అనుసృజన
ధ్రువస్వామిని- 2
హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్
అనువాదం: ఆర్. శాంత సుందరి
కాపలా స్త్రీ ః జయము జయము మహారాజా ! ఒక ఆందోళనకరమైన వార్త తమకు అందించమని అమాత్యులు నన్ను పంపించారు.
రామగుప్త్ ః (విసుగ్గా) ఇలా ఆందోళనతోనే నేను చనిపోవాల్సి వస్తుందేమో ! ఉండు..( ఖడ్గధారిణి తో) ఆఁ, నువ్వు నీ పని చక్కగా చేశావు,కానీ ఆమె ఇంకా చంద్రగుప్తుణ్ణి ప్రేమిస్తోందో లేదో నాకు తెలియనే లేదు.
(ఖడ్గధారిణి కాపలా స్త్రీ వైపు చూసి మౌనంగా ఉండిపోతుంది)
రామగుప్త్ ః (కాపలా స్త్రీ వైపు కోపంగా చూస్తూ) ప్రస్తుతం నాకు తీరిక లేదని, తర్వాత రమ్మని నీకు చెప్పానా లేదా?
కాపలా స్త్రీ ః రాజాధిరాజా ! శక సైన్యం కొండ మార్గాన కిందికి దిగి అటుగా ఎవరూ వెళ్ళకుండా అడ్డుకుంది.శిబిరం నుంచి రాజమార్గానికి వెళ్ళే మార్గం మూసుకుపోయింది.రెండు వైపులనుంచీ సైన్యం మనని చుట్టుముట్టింది.
రామగుప్త్ ః రెండు వైపుల నుంచి చుట్టుముడితే శిబిరానికి ఇంకా ఎక్కువ రక్షణ దొరికినట్టే కదా? మూర్ఖురాలా, నోరు ముయ్యి…( ఖడ్గధారిణి తో) అయితే ధ్రువ దేవి మనసులో ఇంకా చంద్రగుప్తుణ్ణి… నా సందేహం సరైనదే కదూ?
కాపలా స్త్రీ ః (చేతులు జోడించి) అపరాధం మన్నించండి ప్రభూ ! యుద్ధ పరిషత్తులో అమాత్యుల వారు మీ కోసం ఎదురుచూస్తున్నారు.
రామగుప్త్ ః (గుండెల మీద చెయ్యి పెట్టుకుని) యుద్ధం ఇక్కడ కూడా జరుగుతోంది. నీకు కనబడటం లేదా, ఈ లోకం లోకెల్లా అసమాన సౌందర్యవతికి నా మీద ప్రేమ లేదు.ఈ దేశానికి రారాజు నేను !
కాపలా స్త్రీ ః మహారాజా , శకరాజు దగ్గరనుంచి ఒక దూత కూడా సందేశం అందించేందుకు వచ్చాడు.
రామగుప్త్ ః ఓహ్ ! కానీ ధ్రువ దేవి ! ఆమె మనసులో ఏదో బాధ ముల్లులా గుచ్చుకుంటూ ఉన్నట్టు ఉంది .(ఒక్క క్షణం ఆలోచించి) ఒక స్త్రీ ఒక పురుషుడి ఆధీనంలో ఉంటూ , మరొక పురుషుణ్ణి ప్రేమిస్తూ ఉందంటే ఆమె మనసులో ఒక విధమైన భావోద్రేకం ఎగిసిపడుతూ ఉంటుంది.అందుకే, చంద్రగుప్తుణ్ణి ప్రేమించే స్త్రీ ఎప్పుడు ఎలా దెబ్బ తీస్తుందో కదా? లోలోపల ఏవో కుతంత్రాలు చేస్తూ ఉండచ్చు.(ఖడ్గధారిణి తో) నేను చెప్పింది విన్నావు కదా! నన్నే… నన్ను మాత్రమే ప్రేమించమని ధ్రువదేవికి చెప్పు.కేవలం మహారాణి అనిపించుకుంటే సరిపోదు.
(ఖడ్గధారిణీ, కాపలా స్త్రీ నిష్క్రమిస్తారు.శిఖరస్వామి ప్రవేశిస్తాడు)
శిఖరస్వామి ః మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి మహారాజా !
రామగుప్త్ ః (విచారంగా వేళ్ళు కదిలిస్తూ స్వగతం మాట్లాడుతున్నట్టు) ధ్రువదేవి వల్ల నేను సామ్రాజ్యాన్నే కోల్పోవలసి వస్తుందా? లేకపోతే ( ఏదో ఆలోచిస్తూ) సరే కానీ హఠాత్తుగా రాజదండం నా చేతికి రాగానే రాజపురోహితుడూ, మంత్రీ, సేనానాయకుడూ తిరుగుబాటు చేయ్యాలన్న భావాన్ని మనసులో దాచుకుంటారా?(శిఖరస్వామితో) అవును కదా? నువ్వొక్కడివే నాకు విశ్వాసపాత్రుడిలా కనిపిస్తావు. అర్థమైంది కదా? ఈ పర్వత మార్గమే అన్ని వివాదాలకీ అంతిమ నిర్ణయం అందజేస్తుంది. భుజబలం లేని వాడికి బుద్ధిబలమైనా ఉండాలి కదా? ఏమంటావు మంత్రీ?
శిఖరస్వామి ః (ఒక లేఖ తీసి ఇస్తూ) ముందు దీన్ని చదవండి.(రామగుప్త్ లేఖ చదువుతూ ఆశ్చర్యంతో ఉలిక్కిపడతాడు) అలా ఉలిక్కిపడకండి. ఈ సంఘటన ఎంతో అకస్మాత్తుగా జరిగింది.ఆలోచించేందుకు వ్యవధి లేదు.
రామగుప్త్ ః ( ఆగి) అవును అలాగే ఉంది.కానీ పూర్తిగా నాకు ప్రతికూలంగా కూడా లేదనే అనాలి.నాకు ఇలా జరగచ్చు అని ముందే అనిపించింది.
శిఖరస్వామి ః (ఆశ్చర్యపోతూ) ఆఁ? అయితే తమరు ఏదో ఒక ఉపాయం ఆలోచించే ఉంటారు మహారాజా! ఒక వ్యక్తి భవిష్యత్తు మేఘాలు కమ్మిన ఆకాశంలా ఉంటే ,అతని బుద్ధి మెరుపులా తళుక్కున మెరవాల్సిందే.
రామగుప్త్ ః(అనుమానంగా) చెప్పనా నేనేమాలోచించానో? కానీ నువ్వు దాన్ని సమర్థిస్తావా?
