నిష్కల – 12
– శాంతి ప్రబోధ
ఆశ్చర్యంతో పెద్దవైన కళ్ళు , ముడుచుకున్న కనుబొమ్మలు అచ్చం నాన్నమ్మ లాగే ..
ఒక వేళ .. ఆమె .. ఏదో సందేహం మొదలై తొలచి వేస్తున్నది నిష్కల ను. ఆ సందేహాన్ని బయటికి తోసివేయలేక పోతున్నది.
సారా కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూస్తూ ” అవును, నేను చెబుతున్నది నిజమే సారా జి.సి.జలాల .
నా పేరు నిష్కల జె . జె ఫర్ జలాల ” అని ఆగి సారా కళ్ళలోకి సూటిగా చూస్తున్నది నిష్కల
రియల్లీ .. స్ట్రేంజ్ .. సో స్ట్రేంజ్ ..
హౌ ఇట్స్ పాసిబుల్ ” అన్నది సారా నిష్కల చేయి అందుకుంటూ ..
ఆ స్పర్శ ఆత్మీయంగా తాకింది నిష్కల హృదయాన్ని
ఆశ్చర్యంగా ఉందే .. మీరు ఇండియన్ , సారా సింగపూర్ అమెరికన్ అన్నది గీత అయోమయంగా చూస్తూ …
అవునన్నట్లు సాలోచనగా చూస్తూ తల ఊపింది సారా .
ఆ వెంటనే “నేను సగం ఇండియన్ అమెరికన్ , సగం సింగపూరియాన్ అమెరికన్ అని చెప్పి, మళ్ళీ తానే ఊహూ .. అలా కాదు, మా నాన్న ఇండియన్ అమెరికన్. మా అమ్మ సింగపూరియన్ అమెరికన్. నిజానికి మా అమ్మ సింగపూరియాన్ కాకముందు చైనీస్ మలేషియన్ .
ఇప్పుడు చెప్పండి .. నేనేంటి? అంటూ పెద్దగా నవ్వింది
నేను అమెరికాలో పుట్టాను కాబట్టి నేను అమెరికన్ గానే క్లెయిమ్ చేసుకుంటాను.
అవునా .. చైనీస్ మలేషియన్ ఏంటి ? అర్థం కానట్టు మొహం పెట్టింది గీత.
అంటే మా అమ్మ మూలాలు చైనాలో ఉన్నాయన్న మాట.
అవును , మా ముత్తాత ది చైనా. మలేసియాన్ స్త్రీని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. మా తాత కుటుంబం మలేసియా లోనే ఉన్నారు. మా అమ్మ అక్కడే పుట్టింది . తర్వాత మా తాత , ఫిలిప్పిన్స్ కు చెందిన మహిళను పెళ్ళి చేసుకుని సింగపూర్ లో స్థిరపడ్డారు . మా అమ్మ సింగపూర్ లో పెరిగింది . కుటుంబం అంతా సింగపూర్ పౌరసత్వం తీసుకుంది. అలా మా అమ్మ సింగపూరియాన్ గా మారింది. ఆ తర్వాత అమెరికా వచ్చి అమెరికన్ పౌరసత్వం తీసుకుంది . ఇండియన్ ని పెళ్లి చేసుకుంది.
నేను ఇక్కడే, అమెరికాలోనే పుట్టాను అని వివరించింది సారా.
ఓ … చాలా గమ్మత్తుగా ఉంది. క్రాస్ బ్రీడ్…
ఇండియన్ , సింగపూరియాన్, మలేషియన్ , చైనీస్ రక్తం నీ ఒంట్లో ప్రవహిస్తున్నది
అందుకే అంత తెలివి తేటలు వచ్చాయేమో .. కళ్ళెగరేసింది గీత .
హా .. నిజమా .. అన్నట్లుగా చూసి గట్టిగా నవ్వేసింది సారా . అట్లా నవ్వుతున్నప్పుడు మళ్ళీ నాన్నమ్మే కనిపించింది నిష్కలకి.
మా వాళ్ళు పెద్దలు చూపిన పెళ్లిళ్లు చూసుకుంటారు. బంధువుల్లో లేదా కులంలోని మతంలోని వాళ్ళని చూసి చేసుకుంటారు. ఇంత వైవిధ్యం ఉండదు సారా.. అన్నది నిష్కల.
ఆ మాట అంటున్నప్పుడు తన పుట్టుకకు కారణమైన తండ్రి గుర్తొచ్చాడు. అతను చేసిన పని మనసుని మెలిపెట్టింది. గొంతులో సన్నని జీర వచ్చింది.
మీకు అమెరికన్ పేరు .. అడుగుతున్న గీత సందేహం సారా కి అర్థమైంది. సన్నగా నవ్వుతూ నా పేరు పూర్తి పేరు సారా గుణ చైయో జలాల. సారా జి.సి. జలాల అని రాసుకుంటా . అంతా సారా అని పిలుస్తారు.
అమ్మ చైయో .. అంటుంది ముద్దుగా.
ఆ పేరు వినడం తోనే ఉలిక్కిపడింది నిష్కల. తనది సందేహం కాదు. నిజమే అనిపిస్తుండగా ” మీ నాన్న .. ” లోపల ఆమె తండ్రి గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత తొందర పెడుతున్నప్పటికీ , అడగొచ్చో లేదో.. ఎదుటివారి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లడం సభ్యత కాదేమో అని ఆగిపోయింది నిష్కల .
నిష్కల కేసి స్నేహపూర్వకంగా మీ సందేహం అర్ధమైందన్నట్లు చూస్తూ .. మా నాన్న ఇండియన్ అమెరికన్ అని మాత్రమే తెలుసు. అతని పూర్వీకులు దేశాంతరాలు పట్టి తిరగలేదేమో .. భుజాలెగరేస్తూ అన్నది సారా .
ఇండియా చాలా పెద్ద దేశం. ఏ ప్రాంతం నుంచి వచ్చారు సారా .. ” చనువుగా అడిగింది గీత . కొంత కాలంగా సారా తోనే ఉంటున్నప్పటికీ ఆమె వ్యక్తిగత విషయాలు గీతకు తెలియదు .
