరిగా వీళ్ళందరినీ చూసుకుంటూ, ఇంటి పనులు చక్కబెట్టుకోవటంఆడవారికి ఎంత కష్టం??

        అప్పట్లో ఉత్తరాలు , అదీ ఢిల్లీ నుంచీ రావటానికి కనీసం ఐదారు రోజులు పట్టేది. ఇక ఎం.. అంటే మరింత ఆలస్యం. పుట్టపర్తికి కార్యాలయ కార్యక్రమాలనుండీ వెసులుబాటు  దొరికినప్పుడు, పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళి పంపవలె!!  సహాయం చేసేవారెవ్వరూ లేరక్కడ!!

         దినకర్, మహాదేవీ వర్మ, వంటి హిందీ ప్రముఖులెందరో పుట్టపర్తి ప్రాణ మిత్రులయ్యారట!! వారితో తులసీ దాసు రామాయణంలోని విశేషాలనుచర్చిస్తూ కూర్చుంటే సమయమే తెలియటం లేదు నాకు..అని వారే అన్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు! ఇవంతా వినేందుకు బాగానే ఉన్నా, ఆరోగ్యం కూడా బాగుంటే, అక్కడి ఉద్యోగం మరింత ప్రోత్సాహకరంగా ఉండేది, అటు పుట్టపర్తికీ, ఇటు కుటుంబానికీ కూడా!!     

     అక్కడున్న చలికి పుట్టపర్తి తట్టుకోలేక పోతున్నానని ప్రతి లేఖలో వ్రాస్తూనే ఉండేవారు. ఇక్కడి యీ చలి, అక్కడ భర్త చిక్కటి చలిలో ఎటువంటి బాఢలు పడుతున్నారో నన్న వేదన  కడపలోని ఇల్లాలికి  కలిగించటం సహజమే కదా!! 

     చలీ, ఎండాకాలం ప్రకారం ఋతువు ఏదైనా కనకవల్లి వంటి ఇల్లాలి కన్నుల్లో ఎప్పుడూ వర్ష ఋతువే కొలువై ఉంటుందేమోనన్నట్టు ఉన్నది ఇప్పటి పరిస్థితి!! పిల్లలను చూసుకుంటూ, ఇంటి పనీ,   బైటిపనులూ అన్నీ తానే చేసుకోవటండబ్బుకు ఇబ్బంది పడుతూ రోజులు గడపటం, ఎంత కష్టం, ఎంత కష్టం !! కష్టాల కడలినుండీ గట్టెక్కించమని ప్రతి దేవునికీ మొర పెట్టుకుంటూనే ఉంది ఇల్లాలు!!  

            ఆలోచనల్లో  కసువు ఊడ్చి, నీళ్ళు  చల్లి, ముగ్గు వేస్తున్న సమయంలో, ఎదురుగా, ‘బాబా కే నాం  పర్ భిక్షా దో మాయీ..’అన్న శబ్దం  వినిపించి    తలెత్తింది. ఇంత   తెలవారు  ఝామున, బాబా పేరు చెబుతూ, అడుక్కునే వాళ్ళు రావటమా??   దొంగేమో!! భయంగా కనకమ్మ తలెత్తి చూసింది. వచ్చినతను, బాగా ముసలయనే!! కాషాయ వస్త్రాలు, పెరిగిన తెల్లని గడ్డం,   మసక మసక చీకట్లో, ఆయన ముఖమెందుకో చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనబడింది.  వెంటనే, ఆయనే బాబా యేమో, అనిపించిందామెకు!! ఏడుపు తన్నుకుని వచ్చింది.   ‘బాబామా ఆయన దూరంగా ఉన్నారు, ఢిల్లీలో!! నేను పిల్లలను చూసుకుంటూ ఒంటరిగాచాలా కష్టాల్లో ఉన్నాను. మావారిని ఇక్కడికి వచ్చేలా చేయి..బాబా!!’  అంటూ ఉంది, ఏడుస్తూ!! అలికిడికి, తరులత కూడా లేచి కూర్చుంది.

   వచ్చిన పెద్దాయన..’చింతా నహీన్ మైయ్యా!! ఆప్కా   పతి  జల్దీ హీ జాయేగా..ఖుష్ రహో..’ అని ఆశీర్వదించి,   నెమ్మదిగా పక్కనున్న సందులోకి తిరిగి వెళ్ళిపోయాడట!!

