చాతకపక్షులు (భాగం-10)
(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల)
– నిడదవోలు మాలతి
పరమేశంగారు శివరావుని పక్కకి పిలిచి, “నీ ఋణం ఈజన్మలో తీర్చుకోలేనురా” అన్నారు పైపంచెతో కళ్లు ఒత్తుకుంటూ.
“ఛా, అవేం మాటలు పరం, గీత నీకొకటీ నాకొకటీనా?” అన్నారు శివం అప్యాయంగా పరమేశంగారి భుజంమీద చెయ్యేసి.
పరమేశంగారు గీతదగ్గరకి వచ్చి బుద్ధిగా చదువుకోమనీ, ఏం కావాలిసినా శివం మామయ్యనో, కనకమ్మత్తయ్యనో అడగమనీ, మొహమాట పడవద్దనీ పదే పదే చెప్పేరు. శివరావు తండ్రిలాటివాడనీ, కనకమ్మ తల్లిలాటిదనీ, తనో బాబాయో అప్పుడప్పుడు వచ్చి చూస్తూ వుంటామనీ కూడా నొక్కి చెప్పేరు.
గీత అన్నిటికీ తలూపింది. నోట మాట రావడంలేదు.
భానుమూర్తి ఎవరూ చూడకుండా ఓ ఐదురూపాయలనోటు గీతచేతిలో పెట్టేడు. “ఎందుకూ” అంది గీత చప్పున గుప్పిడి మూసి.
తీరా కారు కదలబోతుంటే గీతకి ఉప్పెనగా దుఃఖం వచ్చింది. భానుమూర్తి దగ్గరకొచ్చి తల నిమురుతూ, “ఛ ఏడవడం ఎందుకూ? గుంటూరెంత దూరం కనక. నేను అప్పుడప్పుడు ఫోను చేసి మాటాడతాలే,” అన్నాడు.
కారు కదిలింది.
***
గుంటూరులో కారు దిగి, శివరావువెనకే అడుగులో అడుగేసుకుంటూ ఇంట్లోకి అడుగెట్టిన గీతని సాదరంగా ఆహ్వానించింది కనకమ్మ. ఆవిడ బుజంమీద చెయ్యేసి లోపలికి నడిపించుకు పోతుంటే గీత చలించిపోయింది. శివరావుకి ఆదృశ్యం సంతృప్తి కలిగించింది. మంచిపనే చేశాను అనుకున్నాడు.
“కూచో, కాఫీ తెస్తా” అంటూ ఆ అమ్మాయిని సోపాదగ్గర వదిలి లోపలికెళ్లింది కనకమ్మ.
శివరావు గీతపక్కనే కూచుంటూ, “మీ అమ్మలాగే అనుకో అత్తయ్య కూడా. ఏం కావాలన్నా అడుగు. మొహమాటపడకు. బెంగ పెట్టుకోకు. శలవులకి విజయవాడ వెళ్లొచ్చు, నేనే తీసుకెళ్తాను, సరేనా?” అన్నాడు ప్రేమగా తల నిమురుతూ.
సరేనన్నట్టు తలూపింది గీత. కనకమ్మ ఇద్దరికీ కాఫీగ్లాసులు అందించి, గీతకి రెండోవేపు కూచుంటూ, పేరుపేరునా ఒక్కొక్కరి యోగక్షేమాలూ కనుక్కుంది. తరవాత “స్నానం చేస్తావా?” అని అడిగింది.
గీత తల అడ్డంగా ఆడించింది. కూచున్న చోటునించీ కదలడానికి ఏదో పిరికితనం అడ్డొస్తోంది.
“చెయ్యి. స్నానం చేస్తే ప్రయాణం బడలిక తీరుతుంది,” అన్నాడు శివరావు.
గీత మాటాడకుండా లేచి, పెట్టెలోంచి మారు బట్టలూ, సబ్బూ, తువాలూ తీసుకుని కనకమ్మవేపు చూసింది.
“పద,” అంటూ ఆవిడ లేచి వెళ్లి ఆపిల్లకి స్నానాలగది చూపించి, మళ్లీ హాల్లోకి వచ్చింది.
అప్పుడు చెప్పేడు శివరావు గీతని తీసుకురావడానికి అసలు కారణం.
అంతా విని ఆవిడ, “ఆలోచించకుండా చేసేరు,” అంది.
“అలా అంటావేమిటి? ఆలోచించే చేసేననుకుంటున్నాను. గీత మంచి తెలివితేటలుగల పిల్ల. పరమేశం చదివించలేడు. మనంట్లో ఓ ఆడపిల్ల కలకల్లాడుతూ తిరగడం మనకీ సంతోషమే కదా” అన్నాడాయన.