” ఏమో .. అదంతా నాకు తెలియదు” అని ఒక క్షణం ఆగి “సౌత్ ఇండియా అనుకుంటా ” చేతి వెళ్లనున్న గోళ్లరంగు చూస్తూ చెప్పింది సారా .
ఆమె తండ్రి సౌత్ ఇండియన్ తల్లి సింగపూరియన్ అమెరికన్ ..
ఆమె పేరు సారా గుణ చైయో జలాల అంటే .. నిష్కల హృదయం వేగంగా స్పందిస్తున్నది .. ఆ గుండె సవ్వడి ఆమెకు స్పష్టంగా తెలిసిపోతున్నది.
ఒక్కసారి సారా జలాల ని గట్టిగా హత్తుకోవాలి అని నిష్కల మనసు తపన పడింది. తహతహలాడింది.
ఆ క్షణంలో తనలో కలుగుతున్న భావోద్వేగాన్ని లోలోనే అణుచుకోవడానికి చాలా కష్టపడింది నిష్కల.
“సారా…మిమ్మల్ని చూసిన, మీ నవ్వు, కళ్ళు ముఖ్యంగా ముడుచుకునే మీ భృకుటి అచ్చం మా నాన్నమ్మనే గుర్తు తెస్తున్నాయి. వేల మైళ్ళ దూరంలో ఉన్న మా నాన్నమ్మను చూస్తున్న భావన కలుగుతుంది నాకు ” అన్నది నిష్కల ప్రశాంత వదనంతో.
“ఓ .. అవునా ..
అయితే నేను మీ అమెరికన్ నాన్నమ్మను, హ్హా ..హహ్హ …
యంగ్ అండ్ ఎనర్జిటిక్ నాన్నమ్మను హహ్హహ్హా…
ఆర్ యు గోయింగ్ టు కాల్ మీ ఆస్ నాన్నమ్మ ? ” నవ్వేసింది సారా ..
“సో వ్వాట్ .. “అన్నది గీత
ఆ నవ్వుతో మిగతా ఇద్దరు జత కలిపారు. ఆ తర్వాత కొన్ని క్షణాల మౌనం ముగ్గురి మధ్య. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు .
ఆ క్షణంలో సారా కి ఆమె చిన్నప్పుడు తండ్రి అన్న మాటలు గుర్తొచ్చాయి.
నువ్వు మా అమ్మవు. మా అమ్మలాగే ఉంటావు.
మా అమ్మకు ఆడపిల్లలంటే అంత ఇష్టం ఉండదు. కానీ తన పోలికలతో ఉన్న నిన్ను చూస్తే ఆమె ఎంత మురిసిపోతుందో ..
నీకు తెలుసా .. నీ పేరులో గుణ మా అమ్మ పేరు లోంచి తీసి పెట్టాను అని మురిపెంగా చెప్పిన మాటలు మదిలో మెదిలాయి.
సారా ని ఆమె తండ్రి ఎప్పుడూ సారా అని పిలిచేవాడు కాదు. అమ్మా అని పిలిచేవాడు.
తండ్రి ఇండియన్ అమెరికన్ అని తెలుసు. అతని బంధువులంతా ఇండియాలో ఉంటారని తెలుసు. అంతకు మించి తండ్రి గురించి , అతని కుటుంబం గురించి ఏమీ తెలియదు. చిన్న తనంలో అడిగేది .
అమ్మ వాళ్ళ అమ్మ ఉంది. నాన్న ఉన్నాడు . ఆమె చెల్లి ఉంది. వాళ్లందరినీ చూశాను. మాట్లాడాను.
మీ పేరెంట్స్ తో మీ సిబ్లింగ్స్ తో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎవ్వరినీ చూడలేదు అని ప్రశ్నించేది.
నీకు లేరా నాన్నా అని అడిగేది .
నాకు అందరూ ఉన్నారమ్మా .. అని చెప్పేవాడు తప్ప ఎప్పుడూ చూపించలేదు. వాళ్లెప్పుడూ తమ దగ్గరకు రాలేదు . తామెప్పుడూ వాళ్ళ దగ్గరికి వెళ్ళ లేదు.
తన తండ్రి తల్లిని ఫొటో లో కూడా ఎన్నడూ చూసిన జ్ఞాపకం లేదు సారా కి .
సారా ఏడెనిమిదేళ్ల వయసులో ఉండగా మొదటిసారి తండ్రితో కలసి క్రిస్మస్ సెలవుల్లో ఇండియా ప్రయాణం పెట్టుకున్నారు కుటుంబం అంతా.
తన తండ్రి పుట్టిన దేశాన్ని , అతని తల్లిదండ్రులు, తోబుట్టువులను ఎప్పుడెప్పుడు చూడాలి అని ఉబలాట పడింది సారా . ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నది .
కానీ అనుకోకుండా జరగరానిది జరిగిపోయింది.
సెప్టెంబర్ 11, 2001 లో జరిగిన తాలిబాన్ ఉగ్రవాద చర్యలో తండ్రి మరణం ఓ చేదు జ్ఞాపకం గా మిగిలిపోయింది .
ఆరోజు తమ జీవితాల్లో చీకటి రోజు అని తెలియదు . అతనికి చివరి రోజని తెలియదు . తెలిస్తే వెళ్లనిచ్చేది కాదు .
వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలో పనిచేసే సారా తండ్రి ఎప్పటిలాగే ఉదయం ఏడు గంటలకు బయలుదేరి న్యూ యార్క్ నగరం లో ఉన్న తన ఆఫీసుకు వెళ్లాడు.
ఆల్ ఖైదా ఉగ్రమూక విమానాలతో దాడి చేస్తారని ఎవరూ ఊహిస్తారు.
ఉదయం 8. 45 అయింది .
ఒక్కసారిగా దద్దరిల్లిపోయే శబ్దం.
