నడక దారిలో-12

-శీలా సుభద్రా దేవి

నేను పీయూసి చదువుతున్న రోజుల్లోనే ఒక రోజు అకస్మాత్తుగా  మా చిన్నక్కని హాస్పిటల్ లో చేర్పించినట్లు కబురు వచ్చి అమ్మ కంగారుపడి హడావుడి గా వెళ్ళింది.అందరం  ఏమైందో నని గాభరా పడ్డాం.తీరా అమ్మ బొజ్జలో హాయిగా బజ్జోకుండా తొందరపడి రెండునెలలు ముందుగానే ప్రపంచాన్ని చూసేయాలని బుజ్జిబాబు బయటకు వచ్చేసాడని తెలిసింది.ఐతే మరికొంత కాలం డాక్టర్లు పర్యవేక్షణలోనే ఉంచి డిశ్చార్జి చేసాక కోరుకొండ సైనిక స్కూల్ లోని వాళ్ళింటికి తీసుకు వెళ్ళిపోయారు.అమ్మ కొన్నిరోజులు అక్కడకి వెళ్ళవలసి వచ్చింది.కోరుకొండలోని స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణం,ఫార్మ్ లో పండిన కూరగాయలు, పండ్లు, అక్కడి డైరీ పాలూ వీటన్నింటి వలన తొందరగానే బాబు ఆరోగ్యాన్ని పుంజుకొన్నాడు.

        నాకు కాలేజీ లేకపోవటాన అప్పుడప్పుడు నేను అక్కకి సాయంగా వెళ్ళేదాన్ని.అక్కడికి వెళ్ళినప్పుడు అక్కమిత్రుల ఇంటికి తీసుకు వెళ్తే వాళ్ళ కుట్టు మిషను పై బాబుకి చిన్న చిన్న జుబ్బాలు చిన్న బొంతలు వంటివి కుట్టేదాన్ని.

        మా ఇంట్లో రెండు గదుల్లో అన్నయ్యలు చదువుకోవటమో రాసుకోవటమో చేసుకుంటుండగా, వరండాలో అమ్మ ఏదో పనిచేసుకుంటూ ఉండేది.అమ్మకి సాయం చేయాల్సినవి చేసి తర్వాత నేను డాబా మీదగానీ డాబామెట్లమీద గానీ కూర్చుని పుస్తకాలు చదువుకుంటూనో, బొమ్మలు వేసుకుంటూనో,లేదా రాగాలు తీస్తూనో ఉండే దాన్ని. అందువల్ల మాఇంట్లో అందరూ ఎవరి అరల్లో వాళ్ళు ఉండటంవలన ఎప్పుడూ నిశ్శబ్దం మౌనంగా తపస్సు చేస్తున్నట్లుగా ఉండేది.ఎప్పుడైనా చిన్నక్క వచ్చినప్పుడు మాత్రం బుజ్జిబాబు కేరింతలతో ఇల్లంతా చిలుకలు వాలిన చెట్టై నాకెంతో సంబరంగా ఉండేది.        

  నాకు దొరికిన విరామసమయంలో ఇష్టమైన మరో అభిరుచి బొమ్మలు వేయటం .చిన్నన్నయ్యని ఇండియన్ ఇంక్ కొనమని అడిగి   చిన్నప్పటి నుంచి నాకు ఖాళీ సమయం దొరికితే స్నేహితుల పుట్టినరోజులకో పండుగలకు ఇవ్వటానికో గ్రీటింగ్ కార్డులు తయారుచేసి ఉంచేదాన్ని.

      నాకు పత్రికలలో సీరియల్స్ కి బాపు వేసిన చిత్రాలు చూసి వేయటం చాలా ఇష్టంగా ఉండేది.అలా వేసినవి పోయినవి పోగా కొన్ని మాత్రం ఇప్పటికీ మిగిలాయి.

       అన్నయ్య లైబ్రరీ నుండి పుస్తకాలు  తీసుకువచ్చేవాడు.అన్నయ్య గది శుభ్రం చేయటానికి వెళ్ళి ఆ పుస్తకాలు తీసుకుని చదివి అన్నయ్య వచ్చే సమయానికి యథాస్థానంలో పెట్టేసే దాన్ని.ఒకసారి అలా తీసుకు వచ్చిన జయదేవుని గీతగోవిందం టీకా తాత్పర్య సహితము గా ఉన్నది చదివాను. అందులోని అష్టపదులన్నీ ఒక పుస్తకం లో రాసుకున్నాను.అవి చదివినప్పుడు అష్టపదులన్నీ శృంగార భావనతోనే  ఉంటాయి కదా అటువంటప్పుడు వాటిని భక్తి పాటలుగా ఎలా పరిగణిస్తారు అని అనుకున్నాను.

