నారి సారించిన నవల-27

రంగనాయకమ్మ-4

                      -కాత్యాయనీ విద్మహే

రంగనాయకమ్మ    నవలలో ‘స్వీట్ హోమ్’  కౌమారంలోకి ప్రవేశిస్తున్న ఆడపిల్లల ఆలోచనలు ఆరోగ్యకరంగా ఎదగటానికి దోహదం చేసే నవల. సరదాగా చదువుకొనటానికి వీలుగా వుండి కుటుంబంలో భార్యాభర్తల మధ్య వుండవలసిన ఆహ్లాదకరమైన ప్రజాస్వామిక సంబంధాలకు ఒక కొత్త నమూనాను సూచిస్తూ సాగే నవల స్వీట్ హోమ్. స్వీట్ హోమ్ నవల మొదట్లో రెండు భాగాలుగా వచ్చింది. మొదటి భాగం రచనా కాలం 1967. అదే సంవత్సరం డిసెంబరు నెలలో ఎమెస్కోవారు దానిని పుస్తకంగా ప్రచురించారు. రెండవ భాగం రచనాకాలం 1968 సెప్టెంబరు. అక్టోబరు 16 నుండి ఆంధ్ర ప్రభలో అది ధారావాహికంగా ప్రచురించబడింది. 1969 ఏప్రిల్ లో ముప్పాళ సీతారామస్వామి పబ్లికేషన్ పక్షాన పుస్తకంగా వచ్చింది. మళ్ళీ దాదాపు ముప్ఫయేళ్ళకు 1997 లో స్వీట్ హోమ్ నవలను పొడిగిస్తూ మూడవ భాగం వ్రాసింది రంగనాయకమ్మ. అది 1998 మార్చి 23 సంచిక నుండి ఏడాదికి పైగా ఆంధ్రప్రభలో సీరియల్ గా  ప్రచురించబడింది.  ఆరకంగా స్వీట్ హోమ్ మూడవభాగం 1999 జూన్ లో  స్వీట్ పబ్లికేషన్ పక్షాన పుస్తకరూపంలోకి వచ్చింది.

1

స్వీట్ హోమ్ నవలేతి వృత్తమంతా బుచ్చిబాబు విమలల సంసారాన్నిచుట్టుకొని వుంటుంది. ఈ నవల వ్రాసేనాటికే రంగనాయకమ్మ లోకంలోని కుటుంబాలను, దాంపత్యాలను చూస్తూ, దాంపత్య సంబంధాలలోని అధికార అధీనత లక్షణాన్ని రకరకాలుగా విశ్లేషణకు పెడుతూ పేకమేడలు, రచయిత్రి చదువుకున్న కమల, మొదలైన నవలలు వ్రాసింది. ఈ నవలల్లోని భర్తలు  లోకంలోని భర్తలకు రకరకాల స్థాయీ భేదాలతో ప్రతినిధులుగా కనబడతారు. భార్యలకు స్వంత ఆలోచనలు, ఇష్టాలు వుంటాయన్న వివేకం లేని అధికార దృకృథం  వాళ్ళది. అహంకారం అధిక్యత వాళ్ళ ప్రవర్తనను నిర్దేశించే అంశాలు. పేకమేడలులోని రాజశేఖరం లాంటి వాళ్ళే అందరూ కాక పోవచ్చు కానీ, రచయిత్రిలో మోహన్ అయినా, చదువుకున్న కమలలో మధుమూర్తి అయినా పితృస్వామిక కుటుంబ సంప్రదాయానికి, పురుషాధిక్య భావాలకు ఏదో ఒక మేరకు వారసులే అయినారు. ఇలాంటి మగ వాళ్ళను చూచి చూచి, పాత్రలుగా సృష్టించి సృష్టించి ఇంతకంటే భిన్నంగా అధిక్యతను వదలుకొని సహజీవనానికి, సహజంగా జీవించటానికి సిద్ధపడే మగవాళ్ళను గురించిన అన్వేషణలో రంగనాయకమ్మ సంభవయోగ్యత గల ఒకానొక నమూనా వ్యక్తి గా బుచ్చిబాబును సృష్టించింది. తన ఆశలన్నీ ఏకంచేసు కొని, తన కోరికలన్నీ కలగలుపుకొని, తన గుండెల్ని చీల్చుకుని బుచ్చిబాబు పాత్రను సృష్టించుకున్నానని,  తన వూహలకు రెక్కలిచ్చి పెంచుకొన్న పాత్ర బుచ్చిబాబు అని ఆమె స్వీట్ హోమ్ ఒకటవ భాగం మొదటి ముద్రణకు వ్రాసిన ముందు మాటలో చెప్పుకొన్నది. మొగవాళ్ళు బుచ్చిబాబు లాగా నిరహంకారులు, నిష్కపటులు, నిర్మలులు, అయి స్నేహంగా మెదిలే ఇల్లు స్వీట్ హోమ్ అవుతుందని రంగనాయకమ్మ విశ్వాసం. 