నార్త్ టవర్ 80 వ ఫ్లోర్ ని విమానం వచ్చి గుద్దింది. దట్టమైన నల్లటి పొగ ఎగిసిపడే మంటలు చుట్టుముడుతుండగా ఆ టవర్ లో ఉన్న జనం ఉరుకులు పరుగులు .. ఏమైందో తెలియని అయోమయంలో చుట్టుపక్కల జనం ..
అది జరిగిన మరో 18 నిముషాలకే మరో విమానం సౌత్ టవర్ పై దాడి చేసింది.
నిత్యం సందడిగా ఉండే ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది .
ఢమఢమ ఉరిమిన ట్లు శబ్దం. మిన్ను విరిగి మీద పడుతున్నప్పుడు వస్తున్న ఆర్తనాదాలు ..
ఆకాశాన్ని తాకుతున్నట్లున్న110 అంతస్తుల ఆ ఆకాశ హార్మ్యాలు నేలమట్టం అయ్యాయి.
ఆ శిథిలాల్లో వేల ప్రాణాలు… సమాధి అయ్యాయి.
అదే రోజు అదే సమయంలో వాషింగ్టన్ లోని పెంటగాన్ పై, పెన్సిల్వేనియా లోను ఉగ్రదాడులు ..
ఏ క్షణం ఏం జరుగుతుందో .. ఏమి వినాల్సి వస్తుందో ననే భయం భయంగా .. జనం
తమ ప్రాణాలను కాపాడుకోవాలనో , తమ వాళ్ళను చూసుకోవాలనో ఉరుకులు పరుగుల జనం.
జరుగుతున్నదేమిటి అర్ధంకాక అయోమయంతో జనం
శిథిలమైన ఆ భవనాల్లాగే అందులో చిక్కుకుపోయిన వారి జీవితాలు నేలమట్టం అయ్యాయి. ఆ శకలాల్లో సమాధి అయ్యాయి.
ఆ రోజు కొద్దిగా నలతగా ఉందని ఇంట్లో ఉన్న తల్లి టీవీ వార్తలు చూసింది.
వెంటనే భర్తకు ఫోన్ చేసింది . సమాధానం లేదు .
ఆమెలో కంగారు , భయం మొదలయ్యాయి . ఇంట్లోంచి బయటికి వచ్చి చూస్తే దూరంగా కనిపించే న్యూయార్క్ నగరం వైపు నుండి చుట్టూ దట్టమైన నల్లటి పొగ మేఘంలా .
ఏమీ అర్థం కాకుండా ..
ఆ రోజు దాదాపు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు . అందులో సారా తండ్రి ఒకడు .
ఆ భయానక సంఘటన తాలూకు అనుభవాలు మదిలో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. తండ్రి తలపులతో భారమైన హృదయాన్ని కూడదీసుకుంటూ మాములుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నది సారా .
నాన్న ఉంటే ఎలా ఉండేదో .. తన వాళ్ళని కల్సి ఉండేది .
చాలా మంది ఆసియన్స్ లాగానే అమ్మకి మూఢ నమ్మకాలు ఎక్కువ. పెన్సిల్వేనియా నుండి న్యూ జెర్సీ కి వచ్చినప్పుడు నాన్నతో చాలా గొడవ పెట్టుకుంది. కారణం నాన్న నాలుగో అంతస్తులో ఫ్లాట్ తీసుకోవడమే . నాలుగో అంతస్తులో ఉండడం అంటే చావుతో సహవాసం చేయడమే అని అమ్మ నమ్మకం. ఏడాదికి అగ్రిమెంట్ చేసుకున్న నాన్న అమ్మ గొడవపడలేక రెండు నెలలకే అగ్రిమెంట్ బ్రేక్ చేసేసాడు. అయినా మృత్యువు ఆగిందా .. నాన్నతో దోస్తీ కట్టి వెంట లాక్కుపోయింది .
ఎప్పుడూ లేనిది ఇండియా వెళదాం అని టికెట్స్ బుక్ చేసాడు. అందరికీ తమ ని పరిచయం చేస్తానన్నాడు. తమకు అందరినీ చూపిస్తానన్నాడు. అదేమీ జరగకుండానే ఆయన అందరినీ విడిచి అందనంత దూరం చేరేసరికి అమ్మ కి నేను ఇండియా పేరు ఎత్తడం నచ్చేది కాదు .
నాన్న కూచిని అయిన నేను నెమ్మదిగా నాన్న జ్ఞాపకాలకు దూరమవుతూ వచ్చాను. ఇక ఆయన పుట్టిన దేశం ఇంకేం గుర్తుంటుంది ..? ఎప్పుడో మెరుపు పొరల్లో చేరిపోయింది.
ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ..
కొన్ని క్షణాల తర్వాత , మీ నాన్నమ్మ గారి ఫోటో ఉందా .. మిస్ నిష్కల . నాలాగా ఉన్న ఆవిడను చూడాలని ఉంది అన్నది సారా
తన మొబైల్ తీసి అందులో నాన్నమ్మ ఫోటో చూపింది. సారా కి చాలా ఆశ్చర్యంగా ఉంది .. థ్రిల్లింగ్ గా ఉంది.
నిజమే, తన పోలికలు ఆవిడలో .. ఊహూ .. కాదు కాదు , ఆవిడ పోలికలు తనలో.. ఆ వయసు వచ్చేసరికి నేను కూడా అలాగే ఉంటానేమో అనుకుంది సారా .
మీరన్నది నిజమేనేమో ..నిష్కల గారూ..
ప్రపంచంలో ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటే ఏమిటో అనుకున్నాను . ఇప్పుడు ఈ ఇద్దరినీ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అన్నది గీత
“మీరు ఏమీ అనుకోనంటే చిన్న రిక్వెస్ట్ .” అంటూ నిష్కల మొహం లోకి చూసింది సారా..
ఏమిటన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది నిష్కల .
“మీ నాన్నమ్మ ఫోటో నాకు ఫార్వర్డ్ చేయగలరా .. ? మా అమ్మకు చూపిస్తా. ” రిక్వెస్ట్ చేసింది సారా
నిష్కల కు సారా , గీత లను చూస్తుంటే తన క్లయింట్, క్లయింట్ మిత్రురాలు అనిపించడం లేదు . తనకు ఆత్మీయులుగా తోచారు .
