కథాకాహళి- 26
మహిళాభ్యుదయాన్ని ఆకాంక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు
– ప్రొ|| కె.శ్రీదేవి
1931 జులై 31న కృష్ణాజిల్లా బొమ్ములూరులో పుట్టిన నంబూరి పరిపూర్ణ మహిళాస్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం. బాగా చిన్నప్పట్నించీ విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తృత్వం, మహిళా సంక్షేమ కార్యక్రమాలు ఆమె జీవితమంతా ప్రజారంగానికి సంబంధించినదే. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ ఉద్యోగంచేశారు. ఉద్యోగజీవితం ఆమెను మహిళల సంఘర్షనాత్మక సంవేదనలకు అతి సన్నిహితం చేశాయి. గత యాభై ఏళ్లుగా కథలూ, వ్యాసాలూ రాస్తున్నారు. ఇదివరలో కథలూ వ్యాసాలు, నవల ఆత్మకథ పుస్తకాలుగా వచ్చాయి. “మనిషిలానే ఆవిడ రచనలు సూటిగా, వాడిగా, నిష్కర్షగా ఉంటాయి. నిజజీవిత అనుభవాలే ఆవిడ రచనలకు ముడిసరుకు.” అని అబ్బూరి ఛాయాదేవి భావించారు.
బాల్యం నుండీ పరిపూర్ణ కుటుంబ పరిస్థితులు ఆమెను సమాజానికి బాగా చేరువ చేశాయి. ఆమె పెద్దన్న పదహారో ఏట ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడంతో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన కలిగించిన చైతన్యంతో, ఆమె కుటుంబం జాతీయోద్యమం లోనూ ఆ తరువాత వామపక్ష ఉద్యమాల్లోనూ చురుకుగా పాల్గొంది. కుటుంబ నేపధ్యం వలన దేశభక్తి, దాస్య విముక్తి పట్ల అవగాహన చిన్నతనంలోనే ఆమెకు కలిగాయి. ఆ రోజుల్లో నాయకులంటే దేశభక్తులే. దేశప్రేమ, త్యాగపటిమ రాజకీయ కుటుంబాల స్వభావం. అలాంటి కుటుంబాలకు ప్రజలు ప్రత్యేక గౌరవమిచ్చేవారు. పరిపూర్ణ పెద్దన్న చిన్నవయసులోనే ప్రజా సేవకంకితమై కొద్దికాలంలోనే ప్రముఖ నాయకుడైనాడు. ఎందరో దేశభక్తులకు, రహస్య కార్యకర్తలకు ఆశ్రయమిచ్చి ఆదరించేవారు. ప్రభుత్వ దమనకాండకూ హింసకు గురవుతూ స్థితికి మించిన త్యాగాలు చేస్తుండేవారు.
ఎన్ని శ్రమలూ ప్రమాదాలకైనా ఎదురొడ్డి నిలిచే కుటుంబం ఆమెది. ముఖ్యంగా విప్లవ సాహిత్యాన్ని మూలమూలలకు చేరవేసే క్రమంలో కమ్యూనిస్టు మ్యానిఫెస్టోనూ, మార్కు, ఏంగెల్సు, లెనిన్ల రచనల్నీ, గోర్కీ ‘అమ్మ‘ లాంటి నవలల్నీ పరిపూర్ణ చదివారు.
ఆమె చదువుకొని ఒక వ్యక్తిగా ఎదగడానికి ఆమె అన్నయ్య పట్టుదల, ప్రోత్సాహాలే కారణం. చదువుతోబాటు సామ్యవాద సిద్ధాంతాల భావజాలం వంటబట్టాయి. సమాజ స్వరూప స్వభావాలు అర్థమవ్వసాగాయి. సమాజం శ్రామిక ఉత్పత్తి శక్తులతో పాటూ వారి శ్రమశక్తినీ దోచుకొనే పెట్టుబడిదారీ భూస్వామ్య శక్తుల సంఘర్షణల ఫలితమని గుర్తించారు.