   కనకమ్మ సంభ్రమం నుండీ తేరుకుని, ‘అరెరే, నేను పెద్దాయనకు,   భిక్షం కూడా వేయలేదే..అనుకుంటూ,     ఇంట్లోనుంచీ,   అర్ధ రూపాయి నాణెం తీసుకుని తరులత చేతిలో పెట్టి, సాధువింకా ఇక్కడే దగ్గరలోనే ఉంటాడు, ఇచ్చిరా‘ ..అని చెప్పిందట!! తరులత, నాణెంతో పరుగు తీసింది కానీ, సాధువు కనిపించనేలేదు.   అంతలో ఎక్కడికి వెళ్ళీపోయి ఉంటాడాయన??  సంఘటన ఇప్పటికీ  ఆశ్చర్యమే!!

            సంఘటన జరిగిన కొద్ది రోజులకే,  1956  మార్చ్ నెల మూడవ వారంలో   ఢిల్లీ నుంచి వచ్చిన ఉత్తరం   కుటుంబం   మొత్తం   ఆందోళనకు కారణమైంది. పుట్టపర్తి వ్రాశారు,   తనకు పసిరికలు వచ్చాయట!! బాగా నీరసంగా ఉందట!! తాను బాడుగకు ఉంటున్న బాబా భక్తురాలి కుటుంబమే తనను ఆదుకుంటున్నదని వ్రాస్తూ, మరో సంగతీ వ్రాశారు,   ‘ఆమెకు బాబా కలలో కనబడి, ఆచార్లు వాళ్ళ భార్య పిల్లలతో కష్టపడుతున్నదక్కడ!! ఇతన్ని త్వరగా వెనక్కి వెళ్ళమని చెప్పు..’ అని ఆదేశించారట, ఆమెను!!      అనారోగ్యం కారణంగా     తాను ఇక్కడి ఉద్యోగానికి రాజీనామా చేసి, త్వరలో తిరిగి వచ్చేస్తున్నానని వ్రాశారుపుట్టపర్తి.

         రెండు సంఘటనలలో సమన్వయ పరచి చూస్తే, విశ్వాస బలం,   ఎంతటి అద్భుతాలు చేస్తుందో స్పష్టమౌతుంది. దైవాన్ని నమ్మేవారికి ఇటువంటి సంఘటనలే తార్కాణాలు కదా మరి!!

        భర్త  తిరిగి రావటం మంచి వార్తే కానీ, అనారోగ్యంతో అంటే, గుండె కలుక్కుమంది కనకమ్మకు!! అయ్యో, వారికి ఆరోగ్యం ఎలా ఉందో, ఎంత బలహీనంగా ఉన్నారో!! మందులవీ ఇప్పించాలంటే, మళ్ళీ సుబ్రమణ్యం కు జాబు రాయవలె..’  ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతుండగానేఏప్రిల్ మొదటి వారంలో, ఉన్నట్టుండి పుట్టపర్తి పెట్టే బేడా తో తాను వస్తున్నాననీ,   రైల్వే స్టేషన్ కు ఎవరినైనా  పంపమనీ ఉత్తరం వ్రాశారు. వెంటనే, తేదీకి కడపకు రమ్మని సుబ్రమణ్యంకు టెలిగ్రాం ఇచ్చి, భర్తను క్షేమంగా ఇంటికి చేర్చమని కన్నీళ్ళతో బాబాను వేడుకుంటూ ఎదురుచూస్తూ కూర్చుంది కనకమ్మ!!

       రోజులు చాలా బరువుగా నడుస్తున్నట్టే ఉంది ఆమెకు!!

    మొత్తానికిసుబ్రమణ్యం మీద, పూర్తిగా వాలిపోయి, దుర్బల శరీరంతో ఇంట్లోకి వస్తున్న భర్తను చూసి, కనకమ్మ కన్నీరు మున్నీరైంది.

       అప్పటినుంచీ, నాలుగైదు నెలలు విధంగా గడిచాయో తెలియనేలేదు.