మామూలుగా కేసుకు సంబంధం లేని విషయాలు అసలు మాట్లాడని నిష్కల , ఎప్పుడు ఎంతో బిజీబిజీగా ఉండే నిష్కల వాళ్లకు సమయం ఇస్తున్నది.
సారా ని చూస్తుంటే నాన్నమ్మ తో పాటు ఆమె పెద్ద కొడుకు, తన జన్మకు కారకుడైన తండ్రి గుర్తొస్తున్నాడు. అతన్ని ముఖతా ఎప్పుడూ చూసిన గుర్తులేదు.
ఫోటోలు చూసింది. అవి కూడా అమ్మ వాళ్ళ పెళ్లయిన కొత్తలో దిగిన ఫోటోలు. ఇప్పుడు ఎలా ఉంటారో …
బహుశా .. నేనెప్పుడైనా చూసే ఉంటుందేమో.. కానీ నేనెవరో అతనికి తెలియదు. అతనెలా ఉంటాడో నాకు తెలియదు. నేను ఇక్కడ ఉన్న విషయం బాబాయిల ద్వారా తెల్సే ఉండొచ్చు.
అమ్మతో జీవితం పంచుకోవడం ఇష్టం లేదు. పెద్దల మాట తీసేయలేక తల వంచాడు. పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తన దారి తాను చూసుకున్నాడు.
అమ్మ సంగతి వదిలేద్దాం. కనీసం నాన్నమ్మ ని చూడడానికి రాడు.
నేనేం పాపం చేశానని .. నన్ను తండ్రి గా ఏనాడు దగ్గర కి తీయలేదు. కనీసం నా మొహం చూడలేదు. ఇంకా అతన్ని తండ్రి అంటున్నదేమిటి?
అయినా నేనేంటి ఇవ్వాళ ఇలా ఆలోచిస్తున్నాను? ఏనాడూ నా గురించి , అమ్మ గురించి పట్టించుకోని అతని గురించి ఆలోచిస్తున్నాను .
అతని గురించి ఆలోచించి తన సమయం వృధా చేసుకుంటుందేమో .. అనుకుంది. కానీ సారా పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని ఉబలాట పడుతోంది నిష్కల మనసు.
“అందుకే ఫోటో అడగగానే తప్పకుండా అని నాన్నమ్మ ఫోటోలు రెండు ఫార్వర్డ్ చేసింది నిష్కల. నాన్నమ్మ పక్కనుంటే ఆవిడ మనవరాలు అంటే అందరూ నమ్ముతారు ” అని నవ్వింది నిష్కల .
“అవునవును.. మరి మీరు .. మీ నాన్నమ్మ ముందు నేనుంటే ఆవిడ ఏమంటుంది ..?” హహ్హహ్హా .. ” ఊహించుకుని గట్టిగా నవ్వేసింది సారా .
వీళ్లిద్దరు ఎంత అదృష్టవంతులు. ఇద్దరు దాదాపు తన ఈడు వాళ్ళు. ఒంటరి వాళ్లే.
చీకు చింత లేకుండా హాయిగా నవ్వుతున్నారు.
నిష్కల మొహం మీద ఆ చిరునవ్వు చెదరదు.
కళ్ళు కూడా నవుతూన్నట్లే ఉంటాయి. స్నేహంగా పలకరిస్తాయి. ఆత్మీయంగా మాట్లాడుతుంది.
ఎన్నో కేసులు మహిళలకు , పిల్లలకు సంబంధించినవి వింటుంది. తన క్లయింట్ బాధను తుడిచేయడానికి ప్రయత్నిస్తుంటుంది.
ఎప్పటికప్పుడు వాటి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తుంది. ముఖ్యంగా క్లయింట్ కి తను ఇచ్చే కౌన్సిలింగ్ అపారమైన శక్తిని ఇస్తుంది.
నిష్కల నిండైన నదీ ప్రవాహంలా అగుపించే ఆమెకు ఎలా సాధ్యమో ..?!
అంత ప్రశాంత వదనంతో ఉండడం .. ఆ నదీ ప్రవాహంలో సుడిగుండాలు ఉండవా అని ఆశ్చర్య పోతుంటుంది .
ఆ .. ఎందుకుండవు .. ఆమెతో తన పరిచయం వయసెంతని .. అని తనకు తాను చెప్పుకుంది గీత.
ఇక సారా సంగతి చెప్పనవసరం లేదు. గల గల పారే సెలయేరు లా ఉంటుంది.
ఎప్పటికప్పుడు సెల్ఫ్ బూస్టింగ్ చేసుకుంటూ ఉంటుంది. చాలా అలర్ట్ గా ఉంటుంది. ప్రతిదీ పాజిటివ్ గా ఆలోచిస్తుంది. అలా ఎలా ఉండగలుగుతుంది … అనుకుంటూ ఇద్దరినీ గమనిస్తున్నది గీత.
అతను తన జీవితంలోకి రాకపోతే నేను కూడా ఇలాగే ఉండేదాన్నేమో .. తలపోస్తున్నదల్లా
“స్త్రీ ప్రేమకీ పురుషుడి ప్రేమకి చాలా తేడా ఉంటుందేమో ..
స్త్రీ సర్వం సమర్పించుకుంటుంది. హృదయ పూర్వకంగా ప్రేమిస్తుంది. పురుషుడు అలా చేయడు” అకస్మాత్తుగా అన్నది గీత
ఆమె ఆ మాటలు ఎందుకన్నదో అర్థం కాక నిష్కల , సారా ముఖాలు చూసుకున్నారు.
“గీతా .. మీ మాటలను నేనసలు అంగీకరించను.
స్త్రీ కూడా పురుషులంత స్వార్ధంగా ఉండడంలో తప్పేముంది ? విలువల భారాన్ని నరనరాల్లో ఇంకిపోయేలా చేశారు. అవి అంత త్వరగా వదలవు కానీ వదిలించుకోవాలి” అన్నది నిష్కల.