1958 నుండి గ్రామసీమల్లో విస్తరణాధికారిణిగా, 1962 నుండి స్త్రీ సంక్షేమశాఖలో లైజాన్ ఆఫీసరుగా మహిళలతో అనునిత్యం పనిచేసే అవవకాశం ఆమెకు లభించింది. యుగాలుగా సాంఘిక దురన్యాయాలకీ, ఆర్థిక రాజకీయ దోపిడీకి గురవుతున్నట్టే తెలియ ని గ్రామీణ స్త్రీలలో జాగృతి కలిగించే ఉద్యోగ బాధ్యతతో, పట్టణ, గ్రామీణ, వివిధ వర్గాల స్త్రీల సమస్యలను అవగతం చేసుకోవడానికి ఆమె ఉద్యోగం తోడ్పడిందని ’మాకు రావు ఉషోదయాలు’ కథా సంపుటిలోని చాలా ఋజువుచేసాయి.
అటు కుటుంబ నేపథ్యమూ, యిటు ఉద్యోగ ధర్మమూ ఆమెలో సాంఘిక అవగాహన ఏర్పడేందుకు సాయపడ్డాయి. అందువల్లనే సాంఘిక ప్రయోజనంగల కథాంశాలు రూపుదిద్దుకున్నాయి. మహిళా స్వచ్ఛంద సేవా సంస్థలు తమ ఉద్యమాల ద్వారానూ అన్ని రంగాలోని స్త్రీలూ తమ హక్కుల సాధనకు నిరంతరం కృషి జరిపేలా పురిగొల్పాలనేది నంబూరి పరిపూర్ణ సంకల్పం.
నంబూరి పరిపూర్ణ కుటుంబ నేపధ్యాన్ని ఇంత సుధీర్ఘంగా వివరించడానికి కారణంవుంది. ఆమె రాసిన చాలా కథల్లో స్త్రీల జీవితంలో విద్య అభివృద్ధికి కారణమవు తుందన్న అవగాహన నుండి ఆర్ధిక, రాజకీయ రంగాలలో భాగస్వామ్యం వరకు అది ఒక ఆకాంక్షగా విస్తరించటం కనబడుతుంది. స్త్రీలు తమపై మగవారి పెత్తనం ఉందన్న విషయాన్ని గ్రహించటమే కాక స్త్రీల పట్ల వారి దృక్పథం సరిగాలేదని నిర్ద్వందంగా చెప్పగలిగే చైతన్యాన్ని ఈమెకథల్లో చూడగలం. స్త్రీలు చదువుకోవడం ద్వారానే తమ జీవితాలను చక్కదిద్దుకోగలరన్న భావాన్ని చాలా కథలు తెలియజేస్తాయి. అలాంటి వాటిలో ’శిఖరారోహణం’, ’మాకు ఉంటాయ్ ఉషోదయాలు’, ’శ్రుతి తప్పిన రాగం’ కథలు ముఖ్యమైనవి. అదే క్రమంలో అర్దాంతరంగా చదువు మానేసి ప్రేమ, పెళ్ళి వలయంలో చిక్కుకున్న అమ్మాయిల జీవితం ఎంత అస్తవ్యస్త మౌతుందో చిత్రించిన కథలు అనేకంవున్నాయి. ఈకథావస్తువుతో సాగిన కథలు ’సరికొత్త దృశ్యం’, నిరంతర శాకుంతలం’, ’అనల్ప పీడనం’, ’సావిత్రి కల’ మొదలైనవి.
అయితే స్త్రీలపై అధిపత్యానికి, స్త్రీల వెనుక బాటుతనానికి కారణమైన రాజకీయార్థిక పునాది గురించి కాని, అస్తిత్వంలోవున్న పితృస్వామ్య భావజాలం గురించికాని, దానికి ప్రాతినిధ్యం వహించే కుటుంబవ్యవస్థ గురించి స్త్రీలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. వాటిని ప్రశ్నించే స్థాయికి ఎదగలేకపోయారు. ఆ చైతన్యం, పరిమితమైన ఈ కాలంలో స్త్రీలు రచయిత్రులుగా ఎదగడానికి ఎంతవరకు దోహదం చేసిందో, అవి వాళ్ల రచనలలో ఎలా ప్రతిఫలించాయో పరిశీలించటానికి పరిపూర్ణ కథలు ఒక మంచి అవకాశం. స్వాతంత్ర్యానంతర పరిణామాలను చిత్రించటంలో రచయిత్రులు చూపిన చొరవను గుర్తించటం, వాళ్ళు కాలంతో పాటు నడిచారా, కాలానికంటే ముందున్నారా లేక వెనకబడి ఉన్నారా అన్న ప్రశ్నలతో, ఆమె కృషిని గుర్తించటంలో భాగంగా నంబూరి పరిపూర్ణ కథలను విశ్లేషించటం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇంటా బయటా పితృస్వామ్య అధికారపు ఒత్తిడుల మధ్య జీవించే స్త్రీలు సామాజిక రంగాలలో తమ శక్తినంతా కూడ దీసుకొని పనిచేయాల్సి వస్తుంది. ఈ అలసట వల్ల వ్యక్తులు రకరకాల శారీరిక, మానసిక రుగ్మతలకు లోనుకావటం, ఒక జాతిగా అభివృద్ధి క్రమంలో తమ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకోలేకపోవటం జరుగుతున్న సంధర్భాన్ని ’స్ఫూర్తి’ కథలో చిత్రించారు.