శిఖరస్వామి ః మీరు చెప్పేది నీతికి నిలబడేదైతే తప్పకుండా సమర్థిస్తాను. అందరూ వ్యతిరేకించినా స్వర్గీయ ఆర్య సముద్రగుప్తుల వారి ఆజ్ఞ పాటించకుండా నేనే మిమ్మల్ని సమర్థించను . నీతి శాస్త్ర ప్రకారం జ్యేష్ఠ పుత్రుడు…….
రామగుప్త్ ః (మధ్యలో అడ్డం వస్తూ) అది…నాకు తెలుసు; కానీ ప్రస్తుతం మన ముందున్న సమస్య గురించి ఆలోచించాలి. నా ఈ విజయ యాత్ర వెనుక ఒక రహస్యమైన ఉద్దేశం ఉందని నీకు తెలుసు.అది నెరవేరుతుందన్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి.కొద్దిగా సాహసం చెయ్యాలి, అంతే.
శిఖరస్వామి ః ఏమిటది?
రామగుప్త్ ః శకరాజు దూత సంధికి కోరే ప్రమాణాన్ని కాదనరాదు.అలా చెయ్యడం వల్ల సంకటాన్ని సృష్టించే శత్రువుల నందరినీ మనం సులభంగా తొలగించ గలుగుతాం.
శిఖరస్వామి ః భవిష్యత్తుకి ఇది మంచిదే కావచ్చు కానీ ప్రస్తుతం మనం ఎన్నో అడ్డంకులని ఎదుర్కోవలసి వస్తుంది.
రామగుప్త్ ః (నవ్వి) నువ్వు…నీ బుద్ధి ఎప్పుడు పనిచేయడం ప్రారంభిస్తుంది? అన్నట్టు చంద్రగుప్తుడు ఏమనుకుంటున్నాడో ఏమైనా తెలిసిందా?
శిఖరస్వామి ః కొత్తగా చెప్పేందుకేమీ లేదు.
రామగుప్త్ ః చూస్తూంటే ముందు నా అంతఃపురంలో తలెత్తిన తిరుగుబాటునే అణచవలసొస్తుందేమో.(నిట్టూర్చి) ధ్రువదేవి మనసులో చంద్రగుప్తుడి మీద కోరిక నెమ్మది నెమ్మదిగా తలెత్తుతోంది.
శిఖరస్వామి ః అది అసంభవమేమీ కాదు కానీ మహారాజా ! ప్రస్తుతం మీరు దూతని కలిసి వర్తమాన రాజకీయాల మీద ధ్యాస పెట్టాలి. మనకన్నా బలశాలులు అయిన ప్రతిపక్షం వాళ్ళు సందేశం పంపించడం చాలా విచిత్రంగా ఉంది.
రామగుప్త్ ః విచిత్రమో సచిత్రమో , మంత్రీ! నీ రాజకీయ కౌశలంతో లోపలి శత్రువులనీ, బైటి శత్రువులనీ ఒకే దెబ్బతో పరాజితులని చెయ్యాలి మరి. సరే పద.
(ఇద్దరూ నిష్క్రమిస్తారు.మందాకిని సంకోచిస్తూ ప్రవేశిస్తుంది)
మందాకిని ః (చుట్టూ చూసి) భయంకరమైన సమస్య ! మూర్ఖులు తమ స్వార్థం కోసం సామ్రాజ్యాన్ని సర్వనాశనం చెయ్యాలని నిశ్చయించుకున్నారు. నిజం, శౌర్యం పారిపోయేందుకు పరిగెత్తితే దాని కాళ్లలోంచి కపటమనే ధూళి ఎగురుతుంది. (ఏదో ఆలోచించి) రాజకుమారుడు చంద్రగుప్తుడికి ఈ సమాచారం వెంటనే అందజేయాలి.మూగదానిలా నటించడం వల్ల మహారాణీ మనసులోని భయం కాస్తంత తొలగింది. కానీ ఆమె మనసులో చంద్రగుప్తుడి పైన ఉన్న ఆ కాస్త స్నిగ్ధ భావం కూడా అంత ప్రాముఖ్యం లేనిదేమీ కాదు. కుమార చంద్రగుప్తుడు ! ఎంత అంకితభావం అతనిది ! అతని అన్న రామగుప్తుడు ! అంతా నటనే, కపటమే! ఈ కలుషిత వాతావరణానికి దూరంగా పారిపోయి ఇదంతా మరచిపోవాలనిపిస్తోంది నాకు. కానీ మందాకినీ! విధాత నిన్నెందుకు పుట్టించాడో! (ఆలోచిస్తుంది) లేదు, మనసు రాయి చేసుకుని కర్తవ్యం నిర్వహించేందుకు నేనిక్కడే ఉండాలి. న్యాయం జరిగేట్టు చూడాలి.
(పాడుతుంది)
ఈ బాధా ఈ కన్నీళ్ళూ సహించు మనసా !
నా అభిమానమా! వినయశీలి వై
నా అస్తిత్వాన్ని తెలియజేయవా!
అన్నివైపులా ఉప్పొంగి ప్రేమ రూపమై
నీ మౌన గాథ వినిపించవా !
దుఃఖిత వసుధపై కరుణామూర్తివై
శీతల ప్రవాహమై ప్రవహించవా !
(నిష్క్రమిస్తుంది.ధ్రువస్వామిని విచారంగా నెమ్మదిగా నడుస్తూ ప్రవేశిస్తుంది.ఆమె వెనక ఒక పరిచారిక తాంబూల పేటిక, మరో పరిచారిక చామరమూ పట్టుకుని వస్తారు.ధ్రువస్వామిని ఒక ఆసనం మీద కూర్చుని వేళ్ళు అక్షరాలమీద ఉంచి ఏదో ఆలోచనలో మునిగిపోతుంది. చామరం పట్టుకున్న స్త్రీ దానితో విసరటం ప్రారంభిస్తుంది)
ధ్రువస్వామిని ః (రెండో పరిచారికతో) ఆఁ, ఏమన్నావు? శిఖరస్వామి ఏదో చెప్పాలనుకుంటున్నారా? ఇవాళ కాదు, రేపు వింటానని చెప్పు.
పరిచారిక ః చిత్తం మహారాణీ ! అయితే అమాత్యులవారితో తమరు రేపు మాట్లాడతారని చెప్పి రమ్మంటారా?
ధ్రువస్వామిని ః ( కొంచెం ఆలోచించి) ఉండు, ఆయన గుప్త సామ్రాజ్యానికి అమాత్యుడు.ఆయన్ని ఇవాళే కలుసుకోవాలి.సరే కానీ, ఒక విషయం చెప్పు, మీ రాజవంశపు నియమాలు ఎలాంటివి ? ముందు అమాత్యుడు చెప్పింది విని తర్వాత రాజుగారిని కలవాలా?