“కవచకుండలాల్లా జన్మతః వచ్చే ముళ్ల కిరీటాలు మోయాల్సిందే .. లేదంటే మన సమాజంలో మనుగడ ఉంటుందా ..” ఎదురు ప్రశ్నించింది గీత .
“మంచుపల్లకీ ఎక్కించి ఊరేగించి మాయచేసిన పురుష స్వామ్యం గురించి ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా ..?
నువ్వు వున్నది అమెరికన్ సమాజంలో .. భారతదేశంలో కాదు.
ఇక్కడ ఉండీ.., ఊహూ ఏ దేశంలో ఉన్నప్పటికీ ఈ నాటి ఆడపిల్ల ఇంకా ఆ భారాన్ని మోసుకు తిరుగుతాననడం చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది . బాధగా ఉంది.
మనం మనవి కాని వేషభాషలు సులభంగా వంట పట్టించుకుంటాం కానీ మనదైన శరీర భాషనీ, మనదైన మనసు ఆలోచనని ఎప్పుడూ ఆమోదించం. మనం మన కోసం కాకుండా ఎదుటివారి కోసం బతుకుతూంటాం కాబట్టి . ఆ ఎదుటి వారిని సంతోషపెట్టడం కోసం ప్రయత్నిస్తాం కాబట్టి అంతేనా ..? ” ప్రశ్నించింది నిష్కల.
“పురుషులకంటే అదనపు మంచితనాలు ఆడవాళ్ళకెందుకు ? విలువల భారం స్త్రీలపై మోపడం అన్యాయం కదా .. తరతరాలుగా జీర్ణించుకుపోయిన భావాలు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదా.. ఏసియన్స్.. ము ఖ్యంగా ఇండియన్ విమెన్ మూర్ఖంగా ఆలోచిస్తారని చాలా సార్లు వాదించాను గీతతో .
ఇంటికే పరిమితం అయిన జీవితాలు అట్లా ఆలోచించాయంటే అర్ధం చేసుకోవచ్చు . కానీ గీత స్వేచ్ఛా ప్రపంచంలో ఉంది . పాక్షికమైన ప్రేమను పట్టుకుని వెళ్ళాడ్డం విచిత్రంగా తోస్తున్నది. ఇడియట్ లా ఆలోచించకు గీతా .. ” అన్నది సారా
“మీరన్నది నిజమే కావచ్చు . ప్రకృతిలో తిరిగేటప్పుడో , కమ్మని సంగీతం వింటున్నప్పుడో ఇప్పటి నన్ను నేను రద్దు చేసుకుని ఆ సంక్షోభాన్ని దాటే అవకాశాల్ని వెతుక్కుందామని అనుకుంటాను .
కానీ ఏమిటో .. మళ్ళీ వినోద్ తో గడపిన క్షణాలు .. అతనితో పెళ్లి కాకపోతే మా కుటుంబానికి వచ్చే తలవంపులు .. నా జీవితంపై వచ్చే మచ్చ.. ” ఇంకా చెబుతుండగానే మధ్యలో అందుకుంది సారా
“స్టాప్ ఇట్ గీతా .. నువ్వు నాకు వద్దు అని విదిలించి పారేసిన వాడే కావాలని వెంటపడడం, పట్టుబట్టడం ..
నీకు ఆత్మగౌరవం లేదా .. దరిద్రం వదిలింది అనుకోక ?” అన్న సారా బాడీ లాంగ్వేజ్ , ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మళ్ళీ నాన్నమ్మ కళ్ళ ముందుకొచ్చి నిష్కలను డిస్టర్బ్ చేసింది.
మనసు లోతుల్లో కొనసాగుతున్న ఘర్షణకు కళ్లెం వేస్తూ గీత వైపు దృష్టి మరల్చింది నిషి
” మీరేమనుకోనంటే , మరోలా తీసుకోకపోతే ఒక్క విషయం అడగొచ్చా గీతా .. ” అన్నది
అడగమన్నట్లే నిషిని చూసి తల ఊపింది గీత .
“అన్నీ సర్దుకొని జర్నీ అతనితో చేయగలవా ..?
కుదిరితే ట్రైన్ జర్నీ చేయి. కాదని అనడం లేదు. అది మీ వ్యక్తిగతం . అందులోకి నేను వచ్చి తీర్పు చెప్పను.
నేను ప్రశ్నించేది ఏంటంటే ..
సమస్య వచ్చి జీవితంపై ఇంట్రెస్ట్ పోయినపుడు కొద్ది సేపు ఆలోచించి ఏమి జరుగుతుందో అది జరగనీ అని గట్టిగా అనుకొని కాలానికి వదిలేయగలవా ..?
పాల్స్ ప్రెస్టేజ్ పక్కన పెట్టి నీ పని నువ్వు చేసుకో లేవా ..?” అని గీత కళ్ళలోకి సూటిగా చూసింది నిష్కల
మౌనమే సమాధానంగా తలవంచుకుని ఆలోచిస్తూ గంభీరంగా కూర్చున్నది గీత.
గీతకి న్యాయపరంగా ఎటువంటి సహాయం చేయలేదు. అమెరికన్ చట్టాల ప్రకారం మేజర్లు అయిన ఇద్దరు డేటింగ్ లో ఉన్నప్పుడు ఇద్దరికీ ఇష్టమై శారీరకంగా కలిసిన అది నేరం కాదు.
పెళ్లి చేసుకుంటామని గీత మనస్ఫూర్తిగా అతడిని నమ్మింది. తనను తాను అర్పించుకుంది. మనసా వాచా కర్మణా అతనే తన భర్త అని నమ్మింది. కానీ అతను అలా కాదు. అవకాశం తీసుకున్నాడు. రెండేళ్లు ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు మొహం చాటేస్తున్నాడు. వాళ్లిద్దరూ సహజీవనం ఉన్నారని కానీ, పెళ్లి చేసుకున్నారని కానీ నిరూపించలేరు. కనీసం పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఏ ఆధారం లేదు.
