జ్ఞాపకాల ఊయలలో-10

-చాగంటి కృష్ణకుమారి

పఠాభి మాష్టారు గారు పాలికాపునిచ్చి  నన్ను లచ్చమ్మపేటకి  పంపారు కదా ! ఇంట్లోకి అడుగుపెట్టానో లేదో స్కూలు నుండి  తిన్నగా ఇంటికి రాక  పార్వతి ఇంటికెల్లావుట! మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ మొదలెట్టారు. అన్నదమ్ముల కుటుంబాలుంటున్న ఏక పెనక తాటాకు ఇళ్ల లో ఒక ఇల్లు మాది కదా. ఇంటికీ ఇంటికీ మధ్యనున్న పెరళ్లన్నీ  కలిసే వుండేవి.  మధ్యన గోడలు లేవు. మాఇంటినీ  ప్రక్క ఇంటినీ విడదీసి చూపడానికి రెండు పెరళ్లమధ్యనా  నీలి డిశంబరం పూల చెట్ల వరుస కొంత దాకా వుండేది.అంతే. పార్వతి ఇంటికి ఎందు కెళ్లావనీ  ఏంచేసావనీ  ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతీదీ పూస గుచ్చినట్టు  చెప్పడం అలవాటు. కథ చెప్పడం మొదలెట్టాను , కధలో భాగంగా  నేనూ పార్వతీ  చిట్టెమ్మ గారింటికెళ్లామని చెప్పాను.  అంతే! ఇంకేముంది?  

చిట్టెమ్మింటికెళ్ళావా? 

దానింటికెందుకెళ్ళావ్? 

చిట్టెమ్మ ఇంటికి కూడా వెళ్ళిందట! 

 దానింటికేల్లాల్సిన  అవసర మేమొచ్చిందీ? 

  “పార్వతి   తీసికేళితే  వెళ్లాను.”  

“పార్వతి ఎక్కడకు  తీసికెళి తే అక్కడకు  వెళిపోతావా?”  

“అది నూతిలో  దూకమంటుంది .దూకుతావుటే?”  

అందారూ  నేనేదో  చాలా తప్పుపని చేసినట్టుగా  గట్టిగా  అరుస్తున్నారు .

“ఆవిడ చాలామంచిది.  మాకు మరమరాలు పెట్టింది.”  అన్నా. 

“ మరమరాలు పెడితే  మంచిదైపోతుందిటే !”   

 ఈ గద్దింపులతో  నాకు ఏడుపొచ్చింది. ఆరోజులలో  నానెత్తి మీద  కుండ  నిండా నీళ్ళతో వుండేది.  ఈ గద్దింపులకి  ఆనీళ్ళు కళ్లంపట  బుగ్గల మీదుగా జారి పడుతున్నాయి. కుండ ఖాళీ ఆయేదేలేదు . శివుడి  జటాజూటంనుండి ఒక పాయ గంగమ్మ   నేరుగా  నానెత్తి మీద కుండలోకి   వచ్చి పడుతున్నాది.

ఏ ఘట్ట మైనా  ఎంతసేపు  నడుస్తుంది?  చిన్న పిల్ల  దానికేమిటి తెలుసు?  ఆపిల్ల తీసికేళితే వె ళ్లింది , ఇంకదాన్నేమీ అనకండి అన్నారెవరో . 

ఇంతకీ , “ మరమరాలు పెడితే  మంచిదైపోతుందిటే?’  అంటె వారి ఉద్దేశ్యం ఆవిడ మంచిది కాదనేగా !  

ఆవిడ ఎందుకు  మంచిదికాదంటున్నారు?  అప్పుడు  నాకు ఏమాత్రం అర్ధంకాని విషయం . సందేహం అది.  

అసలు ఆవిడ పేరు చిట్టెమ్మేనా?  అలాగే  గుర్తుంది. ఎందుకంటె  “ చిట్టెమ్మఇంటికెల్లిందట ! చిట్టెమ్మఇంటికెల్లిందట! !అని ఆప్రక్క ఈ ప్రక్క వున్నవారు   పలు మార్లు అనుకొంటున్న ట్టుగా గుర్తు. 

 పోనీ  చిట్టెమ్మ కాకపోతే  చిన్నమ్మ !  లేదా  పెద్దమ్మ , ఎవరో? ఒక అమ్మ ! అమ్మల గన్న యమ్మ , ముగురమ్మల మూలపుటమ్మ!  చాలాపెద్దమ్మ !  మాకు మరమరాలు పెట్టినమ్మ ! మాకు దయాంభురాశి గా కనిపించినమ్మ. 

ఆవిడ  మంచి చెడులు  తెలుసుకోవాలంటే  నావల్లయ్యే పనే! 

 ఆవిడ  ఇంకా బతికుంటుందా?  ఆతరంవారంతా  చనిపోయేవుంటారుకదా! అయితే  విజయనగరంలో   మధురవాణి  బతికేవుంది. ఆవిడకు చావులేదు.  ఆవిడను అడిగి తెలుసుకోవాలి. కల్లే పల్లి విజయనగరానికి ఏమంత దూరంలోవున్నది కనక!  మధురవాణే   చరిత్రను  అటు తిప్పి ,ఇటు తిప్పి ,  తిరగేసి  బోర్లేసి, శోధించి , పరిశోధించి, నిగ్గు తేల్చిచెప్పగలదు.   

*****

Please follow and like us:

One thought on “జ్ఞాపకాల ఊయలలో (భాగం-10)”

  1. కృష్ణకుమారి గారూ!మీ జ్ఞాపకాలు ఎంత బావున్నాయో. బాల్యం అంటేనే మధురమైనది కదా. మీ బాల్యపు ప్రత్యేకత ఏమిటంటే చాసో గారు కూడా ఉండడం. అభినందనలు.
    మనం విజయనగరం లో నా చాసో పురస్కారసభలో కలవడమే. మిమ్మల్ని US లో కలిసినట్టు గీత చెప్పింది. మళ్ళీ కలుద్దామండి 👍

Leave a Reply

Your email address will not be published.