అయితే మగవాళ్ళు సంస్కార వంతులయిన మాత్రాన సరిపోదు.మగవాళ్ళ సంస్కారాన్ని అర్ధం చేసుకోవటానికి జీవితాన్ని ఉన్నతంగా వెలిగింప చేసుకొనటానికి స్త్రీకి కూడా స్వంత ఆలోచనలు వ్యక్తిత్వం వుండాలి. సంప్రదాయంగా తరతరాలుగా కొనసాగివస్తున్న జీవిత విధానమే సరిఅయినదని నమ్మి బ్రతుకుతూ స్వంత ఆలోచనలే లేకుండా స్త్రీలు జీవిస్తున్నా, జీవితం పట్ల అ సంతృప్తులుండి కారణాలు తెలుస్తూ కూడా తన ఆలోచనలను అభిప్రాయాలను ఎవరేమను కొంటారో అని గానీ,  కుటుంబ శాంతికి భంగమవుతుందని గానీ – బయటకు చెప్పకుండా స్త్రీలు లోలోపలే అణిచేసుకొని జీవిస్తున్నా ఆ పరిస్థితి పురుషులను ఎక్కువకాలం సంస్కారవంతులుగా నిలబడనీయదు. అందువల్ల ఈ ప్రమాదాన్ని నిరోధించటానికి కొత్త తరహాస్త్రీ కావాలి. విమల అటువంటి స్త్రీ. ఆడవాళ్లని చనువుగా మాట్లాడనివ్వాలి. “అప్పుడు ప్రతి భార్యా భర్తకు అర్ధం అవుతుంది” అని రచయిత్రి నవలలో రుక్మిణి చేత చెప్పించిన రంగనాయకమ్మ చనువుగా మాట్లాడటమే సహజ స్వభావంగా విమల పాత్రను సృష్టించింది. నిష్కపటుడు, నిర్మలుడు, స్నేహమూర్తి అయిన బుచ్చిబాబుకు భార్యను చేసింది.  స్వీట్ హోమ్ రెండవభాగం మొదటి ముద్రణకు పాల గుమ్మి పద్మ రాజు జాబు రూపంలో వ్రాసిన అభిప్రాయం – “స్త్రీత్వంలోని రంగు, రుచి, మెరుపు, తళుకు, చురుకు మృదుత్వం అన్నీ కలగలిపిన అపురూప సృష్టి విమలఅన్న వాక్యంతో ముగుస్తుంది. స్త్రీత్వం సౌందర్యానికో, గృహిణీత్వానికో, మాతృత్వానికి సంబంధించినది కాదు. తాను స్త్రీని, ప్రత్యేక వ్య క్తిని అన్న చైతన్యంతో నిరంతరం ప్రవర్తించ గలగటం, తాను లోపల ఏమనుకొంటుందో అదే బయటకు అనగలగటం, తాను ఆశించేది ఆచరణ వాస్తవం చేసుకొనటం, ఇవన్నీ విమలను చలన చైతన్యాలతో చూపిస్తాయి. ఇలాంటి విమల అలాంటి బుచ్చిబాబు వీళ్ళిద్దరి సంసారంలోని స్నేహాలు, ప్రేమలు, సంభాషణలు, సంఘటనలు, సన్నివేశాలు, సంఘర్షణలు, వాదాలు, వివాదాలు అన్నీ కలిసి స్వీట్ హోమ్ నవలకు ఇతివృత్తం.

విమల బుచ్చిబాబుని ఇష్టపడే పెళ్ళి చేసుకొంది. పెళ్ళయ్యాక క్రమంగా తెలిసివచ్చింది. తనకున్న అభిరుచులేవీ అతనికి లేవని. తనకు పుస్తకాలు ప్రాణం. అతనికి చదివే అలవాటు లేదు. తనకు సంగీతం ఇష్టం. అతనికి సంగీతం గురించిన పరిజ్ఞానమే లేదు. తనకున్న ఆసక్తులు అతనిలో కలిగించాలని ప్రయత్నించి విఫలు రాలైంది విమల. అయినా అతని మీద ప్రేమ పోలేదు, ఎందుకంటే బుచ్చిబాబు ఇలావుంటే బాగుండు నన్న వూహలయినా విమలకు వున్నాయి కానీ విమల ఇలా వుండాలన్న పట్టింపు అతనికి లేదు. విమల అభిరుచులు, అభిప్రాయాలు, అసహనాలతో సహా ఆమెనతను స్వీకరించాడు. ఆమె అభిరుచులను తన అభిరుచులుగా చేసుకోలేకపోయినా ఆమె అభిప్రాయాలను వినగలిగిన సహనం, ఆమె అసహనాన్ని అర్థం చేసుకోగల సంస్కారం అతనికి వున్నాయి. అందుకే ఆమె అరుపులకు కోపానికి అతను నొచ్చుకోడు. తన తప్పును తెలుసుకొని సరిచేసుకొనే ప్రయత్నం చేస్తాడు. అందువల్లనే విమల బుచ్చిబాబును ప్రేమించకుండా వుండలేక పోతుంది. 

 ప్రాక్టీసు ఇల్లు తప్ప మరొక లోకం తెలియని బుచ్చిబాబును  స్నేహితులతో, సమాజంలో సరదాగా మెదిలే మనిషిగా తయారు చేయాలని విమల తాపత్రయ పడింది. విమలకు ఇష్టం కదా అని అతనలా ముందుకు పోతాడే కానీ తనకు తాను ఎక్కడివరకు వుండాలో హద్దు లేర్పరచుకోలేడు. హద్దు మీరుతున్నాడన్న హెచ్చరిక మళ్ళీవిమల నుండి తీవ్రస్థాయిలో వస్తే తప్ప అతను ఆగలేడు, తనను తాను సవరించుకోలేడు.  పేకాట పట్ల, డ్రామాలపట్ల బుచ్చిబాబుకు అభిరుచి కల్పించాలని విమల ఇచ్చినప్రోత్సాహం, చివరికతను వాటిల్లో తలమునకలయి పోతుంటే అతనికి తెలిసి రావాలని ఆమె చేసిన ప్రయత్నాలు, చివరికి బుచ్చిబాబుకు విమలే ప్రియమైందన్న విషయాన్ని బుజువు చేసి పెడతాయి. విమలకు కూడా అంతే. లోకం దృష్టిలో అతను పెద్ద అందగాడు కాకపోయినా, సమర్ధుడు కాకపోయినా తన మనసులోని మాటను స్వేచ్ఛగా ఎప్పుడు పడితే అప్పుడు వ్యక్తీకరించటానికి వీలిచ్చే వ్యక్తిత్వం కనుక అతను ఆమెకెంతో అపురూపం. అతనిని గురించి అన్న అయినా, అక్కయినా ఎంత దగ్గరి వాళ్ళయినా హేళనగానో, బాధపెట్టేట్లుగానో మాట్లాడితే ఆమె సహించలేదు. బుచ్చిబాబుకు విమలే లోకం. విమల బుచ్చిబాబు కోసం లోకాన్నంతా తిరస్కరించ గలదు. స్వీట్ హోమ్ నవల మొదటిభాగం చివరి కొచ్చేసరికి పాఠకులకు కలిగే అవగాహన ఇది.

