మా నాయన బాలయ్య
-అనురాధ నాదెళ్ల
పుస్తకం అంటే మంచి మిత్రుడుగా చెబుతాం. ఒక పుస్తకం చదివినపుడు కొత్త ఎరుకని కలిగి, కొత్త లోకపు దారులలోకి ప్రయాణించటం పుస్తకాన్ని ప్రేమించేవారందరికీ అనుభవమే. ఈ పుస్తకం చెప్పే కబుర్లు సాధారణమైనవి కావు. సమాజపు అంచుల్లో జీవించిన, ఇంకా జీవిస్తున్న వారి కష్టసుఖాలు, మంచి చెడులు మన కళ్ల ముందుకు తెస్తుంది. సమాజపు పైస్థాయి జీవితానుభవాలు మాత్రమే తెలిసినవారికి ఈ రకమైన జీవితాల్లో ఉన్న వ్యథ, పోరాటం చెబుతుంది.
ఈ నేల మీద జీవిస్తూ, ఇక్కడి గాలినే పీల్చే మనుషుల్లో కొందరు మిగిలినవారి నుంచి ఎలా పరాయివారై బతుకుతున్నారో, మనుషులు ఒక్కటిగా కాకుండా కులాలుగా, మతాలుగా, జాతులుగా, అంటరానివారుగా, చదువుకునే అర్హత లేనివారిగా ఇలా ఇన్ని రకాలుగా ఎందుకు విడిపోయారో, అది జీవితాల మీద ఎలా ప్రభావం చూపుతుందో ఈ పుస్తకం మనకు చెబుతుంది. కొందరి అవిద్యకు, లేమికి కారణాలేమిటో, కారకులెవరో కూడా చెబుతుంది.
తెలంగాణాలో ఒక మారుమూల పల్లెలో పుట్టిన ఒక దళిత మాదిగ కుటుంబ చరిత్రను కంటిముందు దృశ్యమానం చేస్తుంది. భూస్వాములు చెలాయించే పెత్తనం, పీడన సహించలేక, ఆ బానిస జీవితాన్ని వదిలించుకుందుకు పల్లె వదిలి ఆత్మవిశ్వాసంతో విశాలమైన ప్రపంచంలోకి కట్టు బట్టలతో అడుగుపెట్టిన ఒక వ్యక్తి తన తరువాతి తరాలకు ఎలా మార్గ దర్శకత్వం చేసాడో చెబుతుంది. తరం తర్వాత తరం బానిసలుగా బ్రతికే అవస్థ నుంచి విముక్తి కోరుకుంటూ, భవిష్యత్తు తమకోసం ఏమి దాచి ఉంచిందో ఊహామాత్రంగా కూడా తెలియక పోయినా కొత్త దారులు వెదకబోవటం వెనుక వారనుభవించిన అమానవీయ అనుభవాలెన్నో! ఎలాటివో!
‘’మా నాయన బాలయ్య’’ రచయిత వై. బి. సత్యనారాయణ గారు. ఆయన రసాయన శాస్రంలో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. తన తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం శ్రమించిన తీరు కుటుంబంలోని రాబోయే తరాలవారికే కాకుండా దళితులందరికీ తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ పుస్తకం రాసినట్టు ముందుమాటలో చెప్పారు. దళితులతో పాటు దళితేతరులూ ఈ జీవితాల్ని తెలుసుకుంటే రేపటి సమాజానికి మంచి రోజుల్ని తీసుకువస్తారని ఆశిస్తున్నారు. ఇరవైయ్యో శతాబ్దపు మొదట్లో దళితులు అంటరానివారిగా ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు భవిష్యత్తులోనైనా మారుతాయన్న ఆశతో తమ కుటుంబ చరిత్రను చెప్పాలనుకున్నానని తెలిపారు.