       అప్పట్లో, పసిరికలకు  సరైన    అల్లోపతి మందులు లేవు. ఆయుర్వేదమో, లేదా, తెల్లవారు ఝామునే ఎక్కడికో వెళ్ళి పసరుల రూపంలో కుటుంబాలవాళ్ళు  ఇచ్చే మందులను,  నిర్దేశించిన   తేదీల ప్రకారం   వేసుకుని రావాలి. వాళు చెప్పే ఆహార నియమాలూ, పత్యాలూ  పాటించవలె!!   మజ్జిగ బాగా త్రాగవలె!!  పసిరికలు వికటిస్తే చాలా ప్రమాదం కూడా!!

           సమయంలో, కొన్ని రోజులు, హైద్రాబాద్ నుండీ తల్లి శేషమ్మ కూడ కూతురికి తోడుగా వచ్చి ఉంది. కఠిన పరీక్షను ఎదుర్కొని పుట్టపర్తి మళ్ళీ పూర్తి ఆరోగ్యం పుంజుకునేందుకు ఐదారు నెలలు పట్టింది.

         ఎంతో పొదుపుగా దాచుకున్న డబ్బుతో సంసారాన్ని నడుపుకువస్తున్నది కనకమ్మ!! అప్పుడప్పుడు, శిష్య పరమాణువులు, మాలేపాటి సుబ్రహ్మణ్యం, సుబ్బన్న, గోవింద రెడ్డి, బాబయ్యవంటివారు ఆర్థికంగా ఆదుకుంటుంటారు. వాళ్ళను చూస్తుంటే ఎంతో ముచ్చట, దంపతులిద్దరికీ!! ప్రొద్దుటూరులో వారితో ఏర్పడిన యీ గురు శిష్య బంధం ఇంత పటిష్టమైనదా అని  ఆశ్చర్యం  కలుగుతూ ఉంటుంది చూచేవారికి కూడా!!

       ప్రొద్దుటూరు పాఠశాలలో పుట్టపర్తి వాళ్ళకు గురువైనా, తరువాతి సమయంలో వాళ్ళకు పుట్టపర్తి వారు తండ్రి, కనకమ్మతల్లి. అంతే!! ప్రొద్దుటూరు నుండీ, కడపకు మారినావారిలో పుట్టపర్తి దంపతుల పట్ల భక్తి భావం మాత్రమూ తగ్గలేదు, సరికదా, మరింతగా వారి జీవితాలలో పాతుకుపోయిందనే చెప్పాలి. కడపకు వచ్చిన ప్రతిసారీ, ఇంటికి వచ్చిఅమ్మ వంటలను ప్రసాదం గా భావించి భక్తితో తీసుకోవటం వారికి అలవాటు. దంపతులను కలిసిన ప్రతిసారీ, మళ్ళీ  ఊరికి వెళ్ళేటప్పుడూఇద్దరి పాదాలపై మోకరిల్లి పదస్పర్శని గుండెల్లో అలాగే పదిలపరచుకోవటంవాళ్ళంతా క్రమం తప్పక చేస్తూనే ఉండేవారు. ( సంగతి నా చిన్నతనంలో చాలా దగ్గరగా, ఆశ్చర్యంగా చూస్తూ ఉండేదాన్ని.)  

      ఒక సారి   ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. పుట్టపర్తి ఏదో పనిమీద ఊరిలోకి వెళ్ళారు. ఇంట్లో పప్పూ, ఉప్పూ నిండుకోబోతున్నాయని చెబుదామనుకుంటూనే ఉందికనకమ్మ  రెండు రోజులనుంచీ!! వీలే అవలేదు. ఇప్పుడేమిచేయాలబ్బా?? వంటింట్లో డబ్బాలలో మిగిలిన సరుకులేమైనా ఉన్నాయా అని మరోసారి చూస్తున్నది కనకమ్మ!!

  ఇంతలో, బైటినుంచీ, ‘అమ్మా..’అని పిలుపు!!

  ఎవరబ్బా అనుకుంటూ బైటికి వచ్చిందామె!!

  ఎవరో పదిహేనేళ్ళ కుర్రవాడు!!

  ‘ఎవరు కావాలయ్యా??అడిగిందామె!!

        ‘అమ్మా!!పుట్టపర్తి ఆచార్ల వాళ్ళిల్లు మీదే కదా?? పకింటివాళ్ళు చెప్పినారు.    మా అన్న సుబ్బన్న యీ సామానులు ఇచ్చి రమ్మన్నాడమ్మా!! మధ్యాహ్నం భోజనానికి వస్తాడంట!! కూరగాయలూ అవీ పంపించినాడు. ఇక్కడ పెట్టేదా??’