ఈ మొదటి భాగం చివరలో విమల అన్న మధుసూదనరావు బుచ్చిబాబుకు ఒక సలహా ఇస్తాడు. “విమల నిన్ను తెగ ఏడిపించేస్తోంది. అప్పుడప్పుడు ఓడోసు ఇస్తూ వుండాలోయ్!” అని చెప్పాడు. మధుసూదనరావు తనస్నేహితుడు.  విమలను పెళ్ళాడటం వలన అతను తనకు మరింత ప్రియమైన వాడు, దగ్గరవాడు అయినాడు. ఇంటికొచ్చిన అన్నగారికి విమల బుచ్చిబాబు డ్రామాల పిచ్చిగురించి చెప్పి కాస్త మందలించమని కోరింది. అతను బుచ్చిబాబును సంభాషణలలో పెట్టి భర్త అలవాట్ల వల్ల బాధపడుతున్న ఒకావిడకు విడాకులు కావాలని చెప్పి. వస్తాయా అని అడిగి, ‘ఇష్టం కాపురాలు చేయాల్సిన అవసరం లేదని విడాకుల కోసం ప్రయత్నించవచ్చని’ అతను చెప్పాక, అయితే ఆవిడాకులు కావల్సింది విమల కేనని అసలు విషయం బయట పెడతాడు మధుసూదనరావు. 

విమల విడాకులు తీసుకోవాలను కొనేంతగా తనతో విసిగిపోయిందా  అని బాధపడి బుచ్చిబాబు నా దగ్గర వుండటం నీ కిష్టం లేకపోతే నేను బలవంతం చెయ్యగలనా విమలా?’ అని ఆమెకెలా ఇష్టమైతే అలా చెయ్యమని చెప్పాడు. ఆ చెప్పటంలో అతను పడ్డ వేదన విమలను చలింపచేసింది. అన్నమీద కోపంగా మారి, ‘ఆయన్ని విమర్శించి విడాకులిప్పించే పెద్ద మనిషివా నువ్వుఅని తిట్టేంత దూరం వెళ్ళింది. ఈ నేపధ్యంలో విమల అన్న బుచ్చిబాబుకో సలహా ఇచ్చాడు. బుచ్చిబాబు, దానిని ఆచరణలో పెట్టాలను కొన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక విమలకు స్త్రీకి వుండాల్సిన సహనాన్ని గురించి, శాంతాన్ని గురించి బోధించే ప్రయత్నం చేశాడు.స్త్రీ సహజ లక్షణాలుగా సమాజం నిర్దేశిస్తున్న విలువలను తిరస్కరిం చటంలోనే విమల ఉనికి వుంది. సహనం ,శాంతం అనగానే నేను నీకు పతివ్రతలా కనబడు తున్నానా అని బుచ్చిబాబు తో తగవుకు దిగుతుంది. 

విమల భర్త పట్ల అనురక్త. కాని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ఆత్మగౌరవం కోల్పోయి భర్తకు నీడగా అధీన జీవితాన్ని దయా ధర్మభిక్షంగా అనుభవించే పతివ్రతకాదు. అందుకే పతివ్రత అనేమాట వింటేనే విమలకు అంతకోపం. స్త్రీ ధర్మాలంటే కోపం. స్త్రీని, భార్యను చట్రంలో ఇమిడ్చి జీవచ్ఛవంగా చేసే ఏ విలువలనూ ఆమె అంగీకరించ లేదు. స్వీయ వ్యక్తిత్వంతో సహజంగా తనకు తోచినట్లు జీవించటం ఆమె ఆకాంక్ష. భావుకత్వం దానికి తోడయింది. ఆ ఆకాంక్ష తీవ్రత నుండి, భావుకత నుండి ఆమె బుచ్చిబాబును ప్రేమిస్తుంది. జన్మజన్మలకీ అతని సాహచర్యాన్ని కోరుతుంది. కానీ ఆ ఆకాంక్ష తీవ్రతను గుర్తించక, భావుకత్వ స్థాయిని అందుకోక బుచ్చిబాబు మాట్లాడే లౌకిక వ్యవహారపు మాటలు ఆమెను నేలమీదికి తెస్తుంటాయి. నీతో మాట లేవిటి? ఉత్త ఇడియట్వి!అని ఆ సందర్భాలలోనే ఆమె అంటుంది. సహజ సుందరమైన ఇటువంటి సన్ని వేశాలు స్వీట్ హోమ్ లోకి మనల్ని సమాకర్షిస్తాయి.