భారత రాజ్యాంగం దళితులకు ఇచ్చిన రిజర్వేషన్లు, అవి అమలు పరిచే చట్టాలూ కూడా చాలా దళిత కుటుంబాల జీవితాలలో మార్పు తేలేక పోతున్నాయని ఆయన చెబుతారు. ఇప్పుడిప్పుడు చదువుకునే అవకాశాలను అందిపుచ్చుకున్నవారు కూడా తమ మూలాలను తెల్సుకోవాలనుకోవటంలేదు. క్రమంగా ఇప్పటి దళిత జీవితాల్లో వస్తున్నఅభివృధ్ధికి కారణమైన ముందుతరంలోని వారి త్యాగాలు, కష్టాలు, వారి పట్టుదల గురించి చెప్పి తీరవలసిన అవసరం ఉందని రచయిత అభిప్రాయపడ్డారు. ఈ రచనను వారు ఇంగ్లీషులో రాయటానికి కారణం ఆ భాషను మార్పుకు, ప్రగతికి సంకేతంగా భావించటమే.
ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో హార్పర్ కాలిన్స్ వారు ప్రచురించగా, తెలుగు అనువాదాన్ని హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. అనువాదకులు పి. సత్యవతిగారు.
ఈ పుస్తకాన్ని తెలుగు చెయ్యటానికి ప్రధానంగా రెండు కారణాలను హెచ్.బి.టి. వారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంగ్లీషులో వచ్చిన మొట్టమొదటి దళిత ఆత్మకథాత్మక జీవిత చరిత్రగా ఈ పుస్తకానికి సముచితమైన స్థానం కల్పించటం ఒకటైతే, తెలంగాణా నుంచి వచ్చిన మాదిగ, దళిత అనుభవాలు, కులానికి సంబంధించిన ఎన్నో అంశాలను డాక్యుమెంట్ చేసిన రచనను తెలుగువారికి అందుబాటులోకి తేవాలని భావించటం మరొక కారణం.
ఈ కథలో బాలయ్య నాయకుడు. అతను నిజాయితీగా కష్టపడటం ఒక్కటే తెలుసున్న వ్యక్తి. తమ జాతి అంటరానివాళ్ళుగా అవమానాలను, అవహేళన లను భరించటాన్ని నిరసిస్తూ, పై అధికారుల దగ్గర కూడా తన గొంతును వినిపించే ధైర్యం ఉన్నవాడు. చిన్ననాడే తల్లిని కోల్పోయి, తండ్రితో పాటు తండ్రి మేనమామల ఊరు చేరతాడు.
సవతి తల్లి పెట్టే బాధలను మౌనంగా భరిస్తూ పదహారేళ్ల వయసులోనే బాలయ్య కూడా రైల్వేలో చేరతాడు. చిన్నప్పటినుంచీ చదువుకోవాలన్న ఆశ ఉన్నా తాము అంటరానివాళ్ళవటంతో చదువుకునే అర్హత లేదన్న తండ్రి మాటలతో నిరాశ చెందుతాడు. కానీ చదువు పట్ల అతని శ్రధ్ధ చూసి పొరుగున ఉన్న ఒక ముస్లిం గురువు చదవటం, రాయటం నేర్పుతాడు. అదిగో ఆ గురువు నాటిన చదువు విత్తును ఆ కుటుంబం ఎంత పచ్చని వృక్షంగా మార్చిందో ఈ కథ చెబుతుంది.
ఈ కథలో పాత్రలన్నీ ఒట్ఠి పాత్రలు కాక మన మధ్య తిరిగిన, తిరుగుతున్న వ్యక్తులే అవటం మనలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఈ పుస్తకంలోని వ్యక్తులు, సంఘటనలు కేవలం కల్పన కాదన్నది ఒక అపురూపమైన వాస్తవం.
ముందుమాటలో శ్రీ ఎస్. ఆర్. శంకరన్ పుస్తకంలోని సంగతులను వివరంగా చెప్పారు. భారతదేశం బ్రిటీష్ వారి పాలనలో ఉన్నప్పుడు రైల్వేశాఖలో, గనులలోనూ, ఓడరేవుల్లోనూ, సైన్యంలోనూ కొత్త ఉద్యోగాలను సృష్టించటం అస్పృశ్యులకు కొత్త అవకాశాలను కల్పించింది. వాటిలో ఉండే ప్రమాదాలు, కష్టాలు అగ్రవర్ణులకు నచ్చకపోవటంతో క్రింది కులాల వారికి అవి వరాలయ్యాయి. భూస్వామ్య అణచివేతల నుండి విముక్తిని కలిగించాయి. గ్రామాల నుండి పట్టణాలవైపు దారితీసేలా చేసాయి.
