నడక దారిలో-11

-శీలా సుభద్రా దేవి

ఒక్కసారిగా మళ్ళా నా చదువుకు విరామం వచ్చింది.సెప్టెంబర్ లో గానీ తిరిగి సప్లిమెంటరీ పరీక్ష ఉండదు.ఒకవేళ చదివిస్తే మే-జూన్ లో గానీ కాలేజీ ఉండదు.

         నా అభిరుచులను సానపెట్టటానికి మళ్ళీ పూనుకున్నాను.లేకపోతే మానసికంగా కుంగిపోతానుకదా! ఆ అవకాశాన్ని నా మనసుకీ,నా మెదడుకీ ఎప్పుడూ ఇవ్వటం నాకు ఇష్టం లేదు.

         ఈరోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ , నిరక్షరాస్యులు, విద్యావంతులు కూడా అనేకమంది అతి చిన్న విషయాలకు కూడా కుంగిపోయి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు.అలా ఐతే నేను ఎన్నిసార్లు కుంగిపోవాలో ఎన్నిసార్లు అవాంఛిత నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చేదో.ఎప్పటికప్పుడు నాకు నేనే ,నన్ను నేనే స్పూర్తి కలిగించుకోవటం నావిధానం.

         ఇప్పుడు మళ్ళా కథలోకి వెళ్తాను.

        సాయంత్రం సంగీతం కాలేజీకి నాలుగుగంటలకి వెళ్తే ఆరువరకూ నా క్లాస్ సమయం. మా కాలేజీ ప్రిన్సిపాల్ గా అప్పట్లో ద్వారం భావనారాయణ గారుఉన్నారు.మా గాత్రం గురువు గారు బురిడి లక్ష్మీనారాయణ గారు.ద్వారం మంగతాయారు గారు వయోలీన్ గురువు గారు గా ఉండే వాళ్ళు.

        సంగీత కళాశాలకు గొప్ప చరిత్ర ఉంది.విజయనగరం సంస్థానాథిపతి పూసపాటి విజయరామ గజపతిరాజు తన ఆస్థానంలోని ఉద్యోగి చాగంటి జోగారావుగారి అంధ కుమారుడు బాబు కోసం 1919 ఫిబ్రవరి 5న గాన పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆనాడు ఈ పాఠశాలకు హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు అధ్యక్షులు. అనంతరం వయోలిన్‌ వాద్యంలో మేటి అయిన పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు విద్యార్థిగా చేరటానికి రాగా ఆయననే అధ్యక్షులుగా నియమించారు. ఈ కళాశాలలో వీణ, గాత్రం, వయోలిన్‌, మృదంగం, సన్నాయి, డోలు వాద్యాలతో బాటూ నృత్యంలో కూడా శిక్షణ ఇస్తారు.

        మా గురువు గారు నా గ్రూప్ వాళ్ళకి పాఠం చెప్పి బయట చెట్లు కింద ప్రాక్టీస్ చేసుకోమనేవారు.మేము సరీగా పాడుతున్నామోలేదో చూడటానికి మాచేత ప్రాక్టీస్ చేయించటానికి మాకు సీనియర్ విద్యార్థినులైన ద్వారం లక్ష్మీ, ద్వారం పద్మ లకు అప్పగించేవారు.అప్పటికి లక్ష్మీ,పద్మా పది,పన్నెండేళ్ళ పిల్లలు.వాళ్ళు తమ కన్నా వయసులో పెద్దవారిమైన మాచేత ప్రాక్టీస్ చేయిస్తుంటే తమాషాగానే కాక ముద్దుగా ఉండేది.వాళ్ళు మా చేత పాడించటమే కాక వాళ్ళూ తమ పాఠాన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే వినటం నాకు ఇష్టం గా ఉండేది.

        సంగీతకళాశాల ఆవరణలో చెట్లకింద ఒకచోట వీణమీద కృతులు ప్రాక్టీస్ చేస్తున్నవాళ్ళూ,మరోచోట ఫిఢేలురాగాలూ, ఇంకోచోట మృదంగ దరువులూ వినిపిస్తుంటే మనసంతా రాగమయం అయిపోతుండేది.ఏమూలో సన్నగా వినిపించే మువ్వలసవ్వడి మరోలోకంలోకి తీసుకుపోతుండేది.నాకు ఎప్పుడోఏదో పుస్తకంలో కలకత్తా లోని శాంతినికేతన్ గురించి చదివిన దగ్గర నుండి అక్కడ చదవకపోయినా పర్వాలేదు కానీ ఒకసారి చూడాలని చాలా కోరికగా ఉండేది.సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్నంతకాలం అది గుర్తు వచ్చేది.అందుకే పాఠం నేర్చుకున్న తరువాత కూడా చాలా సేపు అక్కడే ఉండేదాన్ని.