సంపాదనలో వున్నఇద్దరు వేరువేరు వర్గాలకు చెందిన స్త్రీలు ఒకేరకంగా భర్తల చేతిలో దెబ్బలు తినడం సామాన్యాంశమైతే, పనిమనిషి మస్తానమ్మ తాగి తనసంపాదనను ఇవ్వకుండా పెత్తనం చేసే భర్త ప్రవర్తనను సరిదిద్దు కుంటుంది. ఉద్యోగస్తురాలైన విమలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది. చదువు సంస్కారాలతో చొరవ ప్రదర్శించలేని మధ్యతరగతి మహిళల ఆలోచనా క్రమం మారవలసిన అవసరాన్ని ఈకథ తెలుపుతుంది.
ఇది మళ్ళీ ఒక సాకుగా మారి సామాజిక రంగాలలోకి స్త్రీల ప్రవేశాన్ని, క్రియాశీలక పాత్రను అవహేళనచేసి, అనవసరమనిపించే భావనను అభివృద్ధి చేస్తున్న క్రమాన్ని’శిఖరారోహణం’ కథలో చిత్రించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయరంగాలలో స్త్రీల భాగస్వామ్యాన్ని బలపరిచే భావజాలం ఈమె కథల్లో కనిపించే సామాన్యాంశం.
స్త్రీలపాత్రను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే అదే భావనను బలపరిచిన వాళ్ళమవుతాము. కాబట్టి స్త్రీలను అంచనా వేయటానికి కుటుంబ ఒత్తిడి, సామాజిక ఒత్తిడి, ఇంటిపని భారం, పిల్లల పెంపకం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే అభివృద్ధి క్రమానికి స్త్రీలు చేసే దోహదంలోని వాస్తవికమైన అసలు విలువ తెలుస్తుంది.
’ఎర్రలచ్చుప్ప’, ఆదర్శాలు-అన్వయాలు’, ’నిరంతర శాకుంతలం’, మాకు రావు ఉషోదయాలు’, కథలలో స్త్రీలకు చట్టబద్ధమైన వివాహమే భద్రతనిస్తుందని పరిపూర్ణగారి అభిప్రాయంగా మూడు నాలుగు కథల్లో చాలా బలంగా వ్యక్తమవుతుంది. లక్షుమ్మ-నాగభూషణం, ప్రమీల-ప్రసాద్, శ్యామల-షణ్ముగం, శకుంతల-ప్రసాద్, ఈ జంటలందరూ నాలుగేళ్ళనుండి పాతికేళ్ళ వరకు అన్యోన్య దాంపత్యాన్ని సాగించినవారే. కానీ తమ జీవిత భాగస్వాముల్ని వదలి మరోపెళ్ళి చేసుకొని సహచారిణులను ఒంటరులుగా మిగిలించారు. ఈ కథల్లోని పురుషులు ప్రేమైక జీవులే. కానీ ఆర్థిక పరిస్థితులకు తలవొంచి తల్లిదండ్రుల ఒత్తిడితో మరోపెళ్ళికి సిద్ధపడతారు.