సాధారణంగా మొగాళ్లకి ఇలాటివిషయాల్లో ముందుచూపు తక్కువ. సభల్లోనూ సంతల్లోనూ ఎంత పాండిత్యం వొలకబోసినా నట్టింట ఆడపిల్ల పరిస్థితులేమిటో గుర్తించలేరు. ఈవిషయంలో ఆడవాళ్లకే చురుకుపాలు ఎక్కువ. వాళ్లకే తడతాయి ఎక్కళ్లేని ఆలోచనలూనూ!
“వయసులో వున్న ఆడపిల్ల తల్లిచాటున వుంటేనే అందం. అన్నీ సవ్యంగా వున్నంతకాలం ఏబాధా లేదు. వుండాలనే మనం కోరుకుంటాం. కీడెంచి మేలెంచమన్నారు. చూసారా? ముందు కీడూ తరవాత మేలూను,” అందావిడ.
శివరావు విస్తుపోతూ భార్యవేపు చూసాడు. “కీడెందుకు జరుగుతుంది కనకం, తల్లిలాటి నువ్వుండగా,” అన్నాడు.
“అదే నాగోల కూడాను. ముందూ వెనకా చూసుకోకుండా మాటిచ్చేసి, బరువు నానెత్తికెత్తి మీరు చేతులు దులిపేసుకు కూచుంటారు. మనింట అందరూ మగపిల్లలు. ఎప్పుడు ఎవరికి ఏబుద్ధి పుడుతుందో అన్న ఆలోచన మీకేమయినా తట్టిందా?”
ఆవిడ అంతగా చెప్పినా ఆయనకి భయపడవలసినఅవసరమేమీ కనిపించలేదు. “సరే నువ్వన్నట్టు మనింట అందరూ మగపిల్లలే. ఒకవేళ మన రెండోవాడు దాన్ని ఇష్టపడ్డాడనుకో. అందులో తప్పేముంది. మనం పూనుకుని పెళ్లి జరిపించేద్దాం. పరమేశం మాత్రం ఇంతకంటే గొప్ప సంబంధం తేగలడా?”
కనకమ్మ నెత్తి బాదుకోడం తరువాయిగా, “ఎంతసేపూ మీరు ‘మనవాడు ఇష్టపడితే’ ‘పరమేశం మాత్రం’ .. అంటూ మీవేపునుంచే ఆలోచిస్తున్నారు. తల్లిని అనవలిసినమాట కాదు కానీ ఆపిల్లకి తగినట్టే వున్నారా మనపిల్లలు?” అంది కనకమ్మ రుసరుసలాడుతూ.
“ఆలూ లేదు, చూలూ లేదు …” అంటూ ఆగిపోయాడు శివరావు. ఆవిడమాటల్లో అంతరార్థం ఇప్పుడే తట్టింది ఆయనకి. తన పిల్లలెవరూ అదుపాజ్ఞలలో పెరగలేదు. ఆవిషయంలో తనూ కనకమ్మా చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఆసంగతి కనకమ్మ గ్రహించింది. ఇప్పుడు కనకమ్మ ఎత్తి చూపేవరకూ ఆయనకి తట్టనేలేదు!
***
గీతని తీసుకొచ్చిన మర్నాడు శివరావు కాలేజినుండి ఎడ్మిషను ఫారాలు తెప్పించి, కాలేజీలో చేర్పించేడు. గీత బెరుకుమొహం చూసి, మొదటిరోజు కాలేజికి కారులో ఆయనే తీసుకెళ్లేడు. దారిలో ఓ చిన్న నాలుగువాటాల ఇంటిముందు ఆపి, “అమ్మాయీ! సత్యం!” అని పిలిచారు.
గుమ్మానికి తెరగా అమర్చిన పాతచీరె తొలగించి, తొంగి చూసి, బయటికి వచ్చింది ఓ అమ్మాయి. గీత ఆ అమ్మాయివేపు పరీక్షగా చూసింది. అట్టే పొడుగు కాదు, చామనచాయ, చంద్రబింబంలా మొహం, చిన్న కళ్లూ, చూపరులని ఆకట్టుకునే తీరు కాదు. కానీ తీక్షణంగా చూస్తున్నట్టు వున్న ఆ రెండు కన్నులు కారణంగా ఎవరైనాసరే మరోమారు తిరిగి చూస్తారు.
“మామయ్యగారూ,” అంది సత్యం శివరావునీ, కారులో వెనకసీటులో వున్నగీతనీ చూస్తూ.
“కాలేజీకి వెళ్లడంలేదా?” అన్నారాయన సత్యంతో.
