నిష్కల – 13

– శాంతి ప్రబోధ

తల్లి అడుగుల సవ్వడి గుర్తించిందేమో బిడ్డ ఏడుపు అంతకంతకు పెరిగిపోతున్నది.  గుక్కపెట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకొని గుండెకు అదుముకున్నది కావేరి. 

అప్పుడు  చూసిందామె.  బిడ్డ చెవి దగ్గర వెచ్చగా తగలడంతో కంగారుగా చూసింది. 

బిడ్డ చెవి పక్క నుంచి ఎర్రటి చుక్కలు  మొదట అదేంటో అర్ధం కాలేదు కావేరికి .  

ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది.  కాళ్ళు చేతులు ఆడడం లేదు.  గొంతు పెగలడం లేదు.  ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి.  

ఆ ఎరుపు చూస్తుంటే లోపలి నుండి పొంగుకొస్తున్న దుఃఖం కావేరిలో.. 

ఆమె లోపల బద్దలై  లావా లాగా  ఎగిసిపడుతున్న దుఃఖాన్ని అదిమి పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ బిడ్డను ఊరడించ చూస్తున్నది.  

ఆమె కళ్ళు చుట్టూ దేనికోసమో వెతుకుతున్నాయి. 

అంతలో ఒక్క ఉదుటున అక్కడకు పరిగెత్తుకు వచ్చారు శోభ , రామవ్వ. 

 ఒళ్ళంతా తడిసిపోయి చిన్నబోయిన మొహంతో ఉబికివస్తున్న దుఃఖాన్ని కనురెప్పల కింద దాచేందుకు ప్రయత్నిస్తూ బిడ్డను గుండెకు హత్తుకున్న కావేరిని చూస్తూ “ఏమైంది బిడ్డా .. ” అన్నది రామవ్వ 

ఆ పసి బిడ్డ ఏడుపు ఆగడం లేదు. అంతకంతకు ఎక్కువ అవుతున్నది..  

కళ్లనీళ్లు పర్యంతం అవుతున్న కావేరి నోటమాట పెగలడంలేదు .  బిత్తర చూపులతో బిడ్డ చెవి పక్కన ఉన్న ఎర్రటి చుక్కలు చూపింది. 

కళావిహీనం కావేరినే చూస్తూ “అయ్యో .. ఏమైంది. ఆ రక్తం ఏంటి ? ” కంగారుగా అన్నది శోభ 

రామవ్వ , శోభ బిడ్డకు వేసిన పక్క చూశారు . అక్కడ రెండు గండు చీమలు కనిపించాయి.

గండు చీమ పసిదాన్ని కుట్టింది అని అర్థమైంది వాళ్ళకి . 

ఓర్నీ .. దీనికే అంత కింద మీద అవుతున్నావా.. నీ బిడ్డ కేం కాలేదు. అటు చూడు ఆ గండు చీమలు అవి ముట్టినయ్. అంతే .. అని ధైర్యం చెప్పి కర్ర ఆడించుకుంటూ వంటగదిలోకి పోయింది రామవ్వ. 

బిడ్డకు పాలు ఇవ్వు. తాగుతూ నిద్రపోతుంది అన్నది శోభ. 

బిడ్డకు స్తన్యం అందించింది కావేరి.  అయినా బిడ్డ ఏడుపు ఆపలేదు . స్తన్యం ముట్టలేదు. 

కావేరిని ఓదార్చ యత్నిస్తున్నది శోభ. 

ఉల్లిపాయ తెచ్చి కచ్చా బిచ్చా నమిలి బిడ్డకు చీమ కుట్టిన దగ్గర పెట్టింది రామవ్వ 

 కాసేపటికి ఏడుపు ఆపి తల్లి స్తన్యం కుడుస్తూ నిద్రలోకి జారుకుంది పసిబిడ్డ.  అయినా అప్పుడప్పుడు వెక్కుతున్నది. 