’నిరంతర శాకుంతలం’ కథలోని ప్రసాద్ తో వాళ్ళ నాన్నఇలా అంటాడు. “తెలిసీ తెలియని వయసులో ఏదో ఆదర్శమనుకొని- మన అంతస్థుకూ, కులానికి సరిపడని పిల్లను చేసుకున్నావు. నువ్వు కానీ, నిజానికి ఇది పెద్ద తప్పటడుగు. తలకెక్కించుకున్న లేనిపోని బరువు. బంధువు లందరూ యిదే మాట. ఇప్పటికైనా జరిగింది ఏమంత పెద్ద నష్టంగాదు. లక్షల కట్నంతో నీకు పిల్లనిచ్చే బంధువులు బోలెడుమందున్నారు. నువ్వు ‘ఊఁ‘ అంటే చాలు- కుల మింటి పిల్ల ఇంటికోడలవుతుంది. లోగడ నీకు జరిగింది ‘దండల పెళ్లి. రిజిష్టరూ గట్రా లేదు.”
ప్రసాద్ తండ్రి అలా మాట్లాడటంలో వింతేమీ లేదుగానీ, విప్లవాలు, అగ్నాత జీవితం వెలిగించిన ప్రసాద్ తండ్రి మాటల్ని విని మరో వివాహానికి సిద్ధపడడంలోనే అసంబద్ధత వ్యక్తమవుతుంది. వామపక్ష ఉద్యమాలలో పనిచేసినా వాళ్ళలోని పురుషనైజంలోగానీ, పితృస్వామిక సమాజమిచ్చిన వెలుసుబాటును ఉపయోగించుకోవడంలోగానీ ఎలాంటి వ్యత్యాసం కనబడదు.
పైపెచ్చు తాను రాజకీయాల్లో తిరగడానికీ, సంసార బాదరబందీ లేని నిష్పూచీ జీవనాన్ని గడిపేందుకు సహకరించలేదని భార్యను ఆక్షేపిస్తాడు. సహజీవనం చేసిన భార్య దళితురాలు, చదువుకున్నపిల్ల గాబట్టి రిజర్వేషన్లతో ఉద్యోగం సంపాదించుకో గలుగుతుందని భావిస్తాడు. తండ్రి చెప్పినట్లుగా నడచుకుంటే, కలిగే ఆర్థిక ప్రయోజనాన్ని కూడా బేరీజు వేసుకుంటాడు. రెండోపెళ్ళిలో ఆరులక్షల కట్నానికి సిద్దపడతాడు. ఈసంధర్భంగా ప్రసాదు తండ్రి రాసిన ఉత్తరంలోని వాక్యాలే ఇందుకు సాక్ష్యం.
“మళ్లీ నువ్వు మనలో పిల్లని గనక పెళ్లాడితే డబ్బు యిబ్బందులసలుండవు. నీ జీవనం, నీ కార్యక్రమాలు అన్నీ సాఫీగా నడిచి పోతాయి. నా యీ సూచనల్ని దూరదృష్టితో ఆలోచించగలవని నమ్ముతున్నాను.” అంటూ తండ్రి పెట్టిన ప్రలోభాలు, ఆర్థిక సందేశాలకు ప్రభావితుడయ్యే బలహీన మనస్తత్వం అతనిదని తెలుస్తుంది.
’ఆదర్శాలు-అన్వయాలు’ కథలోని ప్రసాద్-శకుంతల దాంపత్యంలో కూడాఈ అంశాన్నే చిత్రించారు. ప్రసాద్ సాంగత్యంలో ఊహించుకున్న ప్రేమైకజీవితం కొద్దికాలంలోనే వట్టిపోయిన బావి అయ్యింది. నిమ్నజాతి పిల్లను చేసుకున్నందుకు ప్రసాద్ తల్లి దండ్రులతన్ని పూర్తిగా వదిలేశారు. దంపతులిద్దరికీ బంధువుల ఆదరణగానీ, సాయంగానీ లభించని స్థితి. రాజకీయాలూ, ఉద్యమాలే లోకమైన ప్రసాద్ ఇంటి బాధ్యతంతా శకుంతల మీదికి నెట్టివేశాడు. పిల్లల్ని బ్రతికించుకుందుకు రకరకాల టెంపరరీ జాబులు చేస్తూ, అవి లేనప్పుడు దుఃఖాన్ని మింగుతూ గడుపుతుండేది శకుంతల.