        1969లోనే సంగీత కళాశాల స్వర్ణోత్సవాలు జరగటం ఒక మరువలేని జ్ణాపకం.వారం పదిరోజుల పాటు కళాశాల పూర్వ విద్యార్ధులు అయిన శ్రీరంగం గోపాలరత్నం,మంగళంపల్లి, ఘంటశాల, సుశీల,నూకల చిన సత్యనారాయణ,నేదునూరి కృష్ణమూర్తి వంటి మహామహుల కచ్చేరీలు ప్రత్యక్షంగా వినటం ఎంతో అపురూపమైన గొప్ప జ్ణాపకం.

        నిజానికి నేను సంగీతం కళాశాల లో చేరింది.సంగీతం పూర్తిగా నేర్చుకొని కచ్చేరీలు చేసేందుకు కాదు.నాకు లలిత సంగీతం పాడటం ఇష్టం.అపశృతులు రాకుండా పాడటానికి స్వరజ్ణానం ఉంటే కంఠం ఒకే పిచ్ లో సాగి శృతిపక్వంగా ఉంటుంది.మరొకటి కళాశాల ఆవరణలోని సంగీత సాగరంలో ఓలలాడుతూ మానసికంగా సేదతీర్చకోటానికి.

        అంతేకాకుండా అమ్మకు సంగీతం అంటే ఇష్టం.అమ్మ చిన్నప్పుడు వాళ్ళ బంధువు అమ్మవయసుదే హార్మొనీ తో పాడుతుంటే అమ్మ వెళ్ళి వినేదట‌.ఒకసారి పని చేసుకుంటూ ఉత్సాహం తో స్వరాలు కూనిరాగాలు తీస్తుంటే మాతాతగారు “ఆ సాని పాటలు పాడేవంటే నాలుగు వాయిస్తాను”అని తిట్టాడని చెప్పింది అమ్మ ఓ సందర్భంలో.

        అమ్మ పనులు చేసుకుంటూ భూకైలాస్ సినిమాలోని ‘ దేవదేవ ధవళాచల మందిర గంగాధరా’ భీష్మ లోని ‘మహాదేవ శంభో’ పాటల్ని సన్నటి కంఠంతో పాడటం చాలా సార్లు విన్నాను.అందుకేనేమో ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను గొంతెత్తి చిన్నప్పటి నుండి పాటల్ని పాడుతుంటే సంభ్రమం గా వినేది.

        నేను సంగీత కళాశాల లో చేరటానికి వెనకదన్ను అమ్మే.పగలంతా సంగీతం పాఠాలే కాక ఎప్పటిలా లలిత సంగీతం కూడా పాడుకునే దాన్ని.

        నాకున్న సంగీతం అభిరుచి గుర్తించో మరేమో తెలియదు కానీ అన్నయ్య విజయనగరంలోని న్యూపూర్ణా థియేటర్ లో ఇంగ్లీష్ సినీమా ” సౌండ్ ఆఫ్ మ్యూజిక్” కు తీసుకు వెళ్ళాడు.అదే కాక ఎవరో ఒకర్ని సాయంగా పంపి జూలియస్ సీజర్, క్లియోపాత్రా,గన్స్ ఆఫ్ నౌరోన్,బెన్ హర్ ఇలా చాలా సినిమాలకు పంపించాడు.ఆంతమాత్రాన నాతో ఆత్మీయంగా మాట్లాడాడని కాదు.తన చుట్టూ పరిధి చుట్టుకునే ఉండేవాడు.

        అంత ఇష్టంగా సంగీత కళాశాల లో చేరినా డిగ్రీ రెండవ సంవత్సరం లో చదువు ఒత్తిడీ,ఇతర ఆసక్తులు వైపు మనసు పరిగెత్తటం తో సంగీతానికి స్వస్తి చెప్పేసాను.రోజూ గంటలు గంటలు పాటలు పాడుకోవడమే కాకుండా అమ్మకి సాయం చేస్తున్నా, ఎంబ్రాయిడరీ చేస్తున్నా,, బొమ్మలు వేస్తున్నా నా కంఠం నుండి రాగం తీగలు తీగలు గా సాగుతూనే ఉండేది.