పరిచారిక ః (పళ్ళతో నాలుక కరుచుకుoటూ ) అలాంటి నియమమేదీ ఉన్నట్టు నేను వినలేదు మహాదేవీ ! ఇది యుద్ధ శిబిరo కదా ! మహారాజా వారికి అవకాశం దొరికి ఉండదు. మీరు వారిని సందేహించకూడదు.
ధ్రువస్వామిని ః నేను మహారాణి నే కదా? అదే నిజమైతే నా ఆజ్ఞ శిరసావహించి కుమార చంద్రగుప్తుణ్ణి ఇక్కడికి పిలుచుకుని రాగలవా? అమాత్యుడితో బాటు చంద్రగుప్తుడితో కూడా కాస్త్త మాట్లాడాలని అనుకుంటున్నాను.
పరిచారిక ః క్షమించండి మహారాణీ ! దానికి ముందుగా అమాత్యులవారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
(ధ్రువస్వామిని కోపంగా ఆమెవైపు చూస్తుంది. పరిచారిక తాంబూల పేటిక అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఒక మరుగుజ్జూ, గూనివాడూ,కొజ్జా ప్రవేశిస్తారు)
గూనివాడు ః యుద్ధం ! భయంకరమైన యుద్ధం !!
మరుగుజ్జు ః జరుగుతోందా ,జరగబోతోందా మిత్రమా?
కొజ్జా ః ఇక్కడే యుద్ధం చేసి చూపించరాదర్రా? మహాదేవి కూడా చూస్తారు !
మరుగుజ్జు ః (గూనివాడితో) ఒరే విన్నావా? నీ హిమాలయాన్ని ఇటు తిప్పు కాస్త, కుబేరుడి మీదికి దండెత్తి దిగ్విజయం సంపాదించుకోవాలి !
(వాడి గూని వీపుని నొక్కుతాడు .గూనివాడు మోకాళ్ళమీదికి వంగి చేతులు నేలమీద ఉంచి ముందుకి పడతాడు.కొజ్జా వాడి వీపు మీదెక్కి కూర్చుంటాడు.మరుగుజ్జు ఒక నెమలీకల చామరాన్ని కత్తిలా తిప్పుతాడు)
కొజ్జా ః అరే! నేనే నలకూబరుడి వధువును ! దిగ్విజయ వీరుడా, ఒక ఆడదానితోనా నువ్వు యుద్ధం చేసేది? వెళ్ళిపో,మళ్ళీ రేపు రా . నా మామగారూ, ఆర్యపుత్రులూ ఊర్వశీ, రంభ లని కలిసేందుకు వెళ్ళి ఇంకా వెనక్కి రాలేదు.ఇవాళే యుద్ధం చేసేందుకు మంచి ముహూర్తమా ఏమిటి?
మరుగుజ్జు ః (మళ్ళీ నెమలీకల చామరాన్ని వేగంగా ఝళిపిస్తూ) లేదు, ఇవాళే యుద్ధం జరగాలి.నువ్వు స్త్రీవి కావు, నీ వేళ్ళు నా కత్తి కన్నా వేగంగా కదులుతున్నాయి.గూనివాడు నీ కింద నలిగిపోతూ ఉన్నాడు.మరి నువ్వు నలకూబరుడివో , కుబేరుడివో కావని ఎలా నమ్మమంటావు? నీ దుస్తులు చూసి నేను మోసపోను సుమా ! నువ్వు పురుషుడివే, యుద్ధం చెయ్యి.
కొజ్జా ః ( వయ్యారాలు పోతూ) అరే, నేను స్త్రీనే. నన్ను ఎవరూ వివాహం చేసుకోకపోవచ్చు, కానీ యుద్ధం చెయ్యడం నాకేo చాతనౌను?
(దాసీ వెంట శిఖరస్వామి ప్రవేశిస్తాడు)
శిఖరస్వామి ః జయము జయము మహారాణీ!
రెండో వైపు నుంచి ఒక యువతి భుజాన్ని ఆసరా చేసుకుని , మధువు మత్తులో తూలుతూ రామగుప్తుడు ప్రవేశిస్తాడు.చిరునవ్వు నవ్వుతూ మరుగుజ్జు ఆడే నాటకం చూస్తూ నిలబడతాడు. ధ్రువస్వామిని లేచి నిలబడుతుంది.శిఖరస్వామి రామగుప్తుడికి సైగ చేస్తాడు)
రామగుప్త్ ః ( ముద్ద ముద్దగా మాట్లాడుతూ) మహాదేవీ మీకు జయము !
ధ్రువస్వామిని ః స్వాగతం మహారాజా !
(రామగుప్తుడు ఒక ఆసనం మీద కూర్చుంటాడు. శిఖరస్వామి, ద్రువస్వామిని అలా తనకి ఉదాసీనంగా మర్యాద చూపించడం చూసి ఆశ్చర్యపోతూ తల గోక్కుంటాడు)
గూనివాడు ః రక్షించండి మహాప్రభో! హిమాలయం నొప్పి తాళలేకుండా ఉంది. ఈ నలకూబరుడి వధువు నా వీపు మీదినుంచి లేవనంటుంది.పోనీ ఈ మరుగుజ్జు నా మీద విజయం సాధిస్తాడా అంటే అదీ లేదు!
రామగుప్త్ ః (నవ్వుతూ) భళా రే వామన వీరా! ఇక్కడ దిగ్విజయం గురించి నాటక ప్రదర్శన జరుగుతోందా?
మరుగుజ్జు ః ( గర్వంగా) బలి మీద వామనుడి విజయ గాథ , మూడడుగుల మహిమ అందరికీ తెలిసినదే .నేను మూడు సార్లు కాలితో తన్ని వీడి గూని పోగొట్టగలను .
గూనివాడు ః ఒరే మరుగుజ్జూ, ఆ పని చేసిపెడుదూ.ఆ తరవాతైనా ఈ హిమపర్వతం లా నటించే బాధ తప్పుతుంది నాకు !
కొజ్జా ః చూడండి, నేను నలకూబరుడి వధువును వీడి మీదెక్కి కూర్చున్నాను.
మరుగుజ్జు ః అబద్ధం! యుద్ధమంటే భయం చేత వీడు పురుషుడై ఉండి కూడా స్త్రీలా మారిపోయాడు.
కొజ్జా ః యుద్ధం చెయ్యడం చాతకాదని ముందే చెప్పాను కదా?