ఒక శుభముహూర్తంలో సంసారపు బాదరబందీనంతా శకుంతలకొదిలేసి, తలిదండ్రుల అండకు చేరుకున్నాడు ప్రసాద్. తరువాత అమ్మానాన్నలు ఇష్టపడిన కులమింటి పిల్లను చేసుకుని, ఆమె తెచ్చిన భారీ కట్నంతో తన రాజకీయ జీవితాన్ని నిర్విఘ్నంగా సాగిస్తాడు. ప్రసాద్ కు “శకుంతలతో జరిగిన ఆదర్శ వివాహానికి చట్ట బద్దత లేదని అతనికి ముందునించీ తెలుసు” అంటుంది రచయిత్రి. తెలుసుకోలేనిది, గుర్తించలేనిదీ స్త్రీలే. వాళ్ళే ప్రేమ మైకంలోపడి కొట్టుకుపోకుండా స్థిరమైన మనసుతో చదువు, వుద్యోగాలను కొనసాగించాలన్న ఆకాంక్ష ఈకథల్లో వ్యక్తమవుతుంది.
ఒంటరిగా మిగిలిన లక్షుమ్మ, శకుంతల, ప్రమీల, సుజాత, శ్యామల వంటరి మహిళలుగా పిల్లల్ని పెంచడానికి అవస్థలు పడుతూనే, చిన్న వుద్యోగాలు చేసి, స్త్రీల అభ్యుదయానికి పాటుపడుతూ తమదైన జీవితాన్ని సార్థకం చెసుకోగలిగిన వ్యక్తిత్వం గల పాత్రలుగా స్త్రీపాత్రలను సృజించారు. వీళ్ళందరూ అన్యాయానికి గురైనా జీవితంలో స్ఫూర్తివంతంగా జీవించిన పాత్రలే అన్ని కథల్లోనూ వున్నాయి. నిస్సహాయంగా నిలబడిన పాత్రలు కావు. తమకు జరిగినదానికి కృశించవు, కుంగిపోవు. ఆత్మహత్యలకు పాల్పడవు.
’ఎర్రలచ్చుప్ప’ సాధించిన ఘన విజయం మహిళలందరికి ఆదర్శవంతం కావలన్న ధృఢ సంకల్పం, తపన ఈకథలో కనబడుతుంది. ప్రభుత్వ పథకాలు, విధానాల పట్ల రచయిత్రికి గల విశ్వాసం తెలుస్తుంది. ఆదర్శ గ్రామ పంచాయితీగా తీర్చిదిద్దిన లక్షుమ్మ అభినందనసభలో, కలెక్టర్ సమక్షంలో ఆమె ప్రతిస్పందన ఉపన్యాసం తీరులో గమనించ వచ్చు.
“ఒక్క ఈ సిరివాడేగాదు ఈ పంచాయితీ పరిధిలోని ఊళ్లన్నీ నా స్వంత ఊళ్లే. చిన్నతనంనించీ నేను శ్రామిక స్త్రీని. అంచేత నాకు తెలిసిందల్లా కష్టపడి పనిజేయడమే. ప్రజలు సుఖపడాలనీ, మెరుగైన జీవితాన్ని అనుభవించాలనీ ప్రభుత్వం ప్రజల్నీ పంచాయితీల్నీ ప్రోత్సహిస్తోంది. అభివృద్ధి పనుల నిర్వహణకు నిధులు యిస్తున్నది. ప్రజల బాగునే లక్ష్యంగా పెట్టుకొని నేనూ, నా సహచరులూ సంకల్పశుద్ధితో, దీక్షతో సాముదాయక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాము. అంతేతప్ప, బహుమతుల ఆలోచన మాకు లేదు. ఆ సంగతే మాకు తెలియదసలు. పంచాయితీకి ప్రదానం చేసిన లక్షరూపాయల సొమ్మును ప్రజలకుపయుక్తమయ్యే మంచి ప్రాజెక్టు కోసం అందరమూ ఆలోచించి ఖర్చు పెట్టగలము. నన్నూ, మా పంచాయితీ సభ్యులందర్నీ అభినందించి, ఆశీస్సులందజేసిన అధికార, అనధికార ప్రముఖులందరికీ నా కృతజ్ఞతాభివందనములు”. ప్రభుత్వ పరిపాలన పట్ల పరిపూర్ణమైన విశ్వాసానికి, ఆలోచనావిధానానికి ప్రతీకాత్మకంగా లక్షుమ్మ పాత్రచిత్రణ జరిగింది.