నెమ్మదిగా  కావేరి మనసు కుదుట పడింది.  కళ్ళలోకి కొద్దిగా జీవం వచ్చింది . 

కావేరితో పిచ్చాపాటి మాట్లాడుతుండగా శోభకు రమేష్ నుండి ఫోన్ వచ్చింది. 

రామవ్వ ఇంటి దగ్గరకు రమ్మని అతనికి చెప్పింది శోభ. 

రామవ్వ దగ్గరకు వెళ్లి అమ్మా మీరు ఏమనుకోను అంటే ఒక మాట అడగొచ్చా అన్నది శోభ . 

అయ్యో అదేంది బిడ్డా .. ఎందుకంత మొహమాటం .. పెద్ద చదువులు చదివినోళ్లు.  పదిమందికోసం పనిచేస్తున్నవాళ్ళు . మీరు అట్లా అనొచ్చా .. 

అయితే అవుతది అంటా . నా తోని కానిదయితే కాదని చెప్తా .. అన్నది రామవ్వ తన పెద్దరికం చిన్నదిగా చేసుకుంటూ . 

అట్లా కాదు అమ్మా .. మీరు పెద్దవాళ్ళు. నాకంటే ఎక్కువ లోకం తీరు చూసినవాళ్లు.  అన్నిటికంటే ముందు అమ్మ… అని ఇంకా ఏదో చెప్పబోతున్న శోభ మాటలకు బిడియపడుతూ అడ్డం వచ్చింది.  అసలు సంగతేంటో చెప్పు బిడ్డా అన్నది రామవ్వ. 

అప్పుడు కావేరి కోసం తాము చేసిన ప్రయత్నం గురించి స్పష్టంగా వివరించింది శోభ. 

విషయం అర్ధమయిన రామవ్వ నోరారా నవ్వుతూ”అయ్యో ..  ఆయింత దానికి ఇంత గనం అడగాల్నా బిడ్డా.. బర్రెలు కట్టేసుకోను “అన్నది. 

ఆ మాటలకు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది శోభ. 

అంతలో రామవ్వ అందుకుని “గడ్డీ గాదం మన చేన్లనే దొరుకుతది.  అదంత నే జూసుకుంట తీ .. నువ్వేం ఫికర్ జేయకు”  అంటూ భరోసా ఇచ్చింది రామవ్వ . 

తనకు ఒక ఆధారం దొరికినందుకు కావేరికి చాలా ఆనందం కలిగింది. కానీ దాన్ని మాటల్లోకి తర్జుమా చేసి వ్యక్తం చేయగల శక్తి ఆమెలో లేదు. 

ఆమెలో ఆమె మాట్లాడుకుంటున్నది. ఆమెతో ఆమె చాలా చర్చించుకుంటున్నది. తర్కించుకుంటున్నది . 

అయిన వాళ్ళందరూ ఉండి అనాధ అయిపొయింది అని చాలా బాధపడ్డాను. కాను నేను అనాధను కాను.  

నా గురించి ఆలోచించే వాళ్ళు నాకు ఉన్నారు.  నా బాధ వాళ్లది గా చేసుకుని బాధ పడుతున్నారు.  నన్ను బాధ నుండి బయటెయ్యడం కోసం తన్లాడుతున్నారు. నా బతుకుదెరువు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.  అంటే వీళ్ళేగా తన వాళ్ళు. 

రక్త సంబంధం ఉంటేనే అయినవాళ్లు అవుతారా .. ఊహూ .. కాదు .. ఏ బంధం లేకపోయినా నా కోసం ఇంత ఆత్రుత పడుతున్నారు. నా బాగు కోరుకుంటున్నారు. ఇంతకన్నా అయిన వాళ్ళు ఎవరుంటారు?  

నా మంచి చెడు ఆలోచన చేసి నా మేలు కోరిన వాళ్ళు నా వాళ్ళు. వాళ్లే నా ఆత్మబంధువులు మనసులోనే తలపోసింది కావేరి. 