మరుగుజ్జు ః నువ్వు నలకూబరుడి భార్యవు కదా? నా విజయానికి బహుమతిగా నిన్ను అపహరిస్తాను ( మిగిలినవారి వైపు చూసి,కొజ్జా చెయ్యి పట్టి లాగుతూ) అది సబబే కదా? ఇది ధర్మవిరుద్ధం కాదేమో!
(రామగుప్తుడు అట్టహాసం చేస్తాడు)
ధ్రువస్వామిని ః ( మండిపడుతూ) బైటికి నెట్టండి. ఇక్కణ్ణుంచి తరమండి వీళ్ళని. ఇక్కడ ఇలాంటి సిగ్గుమాలిన నాటకం నేను చూడలేను
!(శిఖరస్వామి వైపు కూడా కోపంగా చూస్తుంది.శిఖరస్వామి సైగ చెయ్యగానే వాళ్ళు పారిపోతారు)
రామగుప్త్ ః అరే ఓ దిగ్విజయుడా,ఒక మాట ( లేచి చప్పట్లు చరుస్తూ నవ్వుతాడు)
ధ్రువస్వామిని అసహ్యంవేసి, మొహం తిప్పుకుంటుంది.శిఖరస్వామి సైగ చేసేసరికి దాసీ మధుపాత్ర తెస్తుంది.రామగుప్తుడు దాన్ని చూస్తూనే కళ్ళు విప్పార్చి ఆనందంగా దాన్ని అందుకోబోతాడు) మంత్రీ,ఇవాళే నేను మహాదేవి దగ్గరకు వచ్చాను, మీరూ ఇక్కడికే వచ్చారు. ఇది ఒక విలక్షణమైన సంఘటన, అవునా?
( (మధుపాత్ర తీసుకుని తాగుతాడు)
శిఖరస్వామి: ముఖ్యమైన సందేశం వచ్చింది.
రామగుప్త్ ః ఓ, మరిచేపోయాను! ఆ దుష్ట శకరాజు ఏమంటాడు? ఏం కావాలట? నేను దాడి చెయ్యకూడదంటాడా? అంతే కదా? పోనివ్వు,యుద్ధం చెయ్యడం అంత మంచి పనేం కాదుగా!
శిఖరస్వామి ః అతనికి ఇంకా ఏదో కావాలట.
రామగుప్త్ ః ఏమైనా సహాయం చెయ్యమంటాడా?
శిఖరస్వామి ః ( తల వంచుకుని గంభీరంగా) కాదు ప్రభూ, అతను చాలా ఘోరమైన అసభ్యమైన కోరిక కోరుతున్నాడు.
రామగుప్త్ ః ఏమిటది, చెప్పరాదూ?
శిఖరస్వామి ః క్షమించండి ప్రభూ, దూతని వధించటం నిషిద్ధం.అందుకే అతను తెచ్చిన సందేశం వినవలసి వచ్చింది.సందేశం ఇది: శకరాజుకీ ,మహారాణి ధ్రువస్వామినికీ …(ఆగి ధ్రువస్వామినికేసి చూస్తాడు.ధ్రువస్వామిని తలాడించి చెప్పమని సైగ చేస్తుంది)వివాహం నిశ్చయమైందట.మధ్యలో ఆర్య సముద్రగుప్తులుంగారి విజయ యాత్రలో మహారాణి గారి తండ్రి ఆమెని బహుమతిగా గుప్తవంశానికి పంపారట.అందుచేత మహారాణి గారిని అతను…
రామగుప్త్ ః ఆఁ, ఏమంటున్నావు? మంత్రీ! అతను మహారాణిని కోరుతున్నాడా?
శిఖరస్వామి ః అంతే కాదు ప్రభూ! తన సామంత రాజుల కోసం మగధ సామ్రాజ్యంలోని సామంత రాజుల భార్యలని కూడా ఇమ్మని కోరుతున్నాడు.
రామగుప్త్ ః (ఊపిరి పీల్చుకుని) సరే,మరి అతని వద్ద సామంతులు ఉంటే వాళ్ళకి కూడా భార్యలు కావాలిగా ?అన్నట్టు మహారాణికీ శకరాజుకీ సంబంధం నిశ్చయం కావడం నిజమేనా?
శిఖరస్వామి ః ఆ విషయం నాకు తెలీదు.(ధ్రువస్వామిని రోషంతో బుసలుకొడుతూ పచార్లు చేస్తుంది)
రామగుప్త్ ః దేవీ ,మంత్రి ఏదో అడుగుతున్నాడు?
ధ్రువస్వామిని ః మొదటిసారి మీరు నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు మహారాజా ! కానీ ఒక విషయం తెలుసుకోవాలనుంది. గుప్త సామ్రాజ్యం స్త్రీలని ఇతరులకి ఇచ్చివేయటం వల్లే ఇంత అభివృద్ధి సాధించిందా?
రామగుప్త్ ః (ఖంగు తిని నవ్వుతూ) ఆఁ…ఆఁ…మంత్రీ నువ్వు చెప్పు !
శిఖరస్వామి ః నేనేం చెప్పను?శత్రు పక్షం పంపిన సందేశం అదే.అంగీకరించకపోతే యుద్ధం చెయ్యండి.శిబిరాన్ని రెండు వైపులనుంచీ ముట్టడించారు.అతను చెప్పిందానికి సమ్మతించండి,లేదా మరణించి వంశ మర్యాదని కాపాడుకోండి.వేరే దారేదీ లేదు.
రామగుప్త్ ః (ఉలిక్కిపడి) ప్రాణాలర్పించటం తప్ప వేరే దారి లేదా? ఊఁహూఁ…అయితే మహారాణినే అడగండి.
ధ్రువస్వామిని ః ( తీవ్రంగా) మరి మీరు మరుగుజ్జులూ, కొజ్జాలూ, గూనివాళ్ళూ నాట్యం చేస్తూంటే చూస్తూ కూర్చుంటారన్నమాట.అగ్ని సాక్షిగా సుఖ దుఃఖాలలో నాకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసింది ఎవరో తెలుసుకోవాలని ఉంది.
రామగుప్త్ ః (చుట్టూ చూసి) ఎవరు చేశారు? ఎవరూ మాట్లాడరేం?
ధ్రువస్వామిని ః అయితే నేను రారాజు రామగుప్తులవారి పట్టపురాణిని కానా?
రామగుప్త్ ః ఎందుకు కాదు? కానీ రామగుప్తుడు అలాంటి ప్రమాణం ఏమీ చేసి ఉండడే ! నేనా రోజున ద్రాక్షాసవంలో మునిగి తేలుతున్నాను.పురోహితులు నా చేత ఏమేం అనిపించారో ఏమో? .వాటి భారమంతా నా తలమీదా?( తల అడ్డంగా ఆడిస్తూ) ఊఁ హూఁ వీల్లేదు !