“ఏమైతే మాకేమిటి” కథలో చారుమతి బ్యాంక్ ఉద్యోగి. ప్రతిరోజు తన బస్సు ప్రయాణంలో స్త్రీలకు ఎదురయ్యే సంఘటనలను చూసి చలించిపోతుంది. స్రీలకోసం కేటాయించిన సీట్లు స్త్రీలకు ఇవ్వకుండా పురుషులు ఆక్రమించడం, అడిగినా, లేవకుండా అసభ్యంగా మాట్లాడటం చూసి చలించిపోయింది చారుమతి. మద్రాసు ప్రాంతంలో స్త్రీలకు కేటాయించిన సీట్లలో పురుషులు కూర్చోరు..ఎవ్వరైనా స్త్రీలు వచ్చి నిలబడితే మగవాళ్ళు వాళ్ళ సీట్లల్లో ’ఉకారోంగో’ అంటూ స్త్రీలకు అప్పగించి, వాళ్ళు నిల్చోవడం జరుగుతుంది. రెండు ప్రాంతాలలోని జరుగుతున్న సంఘటనలు రెండింటిని పోలుస్తూ రచయిత ఈ కథనంచేశారు.
స్త్రీలకు ఏదైనా అవమానం జరిగితే అంతా కలిసికట్టుగా అవమానపరిచిన వాళ్ళకి బుద్ధి చెప్పడంకూడా గమనించారు. అమ్మాయిని ఒక పోకిరి వెధవ కౌగిలించు కొని, ముద్దుపెట్టి పారిపోతుంటే కూడా పట్టించుకోని పురుషులను ఆడవాళ్ళే పట్టుకొని పోలీసులకు అప్పగించాలని ప్రయత్నించారు. కానీ వాడు దొరకలేదు. దాంతో ఎవ్వరికి ఏం జరిగినా ఏమైతే మాకేమిటి అని ప్రశాంతంగా జీవిస్తున్న నాగరిక సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించిన చారుమతిపాత్రలో రచయిత్రి కంఠస్వరం వినబడుతుంది.
నేడు స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను చూసి కూడా చూడనట్టు ప్రవర్తించే సమాజవైఖరిని ఈకథలో నిరసించారు. అంతేకాక అమ్మాయిలు అవమానాన్ని ఎదుర్కొని నింధితున్ని శిక్షించే సమాజాన్ని ఆహ్వానించారు. స్త్రీ అంటే విలాసవస్తువుగా చూసే సమాజంలో స్త్రీలు నిరంతరం అవమానానికి గురవుతూనే వుంటారు. ఆ పరిస్థితిని మనకై మనమే మార్చుకోవాలనే సందేశాత్మక హితం ఈ కథలో వుంది. కదలికలేని రాళ్లలాగ కూర్చున్న పురుషాధిపత్య సమాజాన్ని స్త్రీలకు జరిగే అవమానాలను స్త్రీలే జంకు లేకుండా, ఎదుర్కోవాలని రచయిత్రి ఆశించారు.
ఆ ‘పాపదేమి తప్పు‘ కథలో నేటికి సమాజంలో విస్తరిస్తున్న దుర్మార్గం, ఎన్ని చట్టాలు వచ్చినా అరికట్టలేని అన్యాయం స్త్రీలపై జరుగుతున్న అత్యాధారాలు వాటిని తల్చుకొని, పేపర్లో వస్తున్న వార్తలను చదివి, పురుషులపైన గాఢమైన అవిశ్వాసం పెంచుకుంటుంది ఒక చిన్నపాప. స్కూలు నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు యాబ్బై ఏళ్ళ వయసున్న దేవదానం ఇంటి దగ్గర వదిలేస్తానంటే వద్దని చెడామడా తిట్టి వెళ్ళిపోతుంది. సమాజంలో వస్తున్న ఈ అకృత్యాల కారణంగా మంచివాళ్ళు సైతం నింధింపబడాల్సిందే. ‘ఆ పాపదేమి తప్పు‘ అని దేవదానం బాధపడడంతో కథ ముగించేస్తుంది.
