యుద్ధం ఒక గుండె కోత-12

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

పిపీలకమని చులకన చేసేలోపునే

బలవంతమైన సర్పం

చలిచీమల బారిన పడనే పడింది

చరిత్ర పునరావృతమౌతూనే వుంది

ఇప్పుడు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగింపబడుతున్నాయి

పావురాల్ని పట్టేందుకు వలపన్ని

గింజలేయటం విన్నాం

ఇదెక్కడి తిరకాసో

వేటు వేసి శవాలకు గింజలు చల్లటం

ఇప్పటి చిత్రమౌతోంది

జనభక్షణ చేస్తూనే

పవిత్రతని చాటుకొంటున్నాం

నరమాంసం భుజిస్తూ

ఎముకల్ని మెళ్ళో అలంకరించుకొంటూనే 

సాధుపుంగవులమని నీతిబోధలు చేస్తున్నాం

అదేమి చిత్రమో!

వేలెడులేని అంగుళి మాత్రులు అనుకున్నవాళ్ళు

కలతలేని కళ్ళతో చూపుల్ని విసిరి

నిర్భయంగా ఎదురొడ్డుతున్నారు

భూతద్దం పెట్టి వెతికినా

ఏ కనుకొలకుల చివరనుండీ

ఒక చిన్న దయాకిరణం జాలువారటం లేదు

బిగించిన ఏ పెదాల అంచుల్లోనూ

మానవత్వపు చిరునవ్వు మెరవటం లేదు

కనిపించని దైవం కోసం

ఉందో లేదో ఎరగని స్వర్గద్వారాల కోసం

కలలుకంటూ కలవరిస్తూ

ప్రాణాల్ని సమర్పిస్తామంటూనే వున్నారు

పచ్చగా విరియాల్సిన బతుకుల్ని

మసిచేసుకొనే నిప్పులౌతున్నారేమిటి?

రగుల్తున్న హృదయాలకి నవనీతం పూతలా

ఒక్కసారి మనసారా అమ్మని పిలవరేమిటి?

అప్రయత్నంగానైనా తలెత్తనీకుండా

ఆలోచన్ల ప్రేమ మొలకల్ని

మొదలంటా నరికేసే చురకత్తులౌతున్నారేమిటి?

సున్నితంగా సమస్యల ముళ్ళు విప్పి

జీవితాల్ని పదిలం చేసుకోవటం మర్చిపోతున్నారేమిటి?

తుఫానులో చిక్కుకున్న నావలైపోతున్నారేమిటి?

దుఃఖంతో తడిసి ముద్దవుతున్న గుండెల్లో

చురుకుమనిపిస్తూ సూదిమొన

అవిశ్రాంత ప్రయాణం చేస్తూనే వుందేమిటి?

ఆకాశం నిండా భయానక వాతావరణం

సూర్యచంద్రులు ఒకేలా మండుతున్న దృశ్యం

ఉండుండి విధ్వంసక శకలాలు

చుక్కలు రాలినట్లు రాల్తున్నాయి

నింగినీ నేలనీ కలుపుతూ అగ్నిధారలు

మెరుపుతీగలై ఊళ్ళమీద కురుస్తున్నాయి

ఎక్కడో పిడుగు పడిన ప్రకంపనం

నోటపట్టుకున్న బియ్యంగింజల్ని రాలుస్తున్న ఊరపిచ్చుకల్లా

గగనసీమ అంతటినీ ఆక్రమించి

పల్టీలు కొడ్తున్న లోహపక్షులు

కొండకోనల్లో పరుగులు తీస్తున్న రుధిరలావాప్రవాహాలు

లోయల అంచుల్లోంచి జారుతున్న

రాక్షసపక్షులు నమిలివూసిన ఎముకల గుట్టలు

ఎడారి మైదానాల్లోని ఖర్జూర వృక్షాలకు

వేలాడుతోన్న కొస ప్రాణాలు

బొమ్మ జెముడు మొక్కలకు విచ్చుకొంటున్న

రక్తసిక్త శిరస్సులు

గృహాంతఃపురాలలో పరదాలచాటున

పర్చుకొన్న దుఃఖపు నిప్పుసెగలు

ఆకలి కరాల దంష్ట్రాలకు చిక్కుకున్న

అనామక అసహాయ జీవచ్ఛవాలు

నరమాంస భక్షకి నోటి అంచున మెరుస్తున్న

ఎరుపుడాగుల భయానక చిత్రాలు

ప్రపంచపటం నిండా విస్తరిస్తూ

దృశ్యాలు దృశ్యాలుగా రాలుతున్నప్పుడు

దుర్భేద్యమైపోతున్న ఆంతరంగిక అనురాగాలు

చినుకులు చినుకులుగా కురుస్తున్నప్పుడు

హృదయాల్ని తడుపుతున్న కన్నీటి ధారలు

ఊసరవెల్లిగా మారుతున్న మానవ విలువలు

తునాతునకలు అయిపోతున్న సంబంధాలు

పేగుల్ని మెలిపెట్టే బాధావీచికల ముద్రలు

జ్ఞాపకాల పేటికల్ని వెతికితీస్తున్నకొద్దీ

కొనవేళ్ళకి తాకిన కత్తికోతల గాయాలౌతున్నప్పుడు

ఏ దేశంలోని తల్లి గుండెనైనా కోతపెట్టక మానవుకదా

దృశ్యాలు ఏ రెండు దేశాల మధ్యవో కాదు

భూభాగం తెరంతటా ప్రదర్శింపబడుతున్న చిత్రాలే!

చెరిపేయాలనుకున్నా చెదరని గుర్తులవి

రక్తవర్షాలలో నిలువునా తడుస్తూ

స్నేహశీతల ఛాయకోసం తడుముకొంటూ

ద్వేషం మంటలకు దహించుకుపోతూ

ఆర్తితో అలమటిస్తూ

ఎరుపెక్కిన భూగోళాన్ని చేతుల్లోకి తీసుకొని

కౌగిట్లో పొదువుకొని

స్వాంతన పరచడం 

గుండెల్లో విశ్వప్రేమ ఎండిపోనివాళ్ళం మనమేగనక

కరుణామృతాన్ని కురిపించటం ఇక మనవంతే

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.