“ఇదుగో బయల్దేరుతున్నానండీ ఇప్పుడే.”
“పద, నేనూ అటే వెళ్తున్నాను. నిన్ను కూడా అక్కడ దింపుతాను. ఈ అమ్మాయి గీత, మనఅమ్మాయే అనుకో. నువ్వు కాస్త కాలేజీ చూపిస్తావని ఇటు తీసుకొచ్చేను,”
“అలాగేనండీ మామయ్యగారూ, వుండండి పుస్తకాలు తీసుకు వస్తాను,” అంది సత్యం లోపలికి వెళ్తూ. సత్యంతల్లి పాపమ్మ కొంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చి, “బాగున్నారా బాబుగారూ” అంటూ పలకరించింది.
“బాగానే వున్నాం” అని చెప్పి ఆవిడని కూడా క్షేమసమాచారాలు అడిగి, ఏమయినా కావలిస్తే కబురు పెట్టమని చెప్పారు.
సత్యం వచ్చి కారెక్కిన తరవాత, కారు కాలేజివేపు సాగింది.
***
గీతకి క్రమంగా మామయ్యగారి ఇల్లూ, కనకమ్మత్తా, వాళ్ల అబ్బాయిలూ, కాలేజీ వాతావరణం అలవాటవుతున్నాయి. సత్యం చాలా సన్నిహితురాలు అయిపోయింది.
ఇంట్లో అబ్బాయిలు అంతగా కనిపించడంలేదు శ్యాం తప్పిస్తే. అతను అన్నదమ్ముల్లో మూడోవాడు. మొదట్లో లేదు కానీ ఈమధ్య వారం రోజులుగా ఏదో ఒకటి కల్పించుకుని గీతని పలకరిస్తున్నాడు.
ఓరోజు గీత చదువుకుంటుంటే గదిలోకి వచ్చాడు “ఏం చేస్తున్నావు?” అంటూ.
“ఏంలేదు, రేపు తెలుగుక్లాసుకి వ్యాసం రాయాలి,” అంది చదువుతున్న పుస్తకంలో ఓకాగితం ముక్క గుర్తు పెట్టుకుని, మూస్తూ.
“మీకాలేజీలో ప్రెసిడెంటు పదవికి నామినేషన్లు కాల్‌ఫర్ చేశారుట కదా” అన్నాడు.
“ఏమో, నాకు తెలీదు.”
“చేశారులే. ఈసారి కూడా రాణీరావు పోటీ చేస్తుందేమో. ఆ అమ్మాయికేం తెలీదు. ఒట్టి మొద్దు. నువ్వు గోవిందమ్మని సపోర్టు చెయ్యాలి,” అన్నాడు శ్యామ్.
“ఎందుకు?”
“గోవిందమ్మ మనవాళ్ల అమ్మాయి. రాణీరావుకి పొగరు కూడాను. అసలు ఆ అమ్మాయికి సపోర్టే లేదు. ముస్లిములు, క్రిస్టియనులు, అంతా కలిసి 30 శాతం కూడా లేరు మొత్తం కాలేజీలో. గోవిందమ్మతో సెక్రటరి పదవికి పోటీ చేస్తున్న మేరీ ఎంతో మంచి అమ్మాయి. అంచేత నువ్వు గోవిందమ్మని సపోర్టు చెయ్యాలి.”
గీత నోరు తెరుచుకు చూడసాగింది అతనివేపు. ఇంట్లో క్రీనీడన మసిలే ఈ కుర్రాడిలో ఇంత ఎన్నికల పరిజ్ఞానం వుండడం, తన కాలేజీ విశేషాలు తనకంటే అతనికే ఎక్కువ తెలియడం ఆపిల్లకి అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది.
“మరి మేరీ మాత్రం క్రిస్టియను కాదా?” అంది తేరుకుని,
“వాళ్లు అసలు మనవాళ్లే. మూడు తరాలకి ముందు వాళ్లముత్తాత మతం పుచ్చుకున్నారుట. అసలు మేరీకి మన దేవుళ్లన్నా మనమతం అన్నా చాలా ఇష్టం తెలుసా! ప్రతి శనివారం ఆంజనేయస్వామిగుడికి కూడా వెళ్తుంది.”
శ్యాం కూడా శనివారం పొద్దున్నే గుడికి వెళ్తాడు. గీతకి అతడిభక్తి అర్థం అయింది.
“ఏవిటి ఇద్దరూ కబుర్లు?” అంటూ కనకమ్మ రావడంతో శ్యామ్ “ఏంలేదూ” అంటూ వెళ్లిపోయాడు.