2

స్వీట్ హోమ్ మొదటి భాగం చివరిలో విమలకు కొంచెం స్త్రీ ధర్మాలు బోధించాలని ప్రయత్నించి విఫలుడైన బుచ్చిబాబు పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ ఆ పనికి పూనుకొన  టంతో స్వీట్ హోమ్ రెండవభాగం మొదలవుతుంది. ఈ సారి తాను చెప్పే పని పెట్టుకోడు. ఆమెను ఒక సినిమా చూపించి అమాంతం మార్చేద్దానునుకొంటాడు. కోర్టునుండి హడావుడిగా వచ్చి విమలను సినిమాకు బయలుదేరమంటాడు. అందులో చాలా నీతి వుందని కూడా చెప్తాడు. ఎవరికి నీతి? మీకా?నాకా?” అని అడుగుతుంది. ఇద్దరికీ ఒక్కనీతి  “పనికి రాదేమిటి? అని అతనడిగితే “పనికి రాదు మీ నీతి నాకు అవినీతి నా న్యాయం మీకు అన్యాయం అని సమాధాన మిస్తుంది. విమల. స్త్రీ పురుషులకు వేరువేరుగా వర్తించే సామాజిక నైతిక విలువల  స్వభావం తెలిసిన చైతన్యంతో ఆసినిమా మగ వాళ్ళకు ప్రయోజనకరమైందా ఆడవాళ్ళకు ప్రయోజన కరమైందా అన్న సందేహంతోనే బయలుదేరింది. విమల. ధర్మాలంటే మండిపడే విమల భారతస్త్రీ ధర్మాలను భారతస్త్రీకి సతియే దైవం అని బోధించే సినిమాను విమర్శించటం, వ్యతిరేకించటం సహజంగానే జరిగింది. విమలకున్న ఈ చైతన్యం బుచ్చిబాబుకు ఆశ్చర్యం కలిగించదు. ఆందోళన కలిగించదు. మగవాడి అధికారపు పునాదులు కదిలిపోతాయన్న బెంగ అతనికి లేదు. పెళ్ళాం చేత బహువచన సంబోధనలతో గౌరవించబడాలన్న ఆధిక్యతా లక్షణం గానీ, పెళ్ళాన్ని తిట్టి అదుపులో పెట్టుకోవాలన్న అధికార కాంక్ష గానీ అతనికి లేవు కనుక అతనికి విమల మాటలు విడ్డూరంగా తోచవు. కానీ ఆ ఇంటికి చుట్టంగా వచ్చిన శ్యామలరావుకు మాత్రం ఇదంతా విచిత్రంగానే తోచింది.

విమలకు పిన్ని కూతురు విశాల. విశాల భర్త శ్యామలరావు. విమల బుచ్చిబాబు ఇద్దరూ అతనికి ఆశ్చర్యార్ధకాలే. “మొగుడితో అంతధైర్యంగా అంత చొరవగా అంత కోపంగా – అంత హాస్యం గా మాట్లాడే ఆడవాళ్ళనెప్పుడూ అతను చూడలేదు. పెళ్ళాం కేకలకి మండి పడకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని నవ్వే మొగుళ్ళనీ చూడలేదు”. అందుకే అతనికి విమల్ని చూస్తుంటే గాభరా. బుచ్చిబాబును చూస్తే ఆశ్చర్యం.శ్యామలరావుతో చేసిన సంభాషణల్లో విశాలతో చెప్పిన కబుర్లలో భార్యాభర్తల సంబంధాల గురించి విమలకున్న భావాలు వ్యక్తమవుతాయి. పెళ్ళాం ఒక మనిషి. ఆమె అభిప్రాయానికి ఇష్టానికి విలువ ఇచ్చి ప్రవర్తించాలి గానీ పెళ్ళాం మీద పెత్తనం కూడనిది. సంసారాన్ని నరకం చేస్తుంది అది. నరక ప్రాయమైన సంసారాన్ని ఏడుస్తూ జీవితాంతం భరించటం కాకుండా దానిని బాగు చేసుకొనేందుకు స్త్రీలు ప్రయత్నించాలి. సంసారంలో హక్కుల కోసం భార్య భర్తను దిక్కరించాల్సిందే. శాంతం సహనం స్త్రీత్వ లక్షణాలంటే విమల ఒప్పుకోదు. గర్భం ధరించే శక్తి ఒక్కటే స్త్రీత్వం. మిగిలిన అన్ని విషయాల్లో స్త్రీ పురుషుడితో సమానం. శాంతం సహనం స్త్రీత్వ లక్షణాలుగా చెప్పే మగవాడి అధికారాన్ని, దుర్మార్గాన్ని ప్రశ్నించకుండా జీవించే పద్ధతిని స్త్రీకి సమాజం అలవాటు చేస్తున్నదని విమల  శాంతం, సహనం అన్న మాటల చుట్టూ వున్న మాయను విప్పి చూపింది  విశాలకు.స్త్రీ జీవిత సమస్యలకు తండ్రి అధికారం గల సమాజం, పురుషాహంకారం మూల కారణాలన్న అవగాహన వాటిని తన వ్యక్తిత్వం తో ఎదిరించి స్త్రీవిముక్తి సాధించాలన్న దృక్పథం విమలకు వున్నట్లు స్వీట్ హోమ్ రెండవ భాగం ముగిసే సరికి పాఠకులకు అర్ధం అవుతుంది. 

