స్వదేశం
-కుందుర్తి కవిత
విదేశంలో ఉంటూ దేశభక్తిమీద కవితేంటని మొదట వ్యంగ్యంగా నవ్వుకున్నా…
ఆలోచనలు ఏదో అజెండా తో
గిర్రున వెనక్కి తిరిగి
జ్ఞాపకాల వీధిలో జెండా పాతాయి…
పదిహేనేళ్ళ నా పూర్వం
పరదేశంలో తన పునాదులు వెతికింది!!
ఆరునెలలకు మించి ఇంటికెళ్ళకపోతే
మనసు మనసులో ఉండకపోవడం…
మన దేశం నుంచి ఎవరొచ్చినా
సొంతవాళ్ళలా మర్యాదలు చేయడం…
మన జాతీయ హస్తకళలతో ఇంటినంతా నింపుకోవడం
మన దేశపు చిన్ని భాగాన్నైనా
ఇంట్లో బంధించామని పొంగిపోవడం…
పిల్లలకి దేశభక్తి పాటలు నేర్పుతూ ,
“ఏ దేశమేగినా, ఎందుకాలిడినా”
అని మైమరిచి పాడటం..
జణగణమన తరువాత జై హింద్ కి ప్రతీసారీ
అప్రమేయంగా చేయెత్తి జై కొట్టడం…
ఇవన్నీ దేశాభిమానానికి నిదర్శనం కాదా?!
మన సినిమాల ప్రీమియర్ షోల కి వెళ్ళి ఈలలు వేయడం నుంచీ…
మార్స్ మంగళ్ మిషన్ సఫలానికి
గుండె గర్వంతో ఉప్పొంగిపోవడం వరకూ..!!
ఆనాటి క్రికెట్ వరల్డ్ కప్పులో టీం ఇండియాకి
పై కప్పులెగిరేలా ఛీర్ చేయడం నుండి
మొన్న ఒలంపిక్సులో సింధు కంచుపతాకానికి
కంచు కంఠంతో అరవడం వరకూ !!
అన్నిట్లో దేశారాధరోదన వినిపించలేదా ?!
కాషాయవన్నె ధైర్యం వెన్నంటే ఉంచుకుని
తేటతెల్లని మమతలు మనసులో నింపుకొని
అభివృద్ధికై పచ్చటి శుభసంకల్పంతో
ధర్మసందేశాన్ని విస్తరించే విహంగాలై
వినీలాకాశంలో విహరిస్తూ
త్రివర్ణ తత్వాన్ని త్రికరణశుద్ధిగా పాటిస్తున్న మనం..
ప్రవాసంలో కూడా స్వదేశ ఛాయలనే
కదా వెతుక్కుంటున్నది?!
దేశభక్తుడంటే…
దేశాన్ని ఉద్ధరించే సంఘసంస్కర్తలే అవనక్కర్లేదు,
సరిహద్దుల్లో పోరాడే సైనికుడే కానక్కర్లేదు,
దేశంపై హద్దుమీరిన ప్రేమని గుండెల్లో నింపుకొని…
జీవనపోరాటానికి దూరదేశాలకి వలస వెళ్ళినా…
మన సంస్కృతినీ సంస్కారాలనీ బ్రతికిస్తూ…
మనదేశ గౌరవాన్ని నిలబెడుతూ…
మన ఉనికిని స్మరించుకుంటూ…
దేశ శ్రేయస్సు కాంక్షిస్తున్న ప్రతి ఒక్కరూ,
ఏ దేశంలో ఉన్నా , ఏ పని చేస్తున్నా…
టైం జోను ఏదైనా, పాస్ పోర్టు ఏ రంగైనా…
దేశభక్తులే, దేశాభిమానులే
భావితరాలకు బాధ్యత నేర్పే
భరతమాత ముద్దుబిడ్డలే !!
*****
నాకు ఇందులో ఏం కూడా కవిత ల అనిపించలేదు
భావాలు అంటే బాగుటుంది కానీ మీ ప్రయత్నం నాకు చాలా నచ్చింది
చాలా చాలా బాగుంది కవిత గారు. ప్రాణాలర్పించిన సైనికులే కాదు ప్రవాసంలో ఉంటూ అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ దేశాన్ని తలచుకుంటూ ఉప్పొంగే గుండెలూ…..నిజమైన దేశభక్తులని చాలా చాలా చక్కగా చెప్పారు. నిజం భక్తి అంటే ఇదే కదా…నిరంతర నామస్మరణేగా. ఆటైనా, అణ్వస్త్ర ప్రయోగమైనా…అట్లతద్దె అయినా…అమ్మతనంతో పిల్లలకు అమ్మభాషను నేర్పుతూ…, సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెడుతున్న ప్రవాసీయుల ఆత్మను అక్షరాలలో నిలిపారు. ఇక్కడ భారతీయులలో ఉన్న విదేశీయులు భుజాలు తడుముకోవాలి ఈ కవితకు.
శుభాభినందనలు 💐💐