సినిమాల ద్వారా, వార్తాపత్రికల ద్వారా ప్రచారమయ్యే సన్నివేశాలు, వార్తలు చిన్నపిల్లల్లో ఎంతటి భయాందోళనలు కలిగిస్తున్నాయో రచయిత మాధవి పాత్ర ద్వారా తెలియజేశారు. చిన్నపిల్లలు సమాజాన్ని అర్థం చేసుకొనే దశలో వారి మానసిక సంఘర్షణను ఈకథలో తెలిపారు. పురుషాధిపత్య సమాజంలో స్త్రీలు కూడా ఆ భావజాలానికి బలైపోతున్నారనే మాధవి ఆలోచనా క్రమంలో కథ నడుస్తుంది. వాటిని ఎదుర్కొనడానికి చేసే ప్రయత్నంలో మంచివాళ్ళను కూడా నిందలు పడాల్సివస్తుందని మాధవి పాత్ర ద్వారా తెలియజేశారు. పురుషాధిక్య సమాజంలో బాలికల్లో, మహిళల్లో వున్న అభద్రతాభావాన్ని అందరికీ అర్థమయ్యేలా చాలా సులభశైలిలో రచయిత్రి అందించగలిగారు.
“ప్రాబ్దకర్మం” కథలో సులోచన తన అల్లుడితోపాటు ”ఝనక్ ఝనక్ పాయల్బాజే !’ అనే సినిమా చూడాలనుకొని పొరపాటుగా తెలుగు సినిమాకు వెళ్తుంది. అక్కడ కళామతల్లికి పట్టిన దుస్థితిని చిత్రించడంతోపాటూ, సినిమారంగంలో స్త్రీ పాత్రల చిత్రీకరణను గురించి తెలియజేసిన కథ ’ప్రారబ్ధకర్మం’. పెళ్ళికాక ముందు వున్న హిరోయిన్ స్వభావానికి భార్య అయిన తరువాత ఆమె స్వభావంలో వచ్చిన తేడాని గమనిస్తే ఆ స్త్రీపాత్రచిత్రణంతా కూడా పురుషాధిపత్య భావజాలంతో చిత్రించినదేననిపిస్తుంది. తెలివి, అందం, పొగరు వున్న అమ్మాయిని పెళ్ళి తరువాత ఎంత దిగజార్చాలో అంతా దిగజార్చారని రచయిత తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
నేటి సినిమా రంగంలో స్త్రీలను వసూళ్ళను పెంచుకోవడానికే ఉపయోగించే ఒక వ్యాపార వస్తువుగా చేసిన పరిస్థితి కనిపిస్తోందన్నారు. స్త్రీని అర్ధనగ్నంగా, వీలైతే పూర్తి నగ్నంగా కూడా చూపించడానికి వెనుకాడని దుస్థితి నేటి సినిమారంగంలో చోటు చేసుకుంది. క్లబ్ డాన్సర్స్, డాన్సర్స్, అన్న తేడా లేకుండా అన్ని పాత్రల్ని హీరోయిన్సే వేస్తున్నారని విమర్శించారు. నేడు ఐటెమ్ సాంగ్ అన్న పేరుతో పాటల్లో అశ్లీలత, ద్వంద్వార్థాలు స్ఫురించేలా రాయిస్తున్నారు. లేడిసింగర్స్ చేత పాడించడం కొసమెరుపు. స్త్రీ స్థానాన్ని క్రమక్రమంగా తగ్గుమొహం పట్టిస్తున్నారు. సినిమా రంగం మీద గౌరవం లేని, స్త్రీలను గౌరవించలేని స్థాయిలో వుందని రచయిత్రితన ఆవేదనను ప్రకటిస్తారు.