రక్త సంబంధీకులు, పెద్ద బలగమే ఉంది ఇద్దరి వైపు.  ఆపదలో ఉన్నప్పుడు, ఊబిలో కూరుకు పోతున్నప్పుడు చేయి సాయం అందించి పైకి తేవడానికి మనసు రానివాళ్ళు, ఆ చుట్టు పక్కల కానరాని వాళ్ళు వాళ్లంతా.  

వాళ్ళు బంధువులా .. అయినవాళ్ళా ..? 

ఊహూ … కానేకాదు . నా వాళ్ళు ఎలా అవుతారు?

అది చేయకపోగా రాబందుల్లా పీక్కుతిన్న వాళ్ళు వాళ్లంతా.. అమ్మానాన్న తమకు చెప్పకుండా, వాళ్ళకు విలువ ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా అతని వెంట నడిచానని బాధపడ్డారంటే, కోపగించుకున్నారంటే అర్థముంది.  కానీ అక్క కూడా అర్ధం చేసుకోలేదు. తన అత్తారింట్లో తల తీసేసినట్లుందని నానా మాటలంది. తమ్ముడు ఏం తక్కువ తినలేదు.  వీళ్ళే ఉంటే మిగతా బంధుగణం ఎంత చిలువలు పలువులు చేసి మాట్లాడుకున్నారో .. అడపా దడపా వార్తలు అందుతూనే ఉన్నాయి. అదంతా తానెప్పుడూ  సీరియస్ గా తీసుకోలేదు.  కానీ ఇప్పుడు నేను ఒంటరైన క్షణంలో ఓదార్చే తోడే లేదు.  కొడుకు పోయిన దుఃఖంలో అత్తింటివాళ్ళు ఆరడిపెడుతుంటే పుట్టింటివాళ్ళు అసలు ఇటుకేసి తొంగి చూడలేదు.   మా దృష్టిలో అదెప్పుడో చచ్చిపోయిందని తిలోదకాలిచ్చిన వాళ్ళు ఇక తనకేమవుతారు ?నేను వాళ్ళకేమవుతాను? ఈ లోకంలో మిగతా జనంలాగే వాళ్ళు కూడా.  

అంతే .. అంతే అంటూ తనకు తాను సమాధానపరుచుకుంది కావేరి. 

ఇంకెప్పుడూ అమ్మ-నాన్న, అక్క, తమ్ముడు అంటూ రక్తసంబంధీకుల కోసం బాధపడకూడదని గట్టిగా నిర్ణయించుకుంది కావేరి.  

కళ్ళముందు కనిపిస్తున్న ఇద్దరినీ చూస్తూ ఆపదలో అక్కున చేర్చుకున్న వీళ్ళే కదా తన వాళ్ళు.  తనకి తిరిగి ప్రాణం పోయాలని తపిస్తున్న వాళ్లు. 

తన నుండి  ఏమి ఆశించి చేస్తున్నారు.. వాళ్ళు ఆశించినా తాను ఏమి ఇవ్వగలదు ?  

ఏమి ఇవ్వలేని నిరుపేద తను.  

నిస్వార్ధంగా ఆప్యాయత పంచుతున్న మనసున్న మనుషుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలదు? లోలోనే తలపోసింది కావేరి.     

అంతా కలలో లాగా జరిగిపోయింది. సుడిగాలిలా తన జీవితంలోకి అడుగు పెట్టాడు. అంతే వేగంగా వెళ్లిపోయాడు. 

అతనితో పాటే చితి మంటలలో కాలిపోయిన జీవితంలో ఈ శరీరం కాలిపోకుండా చిన్న వెలుగురేఖ ఇచ్చిపోయాడు. తనకు మిగిలిన ఒకే ఒక ఓదార్పు ఈ బిడ్డ.

ఒళ్లోనే నిద్రపోయిన బిడ్డను మురిపెంగా చూసుకుంటూ లేచి వెళ్ళింది.  ఆ కదలికకు బిడ్డ అసహనంగా కదిలింది. 

పాత చీరతో దూలానికి కట్టిన ఉయ్యాలలో వేసి ఊపింది.  మళ్ళీ హాయిగా నిద్రలోకి జారుకుంది కావేరి కూతురు. 

రామవ్వ, శోభ ఎంతో పరిచయం ఉన్న వాళ్ళ లాగా మాట్లాడుకుంటున్నారు.  వాళ్ళెంత బాగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లకు కష్టాలు లేవా.. ఎంత హాయిగా నవ్వుకుంటున్నారు? 

లోకానాధ్  ఉండి ఉంటే నేనూ అట్లాగే నవ్వుతూ తుళ్ళుతూ ఉండేదాన్నేమో…

అతను తప్ప ఈ లోకంతో తనకేం సంబంధం లేనట్టు ఉండేది అప్పుడు. 

మనిషికి మనిషికి మధ్య సంబంధాలు లేకపోతే … వీళ్ళిద్దరూ తనకు పరిచయం అయ్యే వారా?

 ఒక్కసారిగా ఉలిక్కిపడింది .  

ఎవరో వీపుమీద చరిచినట్లయింది కావేరికి.  

గతకాలపు  తలపులతో వచ్చిన ఆమె గాఢమైన నిట్టూర్పు శోభ రామవ్వల దృష్టిని దాటిపోలేదు. 

అంతలో రమేష్ రెండు బర్రెలతో రానే వచ్చాడు. 

ఆ బర్రెలను చూడగానే కావేరి కళ్ళలో తళుక్కుమన్న మెరుపు శోభ, రామవ్వల దృష్టిని ఆకర్షించింది .  

ఎంత పెట్టి కొనుక్కొచ్చారో.. రెండు బర్రెలు ఇవ్వాలో రేపో ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి.  

రెండూ లోకల్ బర్రెలే కానీ  ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. ఒక బర్రె నల్లగా నిగనిగ మెరుస్తున్నది. మరోబర్రె అంత నల్లగా లేదు. మొఖం మీద తెల్లటి మచ్చ నుదుట బొట్టు పెట్టినట్టుగా ఉన్నది అని వాటికేసి సంబ్రమాశ్చర్యంతో  అపురూపంగా చూస్తున్నది కావేరి. 

కొట్టంలో తన బర్రె పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో  కట్టేయమని సూచించింది రామవ్వ. 

ఎండన పడి వచ్చిన  రమేష్ కి మంచినీళ్లు ఇచ్చి బర్రెలకు కాస్త నీళ్లు పెట్టమని కావేరికి పురమాయించింది ఆమె. 

రమేష్ కి మంచి నీళ్లు అందించిన కావేరి బర్రెలకు నీళ్లు ఎక్కడ పెట్టాలో అర్థం కాక అయోమయంగా రామవ్వ వైపు చూసింది. 

ఆమె చూపులకు అర్ధం గమనించింది రామవ్వ.   

తన బర్రెకు కుడితి పెట్టె గాబు లో నీళ్లు పెట్టమని సూచించడంతో నెమ్మదిగా అటుకేసి కదిలింది కావేరి. 

రమేష్ కావేరి వెనకే బర్రెల దగ్గరకు వెళ్ళాడు. 

నా దగ్గర ఎప్పుడు ఒక బర్రె ఉంటది. ఇప్పుడు ఇవి తోడయినయి . శోభ కేసి చూస్తూ చిన్నగా నవ్వింది రామవ్వ. 

నీలాకాశంలో చెదిరిపోతున్న మేఘాల్ని చూస్తూ .. ఇంకా ఈ లోకం ఇట్లా ఉన్నదంటే మీ అటువంటి వాళ్ళు ఉండబట్టే.. లేకుంటే లోకం తెల్వని ఈ పసిది ఏమవుతుండెనో …  అంటూ శోభ చేతిని చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కింది రామవ్వ. 

