విజయవాటిక-3
చారిత్రాత్మక నవల
– సంధ్య యల్లాప్రగడ
మల్లికావల్లికి మల్లికాకుసుమాలంటే అమిత ప్రీతి. ఆమె అమరావతిలో, అమరేశ్వరుని ఆలయములో, దేవుని సేవకై ఉన్న దేవదాసి నాగవల్లి కూమార్తె. కళావంతుల పిల్ల, నాట్యమయూరి. సాహిత్యంలో సంగీతంలో అందె వేసిన చేయి. ఆమె తన సాహిత్యం, సంగీతం, నృత్యం, సర్వం అమరేశ్వరునికే అంకితమివ్వాలని ఉవిళ్ళూరుతున్నది. ఒకనాటి బ్రహ్మోత్సావాలలో ఆమెకు శ్రీకరునితో పరిచయం కలిగింది. పదహారేళ్ళ ఆ జవ్వని శ్రీకరుని హృదయాన్ని గిలిగింతలు పెట్టింది. ఆమె శ్రీకరుని చూచి ఆశ్చర్యపోయింది. ఆనాటి గొడవలలో శ్రీకరుడు చూపిన శౌర్యం ఆమెను ఎంతో మురిపించింది. దేవసేవకు అంకితమవ్వాలన్న ఆలోచన మానుకుంది. ఆనాటి నుంచి వారి స్నేహం మొదలయింది. మల్లికావల్లికీ శ్రీకరుడంటే అమిత ప్రేమ కలిగింది.
కృష్ణానది ఒడ్డున కూర్చుని మల్లిక పాదాలకు లత్తుక అద్దుతూ “మల్లికా నే వచ్చే వరకూ ఈ లత్తుక ఉంటుందా?” అన్నాడు శ్రీకరుడు. గలగలమంటూ నవ్వింది మల్లిక
“వీరుడా! ఆ బాధ్యత నాది. నీవు వచ్చే వరకూ ఈ లత్తుకను పదిలపర్చుకుంటా కాని నీవు శ్రీపర్వతస్వామి సేవలో పడి నన్ను మరువకు సుమా! త్వరగా వచ్చేసేయి!” అన్నది.
“పనులు పూర్తయిన వెంటనే నీ ముందుంటాడీ సేవకుడు…” అన్నాడు శ్రీకరుడు నాటకీయంగా.
“ఎవరికి ఎవరు సేవకులు…” మువ్వల గలగలల వలె నవ్వుల గలగలలు విసురుతూ అడిగింది మల్లిక.
“ఇంకెవ్వరు? ఈ దీనుడు ఆ మల్లెల నవ్వుల అందాలకు దాసుడు… ఆ అందాల అధికారి ఈ సుందరికి సేవకుడు…”
“అలాగే! అయితే, ఓయి సేవకా! నేటి నుంచి నీవు నా కనుసన్నల నుంచి కదలటానికి వీలులేదోయి!”
“అలాగే సుందరీ!” అంటూ శ్రీకరుడు మల్లికను అమాంతం లేవనెత్తి గుర్రం మీదికెక్కించాడు. అటుపై తాను ఛెంగున ఎగిరి ఎక్కి, ఆమెను ఆమె భవనము వద్ద దింపాడు. తీయని వీడుకోలుతో ఆ ప్రేమజంట విడిపోయారు.
‘ఎలా ఉన్నదో మల్లిక. ఆ పుష్పాలతో ఆమెకు అభిషేకం చేసినా, ఆమె సొగసు వీటికొచ్చునా?’ అనుకున్నాడు.
ఆ సాయంత్రం వేళ అమరావతి చేరుకున్నాడు శ్రీకరుడు. పువ్వుల సువాసన ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తన భవనానికి వెళ్ళి స్నానమాచరించి అమరేశ్వర సన్నిధికి చేరుకున్నాడు, బుట్ట పువ్వులు సమర్పించటానకి.
****
కృష్ణవేణమ్మ గలగలా ప్రవహిస్తోంది. పశ్చిమానికి భానుడు దిగుతున్నాడు. ఆకాశం నారింజ రంగు చీరను చుట్టుకున్నట్లుగా ఉంది. ఆ చీరకు అంచుగా ఉదా,నీలాలు పులుముకున్నట్లుగా ఉంది. రంగులతో కూడి వింత అందాలతో మెరుస్తున్నదాకాశం. పరమాత్మ గొప్ప కళాకారుడు.
అమరావతి నగరము కృష్ణానది ఒడ్డున వెలసిన మహానగరం. పూర్వపు రాజధాని అయినా ఆ నగరం ఖ్యాతి, ప్రఖ్యాతి తగ్గలేదు. యంత్రాంగం సగం ఇక్కడ, సగం విజయవాటికలో ఉంటుంది. అమరావతికి రాజప్రతినిధిలా మహదేవవర్మ ఉన్నాడు.