అతను స్వేచ్ఛగా తిరుగుతున్నాడు . ఆమె భయంతో , తప్పు చేసిన బాధతో కుమిలిపోతున్నది . తన జీవితమే పోయినంత బాధ పడుతున్నది . తలవంచుకుంటున్నది. ఆ భారం మోయలేక కుంగిపోతున్నది. వంగిపోతున్నది.
నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగల్ ఆక్టివిటీస్ (NILA ) ఎంతోమంది మహిళలకు సహాయం అందిస్తున్నది . అమెరికా కెనడా ఆస్ట్రేలియా , యూకే , మిడిల్ ఈస్ట్ దేశాల్లో భర్త నిరాదరణకు గురైన , వదిలెయివేయబడిన మహిళలకోసం ఉన్నారు .
విదేశాల్లో ఉన్న వ్యక్తిని పెళ్లిచేసుకున్న భారతీయ మహిళ న్యాయపరమైన హక్కులు గత ఏడాదే అప్రూవ్ అయింది . భారతదేశం బయట ఉండే విదేశీ వరుల పెళ్లిళ్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి
జాతీయ మహిళా కమిషన్ కు ఏటా వేలాది దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి .
భార్యను వదిలేయడంతో పాటు వరకట్న వేధింపులు , గృహహింస కూడా ఉంటున్నాయి . NRI పోలీస్ యూనిట్ కూడా ఉంది . అది భార్యని వదిలేసిన కేసుల్ని డీల్ చేస్తున్నది
ఇలాంటి కేసులు చాలా సంక్లిష్టంగా ఉండడంతో పాటు సమయంకూడా తీసుకుంటాయి . భర్త నుండి వదిలివేయబడిన భార్యలు వాళ్ళ లాయర్లు నిందితుడి సమాచారాన్ని స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ , విదేశీవ్యవహారాల శాఖ , కాన్సులేట్ ల ద్వారా సమాచారం తీసుకోవచ్చు
నిందితుడికి కోర్ట్ సమన్లు జారీచేసినా చాలా సందర్భాల్లో అతను కోర్టు కు హాజరు కావడం లేదు . భారతీయ కోర్టులు చాలా సందర్భాల్లో నిందితుడిని చేరడం లేదు .
విడాకుల కార్యక్రమం పూర్తి కాకుండా ఆమె మళ్ళి పెళ్లిచేసుకోలేదు . అతను మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా మరో కాపురం చేస్తుంటాడు . అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ ఏమి అడ్డంకి ఉండదు
వాళ్ళకి మానవత్వం ఉండదు . చాలా కేసుల్లో భార్యతో పాటు బిడ్డని కూడా వదిలించుకుంటారు . వాళ్ళకి మనోవర్తి కూడా ఉండదు . బాధ్యత ఉండదు
ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో .. సమస్య పరిష్కారానికి చాలా స్ట్రగుల్ చేస్తున్నాం
భారతీయ కాన్సులెట్ , ఎంబసి ఇంకా చేయాల్సింది చాలా ఉంది .
ఎవరైతే భర్త నుండి గెంటివేయబడ్డారో, వదిలివేయబడ్డారో వాళ్ళకి ఆర్థిక సహాయం చాలా అవసరం . అతని పాస్పోర్ట్ చెల్లకుండా చేయాలి .
గీత సమస్య ఈ పరిధిలోకి రాదు.
చట్ట బద్ధంగా పెళ్లయిన మహిళలే ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. న్యాయం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఆర్ధికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి కేసుల్లోనే ఇంకా సరైన న్యాయం అందడం లేదు వాళ్ళకి . ఇక గీత విషయంలో అతనికి శిక్ష పడుతుందని ఎలా ఆశించగలం ?
గీత-వినోద్ లకు సంబంధించిన పెళ్లి మాటలన్నీ పెద్దల మధ్య ఇండియా లో జరిగాయి. ఇక్కడ వీళ్ళు కలసి తిరిగారు. ఒకరి మీద ఒకరి కి బంధం ఏర్పడలేదు. ఇక హక్కు ఎక్కడిది ?
స్త్రీ పురుషుల మధ్య బంధం గాఢంగా, ఒకరిపై ఒకరికి బలమైన నమ్మకం ఏర్పడడం ఉండాలి. ఆ పునాదిపై ఇద్దరు వ్యక్తులతో కుటుంబ నిర్మాణం మొదలవ్వాలి. కానీ అది జరగలేదు.
ఇంగ్లీషు రచయితా సైమన్ అన్నట్లు పది సెకన్లే ఉండే ఒక ఓవర్ రేటెడ్ అనుభూతి సెక్స్. దాని కోసం ఎంత వంచన ? ఎంత దిగజారుడు తనం ? అతనిలో …
ఇప్పటికి ఆమె దాన్ని నమ్మలేకపోతున్నది.
ఎంత విచిత్రం ? గీత చట్టపరంగా ఏర్పడని బంధాన్ని కావాలని కోరుకుంటున్నది.
మరి నేను? పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడని సహజీవనం లోకి అడుగు పెట్టింది. అతని ప్రేమలో కాదు తరతరాల దారుల్లో మొలిచిన చిన్న చిన్న ముళ్ళు పెకిలించే యాలని చూస్తున్నది. మారదాం మనం మారుదాం అంటున్నది. ఆ దిశగా అడుగులు వేస్తున్నది.
గీత నిష్కల ఇద్దరూ భిన్న ధృవాలు .
ఇద్దరి జీవితాల్లో ఘర్షణ ఉంది. చెప్పలేనంత
ఇద్దరు పుట్టి పెరిగింది భారతదేశంలోనే. తెలుగు ప్రాంతంలోనే . కానీ పురుషుడిని అర్ధం చేసుకోవడంలో, స్త్రీ తనను తాను నిలబెట్టుకోవడంలో ఇద్దరి ఆలోచన నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం
అంకిత్ ని మొదటి సారి కలసిన పరిచయం నిష్కల కళ్ళముందు కదలాడింది.
ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ లో మొదట కలిశారు .
వివిధ రకాల సామాజిక కార్యక్రమాల ద్వారా భారతీయ సంస్కృతి ని ప్రమోట్ చేసే కార్యక్రమాలు చేసేవారు . అందుకోసం మహారాణి ఇండియన్ రెస్టారెంట్ లో కూర్చొని గంటల కొద్దీ చర్చలు చేసేవారు.
దేశీ కమ్యూనిటీ గ్రూప్ లోను , దేశీ సింగిల్స్ గ్రూప్ లోను అంకిత్ కలిసేవాడు.
ఇద్దరూ ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు .
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కలీ కౌన్సిల్ లో అవుట్ రీచ్ కో ఆర్డినేటర్ గా నిష్కల ఉంటే ఈవెంట్స్ డైరెక్టర్ గా అంకిత్ ఉండేవాడు
బే ఏరియా లో గ్రీన్ హోలీ .కల్చరల్ షోస్ , మూవీ స్క్రీనింగ్ , వివిధ పండుగల సంబరాలు ఉత్సవాలు , డాన్స్ పోటీలు , పిక్నిక్ లు హైకింగ్ ట్రిప్స్ కమ్యూనిటీ సర్వీసెస్ ఎన్ని కార్యక్రమాలో ..
అంకిత్ తల్లిదండ్రులు కూడా అమెరికాలోనే ఉంటారు.
అతని పరిచయం స్నేహంగా మారింది . మిత్ర బృందంలో వివిధ అంశాలపై చర్చోపచర్చలు జరిగేవి. ఆ చర్చలలో నిష్కల అభిప్రాయాలు , కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ఆమె తత్త్వం అతనికి నచ్చేవి . ఆకర్షణ మొదలైంది.
స్నేహంలోంచి ఆకర్షణ లోంచి ప్రేమ పుట్టింది.
తనలో తాను సన్నగా నవ్వుకుంది నిష్కల.
“ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు ” అడిగింది సారా
ఏమీ లేదన్నట్టు తల ఊపి గాలిలో ఎగురుతూ ఉన్న జుట్టును వేళ్ళతో పైకి తోసుకుంది నిష్కల. ఆ తర్వాత గీత కేసి చూస్తూ ..
” నమ్మిన వారు మోసం చేసినప్పుడు కష్టంగానే ఉంటుంది. ఏడ్చి గోల చేస్తే లాభం లేదు. ధైర్యం కూడగట్టుకోవడం అవసరం.
మీ దగ్గర ధైర్యం ఉంది అందుకు అభినందనలు.
మార్గం వెతకడం , అతనికి శిక్ష పడాలనుకోవడం సబబే. కానీ ఆ క్రమంలో ఏది జరిగినా మన మంచికే అని ముందుకు కదలడం, ఆ సమయంలో నిబ్బరంగా ఉండడం , పాసిటివ్ మైండ్ తో ఆలోచించడం చాలా అవసరం .
అడుగు దాటితే పిడుగు దాటొచ్చు అనే సామెత మన వాళ్ళు అంటూ ఉంటారు. అర్ధం చేసుకోండి. ఇక మారాల్సింది మీరేనని గుర్తుంచుకోండి “. చెప్పింది నిష్కల
“అవును గీతా .. ఒక్క నెగటివ్ ఎనర్జీ.. కొన్ని నెగటివ్ థాట్స్,
మన నీడను చూసి కూడా మనం భయపడాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి.
ఆ సందర్భంలో ఎలా ఉంటుంది అని మనలో మనమే బాధపడే బదులు మన దగ్గర వాళ్లకు చెప్పాలి . వాళ్ళు ఇచ్చే ధైర్యం చాలా గొప్పదవుతుంది .
నిన్ను నీవు నమ్ముకుంటావు . హోప్ ని వెతుక్కుంటావు . ఏదైనా చేయగలుగుతావు. రేపు గురించి భయపడుతూ ఈ రోజుని కోల్పోవు.” అనునయంగా అన్నది సారా
“దూరంగా వున్నా, దగ్గరగా ఉన్నా మన మధ్య మొలిచిన మౌన ఎడారుల్ని మాటల చివుర్లతో మార్చేస్తూ ఆప్యాయతల మొలకల్లా మారుదాం మనం…” అన్నది నిష్కల
“పగలంతా ఎవరో ఒకరు కంటికి కనిపిస్తారు. రాత్రుళ్లు ఒంటరితనంలో భయం వేయదు కానీ, చిరాగ్గా ఉంటుంది. లైఫ్ మరీ మెకానికల్ అయిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది.
అమ్మ ఒడిలో తల పెట్టుకుని సేదతీరాలనిపిస్తుంది . వేల మైళ్ళు వెళ్లి అమ్మ ఒడి చేరలేను . అందుకే అమ్మా నాన్నలతో వీడియో కాల్ చేసి మాట్లాడతాను. కొద్దిగా రిఫ్రెష్ అవుతాను. రీచార్జ్ అవుతాను .
ఈ లోగా మాటల్లో మళ్ళీ అతని ప్రస్తావన వస్తుంది . మళ్ళీ మాములే …
అతనికి సంబంధించిన జ్ఞాపకాలు కూడా లేకుండా ఖాళీ చేయడం.. కష్టమైపోతుంది. లోలోపలే మంచులా గడ్డకట్టిపోయి కత్తిలా కోసేస్తుంటాయి ” అన్నది గీత
“ఫ్రెండ్స్ తో తాగి తిరిగి అరిచి లోపలున్న ఫ్రస్ట్రేషన్ అంతా తోడి పడేయాలి . జీవితం వేసే ఇంకో ఎత్తుకి సిద్ధం అవ్వాలి ” సరదాగా నవ్వుతూ వాతావరణాన్ని తేలికచేస్తూ అన్నది సారా
“నాది కాని మొండెంలో, నాది కాని చర్మంలో తలదాచుకుంటున్నట్లుగా ఉంది. నాదైన జీవితమే లేదని అనిపిస్తుంది ” బేలగా అన్నది గీత
“ఒంటరిగా మాత్రం అస్సలు ఉండొద్దు.. అదింకా ఊబిలోకి తోస్తుంది
అంది వచ్చినవన్నీ అందుకోవాలి..
