మెరుపులు- కొరతలు

అట్లా అని పెద్ద బాధా ఉండదు – దాట్ల దేవదానం రాజు కథ 

                                                                – డా.కే.వి.రమణరావు

తనచుట్టూ ఉన్న సమాజంలోని చెడుని చూసి భరించలేక దాన్ని సరిచేయడంకోసం వ్యక్తిగతంగా నిత్యం పోరాటం చేసి ఎదురుదెబ్బలు తిన్న ఒక సామాన్య యువకుడి కథ ఇది. అతని జీవితంలో కొంతకాలంపాటు జరిగిన కొన్ని వరస సంఘటనలు కథనంలో రచయిత దృక్కోణంలో చూపబడ్డాయి.

స్థూలంగా ఇదీ కథ.

ముగింపులో ప్రారంభిం చబడిన ఈ కథంతా దాదాపు ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది. ఓ చిన్నవూర్లో ఒంటరిగా ఓ గదిలో ఉంటున్న నారాయణ రూపం, వ్యక్తిత్వం ప్రత్యేకం. అతను బనీను, నిక్కరు మాత్రమే ధరిస్తాడు. తనచుట్టూ ఉన్న మనుషులు బాధల్లేకుండా జీవించాలని అనుకునే యువకుడు. అలాంటి బాధలు కొంతమంది చెడు ప్రవర్తనవల్ల కలుగుతాయని నమ్మి, అలాంటి వ్యక్తులను పట్టుకుని గట్టిగా బుద్ధి చెప్పి దారిలో పెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాడు. దానివల్ల వచ్చే ఇబ్బందులను లెక్కచేయకుండా సాగిపోతూంటాడు. 

అతనికి పిల్లలంటే ఇష్టం. అందుకని ఓ స్కూలు ఎదురుగా చిన్నబడ్దీకొట్టు పెట్టి బడిపిల్లలకి చాక్లెట్లు, తినుబండారాలు అమ్ముతూంటాడు. స్కూల్లో పిల్లలకొచ్చే సమస్యలనుకూడా పట్టించుకుని వాటిని ఏదోవిధంగా పరిష్కరిస్తూంటాడు.

అవి ఇలావుంటాయి. ఒకరోజు కొంతమంది స్కూలు పిల్లలు సైకిళ్లను స్కూల్లో ఉంచాల్సినచోటులో ఉంచలేదని హెడ్మాస్టరు వాటి వాల్నట్లు తొలగించి గాలితీసేస్తే నారాయణ ఆయనతో పోట్లాడి, వాటిని సరిచేయిస్తాడు. ఒక టీచరు ఓ విద్యార్థినిని వలలో వేసుకోబోతే అతన్ని బెదిరిస్తాడు. మరో విద్యార్థి ఒకమ్మాయికి ప్రేమలేఖ రాస్తే ఆ అబ్బాయెవరో కనుక్కుని అతన్ని కొడతాడు. ఇవన్నీ చేసినందుకు నారాయణను మెచ్చుకోకపోగా అతని బడ్డికొట్లో స్కూలుపిల్లలేమీ కొనకూడదని స్కూలువాళ్లు నిబంధన విధిస్తారు. అయినా తొణక్కుండా నారాయణ కొట్టుముందు ఓ బోర్డు వేలాడదీసి ఆ స్కూలులో జరిగే అవతతవకలన్నీ రాస్తూంటాడు. ఇవేకాక ఊళ్లో జరిగే అన్యాయాలన్నిటిని ఇలాగే ఎదిరిస్తాడు. ఇలా చెయ్యడంవల్ల అందరి దృష్టిలో మంచివాడు కావాల్సిందిపోయి చెడ్డవాడైపోవడం అతనికి బాధ కలిగిస్తూంటుంది. 

ఇంతలో ఇలాంటిదే మరో సంఘటన జరిగి చేయని నేరాన్ని నారాయణమీద బనాయించి అతన్ని జైలుకి పంపిస్తారు. అతను జైలు శిక్షను పూర్తిచేసుకొని ఇంటికొచ్చాక లోకంతీరుగురించి బాధపడి భవిష్యత్ కర్తవ్యం గురించి మీమాంసలో పడతాడు. 