కృష్ణానది దక్షిణాపథంలో ముఖ్యమైననది. ఎన్నో చరిత్రలను తనలో దాచుకున్న నదిని ఆ పరివాహక ప్రజలు భక్తితో కొలుస్తారు. అమరావతి నగరంలో అమరలింగేశ్వరుడికి ప్రతిదినం మహారుద్ర సేవ జరిగేది కృష్ణమ్మ జలంతోనే కదా!
ఆ నది ఒడ్డున ఉన్న సోపాన శ్రేణి వద్ద కూర్చొని ఉన్నది మల్లికావల్లి. ఆమె ఆకుపచ్చని చీర కట్టింది, ఆకాశనీలపు రంగు రవిక తొడిగింది. నల్లని కురులు దువ్విన బారైన జడ…కృష్ణవేణి నదికి పోటీలా ఉన్నది. అరవిందాల వంటి కన్నులకు దిద్దిన కాటుక మెరుస్తుస్తోంది. నడుముకు మువ్వల వడ్డాణం, మెడలో పచ్చలహారాల వరుసలు…చేతులకు కంకణాలతో సౌందర్యం రాశిపోసినట్లుగా ఉన్న ఆమె నదీ విహారానికి వచ్చిన వనదేవతలా మెరిసిపోతోంది.
ఆమెను చూడగానే ఆమె చుట్టూ వెలుగులు, ఆ కళ్ళలో కాంతులు కనపడుతాయి. అందానికి నిర్వచనంలా ఉన్న కౌమారి మల్లికావల్లి. ఆమె నవ్వులకు ముత్యాలు జలజలలు కురుస్తాయి. ఆమె చూపులలో నీలోత్పలాల మెరుపులుంటాయి.
ఆమె చుట్టూ ఆమె చెలులు నలుగురు కూర్చున్నారు. వారు దాదాపు ఆమె వయసువారే. వారంతా కలసి అప్పటి వరకూ జలవిహారం చేసి వచ్చారు. ఒడ్డున ఉన్న సోపాన పంక్తి చేరి కబుర్లు మొదలుపెట్టారు.
“చీకట్లు పెరగకముందే మనము బయలుదేరుదామా చెలీ! నీ ప్రియుడు నగరములోకి వచ్చి ఉంటే, ఈ పాటికి వచ్చేవాడేగా!” పరాచకాలాడుతూ అందో భామ. మల్లిక తన ప్రియుని కొరకు ఎదురుచూస్తున్నదని ఆట పట్టిస్తున్నారు వారంతా.
“మనము తిరిగి వెళ్ళటము ఆలస్యమయితే మీ అమ్మగారు ఆందోళనపడుతారు…” హెచ్చరికగా అంది మరో భామిని.
“అబ్బా! ఉండండే. మీరూ, మీగోల. చీకటంటే భయమేమిటి? మనము శ్రీ.శ్రీ. మాధవవర్మ మహారాజుల రాజ్యంలో ఉన్నాము. పైపెచ్చు మహాదేవవర్మ ప్రభువుల మిత్రులైన శ్రీకరవర్మ ప్రియ చెలులము. మనకే భయమైతే ఎలాగే? ఈ వాతావరణం ప్రియుని కౌగిలిని గుర్తుచేస్తోంది. నాకు రావాలనిలేదు…” ముద్దుగా విసుక్కున్నది మల్లిక.
“అమ్మా! మీరు ఇలా విరత్కంఠినిలా ఉంటే రమ్మన్నారారు. కొద్దిగా ఓపిక పట్టండి. మీ ప్రియ మనోహరుడు వచ్చే వరకు. వారు రేపో మాపో రాకపోరు…మీరు మమ్మల్ని మరచి వారితో నౌకావిహారానికి వెడతారు … అంత వరకూ ఈ విరహం దాచండి. ఈ రోజుకు మాత్రం మాతో రండమ్మా!” బ్రతిమిలాడారు వారు.
“ఇంకొంత సేపు…కాస్త ఏకాంతం…” అన్నది బ్రతిమిలాడుతూ మల్లిక.
శరత్కాల వెన్నెలలు ఆకాశంలో పరుచుకోవటం మొదలయింది.
ఆమెతో అచ్చికబుచ్చికలాడుతున్న మిత్రురాండ్లు కూడా చంద్రోదయం అయ్యే సరికే, అన్నీ మరిచి ఆ అష్టమి నాటి చంద్రుని చూస్తూ మైమరచిపోతున్నారు.
