యాత్రాగీతం
నా కళ్లతో అమెరికా
అలాస్కా
-డా||కె.గీత
చివరి భాగం
కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ క్రూజ్ (Kenai Fjords National Park Cruise) ప్రయాణాన్ని ముగించుకుని, ఎన్నో అందమైన ఆ దృశ్యాలు మనస్సుల్లో దాచుకుని సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో తిరిగి సీవార్డ్ తీరానికి చేరుకున్నాం.
క్రూజ్ దిగిన చోటి నుంచి మళ్ళీ మాకు నిర్దేశించిన షటిల్ లో పదినిమిషాల వ్యవధిలో రైలు స్టేషనుకి చేరుకున్నాం.
అప్పటికే గోల్డ్ స్టార్ డూమ్ రైలు మా కోసం సిద్ధంగా ఉంది. పొద్దుట్నించి అలిసిపోయినా డూమ్ రైలు చూసేసరికి పిల్లలు హుషారు తెచ్చుకున్నారు. అందుక్కారణం చుట్టూ అద్దాలతో ఆహ్లాదంగా సాగే ప్రయాణం ఒక్కటేకాదు, రకరకాల జ్యూసులు, పానీయాలు, పుడ్డింగులు వంటివి టిక్కెట్లో భాగంగా అందజేస్తారు మరి!
మా చిన్నపాప సిరివెన్నెల చాలా ఓపికమంతురాలు. ఒంట్లో బాలేకపోయినా పేచీ పెట్టదు ఎప్పుడూ. ఈ ప్రయాణంలో తనకు రెండవ రోజు నుంచే భోజనం సహించక పోయినా ఇలా జ్యూసుల వంటివి తాగి తన మట్టుకు తను నిద్రపోతూ, మాతో ఎక్కడికంటే అక్కడికి నిశ్శబ్దంగా నడుస్తూ ఉంది పాపం.
మా అలాస్కా ప్రయాణంలోని చివరి రైలు ప్రయాణం ముగించుకుని మరొక రెండుగంటల్లో యాంకరేజ్ చేరుకున్నాం. కానీ రైలు స్టేషను నుంచి హోటలుకి వెళ్ళడానికి షటిల్ కోసం హోటలుకి ఫోను చేసి అదొచ్చే వరకు ఒక అరగంట స్టేషను బయట వేచి ఉండవలసి వచ్చింది. స్టేషనులో అదే చివరి బండి కావడం వల్ల లోపలా, బయట ఎవరూ లేరు. బయట కూర్చునేందుకు బల్లలు వంటివి ఏవీ లేవు. దర్జాగా డూమ్ రైలు ప్రయాణం చేసివచ్చినా అలిసిపోయినందువల్ల కాళ్లలో సత్తువలేక పిల్లలు లగేజీ పక్కనే అతిశుభ్రమైన నేలమీద బైఠాయించారు. మొత్తానికి మరోగంటలో తిరిగి మేం మొదటి రోజు బస చేసిన హోటలుకే చేరుకున్నాం.
వేసవి కాలం కావడంతో అలాస్కాలో అర్థరాత్రి పన్నెండు వరకు వెలుతురు ఉండడంతో ఏది సాయంత్రమో, ఏది రాత్రో కూడా చెప్పలేం. ఇలా వెలుతురు ఉండడం వల్ల పిల్లలు సరిగా నిద్రపోక సగం నీరసం అయిపోయేరు.
అయినా మర్నాడు పొద్దున్న ఇంటికి వెళ్తున్నామంటే అందరికీ మళ్లీ హుషారు ముంచుకొచ్చింది.
ఎక్కడికెళ్లినా ఇలా తిరుగు ప్రయాణం రోజుకి పిల్లలు ఇంటికి వెళ్లడం అంటే భలే సంతోషపడతారు “హోమ్ స్వీట్ హోమ్” అనుకుంటూ. ఏమాటకామాటే చెప్పాలి! నాకు భలే ఆశర్యమూ, ముచ్చటా వేస్తుంది ‘వీళ్ళకి ఇల్లంటే ఎంత ప్రేమో’ అని.
ఇక మర్నాడు ఉదయం యథావిధిగా అలాస్కా కు వీడ్కోలు పలికి ఎయిర్ పోర్టుకి సమయానికి చేరుకున్నాం. అయితే చెకింగ్ లైనులో తీసుకురాకూడని వస్తువుల జాబితాలో ఉన్న “ఊలూ కత్తి”ని చూసి అప్పటికప్పుడు మేం ముచ్చటపడి సావనీరుగా కొనుక్కున్న ఊలూ కత్తి కోసం ముప్ఫై డాలర్లు ఫీజు కట్టి ఒక సూట్ కేసుని చెకిన్ బ్యాగేజీగా ఇచ్చేశాం. అయితే అప్పుడు కూడా మేం తెలుసుకోలేక పోయిన విషయం ఏవిటంటే ముందురోజు క్రూజ్ లో ప్రయాణం చేసినందుకు గాను మాకు బహుమతిగా ఇచ్చిన ఇరవై డాలర్ల విలువ చేసే కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ వాటర్ గ్లోబు కూడా చెకిన్ లో తప్ప మా చేతుల్లో ఉన్న బ్యాగుల్లో పెట్టుకోవడానికి వీలు లేదట. అందులో ఉండవలిసిన లిమిట్ కంటే లిక్విడ్ ఎక్కువ ఉందట. చూస్తూ ఉండగానే నా బ్యాగులోని గ్లోబుని చెత్త బుట్టలోకి గిరాటేసేరు చెకింగ్ స్టాఫు. మనసు ఎంత ఉసూరుమందో చెప్పలేను. చెప్పలేని దుఃఖం వచ్చింది ఎందుకో. దాని ఖరీదు కంటే అందమైన వస్తువు అది. ఎయిర్పోర్టు లోపలికి వెళ్ళేదారిలో కనబడ్డ మొదటి కుర్చీలో కూచున్న నన్ను చుట్టుముట్టి మరీ ఓదార్చేరు సత్య, పిల్లలూ.
అపురూపమైన వస్తువుని పోగొట్టుకున్నా చెదరని జ్ఞాపకాన్ని భద్రంగా తీసుకొచ్చుకున్నాను.
ఇంటికి వచ్చిన రెండు వారాల వరకు నాకు కాళ్ళ మీద ఇన్ సెక్ట్ బైట్స్ తగ్గక చాలా బాధ పెట్టేయి. అయినప్పటికీ
మళ్ళీ అలాస్కా అంటే ‘మేం రెడీ’ అనేంత బాగా నచ్చింది ఈ ప్రయాణం మా అందరికీ!
****
(సమాప్తం)
Geetha, as always its a pleasure to read your writings, either its a novel or a Travelogue. Thank you for the wonderful description of the nature, I have felt it as if I were there myself. Now I got an idea how to plan the trip. Its very helpful for people like myself to plan accordingly.
When I think about Alaska, first thing that comes to my mind is Northern Lights. But was surprised that you have not mentioned it at all. I am sorry if you have missed it.
Overall it was a wonderful trip , and its expected to a few mishaps here an there in any trip. The important part is to have fun. Thank you again for a wonderful virtual tour.
Thanks, Gayathri. Since we visited in Summer there were no northern lights at that time.
👌