“వాడొఠ్ఠి కబుర్లరాయుడు. నీమానాన నువ్వు చదువుకో. నిన్ను అట్టే చదువుకోనీకపోతే నాతో చెప్పు, నేను వాడికి చెప్తాను,” అంది ఆవిడ గీతతో.
ఆవిడ గదిలోంచి వెళ్లిపోవడం చూసి, శ్యాం మళ్లీ ప్రత్యక్షం. గీత అయోమయంగా చూసింది. మాట్లాడ్డానికీ, మానెయ్యడానికీ వీల్లేని అయోమయావస్థలో చిక్కుకున్నట్టు కటకటగా వుంది.
“చూడు గీతా! మాయింట్లో ఆడపిల్లలు లేరు కదా. అంచేత నాకు నీతో మాట్లాట్టం బాగుంటుంది, అంతే. నాకు నువ్వు చెల్లాయిలా కనిపిస్తావు. అమ్మెందుకు విసుక్కుంటుందో నాకర్థం కాదు,” అన్నాడు.
గీతకి నిజమేననిపించింది. చిన్నగా నవ్వి, “నేనేం అనుకోనులే” అని, “చదువుకోవాల్సింది చాలా వుంది,” అంది, కనకమ్మ హెచ్చరిక గుర్తు తెచ్చుకుని.
శ్యాంని తల్లి పిలిచింది పక్కగదిలోంచి. శ్యాం చప్పున గీతచేతిలో ఓ చీటీ కుక్కి, “ఇది,.. ఇది” అనేసి వెళ్లిపోయాడు గబగబా అక్కడ్నుంచి.
గీతకి ఒళ్లు ఝల్లుమంది. చేతిలో కాయితంముక్క చెమటకి తడిసి ముద్దయింది.
“ఇంకా పడుకోలేదూ?” అంటూ కనకమ్మ వచ్చింది కొంగుతో చేతులు తుడుచుకుంటూ. ఇంచుమించు రోజూ గీత ఈవేళకి పుస్తకాలమీద పడి నిద్రపోవడం, ఆవిడ వచ్చి, పుస్తకాలు తీసి పక్కన పెట్టి, లైటార్పి వెళ్లడం అలవాటు.
“నిద్ర రావడం లేదు,” అంది గీత పుస్తకంమీదికి మరింత వంగి.
“పడుకో. లైటు తీసేసి, కళ్లు మూసుకు పడుకుంటే అదే వస్తుంది నిద్దర,” అందావిడ పుస్తకాలు దొంతు పెడుతూ.
గీత పడుకుంది దుప్పటి మీదకి లాక్కుంటూ. చేతిలో చీటీ నలుగుతోంది. తను చదివిన కథలూ, చూసిన సినిమాలూ తలలో గిర్రున తిరుగుతున్నాయి. అందరూ నిద్దపోయేరని నమ్మకం కుదిరేక, బాత్రూంలోకి వెళ్లి, నెమ్మదిగా చీటీ సాపు చేసి చూసింది దడదడ కొట్టుకుంటున్న గుండెలతో.
“రేపుసాయంత్రం మేరీని ఆంజనేయస్వామిగుడికి రమ్మని చెప్పు. అర్జెంటు,”
సంతకం లేదు కానీ తెలుస్తోంది అందులో సందేశం. లిప్తపాటు నిరాశలాటిది కలిగింది గీత మనసులో. తనేమిటి ఎదురుచూసిందో, ఏమిటి ఎదురయిందో అర్థం అవడానికి రెండు నిముషాలు పట్టింది. తరవాత తన కర్తవ్యం తెలుసుకోడానికి రాత్రంతా పట్టింది.
తెల్లారి శ్యాం కనిపించకుండా వుంటే బాగుండునని వెయ్యి దేవుళ్లకి మొక్కుకుంది. వాళ్లు ఆపిల్ల మొర ఆలకించేరేమో శ్యాం కనిపించలేదు. ప్రైవేటు క్లాసుంది అంటూ తెల్లారే వెళ్లిపోయాట్ట.
కాలేజీలో మధ్యాన్నంవరకూ ఆలోచనలతో బుర్ర బద్దలుకొట్టుకుని, ఆఖరికి సత్యాన్ని అడిగింది మేరీ ఎవరని.
“తనతో నీకేం పని?”
గీత కంగారుగా, “నాకేం పనీ లేదు. సెక్రటరీ పదవికి పోటీ చేస్తోందిట కదా, ఎవరో చూద్దాం అని, అంతే,” అంది.
“శ్యాం చెప్పేడా?”
“నీకెలా తెలుసు?”