అందమైన ఆ ఆడపిల్లలు నీలవేణిలా ప్రవహించే కృష్ణా తరంగిణీ సౌందర్యం చూస్తూ సమయం మరిచిపోయారు.
‘ఈ రోజుకు రావాలి తనప్రియ ‘కారుడు’… ఎందుకు ఇంకా రాలేదు?’ అని మనస్సులో అనుకుంటూ ఆ వెన్నెల జలతారులకు విరహము అధికమై తనను తాను మైమరిచిపోతున్నది మల్లిక.
అందరూ వచ్చే పౌర్ణమి నాటి నౌకాయాన్నాని గురించి మాట్లడటం మొదలుపెట్టారు.
మల్లిక లేచి నెమ్మదిగా సోపానం దిగి నది ఒడ్డుకు వచ్చింది.
చల్లిని ఆ నీరు చేతులతో తాకితే శరీరం జల్లుమన్నదామెకు.
మనసులో నవ్వు వచ్చింది. ‘చలికి శత్రువు ప్రియుని వెచ్చని కౌగిలి, అది లేదని తెలిసి ఈ చలి పెరిగింది నాకు’ అనుకుంది మురిపెంగా.
నదిలో పాదాలు పెట్టుకుని ఆ గట్టు మీద కూర్చుంది. ఆమె పాదాల లత్తుక నవ్వినట్లుగా అనిపించింది. ఆ లత్తుక శ్రీకరుడు వెళ్ళే రోజున అద్దాడు. ఆమె దానిని చెరిగిపోనీకుండా తిరిగి తిరిగి దిద్దుకున్నది.
ఆమె హృదయంలో శ్రీకరుని పైన ప్రేమ కృష్ణాతటికి పోటీ పడుతోంది.
శ్రీకరుడు ఆమెను కలసినది మొదలు ఆమె అతనిని ప్రేమించింది. అందగాడు, శూరుడు, స్త్రీ మనస్సు ఎరిగినవాడు, రాజప్రముఖుడు, పైపెచ్చు ఆమెను కోరి వరించినవాడతను.
శ్రీకరుని వివాహమాడి సంసారనౌక సాగించాలని ఉన్నా, అది తీరని కోరికయని భయంతో ఆమె ఆ కోరికను బలవంతంగా అణిచివేసింది. కాని శ్రీకరుడు కూడా ఆమె అంటే ఎంతో మరులుకొనిఉన్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలనే అతని సంకల్పం కూడా.
శ్రీకరుడు చిన్నతనంలో తల్లితండ్రులను కోల్పొయాడు. మహారాజు మాధవవర్మ కుమారునితో సమానంగా రాజప్రసాదంలో పెరిగాడు శ్రీకరుడు. అందుకే మహారాజు అనుమతి లేనిదే శ్రీకరుడు గాలి కూడా పీల్చడని మిత్రులు హాస్యమాడుతారు. మరి మహారాజుగారు ఒప్పుకుంటారా? ఒక దేవదాసి పుత్రికను వివాహమాడటానికి? అన్నది ఆమె మనస్సులో సుడులు తిరుగుతూనే ఉంటుంది.
శ్రీకరుడు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాడు ఈ విషయంలో.
‘ఆ అమరలింగేశ్వరుని అనుగ్రహమెటులున్నదో…’ అనుకుంది మల్లిక చిన్నగా నిట్టూర్పులనిడుస్తూ..
చంద్రుడు పైపైకి వచ్చేస్తున్నాడు.
‘పొద్దుపొయింది. అమ్మ కంగారుగా ఉండి ఉంటుంది…’ అనుకుంటూ లేవబోతుండగా ఆమెకు ఏవో మాటలు వినిపించాయి.
లేవబోతున్న మల్లిక కూర్చుండిపోయింది.
ఇద్దరు పురుషులు అక్కడికి దగ్గరగా ఉన్న రెల్లుగడ్డి మాటున మాట్లాడుకుంటున్నారు.
అప్రయత్నంగా ఆమె ఆ మాటలను ఆలకించింది.
“ప్రమాదం లేదుగా..మనలను ఎవరు గమనించకూడదు…” అన్నదొక పురుష కంఠం.
“అసలు తెలియదు… నీకెందుకు? చెప్పినట్లు చేయి! ఇది గాలి నుంచి నెమ్మది నెమ్మదిగా రక్తంలో కలిసి పనిచేస్తుంది. వెంటనే తెలియదు. నెలలు పడుతుంది. కాబట్టి ప్రమాదంలేదు. నన్ను నమ్ము…” అన్నది రెండవ పురుష కంఠం.
“సరే అయితే జాగ్రత్త! రాజధానిలో రక్షణ పెరిగిందని విన్నాను. అందరూ అప్రమత్తులుగా ఉంటున్నారు…” మొదటి కంఠం.
“నీవు వెళ్ళు. మళ్ళీ నెల వరకు నాకు కనపడకు…” అన్నది రెండవ కంఠం.
చిన్న చప్పుడుతో నీళ్ళలో ఎదో తొట్టి వెళ్ళిన చప్పుడు, రెండో వ్యక్తి అడుగుల చప్పుడు దూరమయ్యాయి.
కాసేపటి వరకూ మల్లిక ఆచేతనంగా ఉండిపోయింది.
ఆమెకు మొదట తను విన్నది అర్థం కాలేదు. తరువాత వివిధములైన ఆలోచనలు కమ్ముకున్నాయి.
‘ఎవరువీరు? బలమైన విష్ణుకుండిన ప్రభువుల రాజ్యంలో ఇలాంటి పన్నాగాలు సాగే అవకాశముందా? వారు రచిస్తున్న ఆ పూహ్యమేమిటీ? ఇది ప్రమాదమైనదా? లేక కాకతాళీయంగా ఇద్దరు పల్లెవారు మాట్లాడుకుంటున్నారా? వైద్య సంబంధమైనదా?’ ఇలా రకరకాలుగా ఆలోచనలు ముట్టడించి ఆమెలో అలజడి కలిగింది.
ఆ చీకటిలో అలా కూర్చున్నందునా, ఆమె చెలులు వచ్చి ఆమె ఏకాంతం భంగ పరచనందునా… వారికి ఆమె ఉన్నట్లు తెలియలేదు. కాబట్టి ఈ మాటలు వినగలిగింది.
ఆమె విన్న ఆ మాటలు అతి గొప్ప కుట్రకు సంబంధించినవని ఆమెకు ఆ క్షణంలో తెలియదు.
ఇంతలో ప్రహారా వారు దీపాలతో అటు వచ్చారు. ఆమెను చూసి పలకరింపుగా నవ్వుతూ “అమ్మా ఈ చీకటిలో ఉన్నారేమిటి? ఇంటివద్ద దిగబెట్టాలా?” అని అడిగారు గౌరవంగా.
“వద్దు…వద్దు.. మేమంతా కలసే వచ్చాము…” అన్నది మల్లిక లేచి నడుస్తూ.
చెలులు కూడా రమ్మని పిలుస్తున్నారు. వడివడిగా వారి వైపుకు నడిచింది .
అందరు నది ఒడ్డు నుంచి రహదారి వద్దకు వచ్చి వారి రథాన్ని ఎక్కి వారి వారి గృహాలకు వచ్చేశారు.
ఆనాడు ఇంటికి వచ్చాక ప్రియుని తలపులలో పడి కృష్ణానది ఒడ్డున విన్న మాటలు మరిచిపోయింది మల్లిక. బహుశా అవి శ్రీకరునికి చేరి ఉంటే చరిత్ర మరోలా ఉండి ఉండేదేమో…
* * * * *
(ఇంకా ఉంది)
తెలంగాణలో పుట్టి పెరిగారు. వివాహాంతరము అమెరికా వచ్చారు. గత పదహరు సంవత్సరాలుగా అట్లాంటా నగరములో నివాసముంటునారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎం. బి. ఎ డిగ్రి పొందారు. శ్రీవారు కొండల నల్లజర్ల టీ మొబైల్ లో పని చేస్తున్నారు. కుమార్తె మేఘన. స్టాంఫోర్డ్ లో రెసెర్చు అసిస్టెంట్ గా సైకాలజీ ల్యాబ్ లో పనిచేస్తున్నది. సాంఘిక సేవాసక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా అట్లాంటా తెలుగు సంఘములో పని చేశారు. తానా, అమెరికన్ రెడ్‌క్రాస్, అట్లాంటా సాయి టెంపుల్, అట్లాంటా హిందూ టెంపుల్, వీ.టీ. సేవ ఇత్యాది సంస్థల్లో స్వచ్ఛంద సేవ సేవలందించారు. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసము సేవలందించే ‘రక్షా’ సంస్థ వారి “Ramesh Bakshi Leadership” అవార్డును, ‘పాడుతా తీయగా’ వారి సహకార అవార్డును, సిలికానాంధ్రవారి అవార్డును అందుకున్నారు. “నేను వడ్డించిన రుచులు, చెప్పిన కథలు” అన్న పుస్తకం ప్రచరించబడింది. కౌముది, సంచిక, మాలిక, దర్శనం వెబ్ మ్యాగజైన్స్ లో వీరివి ప్రతినెలా ప్రచురితమౌతున్నవి. ఊహలుఊసులు అన్న తెలుగు బ్లాగు రచయిత.