భర్త మీద ఆధారపడి బ్రతుకుతున్నానన్న అధీన భావసంస్కృతి నుండి విముక్త అయిన స్త్రీ విమల. బి.ఎ. చదువుతున్న విమల బుచ్చిబాబును పెళ్ళాడి చదువు అర్ధాంతరంగా ఆపేసి సంసారంలో పడ్డది. (ఒకటవ భాగం పు: 29,  రెండవ భాగం పు: 47) ఆర్థికంగా సంపాదన లేని సం సార స్త్రీ లోకవిధానాన్ని అనుసరించి భర్త మీద ఆధారపడి బ్రతుకుతున్నట్లు. భరించేవాడు, పోషించే వాడు భర్త అని సమాజ నిర్వచనం. ఆ పరిస్థితే భర్తలకు భార్యల మీద సర్వాధి కారాలను  వాళ్ళజీవితం మీద పెత్తనాన్ని ఇస్తుంది. తిండికీ బట్టకు భర్త మీద ఆధారపడ్డవాళ్ళం అన్న స్పృహ స్త్రీలను ఎన్ని అవమానాలనయినా భరిస్తూ సంసారాలు చేసేట్లు చేస్తుంది. విమల ఈ స్థితిని అధిగమించింది. ఇంటిపని చేస్తూ పిల్లల్ని కని పెంచుతూ బ్రతుకంతా భర్త సుఖం కోసం వెచ్చించే స్త్రీ మొగుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నదంటే విమల ఒప్పుకోదు. మొగ వాడు సమస్త విషయాలకు స్త్రీ మీద ఆధారపడి వుంటాడు. ఆ విషయాన్ని తల కిందులు చేసి, స్త్రీ తనమీద బతుకుతున్నట్లు కల్పించిన మాయను విమల విచ్ఛేదం చేసింది. మొగుడు, మగ వాడు – ఆడదాని మీద ఎన్ని విధాలుగా ఆధారపడి వున్నాడో తెలిసిన స్త్రీగా ఆమె ఆధీన భావ సంస్కృతి నుండి తనను తాను విముక్తం చేసుకోగలిగింది. ఆత్మన్యూనత, అభద్రతాభావన ఆమెలో ఛాయా మాత్రంగానైనా కనిపించక పోవటానికి కారణం అదే. ధీమాగా, ప్రేమతో హక్కుగా ఆమె తన జీవితాన్ని బుచ్చిబాబు జీవితంతో ఏకం చేసుకోగలిగింది. అందుకే స్వంత సంపాదన లేదన్న దిగులు ఆమెలో ఎక్కడా కనబడదు. బుచ్చిబాబు డ్రామాల మోజులో తనను పిల్లలను నిర్లక్యం చేస్తున్నాడన్న అనుమానం కలిగినప్పుడు మాత్రమే ఆమె అన్నగారిని తన కోసం ఉద్యోగం చూసి పెట్టమని అడిగింది ( ఒకటవ భాగం, పు: 113) కానీ అది ఆమెకు. అంత ముఖ్యమైన విషయం కాదు. తన భర్త ప్రేమ ఆసక్తి అన్నీ తన మీదే వుండేట్లయితే ఆమెకు ఉద్యోగం అవసరం కాదు.

ఆర్థిక స్వేఛ్ఛ స్త్రీ జీవితం సుఖంగా సాగటానికి చాలా పెద్ద కారణమే అని విమలకు తెలుసు.  (రెండవ భాగం పు: 99) కానీ ఉద్యోగం చేసి సంపాదిస్తున్నదని భార్యమీద పెత్తనాన్ని కొంత సడలించుకొనే ఉదారులైన భర్తలను విమల సహించలేదు. స్త్రీ సంపాదనాశక్తితో సంబం ధం లేకుండా పురుషుడు తన అహంకారాన్ని, పురుషుడు కావటం వల్ల సంక్రమించిన సామా జికాధికారాన్ని వదులుకొని ఆమెను ప్రేమించగలగటం, సాటివ్యక్తితో ప్రవర్తించినట్లు ప్రవర్తిం చటం ముఖ్యం అన్నది విమల అభిప్రాయం. స్వీట్ హోమ్ రెండవ భాగం మొదటి ముద్రణకు ‘బుచ్చిబాబూ ! విషయూ గుడ్ లక్’  అనే శీర్షికతో రంగనాయకమ్మ తాను వ్రాసిన ముందు మాటలో ఆర్థిక స్వాతంత్య్రం స్త్రీలకు పురుషులతో … బ్రతుకులో చాలా విధాల సమానావకాశాలు కల్పి స్తుంది. కానీ భార్యాభర్తలు… వారి బిడ్డలు పోయిగా బ్రతకాలంటే.. పరస్ప రాను రాగంతోనూ తీయని, స్నేహంతోనూ మాత్రమే సాధ్యమౌతుందన్న అభిప్రాయాన్ని కనబరిచింది. అనురాగం స్నేహం. సంస్కారానికి సంబంధించిన మానవీయ విలువలు. దాంపత్య సంబంధాలకు  ప్రాతి పదిక కావలసినవి అవే. విమల కోరే దాంపత్య సంబంధాలు అవిధమైనవే. మొత్తం మీద భార్యా భర్తల సంబంధాలను నియంత్రించే సాంఘిక కట్టు బాట్లు, స్త్రీ పురుషులను సమానులుగా గుర్తిం చని సాంఘిక దౌష్ట్యం నశించనంత వరకు స్త్రీల జీవితం మెరుగవుతుందను కొనటానికి ఎక్కువ అస్కారం కనబడదు. సాంఘిక కట్టుబాట్ల మీద, అసమ సాంఘిక వ్యవస్థా దుర్మార్గ మీద స్వీయ చైతన్యంతో విమల చేసిన దాడి అంతా వ్యక్తి గతమైంది.