  అందులోని ఒక అష్టపదిలో నాయిక ప్రియుని కొరకు ముస్తాబై ఎదురుచూస్తూ అతడు ఎంతకు రాకపోవటంతో దుఃఖోద్వేగంతో అలంకరించుకున్న ఆభరణాలన్నీ తీసి విసిరికొడుతుందనీ,అప్పుడు ప్రియుడు వచ్చి ఒక్కొక్క ఆభరణాన్నీ తిరిగి అలంకరించటాన్నీ ఒక్కో చరణంలో జయదేవుడు వర్ణించాడు.అది నాకు చాలా నచ్చి అష్టపది లోని ఎనిమిది చరణాలకూ ఎనిమిది చిత్రాలు వేసాను.అప్పటివరకూ బాపూ చిత్రాలు చూసి వేసినా ఇవి మాత్రం స్వంతంగానే వేసేంతగా ఆ అష్టపది నామనసులో అంతగాఢంగానూ రూపు కట్టింది.కానీ అందులో కొన్ని చిత్రాలు ఎందువల్లనో అసంపూర్తిగా వదిలేసాను.ఈ లోపున పరీక్ష పాసవటం తిరిగి కాలేజీ లో చేరటం ఒకకారణం అయ్యుండొచ్చు.ఇంతకీ ఆ అష్టపది ఏమిటో మాత్రం ఇప్పటికీ అసలు గుర్తు రావటం లేదు.

                 బాపూ బొమ్మలే కాక కొన్ని వడ్డాది పాపయ్య చిత్రాలు కూడా వేసాను. బాపూ చిత్రాలు కేవలం రేఖా చిత్రాలు గా  వేసేందుకు వీలుగా ఉంటాయి.కానీ వపా చిత్రాలు రంగులమేళవింపుతోనే అందగిస్తాయి.రేఖాచిత్రం గా వేసి ఆపితే బాగుండవు.అందుకే వడ్డాది పాపయ్య చిత్రాలు తక్కువగా వేసాను.

            తర్వాత్తర్వాత చిత్రాలు  వేసే తీరిక లేకపోయింది.వివాహానంతరం వీర్రాజు గారు వేస్తుంటే ఉత్సాహం వచ్చేది కానీ తీరికగా కూచుని వేసేంత వెసులుబాటు నాకు ఉమ్మడి సంసారంలో కలగలేదు.

               నా బాల్య స్నేహితురాలు కుమారీ ఆడబడుచు బియీడీ చదువు తున్నప్పుడు  మాయింటికి వచ్చి “నువ్వు బొమ్మలు బాగా వేస్తావని వదిన చెప్పింది.నాకు చార్టులు వేయవా” అని అడిగింది.సరే అని వప్పుకుని తీరిక చేసుకుని వేసాను.ఆమెకు వేసిన చార్టులు చూసి బియీడీ ట్రైనింగు అవుతున్న విద్యా ర్థినులు మరికొంత మంది వచ్చి డబ్బులు ఇస్తాం వేసిపెట్టమని బతిమాలారు.

                    ఇంటి పనులయ్యాక తీరిక చేసుకుని ఆ ఏడాదేకాక రెండేళ్ళపాటూ చాలా మందికి చార్టులే కాక వాళ్ళు చెప్పే పాఠాలికి మోడల్స్ కూడా చేసి నా చేతి ఖర్చు కి కాసిన్ని డబ్బులు సంపాదించాను.అదే నా మొదటి సంపాదన.తర్వాత కుటుంబ బాధ్యతలు,పిల్లలు అనారోగ్యం ,చికాకులు తో  అదీ ఆగిపోయింది.

               ఇంక  పేపర్లమీద మానేసి ఎప్పుడైనా చీరల మీదో,పాప ఫ్రాకులమీదో ఫేబ్రిక్ డిజైన్లు కి పరిమితమైపోయింది నా చిత్రలేఖనం.

                నా బాల్య మిత్రులు ఎవరైనా ఫోన్ చేస్తే మొదటిగా అడిగే. ప్రశ్న ” చిన్నప్పుడు చిత్రాలు వేసేదానివి.ఇప్పడూ వేస్తున్నావా”అనే.ఇటీవల ఒక బాల్య మిత్రుడు తన దగ్గర ఎప్పుడో నేను వేసిన గ్రీటింగ్ కార్డులు వాట్సప్ లో షేర్ చేసేడు సుమారు నలభై ఏళ్ళకు పైగా భద్రంగా అతను దాచినందుకు ఎంత ఆశ్చర్యం వేసిందో.            

            చిత్రలేఖనం వంటి కళలను జీవితాంతం కొనసాగించటం మహిళలకు కష్టమే.అందుకు తగిన ప్రోత్సాహం,సమయం ,వాతావరణం అన్నీ అనుకూలించాలికదా.            