చివరికి తన పోరాటం కొనసాగించాలనే నిర్ణయించుకుంటాడు. అక్కడితో కథ ముగుస్తుంది.

ఈ కథంతా ఒకరి జీవితచరిత్రలోని ఒక అధ్యాయంలో కొంతభాగం చెప్పినట్టుగా ఉంటుంది. సాంప్రదాయమైన కథాశిల్పం ఉండదు. రచయిత దానికసలు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడదు. నాగరిక సమాజానికి సంబంధిన ఒక మౌలిక ప్రశ్నను లేవనెత్తే ఉద్దేశ్యంతో రాసిన కథగా పాఠకులకు అనిపిస్తుంది. చుట్టూ కొందరు మనుషుల స్వార్థం కారణంగా జరుగుతున్న అవసరంలేని అన్యాయాలను మనకు సంబంధం లేకపోయినా ఒక సామాన్య పౌరుడిగా మనం ఎదిరించాలా లే దా అన్నదీ మౌలిక ప్రశ్న. 

అలా నిస్వార్థంగా ఎదిరించిన మనిషి అందరికీ చెడ్డవాడై, శిక్షను అనుభవించడం ఏమిటన్నది ఒక అనుబంధ ప్రశ్న. అయినాసరే పోరాడ్డమే సరైన కర్తవ్యమన్నది చివరికి రచయిత ఈకథద్వారా సూచించిన మార్గం. 

దీనికి సంబంధించి కథలో రచయిత కొంత నేరుగా, కొంత నారాయణ పాత్రద్వారా తన భావాలను ఇలా చెబుతారు. 

“అట్లా అనుకుంటాంగానీ అన్నీ జరుగుతాయి… ఏమీ జరగదు, లోకం అలాగే ఉంటుంది్ మహా అయితే కేలండర్ల కాగితాలు చిరుగుతాయి. నువ్వొక్కడివే ఏం చెయ్యగలవు? అలాగని పూని ఏదైనా చేయకపోతే ఎలా? తనొక ఒంటరి. అయినా పోరాటం చేయాలి” అనుకున్నాడు నారాయణ’ అంటూ మొదలౌతుంది కథ

‘తను ఇంత గట్టిగా ఉన్నట్టుగా కనిపిస్తాడా?… ఎంతో దుఖాన్ని మోస్తాడు’ … 

‘ఊరు ఎలాపోతేనేం అని ఎప్పుడైనా అనుకున్నాడా? ఏంచేసింది ఊరు? మంచికోసం వెళితే ఇరుకున పెట్టి నలిపి ఉండచుట్టింది. అన్యాయాన్ని సహించడు. జనం కళ్లముందుంచేంతవరకు నిద్రపోడు. జీవితమంతా అన్వేషణే, పోరాటమే అలజడే’ అని తనను తాను విశ్లేషించుకుంటాడు.

“దగా మనుషుల లోకం. అంతా నీరుగారిపోయింది. చుట్టూ ఉన్న వారి తక్షణ ప్రయోజనాలు వేరు. అవకాశవాదంతో పరుగులు పెడతారు. కుళ్లు రాజకీయాలు ప్రదర్శిస్తారు. తనేంచేయాలి? పౌరుడిగా తన బాధ్యతేమిటి?” అని జైలునుంచి విడుదలై రాగానే తనలో తాను తర్కించుకుంటాడు.

“పారిపోకూడదు. సమస్యలుంటాయి అధిగమించాలి. కొత్తపుట్టుక ఇది. మళ్లీ విజృంభించాలి. సత్తా చాటాలి. బెదిరే సమస్యలేదు. పగలు వస్తుంది, రాత్రి వస్తుంది. మళ్లీ తెల్లవారుతుంది” అని నారాయణ నిశ్చయించుకోవడంతో కథ ముగుస్తుంది.