1975 లో స్వీట్ హోమ్ 2 కు కొత్త ముందుమాట వ్రాస్తూ రంగనాయకమ్మ ఎంతో చైతన్యవంతంగా కనబడే విమలా బుచ్చిబాబుల భార్యా భర్త సంబంధాలలోని లోపాలను కొన్నిటిని ప్రస్తావించింది. బయట పని చేసి సంపాదించి కుటుంబాన్ని పోషించే ధర్మం మగవాడిదిగా, ఇల్లు చూసే పని ఆడదానిదిగా వున్న సనాతన సామాజిక లక్షణమే వీళ్ళ సంబంధాలలోనూ ప్రతి ఫలించిందన్నది ఒకటి. విమల వంటింటి ఇల్లాలుగా మిగిలి పోవటం, బుచ్చిబాబు ఇంటి పనులలో భార్యతో పాలు పంచుకొనకపోవటం – మరొకటి. ఎంగిలి పళ్ళెం తీసేస్తున్న బుచ్చిబాబును “అదేంపని? నేను వచ్చి తీసేదాన్నిగా! అక్కడ పెట్టండి” అని వారించిన విమల (స్వీట్ హోమ్-1) ఇంటి పని ఆడవాళ్ళదేన్న భావం నుండి బయట పడలేదన్నది స్పష్టం. బుచ్చిబాబు ఆకలికి అగలేనివాడు, రుచులు కోరేవాడే కానీ వంట అసలే చేతకానివాడు. కాఫీ పెట్టలేడు. అన్నం వండలేడు. పెసరపప్పు రుబ్బి అట్లు వేయలేడు. తానే కాదు మొగవాళ్ళెవరికీ ఈ పనులు చాతకావని అతనికి తెలుసు. కానీ అవి నేర్చుకొనటానికి వంటింటి  పనులలో విమలకు సాయపడటానికి అతనెక్కడా చొరవ చూపడు. ఆ రకంగా వంటింటి పని ఆడవాళ్ళదేనన్న సంప్రదాయ భావన నుండి అతను కూడా బయటపడలేదు. ఈలోపాలను సవరిస్తూ రంగనాయకమ్మ స్వీట్ హోమ్ మూడవ భాగం వ్రాసింది.

3

స్వీట్ హోమ్ రెండవభాగం చివరలో విమల స్త్రీల సమస్యల గురించి శ్యామలరావుతో తీవ్రమైన చర్చల్లో మునిగి వున్నప్పుడు ఆకలేస్తోంది. ఏదన్నా చేద్దూ” అని బుచ్చిబాబు అడిగితే చేసుకోరాదూ?” అని ఎదురు ప్రశ్నవేసింది విమల. ఏంచేసుకోనూ అని అడిగితే పెసరపప్పు నాన బోశాను, రుబ్బి పెసరట్లు వేసుకోమంది. చాతవుతాయానాకు అన్న సందేహంతో ఆగి  పోయిన బుచ్చిబాబు వాదం ఎంతకూ తెగక ఆకలి ఎక్కువవవు తున్న సమయంలో “పప్పు నేనే రుబ్బు కుంటాను. అదే చాతనవు తుంది. ఎవ్వరిమీదా ఆధారపడకూడదు. నాకాళ్ళ మీద నేనే నిల బడతాను” అని లేచాడు. అప్పుడల్లా అన్న మాటను ఆచరణలో నిజం చేసి చూపిన బుచ్చి బాబును మూడవ భాగంలో చూస్తాం. ఈ బుచ్చిబాబు  పప్పు రుబ్బ గలడు. మజ్జిగ చేయ గలడు. వంట చేయగలడు. వంటిల్లు సర్దగలడు. పిల్లలకి అన్నాలు పెట్టగలడు. నీళ్లు పోయగలడు

ఈ భాగంలో విమల కూడా ఇంటి నాలుగు గోడలకు  పరిమితమైన పాత విమల కాదు. సమాజంతో సంబంధాలు ఏర్పరచుకొంటున్న విమల.  మహిళా సంఘాల మీటింగులకు వెళ్ళిపచ్చే విమల.  చదువు కొనసాగించి  ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని తహతహలాడే విమల. తాను మామూలు గృహిణి స్థాయిని దాటిన దాఖలాలు కనబడక విలవిల లాడిన విమల.  అతను సంపాదిస్తున్నాడు. నేను యిల్లు చూస్తున్నాను. ఇద్దరం ఎవరి బాధ్యతలు వాళ్ళు చేస్తున్నాం… డబ్బు సంపాదించకపోతే… అతని దయ మీద బానిసగా బ్రతుకుతున్నట్టేఅని తన స్థితి గురించి సంతృప్తి పడే స్థాయి నుండి ( రెండువ భాగం పు. : 99) ‘మొగుడి దగ్గర ఎంత చనువు వుంటే ఏమిటి? అతన్ని నువ్వుఅంటే ఏమిటి? ‘ఒరేఅంటే ఏమిటి? అంత మాత్రాన అతనితో తాను ఏం సమానం అయినట్టు? కుటుంబాన్ని పోషించేవాడు అతనే! పోషించే శక్తి అతని చేతిలో వుంది గానీ, తనకైతే లేదు కదా?’ అన్న ఆత్మజ్ఞానంలో పడ్డ విమల. అందుకే ఆమె చదువు కోవాలని ఏదైనా ఉద్యోగం  సంపాదించాలని గట్టిగానే అనుకొంటుంది. కానీ ఏ చదువు చదవాలో, ఏ ఉద్యోగం చేయాలో నిర్ణయానికి మాత్రం రాలేక పోతుంది. ఈ మూడవ  భాగంలో  ఆమె చేయదలచుకొన్న ఉద్యోగాలు, వాటిలోని సాధకబాధకాలు వీటిని గురించిన చర్చే ఎక్కువగా  వుంది. స్త్రీల పనులుగా సామాజిక రంగాలలో స్థిరపడి వున్న ఉద్యోగాలేమీ ఆమె ఇష్టపడదు. మగవాళ్ళనిగా చెప్పబడే ఉద్యోగరంగాలలోకి చొచ్చుకు పోవాలన్నది ఆమె కోరిక. రైలు డ్రైవర్, పోస్ట్ మెన్ ఇలాంటి ఉద్యోగాల గురించి ఊహిస్తుంది.