మానవ అభివృద్ధిలో భాగంగా స్త్రీల జీవితం అన్ని సమాజాలలో అన్ని కాలాలలో సమస్యాత్మకంగానే ఉంది. లింగ అసమానతలను, సమాజ అసమానతలను వేరుగా చూడలేము. ఈ దేశంలో ఉన్న సామాజిక అసమానతలెంత వాస్తవమో విభిన్న సామాజిక జీవితాలను (వర్గ, కుల, మత, సంప్రదాయ పరంగ) మోస్తున్న స్త్రీలు అసమానంగా ఉండటం అంతే వాస్తవం. అందుకే మన సమాజంలో లింగ అసమానతలతో పాటు స్త్రీల మధ్య అసమానతలు సహజీవనం చేస్తున్నాయి. అందుకే రెండువేల సంవత్సరాలకు పైగా ఈ దేశంలో ఉనికిలో ఉండి గతించిన ఏ ఉత్పత్తి సంబంధమైనా స్త్రీ జీవితంలో మౌలిక మార్పులకు అవకాశం యివ్వలేదు. ఈ స్థితి మీదనే ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు “ఈ సమాజం అసమానమైన చట్రాన్ని పునాదిగా కలిగి విభజించబడిన స్థితిని కాపాడుకుంటూ వస్తున్నది. ఇది సామాజిక మార్పును తనలో ఇముడ్చుకోడానికి తగినంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంటుంది. అందుకే ఈ దేశంలో ఎన్ని మత విశ్వాసాలు ఉన్నా, ముస్లింల పాలన నుండి బ్రిటీష్ వలసపాలన వరకు ఏ పాలనైనా అన్నీ ఇక్కడి సమాజ, సాంస్కృతిక సంప్రదాయాలతో రాజీపడి యిమిడిపోయినవి. ఇలాంటి, సామాజిక నిర్మితిపై మానవీయ విలువలైన స్వేచ్ఛ, సమానత్వం ప్రాతిపదికగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించేందుకు రాజ్యాంగంలో ఏర్పర్చుకోవడం వరకే విశిష్టతగా మిగిలింది.
సమకాలీన ఆంధ్రదేశ స్థితిగతులను పరిశీలించినట్లయితే, అవి అనేక వైరుధ్యాలకు మార్పులకు లోనవుతున్న విషయం గమనించవచ్చు. సాంఘికంగా కులాల మధ్య ఘర్షణ, దళితులపై హింస, స్త్రీలపై అత్యాచారాలు, హింస, వరకట్న మరణాలు ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి నమోదు అవుతూనేవున్నాయి. వీటితో పాటు ఆర్థిక ప్రాంతీయ వ్యత్యాసాలు, పెరుగుతున్న పేదరికం కన్పిస్తాయి. సంస్కృతి పరంగా పోల్లరైజేషన్ ఆఫ్ సెక్స్, హింస, అమానవీయ విలువలు పెరగటం కన్పిస్తుంది. ఇది సమాజంలో ఒక పార్శ్వమైతే ఇంకోవైపు పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల వున్నప్పటికి పంపిణీలో అసమానతల ఫలితంగా రైతాంగ గిరిజన పోరాటాలు, దళిత, స్త్రీల నిరసనోద్యమాలు, పౌరహక్కుల ఉద్యమం ప్రజల చైతన్యంలో మార్పుకు ప్రతీకగా నిలుస్తాయి. పర్యవసానంగా సృజనాత్మక సాహిత్యసృష్టి కూడా తన స్వచ్ఛమైన బలంతో ముందుకు రావటం గమనించవచ్చు. వర్తమాన సమాజ పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవటానికి వలసపాలనలోని రాజకీయార్థిక సాంఘిక చారిత్రక పునాదిని అవగాహన చేసుకోవలసి ఉంటుంది. వలస పాలకుల ప్రధాన ఉద్దేశమైన ఆర్థిక దోపిడి, దాని వెసులుబాటు కోసం వారు ప్రవేశపెట్టిన ఆర్థికవిధానాలు, వారి అవసరాల దృష్ట్యా ప్రవేశపెట్టిన విద్యా విధానం, పరిపాలనా సంబంధమైన, న్యాయ వ్యవస్థా సంబంధమైన మార్పులు భారతదేశంలోని మధ్యయుగాలనాటి సాంఘిక ఆర్థిక పునాదులను కదిల్చి ప్రజల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని కలిగించాయని నంబూరి పరిపూర్ణ కథలు తెలియజేస్తాయి.
*****
కె.శ్రీదేవి ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. స్వస్థలం కడప. 12 పుస్తకాలు రాశారు. మూడు పుస్తకాలు ఎడిట్ చేశారు. ఆరు అవార్డులు అందుకున్నారు. 112 ఆర్టికల్స్ రాశారు.