మొదట్లోనే చెప్పినట్టుగా కథలో సంప్రదాయ కథాశిల్పం కనపడదు. కథంతా ప్రధానపాత్ర తాను స్వయంగా అనుభవిస్తున్న ఒక నైతిక భావోద్వేగాన్ని వెలిబుచ్చినట్టుగా ఉంటుంది. ఈ చెప్పడంలో ఒక పద్ధతిగా, సమతూకంగా చెప్పడం ఉండదు. కథలో నారాయణ పోరాటాలకు ఉదాహరణలుగా స్కూలులో జరిగిన సంఘటనలే ఉంటాయి. ‘ఊళ్లో ఎట్లాంటి అవినీతి జరిగినా’ నారాయణ చివరిదాకా పోరాడేవాడని … ‘ఊళ్లో కొంతమంది పెద్దలకు నారాయణ వ్యవహారం నచ్చేది కాదు. అంతా సమయంకోసం ఎదురుచూస్తున్నారు’ అని రచయిత చెప్పినా, వీటికి ఉదాహరణగా కథలో ఇతర సంఘటన ఒక్కటికూడా కనపడదు. కథను రచయితే ఎడిట్ చేసారేమో అనుకోవాలి.

సమాజమన్నది ఒక సమిష్టి వ్యవస్త. అందులోని సమస్యలను వ్యక్తుల ద్వారా (సినిమాల్లో చూపించినట్టు) విడివిడిగా కాకుండా (పద్ధతి ఏదైనా) సమిష్టిగానే పరిష్కరించుకోవాలనేది, మేధావుల అభిప్రాయం. ఈకథలోనే ప్రస్తావించిన గాంధీజీకూడా జనాన్ని, నాయకుల్ని కూడగట్టుకున్న తరువాత నాయకత్వం వహించాడేగాని అతనొక్కడే పోరాడ్డానికి ఉపక్రమించలేదు. పైగా ఆయనది అహింసాపద్ధతి. 

ఈ కథలో నారాయణొక్కడే అన్నిట్లో తలదూర్చి పోరాటంచేస్తాడు, తప్పుచేసినవాళ్లని అవసరమైతే కొడతాడు. మారినకాలంలో ప్రతివ్యక్తీ తనకుతానై ఉద్యమించాలని చెప్పడమే రచయిత ఉద్దేశ్యం కావచ్చు. అయితే అలా చేసినప్పుడు ఆ పోరాటంవల్ల లాభపడినవారుకూడా ఆవ్యక్తికి బాసటగా ఉండరనేదికూడా రచయితే చెప్తారు.

కథలో అక్కడక్కడా ‘మనసంతా ఉతికిన బట్టలా తడి తడిగా ఉంది. ఎవరో చాటున నిలబది గుండెల్లోకి సూదులు గుచ్చుతున్నట్టుగా ఉంది. కళ్లముందే ఆశించినవన్నీ ధ్వంసమౌతున్న దృశ్యాలు’ లాంటి చక్కటి కవితాత్మకమైన వాక్యాలు కనిపిస్తాయి. 

‘మో’ గా ప్రసిద్ధులైన ప్రముఖ ఆధునిక కవి శ్రీ వేగుంట మోహన్ ప్రసాద్ గారి ‘చితి-చింత’ అనే కవితలోని ‘అట్లా అని పెద్ద బాధా ఉండదు’ అన్న వాక్యాన్ని ఈకథకు పేరుగా పెట్టారు. దాన్ని కథ చివర్లో రచయిత ఇలా పరోక్షంగా గుర్తుతెచ్చుకుంటారు. ‘చిన్న చిన్న బాధలుండవు. అంటే అట్లా అని పెద్ద బాధ ఉండదు. ఎక్కడో ఏకాక్షర కవి మూలుగుతున్నాడు. దిగంతాలనుంచి వినిపిస్తున్న సన్నని జీరలాంటి మూలుగు అది’.

కథాశిల్పం సమతూకంలాంటివి మాటపక్కనబెడితే, వస్తుప్రయోజనాల దృష్ట్యా రచయిత మానవ సమాజానికి సంబంధించి అనాదిగా నలుగుతున్న ఒక మౌలిక ప్రశ్నను కథారూపంలో తనదైన శైలిలో సూటిగా లేవనెత్తారు. అంతేకాదు, దాన్ని భావోద్వేగంతో చెప్పడంలో కృతకృత్యులయ్యారు.  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.