అయితే ప్రాధమికంగా విమలది కుటుంబ అవసరాలను సౌఖ్యాలను  గురించి ఆలోచించే స్వభావం స్వీట్ హోమ్ మొదటి రెండు భాగాలలోకి స్థిరపడిన స్వభావం ఇది. అందువల్ల ఆమె ఏ ఉద్యోగం గురించి ఆలోచించినా ఇంటికి రావటం గురించి, ఇంటి పనులకు ఇబ్బంది కలగకుండా తన  పని  చేసుకొనటం గురించి తప్పని సరిగా అనుకొంటుంది. ఇంటి పనులు  వంటపనులు చేయటంలో ‘ఈ పని ఎందుకుఅని ఎప్పుడూ విచారించుకోని  విమల, ఉద్యోగపు పనుల విషయంలో మాత్రం ప్రతి  పనికీ ఏదో వంక పెడుతూ విముఖతను వ్యక్తం చేస్తుంది. టైపిస్టుపని ఒకందుకు వద్దను కొంటే టీచరు పని మరొకందుకు వద్దను కొంటుంది. లాయర్  పని అసలే వద్దనుకొంటుంది. నవలలోని ఇలాంటి సంఘటనలను, సందర్భాలను పరిశీలించి చూస్తే విమలకు ఉద్యోగం చేయాలన్న సంకల్పం అసలుందా అన్న అనుమానం కలగక మానదు. ఇంటిపని, పిల్లల పని బుచ్చిబాబు  ఎంత పంచుకొంటున్నా అవి తనవేనన్న  భావన అంతరాంతరాలు వదిలిపోని స్థితిలో విమల ప్రవర్తన ఉద్యోగ విషయంలో ఊగిసలాట దశను దాటలేక పోయి వుంటుందనిపిస్తుంది.

అయితే ఈ భాగంలో విమల రచయితగా, సామాజిక సేవాభిలాషిగా కొత్త అవతారాలు  ఎత్తింది. విమలకు కథలు, వ్యాసాలు వ్రాసే అలవాటున్నట్లు స్వీట్ హోమ్ రెండవ భాగంలోనే కనబడుతుంది. మూడో భాగానికి వచ్చేసరికి తన జీవితానుభవాలను తానే వ్యాసాలు వ్రాసి ప్రచు రించే స్థితికి విమల వచ్చింది. అట్లాగే ఆమె మహిళా సంఘంలో పని చేస్తూ పేద పిల్లలకు విద్య నేర్పే  కార్యక్రమాన్ని తీసుకొంటుంది. ఆర్థికానికి ఆరోగ్యానికి, విద్యకు వుండే సంబంధం అర్ధమ వుతూ ఈ అనుభం నుండి ఆమె కొత్త జ్ఞానాన్ని పొందుతుంది. పుస్తకాలు చదువుతూ నగలు స్త్రీల కెంత బంధనాలో గ్రహించి వాటిని వదిలించు కొనటం, సైకి లెక్కి తిరుగుతూ తన పనులు తాను  సులువుగా చేసుకొనటం – ఇవి ఆమె జీవితంలో వచ్చిన కొత్త పరిణామాలు. బుచ్చిబాబు  విషయం లో కానీ మరెవరి విషయంలో కానీ తనకు ఎప్పుడేమి అనిపించినా మరుక్షణం ఎవరే మనుకొం టారో నన్న జంకు లేకుండా అనిపించింది అనిపించినట్లుగా చెప్పెయ్యటంలో ఈ విమల పాత విమలే.  మనుషులతోటి  సంబంధాలలో సహజ ప్రతిస్పందనలతో, మొహమాటాలు, లోకభీతి లేని స్వఛ్ఛత తో కూడిన విమల మాట తీరు ఆమెను  అందరికీ ప్రియమైనదిగానే చేస్తాయి

స్వీట్ హోమ్ మొదటి భాగంలో తన గురించి తాను ఆలోచించుకొని తన సంసారం సంగతి తాను చూసుకొనే విమల రెండవభాగంలో చెల్లెలు విశాల జీవితాన్ని గురించి పట్టించుకొని ఆలోచిస్తుంది. మూడవ భాగంలో జయ, రేఖ అన్నపూర్ణ, లక్ష్మి మొదలైన తోటి స్త్రీలతో స్నేహం చేసి వాళ్ళ జీవితాల గురించి పట్టించుకొని వాళ్ళ అనుభవాలతో  తన అనుభవ పరిధిని పెంచుకొంటుంది. అత్తయ్య జీవితానుభవాలను తెలసుకొంటూ స్త్రీల కున్న పరిమితులు అర్థం చేసుకొని ఆవేదన పడుతుంది. ఆ రకంగా ఈ భాగంలో విమల విస్తృత జీవిత పరిధిలోకి ప్రవేశించింది. అయినా స్వీట్ హోమ్ లోనే ఆమె బ్రతుకు వేళ్ళున్నాయి. పిల్లల పట్ల తల్లి దండ్రుల దృక్పధాన్ని, వృద్ధుల పట్ల, పెద్దల పట్ల కొడుకులు కూతుళ్ళు కనబరిచే వైఖరిని తీర్చిదిద్దుతూ, పిల్లల పెంపకం, ముద్దు ముచ్చట్లు, చదువు సంధ్యలు, పెద్దల ఆరోగ్యాలు, అవసరాలు అన్నింటిని జాగ్రత్తగా చూచుకొనే ప్రజాస్వామిక సంబంధాల వ్యవస్థగా కుటుంబాన్ని భావన చేసిన రంగనాయకమ్మ దానినల్లా నిలబెట్టటం, విమల బుచ్చిబాబు వంటి స్త్రీ పురుషుల వల్లనే సాధ్యమవుతుందని స్వీట్ హోమ్ నవల ద్వారా సూచించింది. 

