ఫోటో
-కొమురవెల్లి అంజయ్య
పుట్టి పెరిగిన ఇల్లు
ఇప్పుడు పాడుబడని పాత జ్ఞాపకం
పెంకుటిల్లయినా హాలు గోడలు ఫోటోల కోటలు
నవరసాల స్మృతులు
చెక్కు చెదరని గుండెధైర్యాలు
గోడల దిష్టి తీసేందుకు సున్నాలేసినప్పుడు
దిగొచ్చిన ఫోటోలు దాచుకున్న యాదుల్ని
దులపరించేవి దుమ్ము కణాలై
ఒక్కో ఫోటో తుడిచే కొద్దీ
జ్ఞాపకాలు చుట్టాలై అలుముకునేవి
చిరిగిపోయిన గతం గూడు కట్టుకునేది
పిలవడానికి అన్ని ఫోటోలే అయినా
దేని దర్జా దానిదే
దేని కథ దానిదే
దేని నవ్వు, దేని ఏడుపు దానిదే
వెక్కిరింతలు, వెటకారాలు పండిస్తాయి హాస్యాలు
వయసు తేడాలున్నా
పక్కపక్కనే అనుబంధాలు పెంచుకుంటూ చిత్రాలు
చిత్రకారుడి నైపుణ్యం నాటికీ నేటికీ కొనసాగితే
నలుపు తెలుపు బొమ్మ నుంచి
రంగుల ఈకలతో ఎగిరే పక్షయింది ఫోటో
రీలు ఫోటో
విజ్ఞానం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే
ఆధునికత మేళవింపుతో ఇప్పుడు ఫోటో
చిన్ని బుర్రలో పుట్టెడు ఆలోచనలలా
సెల్ ఫోన్ కు మొలిచిన కెమెరా కన్ను
తీసే ఫోటోలకు కొదవ లేదు
నోటిమాటకంటే ముందే లోకమంతా చేరవేతలు
మార్పులు నొక్కిన మీటకు
పెంకుటిల్లు హంగుల బంగ్లాగా రూపాంతరం
గోడలపై ఫోటోలు ఒకటో రెండో అలంకారంగా
ఆల్బంలు బరువైనాయి మనిషికి
చిప్ లలో చిక్కుకున్న బొమ్మలు
ఓపెన్ సిసేమ్ లు ,వద్దంటే నోటిమూతలు
*****