          సుబ్బన్నకు ఇది అలవాటే!! ప్రొద్దుటూరు నుంచీ నూనె వ్యాపారం మీద కడపకు వచ్చినప్పుడల్లా, ఇక్కడికే భోజనానికి వస్తాడు. కనకమ్మ అమ్మగారి  చేతి వంటంటే చాలా ఇష్టం పుట్టపర్తి శిష్య వర్గానికి!! సుబ్బన్న మహాకాయుడు. పైగా భోజన ప్రియుడు కూడా!! చిరు మందహాసం వెలిసిందామె పెదవులమీద!!       

            రోజు కడపకు వచ్చినట్టున్నాడు. కనకమ్మగారు, మనసులోనే సాయిబాబాకు నమస్సులు అర్పించుకున్నారు.

          ఇంట్లోకి సామానులు చేర్చి వెళ్ళిపోయాడా అబ్బాయి!!

          ఒక పదిహేను రోజులకు సరిపడా  బియ్యం, కంది బేడలూ, కూరగాయలు!!

           హడావిడిగా వంట ముగించిందా చల్లని తల్లి!!

        భర్త వచ్చి భోజనం చేస్తుండగా చెప్పిందిసుబ్బన్న సామానులు  పంపిన సంగతి!!

         ఇదేమీ కొత్త కాదు కాబట్టి, ఇద్దరికీ ఏమాత్రం ఆశ్చర్యం కలుగనేలేదు.

             కానీ సుబ్బన్న భోజనానికి రానేలేదు.

       పని పూర్తై, ప్రొద్దుటూరికి వెళ్ళిపోయాడేమో వాడు!!’ అన్నారు పుట్టపర్తి!!

          ఇద్ద్దరూ సమాధానపడ్డారు.

         ఈలోగా పుట్టపర్తికి రావలసిన డబ్బు అందింది.

         మళ్ళీ కుటుంబం దారిలో పడింది.

        మరో నెలకు, సుబ్బన్న పంపాడంటూ, మళ్ళీ సరుకులు వచ్చాయి ఇంటికి!!

       సుబ్బన్న భోజనానికి రాగానే, కనకమ్మగారడిగారు..’ఏమిరా!! పోయిన నెల భోజనానికి వస్తానని సరుకులూ పంపినవాడివి రానేలేదే??’

        సుబ్బన్న అన్నాడు.’నేనా?? మూడు నెల్లైందమ్మా, కడపకు వచ్చి!! వ్యాపారంలో ఏదో ఇబ్బంది!! ఇప్పుడెట్లైనా, అయ్యనూ. మిమ్మల్నీ సలహా అడిగి పోదామని వచ్చినాను.’ అన్నాడు.

          ఆశ్చర్యపోవటం, కనకమ్మగారి వంతైంది.

       ఇంతకూ ఎవరు పంపిఉంటారు ఆనాడు సరుకులు మరి??

        ప్రశ్నకు సమాధానం దొరకనేలేదు!!

  ఇటువంటి విచిత్రాలెన్నో జరిగాయి, పుట్టపర్తి కుటుంబంలో!!    

           సాహిత్య అకాడమీ నుంచీ వచ్చే ఆనరోరియం డబ్బు, సుబ్రమణ్యం ప్రొద్దుటూరు రేషన్ దుకాణంలో పనిలో ఉన్న కారణంగా,వారానికోసారైనా తనతో తెచ్చే బియ్యం, చక్కెర, మరో శిష్యుడు సుబ్బన్న రాకపోకలప్పుడు పంపే సరుకులతో –  ఇలా ఏదో విధంగా రోజులు గడిచి, మొత్తానికి కాస్త ఇబ్బందులతోనే,    పుట్టపర్తి మళ్ళీ పూర్వ రూపానికి చేరుకున్నారు

         కోలుకున్న తరువాత, శ్రీ ఆర్. రంగనాథం గారి సహృదయాహ్వానం తో మళ్ళీ, శ్రీ రామకృష్ణ  ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండితులుగా పున:ప్రవేశం చేశారుపుట్టపర్తి !! 

(సశేషం)

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.