స్వీట్ హోమ్ నవలలో మొదటి భాగంలో కంటే రెండవ భాగంలో దాని కంటే మూడవ భాగంలో స్త్రీపురుష సంబంధాల గురించి తదితర సామాజికాంశాల గురించి చర్చలు ఎక్కువ వుతూ వచ్చాయి. ప్రతి విషయాన్ని పాఠకుడికి అర్థం కాదేమోనని విడమరిచి చెప్పే పద్ధతి రచనలో కళా సౌష్టవాన్ని దెబ్బతీస్తుందని తెలిసి కూడా చదవటం తప్పితే ఆలోచించటం బద్ధకమైన వాళ్ళకోసం సర్వ సామాన్యంగా నిత్యమూ మన ఇళ్ళలో జరుగుతోన్న అనేక విషయాలు ఆలోచించి పెడదామనే కుతూహలంతో ఆ పొరపాటు చేశానని చదువుకున్న కమల నవలకు వ్రాసిన (1966 ముద్రణ ) మనవి మాటల్లో రంగనాయకమ్మ అంగీకరించింది. పాఠకుల ఆనందం కోసం, ఆలోచన కోసం…. అంతా ఈ పాఠకుల కోసమే రాశాను అని స్వీట్ హోమ్-2 కు వ్రాసిన ముందుమాటలో ( 1969 ఏప్రిల్ ముద్రణ) పేర్కొన్నది. ఈ రెండు సందర్భాలను, అభిప్రాయాలను కలుపు కొని చూస్తే రంగనాయ కమ్మ స్వీట్ హోమ్ నవలలో సిద్ధాంతచర్చలు ఎందుకంతగా వచ్చి చేరాయో సులభంగానే అర్ధం చేసుకొనవచ్చు. “పాఠకుల్ని లక్ష్య పెట్టడమే నాలక్ష్యం” ( స్వీట్ హోమ్-2) అన్న రంగనాయకమ్మ, భార్యాభర్తల  సంబంధాల నుండి ప్రారంభించి కుటుంబ సంబంధమైన అనేకానేక విషయాలను పిల్లల సమస్య, వృద్ధుల సమస్య, పనివాళ్ళ సమస్య, అవగాహనల సమస్య, మొదలైన వాటికి,  అట్లాగే సామాజిక రంగాల మంచి చెడు, నీతి అవినీతి, ఆర్థిక అసమానతలు, విద్యావైద్య న్యాయవ్యవస్థలు మొదలైన వాటికి సంబంధించిన – ఆలోచించగల చైతన్యం తన పాఠకులకు అందించాలన్న ఆకాంక్షతోటే ఇట్లా వ్రాసిందనుకోవాలి. ఈ జ్ఞాన విషయాలనన్నిటిని గుదిగుచ్చిన కథా సూత్రం విమల బుచ్చిబాబుల దాంపత్యం ఎట్లాగూ బలమైందే. విలువైందే. తనలోని బలాన్ని బలహీనతను సమంగా అంచనా వేసుకోగలిగిన విమల న్యాయదృష్టికి, విమల వాగ్ధాటికి, సంభాషణా చాతుర్యానికి ప్రేమనైనా, కోపాన్నయినా అతి సహజంగాను, సులువుగాను వ్యక్తీ కరించగల నేర్పరి తనానికి ముగ్ధులం కాకుండా వుండలేం. విమల మాటల్లోని వెక్కిరింత చక్కిలి గింతలు పెట్టటమే కాదు భారత స్త్రీ ధర్మాలను పతివ్రతా ధర్మాలను ఆ ధర్మాల గురించిన ఆధునికుల ఆలోచనలను నిలబెట్టి కడిగేస్తుంది. మధ్యతరగతి స్త్రీ పరిణామ చరిత్రను ఈ నవల మనకళ్ల ముందు అస్పష్టంగానైనా చూపించగలుగుతోంది.

వ్యక్తి సంస్కార చైతన్యాలతో కుటుంబంలోని అధికార సంబంధాలను స్నేహ సహజీవన సంబంధాలుగా మార్చుకోవచ్చునన్న ఆశను కలిగిస్తుంది ఈ నవల. అయితే విమలకు, బుచ్చిబాబుకు జీవితాన్ని అలా అందంగా జీవించటానికి అవకాశాలు ఎక్కడినుండి సమకూడాయి? అసలు ఒకరిపట్ల ఒకరికి ఇష్టం , గౌరవం ఎలా ఏర్పతాయి? ఎలా అభివృద్ధి చెందుతాయి? వాటిని అలాగే నిలుపుకొనటానికి ఉపకరించే శక్తి ఏమిటి? సంస్కారం , చైతన్యం వ్యక్తిగతమైనవేనా? ఆ దిశగా మనుషులను సుశిక్షితులను చేసే సామాజిక వాతావరణం , సంస్కృతి ఉన్నాయా? స్త్రీ పురుషులందరూ విమలలు , బుచ్చిబాబులు కావటానికి అవసరమైన జ్ఞానం ఏమిటి? ఆ జ్ఞానం లభించే మార్గం ఏమిటి? – ఈ మొదలైన ప్రశ్నలకు నవలెతివృత్తంలో సమాధానాలు కనబడవు. ఆ ప్రశ్నలకు ఒక సమాధానం లభించనంతవరకు విమల , బుచ్చిబాబు ఏర్పరచుకొన్న సహజీవన కౌటుంబిక సౌందర్యం ఒక ఆదర్శమే కానీ ఆచరణ వాస్తవం కాదు. 

    ( ఇంకా ఉంది)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.