           అటువంటిది వివాహానంతరం హైదరాబాద్ వచ్చాక ఉమ్మడి కుటుంబం లో అలవాటు ప్రకారం రాగాల తీగలు గొంతులు లోంచి సాగబోయి వెక్కిరింతని తాకి ముడుచుకుని తిరిగి కంఠం చుట్టూ బిగుసుకున్నాయి.అంతే మళ్ళీ ఎప్పుడు అందరూ ఉన్న ఆ ఇంట్లో గొంతు విప్పలేదు.ఏ రాత్రి పూటో పాపాయిని నిద్రపుచ్చటానికి సన్నటి జోలపాటగా మిగిలి పోయింది.అప్పుడే రంగనాయకమ్మ రాసిన నవల “కళ ఎందుకు” గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లేవి.

            తిరిగి పదేళ్ళకి బియిడీ చదివేటప్పుడు జాతీయ పండుగ ప్రోగ్రాము కోసం కొంతమంది తో ప్రాక్టీస్ చేయిస్తుంటే అక్కడే వింటున్న నా కంఠం నుండి అనుకోకుండా ఆ పాట వెలువడింది.నా సహవిద్యార్థినులతో పాడిస్తున్న మేడం ఆశ్చర్యం గా చూసి మంచి కంఠం అని పొగిడి ఏదైనా దేశభక్తి పాట నన్ను పాడమన్నారు.ఆరోజు గొంతెత్తి పాడాను.కానీ ప్రాక్టీస్ లేని కంఠం పొడిబారి పోవటం తో పాటు సరిగా రాలేదనిపించి దిగులు వేసింది.

            తర్వాత ఉద్యోగంలో చేరాక స్కూల్లో జాతీయ కార్యక్రమాలకోసం పిల్లలకు పాటలు,డాన్సులూ నేర్పించటమే కాక మా ప్రధానోపాధ్యాయురాలు బడిలో ఉపాధ్యాయ సమావేశాలు జరిగినప్పుడల్లా నాచేత లలిత గీతాలు పాడించేవారు.

            రేడియోలో వింటూ నేను సేకరించి రికార్డ్ చేసుకున్న కృష్ణశాస్త్రిగేయాలూ,సాలూరూ, బాలసరస్వతి పాడినగీతాలూ వందలాది పాటలు కేసెట్లు ప్రాక్టీస్ చేయటం లేదేమని నావైపు జాలిగా చూస్తున్నట్లనిపిస్తుంటుంది.పాట పాడాలనిపించి పాట ఎత్తకుంటే గొంతు సాగక రాగం విరిగి పోతుంటే దిగులు వేసింది.ఆ దిగులు నాలో సుడులు తిరిగి కొన్నాళ్ళు తర్వాత 2002లో “ఎగిరిపోయిన కోయిల”అనే కవిత రాసాను.

            అందుకే మా అమ్మాయికి చిన్నప్పట్నుంచీ సంగీతం నేర్పించాను. ‌ రేడియో ఆడిషన్ లో కూడా ఎంపికై యువవాణిలో కొన్ని లలిత గీతాలు కూడా పాడింది.ఆమెకూడా ఉద్యోగం వల్లా బాధ్యతలవల్లా సంగీతాన్ని అశ్రద్ధ చేస్తుంటే నాలాగే ఆమెకంఠం కూడా ఎక్కడ మూగపోతుందోనని విలవిలలాడిపోతాను.ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటాను.సంగీతం, నృత్యం వంటివి జీవితాంతం కొనసాగించటానికి, ప్రోత్సాహం అందటానికి కేవలం ఆసక్తీ, అభిరుచి మాత్రమే చాలదు.తగిన వారసత్వం కూడా ఉండాలేమో.  

            మూడుతరాలుగా ముందుకు అడుగువేయని సంగీత కథా కమామీషు ఇది.

*****

Please follow and like us:

One thought on “నడక దారిలో(భాగం-11)”

  1. నడక దారిలో పరుగిలిడు తున్నాము. ఆనాటి కాల పరిస్థితులు మా కళ్ళ ముందుంచారు. మీ వ్యక్తిత్వం ఆదర్శప్రాయం.🙏

Leave a Reply

Your email address will not be published.