పుస్తకంలో అప్పటి గ్రామాల నిర్మాణం గురించి చదువుతుంటే వేదన కలుగుతుంది. సాధారణంగా గాలి పశ్చిమం నుంచీ తూర్పుకు వీస్తుంది. కనుక పశ్చిమంలో బ్రాహ్మణుల ఇళ్ళు ఉంటాయి. తూర్పున అస్పృశ్యుల ఇళ్లు ఉంటాయి. అంటే అస్పృశ్యుల ఇళ్ల మీదనుంచీ గాలి అగ్రవర్ణాల వారిని తాకకుండా ఇలాటి నిర్మాణాలుండేవి.
ఇక్కడొక విషయం జ్ఞాపకమొస్తోంది. 2012లో తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో ఒక కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లినప్పుడు ఆయన తన గ్రామమంతా తిప్పి చూపుతూ ఇప్పటికీ తమ గ్రామంలో ఇళ్ల నిర్మాణాలు మనువు నిర్దేశించినట్టే ఉన్నాయని చెప్పారు. నిజంగా ఇది ఆశ్చర్యాన్ని, అంతకు మించిన బాధను కలిగించింది. ఇంకానా? ఇంకెన్నాళ్లీ వివక్ష? గ్రామం ఊరుగానూ, వాడగానూ అగ్రవర్ణాల వారికీ, దళితులకీ మధ్య చీలి ఉండటం ఇప్పటికీ చూస్తున్నామంటే ఈ ఆధునిక శతాబ్దానికి మనం సాధించినదేమైనా ఉందా అనిపిస్తుంది. మనుషుల మధ్య ఇన్ని రకాల చీలికల్ని సృష్టించుకుని ఎలాటి ప్రగతి దారుల్లోకి నడవగలం?
రచయిత ముత్తాత నర్సయ్య తన పల్లె మీదుగా వెళ్తున్న నిజాం ప్రభువుకు దూడ చర్మంతో చేసిన అతి నాజూకైన చెప్పుల జతను బహుమతిగా ఇవ్వటంతో నిజాం ప్రభువు ఆయనకు 50 ఎకరాల భూమిని ఈనాముగా ఇస్తాడు. కానీ దొర దానిని స్వాధీనం చేసుకుని కేవలం రెండెకరాల పొలాన్నిమాత్రం నర్సయ్యకు ఇస్తాడు. దానికే నర్సయ్య సంతోషిస్తాడు. ఆ తర్వాత తరంలో దొర కొడుకు దానిని కూడా స్వాధీనం చెయ్యమన్నప్పుడు నర్సయ్య కొడుకు చిన్న నర్సయ్య వ్యతిరేకిస్తాడు. తల్లిదండ్రుల్నీ, భార్యనీ పోగొట్టుకున్న చిన్న నర్సయ్య గ్రామంలో తనను, తన కొడుకును ఆదరించే వారెవరూ లేక దుఃఖంతో, పసివాడిని తీసుకుని తన భూమిని, పల్లెనీ వదిలి మేనమామల ఊరు చేరతాడు. అక్కడ రైల్వేలో చిరు ఉద్యోగాలు చేస్తున్న మేనమామల సహాయంతో తానూ రైల్వేలో చేరతాడు. కుల ప్రాతిపదికన, అవిద్య వలన చిన్న ఉద్యోగాలకు మాత్రమే వారు అర్హులు.
పల్లెలలో అంటరానివారుగా ఊరు బయట నివాసాల్లో ఉండే వీరు రైల్వే ఉద్యోగులుగా మిగిలిన శూద్ర వర్ణాల మధ్య రైల్వే క్వార్టర్స్ లో ఉండటం మొదలుపెట్టాక ఒక కొత్త జీవితం వారికి పరిచయం అయింది.
భార్యను కోల్పోయిన చిన్న నర్సయ్య రెండో వివాహం చేసుకుంటాడు. కొడుకు రామస్వామికి చదువు పట్ల ఆశ, ఆసక్తి ఉన్నా అవకాశం లేదని బాధ పడతాడు. నర్సయ్య వలస రావటంతో ఆ కుటుంబం ఏవిధంగా ఉన్నత జీవన లక్ష్యాల వైపుకు అడుగులు వెయ్యగలిగిందో పుస్తకమంతా విపులంగా ఉంది.
రామస్వామి చురుకైనవాడు. పదహారేళ్ల వయసులోనే అతను కూడా రైల్వేలో చేరతాడు. అప్పటి నుంచీ అతని ప్రపంచం కేవలం రైల్వేలే. తనపై ఆఫీసర్లను చూసి తన పిల్లలు బాగా చదువుకుని వారిలాగా రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని గాఢంగా కోరుకుంటాడు. దానికోసం తను, తన భార్య కూడా అనేక శ్రమలకు ఓర్చి పట్టుదలగా పిల్లలను చదివిస్తారు. ఆ దీక్షకు అడ్డు తగిలిన సామాజిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్న తీరు, ఎలాటి ఒడిదుడుకుల్లో కూడా చదువును కొనసాగించిన వైనం అబ్బురమనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆశయం, కష్టం అర్థం చేసుకున్న పిల్లలు ఆ ఆశయాన్ని సాధించటం అద్భుతంగా తోస్తుంది. వారి పట్టుదల, క్రమశిక్షణ ఆదర్శప్రాయమని చెప్పచ్చు.
రామస్వామి తన ఉద్యోగంలో నైపుణ్యాన్ని సాధిస్తాడు. నర్సమ్మతో పెళ్లి అవుతుంది. స్నేహితులతో కలిసి మద్యానికి అలవాటు పడతాడు. రైల్వే వ్యాగన్ లోని మద్యం సీసా దొంగతనం కేసులో ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. తండ్రి నర్సయ్య అధికారులతో మాట్లాడి ఉద్యోగం వేయించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో పేరు మార్చుకోవలసిన అవసరం ఉందని అధికారి సలహా ఇస్తాడు. పాత చరిత్ర వదిలి, రామస్వామికి బాలయ్య అన్న పేరుతో మరొకసారి రైల్వేలో ఉద్యోగం ఇస్తారు.
1946-47 సంవత్సరాల్లో రజాకార్ల దౌర్జన్యకాండ సమయంలో నర్సమ్మ నిండు చూలాలు. పిల్లలతో పాటు బయల్దేరి పొలాలకు అడ్డం పడి రజాకార్ల నుంచి తప్పించుకుని ఒక చేనులో తల దాచుకున్న సందర్భం చదువుతుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో బాలయ్య స్నేహితుని చెల్లెలు లక్ష్మమ్మతో సంబంధం పెట్టుకుంటాడు. ఆమెను వారి కుల పధ్ధతిలో వివాహం చేసుకుంటాడు. భార్య అనుమతితో ఆమెను కూడా తన ఇంటికి తీసుకువస్తాడు. నర్సమ్మ సహనం వలన ఇంట్లో ఎలాటి గొడవలూ లేకుండా అందరూ సర్దుకుంటారు. అప్పట్లో పురుషునికి ఇద్దరు భార్యలు ఉండటం విచిత్రమేమీ కాదని రచయిత చెబుతారు.
క్రమంగా ఆర్థిక ఇబ్బందులతో భార్యలిద్దరితోనూ బాలయ్యకు తగాదాలు అవుతుంటాయి. ఈ తగాదాల్లో లక్ష్మమ్మ ఇల్లుని, కొడుకునీ విడిచి వెళ్లిపోతుంది. నర్సమ్మ తన పిల్లలతో పాటు లక్ష్మమ్మ కొడుకుని కూడా సమంగా ఆదరిస్తుంది.
బాలయ్య మొదటి కొడుకు బాలరాజును చదివించే స్థోమత లేక చిన్న వయసులోనే రైల్వేలో ఉద్యోగంలో చేరుస్తాడు. అతని సాయంతో మిగిలిన పిల్లల్ని బడిలో చేరుస్తాడు. బడికి పంపటంతో తన బాధ్యత తీరిందనుకోలేదు. ప్రతిరోజూ సాయంకాలం డ్యూటి నుంచి వచ్చి, పిల్లల చదువుల గురించి వివరాలు అడిగి సంతృప్తి చెందుతుంటాడు. పిల్లలంతా చదువుల్లో చురుకుగా ఉంటారు. ఎనిమిది మంది పిల్లలతో ఉమ్మడి కుటుంబాన్ని ఒక్క తాటిమీద నడపటం గొప్పగా అనిపిస్తుంది.
సికిందరాబాద్ రైల్వే స్కూల్లో చదువుకునే అవకాశం రెండో కొడుకు అబ్బసాయిలుకు మాత్రమే దక్కింది. రచయిత సత్యనారాయణతో పాటు వారి ఇద్దరు అన్నలు చదువుకునే బడిలో క్లాసులో మిగిలిన పిల్లలకి దూరంగా కూర్చోవలసి వచ్చేది. మిగిలిన పిల్లలు వీరిని ముట్టుకునేవారు కాదు, ఆడుకునేవారు కాదు. ప్రతి చిన్న తప్పుకూ బ్రాహ్మణ ఉపాధ్యాయుడు ఈ పిల్లలను నిర్దయగా కొట్టేవాడు. తన పిల్లలపై అమలౌతున్న ఆంక్షలు, అవమానాలు, వర్ణవివక్ష బాలయ్యలో తన పిల్లల్ని చదివించాలన్న నిర్ణయాన్ని సడలించక మరింత పట్టుదలను పెంచాయి. ఈ దయనీయమైన స్థితినుంచి బయటపడేందుకు చదువొక్కటే మార్గమని బాలయ్యకు మరింత స్పష్టమైంది.
రచయితకు జీవితమంతా దగ్గరైన స్నేహితులు బ్రాహ్మణ కుటుంబాలలోని వారేనని చెబుతూ తన చిన్నప్పుడు ఒక బ్రాహ్మణ స్నేహితుని ఇంట జరిగిన సంఘటన చెబుతారు. ఆ ఇంట్లో ఉన్న వంటాయన ఆ ఇంటి పిల్లవాడితో సత్యనారాయణని ముట్టుకుంటే మైల పడతావని హెచ్చరించటం విని, ముట్టుకుంటే మైల ఎలా అవుతుందన్నది అర్థంకాక ఇంటికి వచ్చేస్తాడు.
ఆ తర్వాత కాలంలో ఉద్యోగ నిమిత్తం కర్నకోట గ్రామం వెళ్లినప్పుడు కూడా తన కులం దాచిపెట్టి అద్దె ఇంటిని వెతుక్కుంటాడు. అంచెలంచెలుగా ఎదిగి ఎవరికివారుగా ఉద్యోగస్థులయ్యాక విడిపడి జీవించినా ప్రతి దసరా పండుగకూ పెద్దవాడైన బాలరాజు తన తమ్ముళ్ల కుటుంబాలని ఆహ్వానించి అందరితో కలిసి పండుగ చేసుకునే సంప్రదాయాన్ని మాత్రం పాటిస్తూనే ఉన్నాడు. బాలయ్య పిల్లలంతా సంవత్సరంలో వచ్చే ఈ పండుగ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారని రచయిత చెబుతారు.
బాలరాజు రైల్వేలో చిన్న ఉద్యోగస్థుడైనా తన కంటూ పెద్ద కుటుంబం ఉన్నా, తమ్ముళ్ల చదువు, పెళ్లిళ్లకు తండ్రితో పాటు బాధ్యతను తీసుకున్నాడు. అబ్బసాయిలు బాలరాజు కంటే పెద్ద స్థాయి ఉద్యోగస్థుడైనప్పటికీ బాలరాజే అతనికి సాదర ఖర్చుకి డబ్బు ఇచ్చేవాడన్నది చదువుతుంటే ఆ ఇంట పుట్టిన పిల్లలకు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు, వారి సంస్కారం చూస్తే ముచ్చటేస్తుంది. బాధ్యతలను గ్రహించుకుని తమ కున్న పరిమిత వనరులతో జీవితాల్లో పైస్థాయికి చేరిన ఈ కుటుంబ గాథ సమాజమంతటికీ కూడా ఆదర్శప్రాయమే.
