నా జీవన యానంలో- రెండవభాగం- 14
-కె.వరలక్ష్మి
16-12-84 న సామర్లకోటలో మెయిల్ ఎక్కాను. విజయవాడ లో అందరితో బాటు రిజర్వేషన్ కంపార్ట్ మెంట్ లోకి మారాను. మోహన్ విజయవాడ వరకు వచ్చి నన్ను వారికి అప్పగించి వెళ్ళాడు. ఉదయం పది గంటలకు మద్రాసు లో దిగాం. మేం ఎక్కాల్సిన ట్రైన్ రాత్రి 7.20 కి. స్టేషన్ దగ్గర్లో చిన్న లాడ్జి లో రూమ్స్ తీసుకున్నారు. మా ముగ్గురికి ఒకటి, వాళ్ళ అందరికీ ఒకటి. ఫ్రెష్ అయి ఊరు చూస్తూ నడిచేం. అన్నాదురై సమాధి, మెరీనా బీచ్ వగైరాలు చూసి వచ్చి కేరళ వెళ్లే ట్రైన్ ఎక్కాం. ఉదయం 7 కి త్రిచూర్ లో దిగాం. అక్కడి నుంచి బస్సులో గురువాయూర్ చేరుకున్నాం. మురళీ లాడ్జి లో బస. సాయంత్రం ఒకసారి, మర్నాడు తెల్లవారుజామున 3 గంటలకు ఒకసారి గురువాయురప్ప(కృష్ణుడు) గుడికి వెళ్ళాం. నాకైతే కేరళ లోని ఆలయాలు అస్సాం, భూటాన్ లోని పగోడా ఆలయాల మాదిరిగా కనిపించాయి. ఆలయానికి నలభై ఏనుగులు ఉన్నాయట కానీ మేము మూడు ఏనుగులనే చూశాం. తెల్లవారు ఝామున ఆలయంలో ఒకటే తొక్కిసలాట. ఆ జనం నుంచి బయటకు రాగలనా అన్పించింది. భక్తి అనేది ఏకాంతంలోను , నిశ్శబ్దంలోనూ తప్ప సాధ్య పడదు అని డైరీ లో రాసుకున్నాను. ఆ రోజు లుంగీలు కట్టుకుని అర్ధ నగ్నంగా వున్న మగవాళ్ళతో క్యూ లో నిల్చోవడం గొప్ప జుగుప్స కలిగించింది. చాలామంది ఏనుగుల మూత్రాన్ని చెంబుల్లోకి పట్టుకుని పవిత్రంగా భావించడం చూసి నవ్వొచ్చింది. కొండలూ, కాలువలు దట్టమైన అడవులు లాంటి కొబ్బరి పోక చెట్ల తోటలు తడి జుట్లు విరబోసుకున్న ఆడవాళ్ళ తో ప్రయాణం చాలా ప్లెజెంట్ గా అనిపించాయి. దుడ్డు ఉప్పుడు బియ్యంతో వండిన అన్నం వల్ల హోటల్స్ లో భోజనాలు మాత్రం చేయలేకపోయాము.