ధ్రువస్వామిని ః (నిస్సహాయురాలై దీనంగా శిఖరస్వామితో) చూశారా, ఇదే రాజుగారి వ్యవస్థ! ఇక మంత్రి మహాశయులేమంటారో వినాలని ఉంది !
శిఖరస్వామి ః నే చెప్పేదేముంది మహారాణీ ! రాజ్యాన్ని రక్షించేందుకు సరైన సలహా చెప్పటమే నా కర్తవ్యం.రాజకీయ సిద్ధాంతాలలో అన్ని రకాల ఉపాయాలూ చెయ్యటం ఉచితమే.రాజ్యం కోసం రాజు, రాణి,రాజకుమారులు, మంత్రి అందరినీ త్యాగం చేయక తప్పదు.రాజ్యాన్ని త్యాగం చెయ్యడం చివరి ఉపాయం.
రామగుప్త్ ః( సంతోషంగా) భలే చెప్పావు మంత్రీ! అందుకే అందరూ నిన్ను నీతిశాస్త్రంలో బృహస్పతివని అంటారు.
ధ్రువస్వామిని ః మంత్రీ, నువ్వు బృహస్పతివో శుక్రాచార్యుడివో తెలీదు కాని ధూర్తుడైనవాడు తప్పులు చేస్తాడు, అవునా? ఆర్య సముద్రగుప్తులవారి కుమారుణ్ణి గుర్తించటంలో నువ్వు పొరపడ్డావేమో ? సింహాసనం మీద ఇంకెవరినో కూర్చోబెట్టలేదు కదా!
రామగుప్త్ ః (ఆశ్చర్యపోతూ)ఆఁ ? ఏమిటీ? ఏమన్నావు ?
ధ్రువస్వామిని ః ఏం లేదు, స్త్రీలని పశువులనుకుని, వాళ్ళు తమ ఆస్తి అనుకుని వాళ్ళమీద దౌర్జన్యం చెయ్యటం పురుషులకి అలవాటైపోయింది.అది నా విషయంలో జరగని పని.మీరు నన్ను రక్షించలేకపోతే , మీ కుటుంబ గౌరవాన్ని, స్త్రీ మాన మర్యాదలని కాపాడలేకపోతే , నన్ను వేరెవరికో అమ్మే అధికారం కూడా మీకు లేదు. కావాలంటే మిమ్మల్ని ఈ ఆపదనుంచి రక్షించేందుకు నేనే ఇక్కణ్ణించి వెళ్ళిపోతాను.
శిఖరస్వామి ః ( వ్యంగ్యంగా ) రాజకీయాల్లో ఇలాంటి మాటలు చెల్లవు.నియమాలకి అనుగుణంగా సంధి చేసుకోవాల్సిందే,లేకపోతే ఇక సంధి ప్రస్తావనకి అర్థమేముంది?
ధ్రువస్వామిని ః ఓహో, అయితే ఈ రాజ్యాన్ని రక్షించే యజ్ఞంలో రాణీని బలి ఇస్తారన్నమాట !
శిఖరస్వామి ః మరో మార్గం లేదు మరి.
ధ్రువస్వామిని ః (కోపంగా కాలు నేలకేసి కొట్టి) మార్గం లేకపోతే పోయింది, సిగ్గూ లజ్జా కూడా లేవా నీకు మంత్రీ!మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మాటలు నా చెవిన పడకూడదు .
రామగుప్త్ ః (ఉలిక్కిపడి) ఇంత చిన్న విషయానికి ఇంత గలాభానా ? ( దాసీ వైపు చూస్తూ) నా గొంతు ఎండిపోతోంది.
( దాసీ మధువు అందిస్తుంది)
ధ్రువస్వామిని ః (దృఢంగా) సరే అయితే, ముందు మంత్రిని ఆలోచనా మందిరానికి వెళ్ళమని ఆదేశిస్తున్నాను.నేను కేవలం ఒక రాణీనే కాను, ఒక స్త్రీని కూడా.నా భర్తనని చెప్పుకునే ఈ మనిషితో నేను కాస్త మాట్లాడాలి… రాజుతో కాదు.!
(శిఖరస్వామి దాసీలతో నిష్క్రమిస్తాడు)
రామగుప్త్ ః ఉండవయ్యా నేనూ వస్తాను ( లేవబోతాడు.ధ్రువస్వామిని అతని చెయ్యి పట్టుకుని ఆపుతుంది) నాతో ఏం మాట్లాడాలి నువ్వు?
ధ్రువస్వామిని ః (కాస్త ఆగి)ఇక్కడ ఒంటరిగా ఉండటం భయంగా ఉందా? కూర్చోండి, నేను చెప్పేది వినండి.మా తండ్రి బహుమతిగా నన్ను కన్యాదానం చేశాడు, సరే. కానీ , గుప్త సామ్రాట్టు తన భార్యని బహుమతిగా ఇస్తాడా?( మోకాళ్ళమీద కూర్చుని) చూడండి, ఒకసారి నావైపు చూడండి. నా స్వామి అని చెప్పుకునేవాడు నాకోసం ప్రాణాలు అయినా పణంగా పెట్టాలనుకోవడం ఆశించడం ఒక స్త్రీగా నా హక్కు కాదా?
రామగుప్త్ ః ( ఆమెవైపు చూస్తూ) నువ్వు అందగత్తెవి, అబ్బ ఎంత అందంగా ఉన్నావు! కానీ బాకు బంగారంది అని ముచ్చటపడి ఎవరూ దాన్ని గుండెల్లో దించుకోరుగా? నీ అందం, నీ స్త్రీత్వం, అమూల్యమైనదే కావచ్చు.కానీ నాకు నా అవసరం ఎంత ఉందో బహుశా నీకు తెలీదు.
ధ్రువస్వామిని ః ( అతని కాళ్ళు పట్టుకుని) నేను గుప్తవంశపు వధువుగా ఇక్కడికి వచ్చాను … ఎంతో నమ్మకంతో…
రామగుప్త్ ( ఆమె మాటలకి అడ్డు వస్తూ) అదంతా నాకు వినాలని లేదు.
ధ్రువస్వామిని ః నన్ను కాపాడండి. నన్నూ, మీ గౌరవాన్నీ కాపాడండి.రాజా, ఈనాడు నేను మీ శరణు కోరి వచ్చాను.ఈనాటి వరకూ మీ విలాసాలలో పాలుపంచు కోలేదని ఒప్పుకుంటున్నాను,కానీ ఆ అహంకారం ఇప్పుడు ధ్వంసమైపోయింది.నేను మీకు అనుకూలవతినై ఉంటాను. రాజ్యమూ, సంపదా ఉన్న రాజుకి – పురుషుడికి – ఎంతమంది రాణులైనా , స్త్రీలైనా దొరుకుతారు, కానీ ఒక వ్యక్తి మాన మర్యాదలు మంటగలిస్తే మళ్ళీ దొరకవు.