అబ్బసాయిలు రైల్వేలో ఆఫీసరు స్థాయి ఉద్యోగస్థుడైనప్పటికీ అంతటితో తృప్తి పడలేదు. తమ్ముళ్లు ఉన్నత చదువులు చదువుకోవటం చూసి, తానూ యూనివర్సిటీ చదువు మొదలుపెట్టి డాక్టరేట్ చేసి ప్రొఫెసర్ గా కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. రచయితతో పాటు ఆయన సోదరులు మరి ఇద్దరు డాక్టరేట్ చేసి వారి తండ్రి కన్న కలల్ని వందశాతం వాస్తవం చేసారు. ఈ కథ చదువుతున్నంతసేపూ ఒక కొత్తలోకంలో ఉన్నాను. ఇది ముగిసిపోతుందేమో అన్న భయంతో పుస్తకాన్ని కొద్దికొద్దిగా చదువుతూ వచ్చాను.
ఈ పుస్తకాన్ని రాయాలన్న ఆలోచన చేసిన రచయితకు పాఠకులు, సమాజం కూడా ఋణపడి ఉంటారు. రచయిత రైల్వేల గురించిన ఎన్నో విషయాలను, వివరాలను ఇచ్చారు. రైల్వేలు ఆరంభమైనప్పటి పరిస్థితులు, ఇప్పడు సాంకేతికంగా వచ్చిన మార్పులు అన్నీ కళ్లకు కట్టినట్టే రాసారు.
పుస్తకం 2013 సంవత్సరంలో మొదటి ముద్రన పొందితే నేను మాత్రం ఇప్పుడు ఇంత ఆలస్యంగా చదివినందుకు నిజంగా విచారిస్తున్నాను. 2015 సంవత్స్రంలో రెండవ ముద్రణ కూడా పొందిన ఈ పుస్తకం చదువరిలో ఒక చైతన్యాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. రచయితకు, అనువాదకులకు, ప్రచురణకర్తలకు అభినందనలు.
****
నా పేరు నాదెళ్ల అనూరాధ, నా గురించి చెప్పాలంటే పుస్తకాలు, పిల్లలు, సంగీతం ఇష్టమైన విషయాలు. పిల్లల మీద ఉన్న ఇష్టం నన్ను ఎమ్మే,బియెడ్ చేయించి టీచర్ని చేసింది. గత ఏడు సంవత్సరాలుగా విజయవాడలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకపడిన పిల్లలకోసం సాయంకాలం పాఠాలు చెబుతున్నాను. ఈ ప్రయాణం ఎన్నో పాఠాల్ని నేర్పుతోంది. నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది.
మీ సమీక్ష చాలా బాగుంది.
సత్య నారాయణ గారు మా కలాశాల ప్రిన్సిపల్(Dhàrmavanth Degree college,Yakutpura,Old city, Hyderabad) గా 22 సంవత్సరాలు పని చేసి రిటైర్ అయ్యారు.
నాకు మంచి స్నేహితుడు.
హక్కుల సంఘం భాద్యుడుగా నేను అను దినం చూసే ,సమాజం లోని వివక్ష, ప్రజల హక్కుల లేమి అంశాలను ఎప్పుడు పంచుకునే వాడిని.
నేను అదే కాలేజీ లో ఇంగ్లీష్ ఉప న్యాస కుడిగా పని చేసి రిటైర్ అయ్యాను.
*s.జీవన్ కుమార్
మానవ హక్కుల వేదిక
ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు
థాంక్యూ జీవన్ కుమార్ గారూ. సమీక్ష చదివి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు సంతోషమండీ.
”మా నాయన బాలయ్య” ఒక అరుదైన, అద్భుతమైన పుస్తకం.
Realized how informative the novel would be after reading the review. Very detailed review, and it is almost like a mirror to the original…
Thank you Seshu.