గురువాయూర్ లో 10.30 కి బస్సెక్కి ఆల్వా లో దిగి, తిరిగి వెంటనే బస్సెక్కి వైక్యం లో దిగాం. కాలువ మీదుగా తాటి దుంగల మీద నడిచి తోట లోపలున్న రాధ వాళ్ళ అమ్మగారింటికి చేరాం. పెద్ద ఇల్లు, చుట్టూ రకరకాల చెట్ల తో పెద్ద తోట. మేం వస్తామని ముందే తెలిసి ఉండడం వల్ల వెజిటబుల్ రైస్, రకరకాల కూరలు, కొబ్బరి తో పిండి వంటలు చేశారు. సంధ్య వేళ మోకాలి ఎత్తున్న రెండు ఇత్తడి దీపపు సమ్మెల్లో నూనె పోసి వత్తులేసి బయట వసారా అరుగు మీద గుమ్మానికి రెండువైపులా పెట్టారు. ఇంటికెదురుగా యాభై గజాల దూరంలో వున్న రెండు సమాధుల దగ్గర రెండు ప్రమిదలతో దీపాలు పెట్టారు. రోజూ అలాగే పెడతారట. గుమ్మంలో పెట్టిన దీపాల్ని ఓ అరగంట వెలగనిచ్చి తర్వాత ఆర్పేసి లోపల పెట్టేసారు. అక్కడ వంటకి కొబ్బరి నూనె, ఒంటికి ఆవనూనె, దీపాలకి కానుగ నూనె వాడుతున్నారు. అందుకే కాబోలు ఎక్కడ చూసినా కానుగ చెట్లు పెంచుతూ ఉండడం కనిపించింది. రాధ ముందే చెప్పడం వల్ల మాకోసం వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ నూనె తెప్పించి ఉంచి వాటి తోనే వంటలు చేసారు. రాత్రికి రాధ, రాణి కలిసి అందరికీ చపాతీలు చేశారు. నేనైతే మర్నాడు తొలి వెలుగు రేఖల్లో లేచి తోటంతా తిరిగి వచ్చి, బయట అరుగు మీద కూర్చుని ప్రకృతి అందాన్ని వీక్షిస్తూ ఉండిపోయాను. టిఫిన్ల తర్వాత చేర్తల అనే వూరెళ్ళాం. వెంబనాడు నది మీద లాంచీలో ప్రయాణించి, మూడు బస్సులు మారి రాధ చెల్లెలు శ్రీదేవి ఇంటికి వెళ్ళాం. భాష ప్రాబ్లమే అయినా అక్కడ మణి కుట్టి నాకు మంచి ఫ్రెండైపోయింది. కేరళలో కొబ్బరి చెట్లు వుంటాయని తెలుసు కానీ మరీ అన్ని వుంటాయని ఊహించలేదు. వెంబనాడు గట్లనిండా, ఇళ్లకు ముందు వెనుక,ఆలయాల ప్రాంగణాల్లోనూ ఎన్నెన్ని కొబ్బరి చెట్లో , ఎవరింటికెళ్లినా అప్పటికప్పుడు చెట్ల నుండి తీసిన కొబ్బరిబోండాల నీళ్లు, పచ్చి కొబ్బరి తో ఆతిధ్యం. పెరట్లోంచి అప్పటికప్పుడు తీసిన ఉడికించిన చిలగడదుంపలు కానీ, చెట్ల నుంచి కోసిన బొప్పాయి, పనస లాంటి పళ్లతో మాకు ఆతిధ్యం. నవ్వు ముఖాలతో స్నేహపూర్వకమైన పలకరింపులు. తిరిగి వచ్చేటప్పుడు వైక్యంలో మహాదేవన్ (శివ) ఆలయం చూసాం.
ఆ మర్నాడు అంటే 21 న నాయర్ గారి ఊరు కడుకరా వెళ్ళాం. రాధ వాళ్ళ ఊర్లో బస్సెక్కి రోడ్డు మీద దిగి అడవి లాంటి దారిలో రెండు, మూడు మైళ్లు నడిచి ఆ ఇంటికి చేరుకున్నాం. ఇంటి ముందు పడవలు తిరిగే కాలువ, ఆ సాయంకాలం స్వాములు ఇరుముడి వేయించుకొని శబరిమలై కి బయలుదేరారు. రెండు మైళ్ళ దూరం లో ఉన్న మరవన్ తుర్త్ అనే ఊరెళ్ళి స్వాముల్ని జీప్ ఎక్కించి తిరిగి నడుచుకుంటూ వెనుకకి వచ్చాము. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కులశేఖర మంగలం అనే ఊరికి నడిచి వెళ్లి జోస్ థియేటర్ లో ‘పిది ఇల్లనం’ అనే మూవీ చూసొచ్చాం.
22 రాత్రి స్వాములు తిరిగి వచ్చేసారు. 23 సాయంత్రానికి అందరం తిరిగి రాధ వాళ్ళ ఊరు తోటగం వచ్చేసాం. మేం వచ్చే సరికి స్టేట్ బ్యాంక్ ఎంప్లాయి- రాధ తమ్ముడు సుభాష్, అతని భార్య గీత వచ్చి ఉన్నారు. 24న అక్కడ ఎలక్షన్ జరిగింది. కాంగ్రెస్ ఐ కాండిడేట్ స్కరియా థామస్, కమ్యూనిస్టు పార్టీ నుంచి సురేష్ కురుప్ పోటీలో ఉన్నారు. డిసెంబర్ 25 తెల్లవారుఝామునే లేచి ప్రయాణమయ్యాం. 7 గం లకు వైక్యం లో బస్సెక్కి ఎర్నాకుళంలో దిగి 10.30 am కి జయంతి జనతా ఎక్కేము. 26 ఉదయం వాళ్లంతా విజయవాడ లో దిగిపోయారు. నేను 3.30 pm కి సామర్లకోటలో దిగి 4.30 కి ఇంటికి చేరుకున్నాను. మోహన్ ఎలక్షన్ డ్యూటీ కి వెళ్లి ఉన్నాడు.
ఆ సంవత్సరం స్కూల్ పిల్లల్ని చిన్న తిరుపతి అనే చిన్న వూరు తీసుకెళ్ళాం. ఆ ఊరు పోల్నాడులో కాండ్రకోటకు అవతల వుంది. ప్రాచీనమైన చిన్న దేవాలయం. చాలా వరకు శిధిలావస్థలో వుంది. ఈ మధ్య తిరుమల-తిరుపతి దేవాలయం ట్రస్ట్ ఈ ఆలయాన్ని బాగు చేయించారని విన్నాను. కానీ గోనేడ నుంచి ఆ ప్రాంతమంతా కేరళ లాగా వుంది. ఒక్కోసారి మనకు దగ్గర్లోనే ఉన్న ప్రత్యేకతలను తెలుసుకోలేం. దారి పొడవునా మామిడి, కొబ్బరి, పనస లాంటి తోటల్తో పాటూ అన్ని తోటలకు మొగలి పొదల కట్టవలు. అందుకే కాబోలు పిఠాపురం మొగలి పరిమళాల సెంటుకు ప్రసిద్ధి చెందింది.
1985 నాటికీ స్కూలు బాగానే నడుస్తుంది కానీ విద్యార్థి కి పది రూపాయల ఫీజు తప్ప మరే ఫీజులూ లేక (ఎడ్మిషన్ ఫీజుల్లాంటివి) పెద్దగా ఆర్ధిక పరిస్థితి ఏమీ మెరుగు పడలేదు.
దానికి తోడు మోహన్ ఖర్చు. అతని శాలరీ నేను అడగకూడదనే నియమం ఒకటి. అతడు మాత్రం నా దగ్గర అప్పు అనే వంకతో నా దగ్గరున్న డబ్బులు కూడా తీసేసుకునే వాడు.
తిరిగి అడిగితే నేను వేరే వాళ్ళని తెప్పించి నడిపించుకుంటాను నువ్వు స్కూలు వదిలేయ్ అనేవాడు. పిల్లలు ఎదిగొస్తున్నారు. మా అబ్బాయి ఇంటర్మీడియట్, ఆడపిల్లలు 10th, 8th కొచ్చారు. వాళ్ళ చదువులెలాగా అనే దిగులుతో నాకు నిద్ర పట్టేది కాదు. మానసికమైన వ్యధతో కృంగిపోయేదాన్ని. అది నా ఆరోగ్యం మీద గట్టి ప్రభావం చూపించేది. పైకి గాజుబొమ్మలాగా తిరుగుతూ ఉండేదాన్ని, గుప్పెడు తిండి కూడా తినలేక పోయేదాన్ని. ఇంట్లో ఎవరికీ నా మీద ప్రేమలేదే అని దుఃఖం వచ్చేది. తీరిక లేనంత పనిని కల్పించుకున్నా ఏదో ఒక మూల ముళ్ళు గుచ్చుతూ ఉండేది. ఒక రోజు తీరిక లేక హోటల్ నుంచి టిఫిన్ తెప్పించాను. వాళ్ళు పచ్చి మిర్చి చట్నీ ఇచ్చారు. టిఫిన్ తిన్న ఐదు నిమిషాల్లో నాకు వామిట్స్ మొదలై కాసేపట్లో నాకు ప్రాణం మీదకి వచ్చినంత పనైంది. ఒళ్ళు చల్లబడి పల్స్ అందకుండా అయింది. మా ఫామిలీ డాక్టర్ జయ గారు అర్జెంటుగా కాకినాడకో, రాజమండ్రి కో తీసుకెళ్ళమన్నారట. మెలకువ లో లేని నా చెంపల మీద మోహన్ టపటపా కొట్టి నీ దగ్గర డబ్బులున్నాయా టాక్సీ పిలవాలి అన్నాడు. లేవు అనగానే బట్టలేసుకుని స్కూలుకు వెళ్ళిపోయాడు. అప్పుడు నన్ను సముద్రమంత దుఃఖం ముంచెత్తింది. అప్పటికి నా వయసు ముప్పై ఆరేళ్ళు. ఇక జీవితం ముగిసిపోయింది అనుకున్నాను. మొత్తానికి మా స్కూల్ పిల్లల పేరెంట్స్ ఎవరో జీప్ ఇస్తే దాంట్లో నన్ను రాజమండ్రి రంగయ్య చౌదరి గారి హాస్పిటల్కి తీసుకు వెళ్లారట. నా వెంట మా గీత వచ్చినట్టు గుర్తు. దారిలో జీపు హైస్కూల్ దగ్గర ఆపి మోహన్ ని కూడా ఎక్కించుకున్నారట. దారి పొడవునా అపస్మారకంలోనే వామిట్స్ అవుతున్నాయంట. వెళ్ళగానే డ్రిప్స్ పెట్టి ప్రాణం కాపాడాక లేడీ డాక్టరు (చౌదరి గారి భార్య) నాతో అన్నారు, అపెండిసైటిస్ అనుకుని ఆపరేషన్ చేసేసే వాళ్ళమమ్మా, కానీ అల్సరు ఇది , నువ్వు కారాలు తినకుండా జాగ్రత్తగా వుండు అని. కానీ తర్వాత ఎప్పుడు ఆదమరిచి కానీ, తెలియక ఫంక్షన్స్ లో కానీ, కారం, ముఖ్యంగా పచ్చి మిర్చి కారం తింటే వెంటనే హాస్పిటలైజ్ అయిపోయేదాన్ని. మూడు నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది.
మేం మా అమ్మ వాళ్ళ ఇంటికి మారిన తర్వాత హైస్కూల్ దగ్గరైంది. నా ఆఫీస్ రూమ్ వీధిలోకున్న గదిలో ఉండేది. మోహన్ తరచుగా సైకిల్ మీద వచ్చి ఒక రౌండ్ వేసి వెళ్తూ ఉండేవాడు. అతని ఆ నైజానికి భయపడి స్కూలుకి తల్లులు మాత్రమే రావాలని చెప్పేదాన్ని. ఒకోసారి తల్లులకు వీలుకాకపోతే తండ్రులు వచ్చే వారు. నేను బిగుసుకుపోయి వాళ్ళతో మాట్లాడడానికి భయపడేదాన్ని. ఎవరెవరొచ్చారు, ఎవరితో ఏం మాట్లాడానో అని ఎంక్వైరీలు చేసేవాడు. అదంతా నాకు తల కొట్టేసినట్టు ఉండేది. ఇప్పుడిలా తేలికగా రాసేస్తున్నాను కానీ అప్పట్లో అదంతా ఎంత దుర్భరంగా ఉండేదో చెప్పలేను. ఇంకో పక్క వాళ్ళ పిన్నుల కొడుకుల్ని తీసుకువచ్చి అవసరం పడిందని డబ్బో, నగలో ఇమ్మని అడిగించేవాడు. ఓ పక్క స్కూలుకి సంబంధించిన టెన్షన్లు, మరో పక్క ఇంట్లో ఈ హెరాస్మెంటు భరించలేక పోయేదాన్ని. ఆ స్ట్రెస్ నుంచి బయట పడడానికి దొరికిన పుస్తకమల్లా చదివేదాన్ని. యండమూరివీ, మల్లాదివీ వచ్చిన బుక్కల్లా నా దగ్గరుండేది.
అప్పుడే అనుకోని ఓ అద్భుతం జరిగింది—
*****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.