అవకాశాలు వస్తే అనుభవించాలి.. అనుభూతి చెందాలి..
ఏం మగవాళ్లేనా .. మనం మనుషులం కామా .. ?
వాళ్లలా మనకి మనసులు ఉండవా.. ?
ఆఖరికి ప్రేమ కూడా.. ఆంక్షలకు హద్దే లేదు.. కంచెలు వేస్తే.. తొలగించుకుంటూ ముందుకే.. అడుగు.. వెయ్యండి
అమ్మమ్మలు తాతమ్మల కాలంలో జీవితపు విలువలకి , నేటి తరానికి ఎంతో వ్యత్యాసం ఉంది.
జీవితాన్ని చూసే కోణంలో , మనుషుల్ని కొలతలు వేసి లెక్కలు కట్టే విషయంలో ఎంతో తేడా ఉంది కదా .. ఆనాటి జీవిత పాఠాలు ఆనాటివి. ఆనాటి సామజిక విలువలు సంప్రదాయాలు ఆనాటివి. అవి అలాగే నేటికీ కొనసాగాలని లేదు.
కదిలిపోయే కాలంలో సాగే ప్రయాణంలో ఎప్పటికప్పుడు కొత్త విలువలు , కట్టుబాట్లు , చట్టాలు వస్తూనే ఉంటాయి . పాతవి కాల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి . కొత్తవి చేరుతూ ఉంటాయి. అంతే ..
జీవితం గురించి పాఠాలు ఏ పుస్తకాల్లోనూ ఉండవు. ఏ పుస్తకం లో లేని పాఠాలు మనకు జీవితమే నేర్పిస్తుంది. ” అన్నది నిష్కల .
కాలం గడిచే కొద్ది ఎంతటి దుఃఖం అయినా పల్చనవుతుంది.
చుట్టూ ఉన్నవారు ముల్లు పెట్టి కెలుక్కుండా , నీతులు చెప్పకుండా,సింపతీ చూపకుండా మనల్ని ఎప్పటికప్పుడు నవ్విస్తూ ఉంటే ఎలాంటి బాధనైనా హాండిల్ చెయ్యొచ్చు మనసులో అనుకుంది నిష్కల
“ఎంత బాగా చెప్పారు. ఎంతో అనుభవంతో చెప్పే అమ్మలా .. ” అంటూ హగ్ చేసుకోబోయి ఆగిపోయింది సారా .
ఆమెకు నచ్చితే హగ్ చేసుకోవడం బాగా అలవాటు. అసలే కోవిడ్ కాలం . ఎంత వాక్సిన్ వేసుకున్నప్పటికీ ఎవరికి వారు ఆ దూరం పాటిస్తున్నారు. ఇంట్లో అమ్మని గుండెలకు హత్తుకున్నట్టు హత్తుకుంటే ఏమనుకుంటుందో అన్న సందేహం కలిగింది సారాకి .
ఆ చర్యకి ప్రశాంతంగా, ప్రకాశవంతంగా మెరుస్తున్న కళ్ళతో సన్నని నవ్వు నిష్కల పెదవులపై మొలిచింది .
“ఏదో నిన్ను టీజ్ చేస్తూ చెప్పడంలేదు గీతా .. నిజ్జంగా చెబుతున్నా ..
రొటీన్ బ్రేక్ చేయడమే పరిష్కారం.. ఎలా అన్నది మన ఇష్టాలను బట్టి.. స్థల మార్పు, మ్యూజిక్, డ్యాన్స్, చిన్నప్పటి స్నేహితులను కలవడం.. అలా ఏదోటి మనం పరిసరాలు మర్చిపోయేంత లీనమయ్యే స్పేస్ చూసుకోవడమే.. ” అన్నది సారా
క్షణం ఆలోచించకుండా ” ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా అన్నాది నిష్కల. ఆమెకు కూడా ఈ రొటీన్ నుండి బయటికి రావాలని ఉంది .
త్వరగా పరిష్కరించాల్సిన కేసులు , స్టడీ చేయాల్సిన కేసులు ఉన్నాయి . అయినా సారా వస్తానంటే ఆమెతో కలిసి ట్రిప్ కి వెళ్లాలని ఆమె మనసు బలంగా కోరుకుంటున్నది.
“ఎక్కడికి వెళదాం ..? మనం ఉంటున్న ఈ ప్రపంచానికి దూరంగా ..
అడవికా .. సముద్రానికా .. ఇసుక పర్రెల్లోకా .. మట్టి దిబ్బల్లోకా .. కొండలు లోయల్లోకా .. ఎక్కడికి పోదాం ” గీత ఉత్సాహం చూపింది.
“మనం ఎక్కడికి పోయినా కొంతకాలమే . తర్వాత ఈ ప్రపంచం ఊరుకోదు . మనల్ని వెనక్కి లాగేసుకుంటుంది ” గీత కేసి కొంటెగా చూస్తూ కళ్ళెగరేసింది సారా ..
(మళ్ళీ కలుద్దాం )
* * * * *
నేను వి. శాంతి ప్రబోధ . చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. శ్రీమతి హేమలతలవణం, శ్రీ లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచాను. ఆ నడకలోనిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతమయ్యాయి. ఆ అనుభవాల్లోంచి రాసినవే భావవీచికలు , జోగిని , గడ్డిపువ్వు గుండె సందుక , ఆలోచనలో …ఆమె . భావవీచికలు బాలలహక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం . ILO , ఆంధ్రమహిళాసభ , బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల ‘జోగిని ” . వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది . 2015లో విహంగ ధారావాహికగా వేసింది . ప్రజాశక్తి 2004లో ప్రచురించింది . గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో …ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటిలు . అమర్ సాహసయాత్ర బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ. ఆడపిల్లను కావడం వల్లనే శీర్షికతో వ్యాసాలు ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వచ్చాయి . కవితలు ,వ్యాసాలు ,రేడియో ప్రసంగాలు వగైరా వగైరా ..