రామగుప్త్ ః (భయంతో ఆమె చేతిని తోసేస్తూ) అబ్బ, ప్రాణాంతకమైన నీ స్పర్శ ఎంత ఉత్తేజాన్ని కలిగిస్తోంది !నేను…కాదు. నువ్వు … నా రాణివి ! కాదు కాదు.వెళ్ళు, ఇక్కణ్ణించి తక్షణం వెళ్ళు!నువ్వు బహుమతి ఇవ్వదగిన వస్తువ్వి.ఇవేళ నేను నిన్ను మరొకరికి ఇవ్వాలనుకుంటున్నాను. అందుకు నీకు అభ్యంతరం దేనికి?
ధ్రువస్వామిని ః ( మండిపడుతూ లేచి నిలబడి) సిగ్గులేని వాడా! తాగుబోతూ!! పిరికిపందా !!! అయ్యో, అయితే నన్ను రక్షించే వాళ్ళెవరూ లేరా?(ఆగి) నన్ను నేనే స్వయంగా రక్షించుకుంటాను.నేను కానుకగా ఇచ్చే వజ్ర వైఢూర్యాన్ని కాను. నాలో ఎర్రని నెత్తురు ప్రవహిస్తోంది. గుండెలో వెచ్చదనం ఉంది , దానిలో ఆత్మగౌరవమనే జ్యోతి వెలుగుతోంది.దాన్ని నేనే కాపాడుకుంటాను ( ఒడ్డాణం నుంచి కత్తిని బైటికి తీస్తుంది).
రామగుప్త్ ః (బెదిరిపోయి వెనకంజ వేస్తూ) అయితే నన్ను హత్య చేస్తావా?
ధ్రువస్వామిని ః నిన్ను హత్య చెయ్యను, నువ్వు జీవించి ఉండు.గొర్రెలా నీది క్షుద్రమైన జీవితం. దాన్ని నేను హరించను. నా జీవితాన్నే సమాప్తం చేసుకుంటాను.
రామగుప్త్ ః కానీ నువ్వు మరణిస్తే ఆ దుష్ట శక రాజు దగ్గరకి ఎవర్ని పంపుతాను? వద్దు…వద్దు, అలాటి పని చెయ్యకు.హత్య ! హత్య!! పరిగెత్తు…పరిగెత్తు !!
( పారిపోతాడు.రెండో వైపు నుంచి చంద్రగుప్తుడు వేగంగా ప్రవేశిస్తాడు)
చంద్రగుప్త్ ః హత్యా?హత్యేమిటి? (ధ్రువస్వామిని వైపు చూసి) ఏమిటిది? మహారాణీ, ఆగండి !
ధ్రువస్వామిని ః కుమార్, నువ్వు కూడా ఇప్పుడే రావాలా?( దీనంగా చూస్తూ) నిన్ను వేడుకుంటున్నాను, ఇక్కణ్ణించి వెళ్ళిపో ! నేను అవమానానికి గురై ఇలా నగ్నంగా ఉండగా ఏ పురుషుడికీ నన్ను చూసే హక్కు లేదు. మృత్యువనే బట్టతో నా శరీరాన్ని కప్పుకోనివ్వు.
చంద్రగుప్త్ ః కానీ, కారణమేమిటో తెలుసుకునే హక్కు నాకు లేదా?
ధ్రువస్వామిని ః వింటావా? ( ఆగి ఆలోచించి) లేదు ఇప్పుడప్పుడే ఆత్మహత్య చేసుకోను.నువ్వు వచ్చావు కదా, కాసేపు ఆగుతాను.ఈ పదునైన బాకుని ఈ అతృప్త హృదయంలో , వికసించబోయే పుష్పంలో విషకీటకంలా పొడిచెయ్యనా వద్దా అనే విషయమై ఆలోచిస్తాను.ఒకవేళ అలా చెయ్యకపోతే నా ఈ దుర్దశకి వేరే ఏదైనా పురస్కారం లభిస్తుందా? ఈ జీవితం దొరికినందుకు కృతజ్ఞతతో, ఉపకారం పొందినట్టు భావించి ఈ భారాన్ని మోయవలసిందేనా? ఇదే విధి నా నొసట రాశాడా? నాకిక విముక్తి లేదు. ఈ జీవితం అదృష్టం ఇచ్చే కఠోరమైన ఆదేశాలని అనుసరించవలసిందే. అయితే నా జీవితం కూడా నాది కాదా?
చంద్రగుప్త్ ః మహారాణీ, జీవితం ఈ విశ్వానికి సొంతమైన సంపద.అజాగ్రత్త వల్లనో, క్షణికావేశం చేతనో,దుఃఖాన్ని భరించలేకనో దాన్ని నాశనం చేసుకోవటం సరికాదు.గుప్త సామ్రాజ్య లక్ష్మి ఈనాడు ఇలా కలవరపాటుతో ప్రవర్తించటానికి కారణం తెలుసుకోవచ్చునా?
ధ్రువస్వామిని ః లేదు నేనిక చనిపోను.నువ్వొచ్చేశావుగా అందుకే.నా పల్లకీ వెంట ఆ రోజు చామరంతో అలంకరించిన అశ్వం మీద వచ్చినది నువ్వే. విశ్వాసం ఉట్టిపడే నీ ముఖంలో ఆనాడు అంత ఆనందం ఎందుకు కనిపించింది?
చంద్రగుప్త్ ః గుప్తవంశపు వధువుని సాదరంగా పిలుచుకువచ్చేందుకు వెళ్ళాను,మరి ఆనందంగా ఎందుకుండను?
ధ్రువస్వామిని ః అయితే ఈనాడు నన్ను శకరాజు శిబిరంలోకి నన్ను తీసుకువెళ్ళేందుకు నువ్వే నావెంట రావాలి.(కన్నీళ్ళు తుడుచుకుంటుంది).
చంద్రగుప్త్ ః (ఆశ్చర్యంగా) ఇదేం పరిహాసం?
ధ్రువస్వామిని ః కుమార్ ఇది పరిహాసం కాదు,రాజాజ్ఞ.శకరాజుకి నా అవసరం ఎంతైనా ఉంది.నన్ను కానుకగా సమర్పించనిదే ఈ అడ్డంకి తొలగిపోదు.
చంద్రగుప్త్ ః ( ఆవేశంగా) ఇది జరగటానికి వీల్లేదు.మహారాణీ ! ఏ గౌరవాన్ని కాపాడేందుకు, ఏ మహత్తరమైన వంశాన్ని నిలబెట్టేందుకు నేను రాజదండం వదులుకుని రాజ్యాధికారం త్యాగం చేశానో, అది ఈ విధంగా అవమానింపబడటమా! నేను జీవించి ఉండగా స్వర్గీయ సముద్రగుప్తుడి గర్వాన్ని ఇలా భంగపరచవాసిందేనా ? (ఆగి) ఇంకొక విషయం కూడా ఉంది.నా హృదయాంధకారంలో తొలి కిరణంలా వచ్చి , నాకు తెలియకుండానే తన మధురమైన వెలుగుని నింపిందో , ఆ వ్యక్తి కూడా నీవే! నేను.. అందుకే మరచిపోవాలని ప్రయత్నించి…(ఉన్నట్టుండి ఆపేస్తాడు)
ధ్రువస్వామిని ః (కళ్ళు మూసుకుని, కుతూహలంతో ఆనందంగా)
ఊఁ…చెప్పు…చెప్పు !
( శిఖరస్వామి వెంట రామగుప్తుడు ప్రవేశిస్తాడు)
రామగుప్త్ ః చూడు కుమార్, ఇదేమైనా బాగుందా?ఆత్మహత్య ఎంత మహాపాతకం!
చంద్రగుప్త్ ః కానీ మీరు అది కూడా చేయలేకపోతున్నారు కదా!
రామగుప్త్ ః (శిఖరస్వామితో) చూశావా, కుమార్ మనసులో కల్మషం ఎంత …ఎంత …భయంకరంగా ఉందో?
శిఖరస్వామి ః కుమార్, వినయం గుప్త వంశీయులకు చెందిన గొప్ప గుణం.దాన్ని మరవకూడదు !
చంద్రగుప్త్ ః (వ్యంగ్యంగా) అందుకేగా మంత్రీ మీరు మహారాణి గారిని శత్రువుల పరం చేసి సంధి చేసుకోమంటున్నారు? ఇదే వినయ గుణానికి పరాకాష్ఠ, అవునా? ఇలాంటి వినయం వంచకులు ధరించే ముసుగు.అందులో శీలానికి తావు లేదు.ఇక శీలమంటే పరస్పరం గౌరవించుకోవటమే కదా? పౌరుష హీనుడైన నీచుడా ! ఆర్య సముద్రగుప్తుడి గౌరవాన్ని…
శిఖరస్వామి ః (మధ్యలో అడ్డుపడి) అందుకు నాకు మరణదండన విధించండి !ఏమాత్రం అభ్యంతర పెట్టకుండా దాన్ని నేను స్వీకరిస్తాను.కానీ రాజ్యాన్నీ, రాజునీ రక్షించవలసిన బాధ్యత నా మీదుంది.
మందాకిని ః (ప్రవేశించి) రాజు అసమర్థుడు,తన రాజ్యాన్ని రక్షించుకో లేకపోయినా అతన్ని రక్షించాలా? మంత్రివర్యా, ఇదేమి నిస్సహాయత? మరణదండనకైనా మీరు సిద్ధమే ! మహారాణి ఆత్మహత్యకి సిద్ధంగా ఉన్నారు.మరి అలాంటప్పుడు దేనికి సందేహిస్తున్నారు? చివరిసారిగా మీ బలాన్ని పరీక్షించి చూసుకోండి.గెలిస్తే రాజ్యమూ, గౌరవమూ దక్కుతాయి,లేదంటే సర్వ నాశనమైపోతారు!
చంద్రగుప్త్ ః ఓహ్, మందా ! ఇలాంటి ఉత్సాహపరిచే మాటలు చెప్పేందుకు నువ్వెక్కణ్ణించి వచ్చావు? ఏమంటారు మహామంత్రీ? కాస్త ఆమె చెప్పేది వినండి.
రామగుప్త్ ః (చేతులు నలుపుకుంటూ) కుట్ర, మోసం, నా ప్రాణాలు తీసేందుకు యుక్తులు !
చంద్రగుప్త్ ః అయితే రండి, మనం ఆడదానిలా కూర్చుని ఏడుద్దాం.
కొజ్జా ః (ప్రవేశించి) కుమార్, స్త్రీ అవటం అంత సులభం కాదు ! కొన్నాళ్ళు నా దగ్గర నేర్చుకోవాలి.(అందరి ముఖాలవైపూ చూసి, శిఖరస్వామి ముఖాన్ని నిమురుతాడు). ఊఁహూఁ, నువ్వు కాలేవు ! నీ ముఖంలో చాలా కఠోరమైన భావం ఉంది.(కుమార్ దగ్గరకెళ్ళి) కుమార్, ప్రమాణ పూర్తిగా చెపుతున్నాను, నా చేతులతో మిమ్మల్ని అలంకరించానంటే మహారాణి కూడా పోల్చలేరు .
(చంద్రగుప్తుడు ఆమెని చెవిపట్టుకుని బైటికి పంపిస్తాడు)
ధ్రువస్వామిని ః వదిలిపెట్టు కుమార్ ! ఇక్కడ అతనొక్కడే నపుంసకుడు కాదుగా? ఇంతమంది ఉండగా ఎవరినని బైటికి పంపించగలరు?
(చంద్రగుప్తుడు విచారంగా పచార్లు చెయ్యటం ప్రారంభిస్తాడు. శిఖరస్వామి రామ గుప్తుడి చెవిలో ఏదో చెపుతాడు)
చంద్రగుప్త్ ః (హఠాత్తుగా లేచి నిలబడి) మంత్రీ! అయితే నీ మాటే చెల్లనీ.నీ సహాయకుడు ఈ కొజ్జా చెప్పినది కూడా నాకు చాలా నచ్చింది.నేను ధ్రువస్వామిని వేషంలో శకరాజు దగ్గరకి వెళ్తాను.నా ఉపాయం ఫలిస్తే ఇక సమస్యే ఉండదు, ఒకవేళ నేను హత్యకి గురైతే ఆ తరవాత మీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యండి.
ధ్రువస్వామిని ః ( చంద్రగుప్తుణ్ణి తన బాహువుల్లో బంధించి) లేదు, నిన్ను వెళ్లనివ్వను. నా క్షుద్రమైన, దుర్బలమైన జీవితాన్ని, నా మానాన్ని రక్షించేందుకు నువ్వు ఇంత పెద్ద త్యాగం చెయ్యాల్సిన అవసరం లేదు.