“సరేలే. నువ్వంటే ఇక్ష్వాకులకాలంలోనే వున్నావు ఇంకా. ఈమహానగరంలో అలాటి సంగతులు దాస్తే దాగుతాయా? శ్యామసుందరుడూ తెలుసు, కన్నె మరియమ్మా తెలుసు, ఆంజనేయస్వామిగుడి చుట్టూ వాళ్లిద్దరి ప్రదక్షణాలూ తెలుసు సకలజనులకూ,” అంది సత్యం హేళనగా.
విశ్వరహస్యం గుప్పిట్లో దాచుకున్నాననుకున్న గీత తెల్లబోయింది.
“అదుగో మేరీ,” అంది వాళ్లకి కాస్త దూరంలో గబగబా నడిచిపోతున్న రివటలాటి అమ్మాయిని చూపించి. గీత అటువేపు వెళ్లబోతుంటే, సత్యం చెయ్యి పుచ్చుకుని ఆపి, “చూడు గీతా, ఇలా చెప్తున్నానని ఏం అనుకోకు. నీకు ఫస్టు క్లాసు మార్కులు తెచ్చుకునే తెలివితేటలు వున్నాయి కానీ ఇలాటి ఉత్తరాలు బట్వాడా చెయ్యడానికి వేరే రకం తెలివితేటలు కావాలి. ఎందుకు దిగుతావూ ఈరొంపిలోకి?” అనేసి లైబ్రరీకి వెళ్లిపోయింది.
గీత ఆలోచిస్తూ నిలబడిపోయింది. సత్యం ఎందుకలా చెప్పిందో అర్థం కాలేదు. సరే చూద్దాం అనుకుని, నాలుగంగల్లో మేరీని కలుసుకుని, “శ్యాం ఇవ్వమన్నాడు,” అంది చీటీ అందిస్తూ.
మేరీ ఊఁ కొట్టి గీతవేపు చూడనైనా చూడకుండా ఆ కాయితం లాక్కుని గబగబా వెళ్లిపోయింది. గీతకి సత్యంమాటలు మనసులో మెదిలేయి. “మేరీగురించి దానికే ఎక్కువ తెలుసు” అనిపించింది.
ఇంటిదగ్గర ఆసాయంత్రం శ్యాం కనిపించలేదు. చిన్నతమ్ముడు జగదీశుని అడిగితే సినిమాకి వెళ్లేడని చెప్పేడు. గీతకి అకస్మాత్తుగా తాను ఒంటరిది అయిపోయినట్టు అనిపించింది. ఎవరితోనైనా మాట్లాడాలని వుంది. సత్యంవాళ్లింటికి వెళ్తానంటే కనకమ్మ ఒప్పుకోలేదు చీకటి పడుతోందని.
”పోనీ ఆంజనేయస్వామిగుడికి వెళ్లొస్తాను, పక్కవీధే కదా” అంది.
ఆవిడ “పద నేను కూడా వస్తాను” అంది.
ఆలయంలో ప్రదక్షణాలు చేస్తున్నంతసేపూ గీతకళ్లు నలుదిక్కులా వెదుకుతూనే వున్నాయి.
ఇంటిమీదికి ధ్యాస పోయిందేమో అనుకుంది కనకమ్మ.
* * * * *
(ఇంకా ఉంది)
చిత్రకారుడు: ఆర్లె రాంబాబు
నిడదవోలు మాలతి ఏడు దశాబ్దాలుగా కథలు రాస్తున్నారు. 2001లో తూలిక.నెట్ ప్రారంభించి, మంచి కథలు ఇంగ్లీషులోకి అనువాదాలు చేసేరు.. ప్రధానంగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను విదేశీయులకి కథలద్వారా తెలియజేయాలన్న ఆశయంతో మొదలుపెట్టిన సైట్ అది. 2009లో తెలుగు తూలిక బ్లాగు ప్రారంభించి తమ కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు ప్రచురిస్తున్నారు. ఆమెసాహిత్యం ఆమెబ్లాగు www.tethulika.wordpress.comలో చూడవచ్చు. కథాసంకలనాలు, వ్యాససంకలనాలు అన్నీ తెలుగు తూలిక బ్లాగులో e-Book formatలో ఉచితంగా లభ్యం. స్వాతంత్ర్యానంతరం, తెలుగు రచయిత్రులు అసామాన్యమైన ప్రాముఖ్యం సంపాదించుకున్నారు. ఆ ప్రాముఖ్యతకి వెనుక గల సాహిత్య, సామాజిక, ఆర్థిక, కౌటుంబిక పరిస్థితులను విశ్లేషిస్తూ రాసిన పుస్తకం Women writers, 1950-1975. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ.