నలిగే క్షణాలు

-గవిడి శ్రీనివాస్

గూడు విడిచిన పక్షి మాదిరి
తపనపడ్డ క్షణాలు  నలిగిపోతున్నాయి .

తుఫాను వీచినట్లు
ఎడారులు ఎత్తిపోసినట్లు
ఇంటికి దూరమైన పిల్లలు
హాస్టల్ లో  వేలాడుతున్నారు.

గుండెను తడిపే పలకరింపు కోసం
దూర భారాన్ని దింపుకోవటం కోసం
కన్నీటి తీగలు చెవిలో మోగుతున్నాయి .

కొన్ని చేరువ  కావలసినపుడు
కన్నీటి చినుకులూ కురుస్తాయి .

ఈ కాసింత కాలాన్ని
ఓపిక మీదే ఆరేయాలి

కన్నవారి కలలు పిల్లల్లో
పిల్లల కలలు ఆప్యాయతల్లో
వాలుతుంటాయి .

రాత్రులు కన్నీటి నదుల్లో తడిపేస్తే
మీ జ్ఞాపకాలు కలవరపెడతాయి.

మళ్ళీ తెల్లవారు కోసం
రాత్రుల్ని చించుకోవాలి .

పేగుబంధమంటే ఏమని చెప్పాలి
తీగలు లేకుండానే
దూరాల్ని సైతం కుదిపేది
మనసుని సైతం కూల్చేదీ  ……….

అయినా చిట్టి తల్లీ
కాస్తా చదువుకో వచ్చేస్తా ….

సమయాల్ని నిద్రలేపి
అనురాగపు తీరాల్ని మీ  దరికే 
తీసుకొచ్చేస్తా …

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.