రామగుప్త్ ః (ఆశ్చర్యం, కోపం కలగలిసిన భావం తో) వదులు…వదులు …ఏమిటిది సిగ్గులేకుండా, అందరి ముందూ…!
ధ్రువస్వామిని ః ( చంద్రగుప్తుణ్ణి వదిలి…నిద్రలోంచి మేల్కొన్నదానిలా) ఇది పాపమంటున్నారా? నాకోసం తన ప్రాణాలని సైతం సమర్పించేందుకు సిద్ధమైనవాణ్ణి, నా పట్ల ఆప్యాయత…(ఆగి) అయినా ఇప్పుడేమైందని? శకరాజు నన్ను దేవతలా భక్తి భావంతో పూజిస్తాడా? మానం మర్యాదలని మీరు ఎంతగా పట్టించుకుంటారో!
(శిఖరస్వామి మళ్ళీ రామగుప్తుడి చెవిలో ఏదో చెపుతాడు.అంగీకార సూచకంగా రామగుప్తుడు తలాడిస్తాడు)
శిఖరస్వామి ః ఆజ్ఞాపించండి రాజాధిరాజా ! యువరాజు చెప్పినట్టు ఇదొక్కటే మార్గం.కానీ రాజకీయాల దృష్ట్యా మహారాణి వారు కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది.
చంద్రగుప్తః (కోపంగా) ఎందుకు వెళ్ళాలి? ఆవిడ వెళ్ళేట్టయితే ఇక నేను వెళ్ళి ఏం లాభం? అలాగయితే నేను వెళ్ళను.
రామగుప్త్ ః కాదు, అది నా అజ్ఞ .సామంత రాజులతోబాటు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు.
ధ్రువస్వామిని ః కుమార్, మనం వెళ్ళవలసిందేనని తీర్మానిస్తే ఇక ఆలస్యం చెయ్యటమెందుకు?
( చంద్రగుప్తుడు నిష్క్రమిస్తాడు.ధ్రువస్వామిని అక్కడే ఏడుస్తూ కూర్చుని ఉండిపోతుంది)
రామగుప్త్ ః ఇప్పుడీ నటనేమిటి? నేను ముందే అనుమానించాను, ఈ రోజు నా కళ్ళు తెరిపించావు.
ధ్రువస్వామిని ః అనార్యుడా! నిర్దయుడా! నామీద కళంకం ఆపాదిస్తావా! నీ ఈ మాటలతో నేను ఊపిరి అందక చనిపోతానని అనుకుంటున్నావేమో , అటువంటి ఆశలేమీ పెట్టుకోకు.ఈనాడు నా నిస్సహాయత నాకు అమృతం తాగించి నా సిగ్గుమాలిన జీవితాన్ని పొడిగించాలని ఉవ్విళ్ళూరుతోంది.( లేచి నిలబడి చేత్తో వెళ్ళిపొమ్మని సైగ చేస్తూ)వెళ్ళు, నాకు ఏకాంతంగా ఉండాలనుంది.
(శిఖరస్వామి, రామగుప్తుడు నిష్క్రమిస్తారు)
ధ్రువస్వామిని ః ఆ ఒక్క క్షణకాలపు ఆలింగనం ఎంతటి మదురానుభూతిని అందించింది!నా మనసు సంతోషంతో నిండిపోయింది.విధి అనుకోకుండా వడదెబ్బకి కమిలిపోయిన వసుధని నిర్జనమైన క్షితిజం వద్ద సాయంకాలపు చల్లని ఆకాశంతో కలిపినట్టు!(ఆగి) ఊపిరి పీల్చటానికి కూడా వీలులేని ,గాలిలేని ప్రదేశంలో ఉండి ఉండి ఈ జీవితం దుర్భరమైపోయింది.అయినా నేను చనిపోను.ఈ లోకంలో కొన్ని రోజులు నా కోసం ఆ విధాత వద్ద అడిగి తీసుకుని దాచుకుంటాను.కుమార్, నీ ఉపకారం, ఆత్మీయతా వర్షపు ధారల్లా నన్ను పూర్తిగా తడిపేస్తున్నాయి.ఓహ్ !( గుండెల మీద వేలూని) ఈ వక్షస్థలంలో రెండు హృదయాలున్నాయా?లోపలి మనసు’అవును’అంటూ ఉంటే బైటి మనసు ‘కాదు’ అని ఎందుకంటోంది?
చంద్రగుప్త్ ః ( ప్రవేశించి) మహారాణీ,మేము సిద్ధమే ,కానీ ధ్రువస్వామిని వెంట శకరాజు శిబిరానికి వెళ్ళేందుకు సమ్మతించం.
ధ్రువస్వామిని ః (నవ్వి) రాజాజ్ఞ పాటిస్తే సరిపోదు.రాణీ మాట కూడా వినవద్దా? నన్ను ఇక్కడికి ఎలా వెంటపెట్టుకుని వచ్చావో అలాగే అక్కడికి చేర్చమని నేను ముందే కుమార్ ని కోరాను.
చంద్రగుప్త్ ః లేదు నేను ఒంటరిగానే వెళ్తాను.
ధ్రువస్వామిని ః ఈ ఆనందం నువ్వొక్కడివే అనుభవిస్తావా? అలా వీల్లేదు కుమార్! రాజు కోరిక ఏమిటో తెలుసుగా? నిన్నూ, నన్నూ ఒకే దెబ్బతో వదిలించుకోవటం.మరి అదే జరగనివ్వచ్చు కదా? ఇద్దరం కలిసే వెళ్దాం.మృత్యు గహ్వరంలో ప్రవేశించేప్పుడు నేను నీకోసం జ్యోతిలా వెలిగి ఆరిపోవాలనుకుంటున్నాను.ఇంకొక వినోదం, ప్రళయ పరిహాసం కూడా చూడగలుగుతాను.సహచరుడా! నువ్వు ధ్రువస్వామిని వేషం వేసుకుంటే ఈ ధ్రువస్వామియే చూడలేకపోతే ఏం లాభం?
(రెండు చేతులతో చంద్రగుప్తుడి గడ్దం పట్టుకుని జాలి గొలిపేట్టు చూస్తుంది)
చంద్రగుప్త్ ః ( అర్ధనిమీలిత నేత్రాలతో చూస్తూ) అయితే పద.
(సామంత కుమారుల వెంట మందాకిని ప్రవేశిస్తుంది – చంద్రగుప్తుడూ, ధ్రువస్వామిని వెంట సామంత కుమారులూ నెమ్మదిగా నిష్క్రమిస్తారు. మందాకిని ఒక్కతీ నిలబడి ఉండిపోతుంది)
———–తెర పడుతుంది———-
*****
ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.