            అందుకేనేమో  మన తెలుగుపత్రికల్లో కథలకి చిత్రాలు వేసేవాళ్ళల్లో మహిళలు లేరు.ఒక్క రాగతిపండరి మాత్రం కార్టూనిస్ట్ గా  పత్రికల్లో కనిపించేది.                                       టీచర్ గా పనిచేసే రోజులలో పిల్లలచేత పాఠశాలకు సంబంధించిన చార్టులు వేయించటం అప్పుడప్పుడు నేను వేయటం తప్ప మనషుల చిత్రాలు వేయనేలేదు.ఉద్యోగ విరమణ తర్వాతమళ్ళా మొదలెట్టాలని స్కెచ్ పుస్తకం కొనుక్కొన్నాను.కానీ ఒక మూడు పెన్సిల్ చిత్రాలతో అదీ ఆగిపోయింది.

              నా విరామసమయంలోనే  నా స్నేహితురాలు కుమారీ వాళ్ళఅన్నయ్య, అతని మిత్రుడు కలిసి ఎమెస్కో ఇంటింటి గ్రంథాలయం స్కీం లో చేరి బోలెడు పుస్తకాలు తెప్పించారు.అది తెలిసిన తర్వాత ఇంక నాకు పండగే.నేను అప్పుడప్పుడు ఏ వారానికో  వెళ్ళి ఒక అరడజను పుస్తకాలు తెచ్చుకొని చదివి తిరిగి ఇచ్చేదాన్ని.                                                                   అప్పుడప్పుడు నా ఆలోచనల్ని కథలరూపంలో రాయటం కూడా మొదలు పెట్టాను.కానీ అన్నయ్యలు చూసి ఇవి రాస్తూ చదువు పాడుచేసుకుంటున్నానని కోప్పడతారని క్లాసు పుస్తకాలు కింద దాచేసేదాన్ని.    

             బళ్ళో చదువుతున్నప్పుడు లిఖిత పత్రిక కోసం పద్యాలు రాసినా మళ్ళా వాటి జోలికి పోలేదు.కథలూ,నవలలూ తప్ప కవిత్వం మాత్రం ఇంట్లో లేకపోవటాన చదవలేదు.                                                                                                                                                  అప్పటికే చిన్నన్నయ్య విరివిగా కథలు రాసేవాడు.అతను రావిశాస్త్రికి ఏకలవ్యశిష్యుడు.రావిశాస్త్రీ,బీనాదేవి, కాళీపట్నం రామారావు,చాసో కథల పుస్తకాలు కొంటూ ఉండేవాడు.అవి చదువుతుండటం,అన్నయ్య కూడా రాసే కథలూ అదే విధమైన అభ్యుదయ దృక్పథం కనుక అటువంటి సాహిత్యమే ఎక్కువగా చదవటం అలవాటైంది.                                                                                                

              చిన్నన్నయ్య తన స్నేహబృందం తలా ఒక పత్రికకొని అందరికీ సర్క్యులేట్ చేసే ఏర్పాటు చేసాడు.అందువల్ల  తెలుగు వారమాసపత్రికలన్నీ చదివేదాన్ని.పత్రికలలో అన్ని సీరియల్స్ చదువుతున్నా,రంగనాయకమ్మ సీరియల్స్ ఎక్కువగా ఇష్ట పడేదాన్ని.ఇతర వచన సాహిత్యం లోని సరళమైన వాక్యనిర్మాణం, శైలీ,కథన శిల్పం నచ్చినా వామపక్ష దృక్పథంతో వచ్చే రచనల్ని చదవటమే నాకు నచ్చేది. నా ఆలోచనా విధానం లో అలా క్రమంగా వస్తున్న మార్పు నాకు తెలుస్తూనే ఉంది.                                                                                                                                                                        ఒక మామయ్య కమ్యూనిస్టులతో తిరిగేవాడనీ,స్వాతంత్రానంతరం వారిమీద నిషేధం ఉండేదనీ,అప్పుడు ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడని కథలుగా చిన్నప్పుడు విన్నాను.మామామయ్యలు ఒకరిద్దరూ, అన్నయ్యలు,మా పెద్దక్కా వాళ్ళూ పూజలవీ చేయగా చూసిన గుర్తు లేదు.మా అమ్మ మాత్రమే దేవుడి దగ్గర దీపం పెట్టేది.అందుచేతనో,మరెందుకో ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేది కాదు.నాకు లలిత సంగీతం ఇష్టం కనుక భక్తి పాటలు కూడా పాడేదాన్ని.లలిత కళలన్నీ దైవంతోనూ, ఆధ్యాత్మిక చింతన తోనూ ముడిపడే ఉంటాయి కదా?                                               అన్నట్లు మా కాలేజీ మాగజైన్ కి నేను కృష్ణుడు,రాథల ప్రణయగాధని అనేక లలిత గీతాలతో కదంబంగా అల్లి సంగీత రూపకంలా రాసాను.ఎందుకంటే రావు బాలసరస్వతి పాటల్లో అనేకం కృష్ణుడి గీతాలే కదా? ఆమె పాటలంటే నాకు ప్రాణం అప్పుడూ ఇప్పుడూ కూడా.                      

          ఇవి ఆ ఏడాదంతా  నా పాటలూ,గీతలూ,రాతలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.