దేహం దాచుకోడానికి పిడికెడు జాగాలేని బక్క పలచని ఈ ప్రాణిని తల్లి కోడిలా  తన రెక్కల కింద చేర్చుకున్న రామవ్వ హిమ శిఖరం అంత ఎత్తున కనిపిస్తున్నది శోభ కు. 

కొద్ది క్షణాల మౌనం ఇద్దరి మధ్య. 

 తర్వాత, కావేరి నా మనవరాలు వంటిదే. ఆమెను కంటికి రెప్పలా నేను కావలి కాసుకుంటా బిడ్డా.. 

అత్తమామలంటే కొడుకు పోయిన బాధ లో ఉన్నారు. కానీ కన్నవాళ్ళ కేమయింది? వాళ్ళ  గుండెలు ఇప్పుడయినా కరగలేదంటే..,బండరాయిలే నయం వాళ్ళ కంటే..  ఆ తల్లిదండ్రులు ఏం తల్లిదండ్రులు? ఎంత కర్కోటకులు?  

ఒక్క క్షణం ఆగి , ఎంతయినా కన్న పేగు లాగకుండా ఉంటుందా .. ? 

కులం దాటి, పరువు ప్రతిష్ట లు వదులుకుని అడుగుపెడతానికి భయపడ్డారేమో?  

కులం కులం అంటారు గానీ కులం కాకుల్లా పొడుచుకు తినేందుకే.. కద బిడ్డా .. అంటూ శోభ మొహంలోకి చూసింది రామవ్వ. 

ఆ పెద్దావిడ మంచితనమే కాదు, పరిస్థితులను అర్థం చేసుకోవడం, విశ్లేషించుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నది శోభ.  

కన్నబిడ్డ తోడు వెతుక్కుని ఒక గూటిలో చేరితే అట్లా వదిలెయ్యడమేనా..?  ఆ మాత్రం స్వేచ్ఛ ఆ బిడ్డకు ఉండకూడదా ..? 

ఒక బంధం మరో చోట బంధనం కాకూడదు కద బిడ్డా .. 

ఏ మనిషికైనా తన స్వేచ్ఛ తనకు ఉండాలికదా .. పసితనం పోని పాలబుగ్గల బిడ్డ మరో పసిదాన్ని సాకడం అంటే మామూలా.. 

ఇక లోకం తీరు మనకు తెలియనిదా.. 

మగ తోడు లేని ఆడదాన్ని ఆగమాగం చేయాల్నని చూసే గోతికాడ నక్కలు సిద్ధంగా ఉంటాయి కదా .. అన్నీ పడ్డదాన్నే ..  

వాతలు పెట్టి వెన్నపూస్తామంటారు కొందరు. 

కక్కలేని మింగలేని ఆ యాతన ఏంటో బాగా తెలుసు. 

అందుకే ఎవరేమనుకున్న అనుకోని అనుకున్న. ఈ పిల్లను నా ఇంటికి పిలిపించుకున్నా .. అని ఆగింది రామవ్వ. 

నిజమే అవ్వా ,  మీరు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు.  కావేరి మీ చెంత చేరిందన్న వార్త తెల్వగానే మేమెంతో నిశ్చింతగా ఉన్నాం అంటూ తన సంతోషం ప్రకటించింది శోభ.  

నేనేదో చేసానని ఈ ముచ్చట తేలేదు బిడ్డా .. కన్న బిడ్డ కంటే కులం ఎక్కువైపోయిన వాళ్ళ తీరుకు నాకే గుండెల గునపం కుచ్చినంత బాధ అయింది. 

ఇక పసిపిల్ల ఎంత బాధ పడుతున్నదో.. 

పైన చిమ్మచీకటి

లోన భగభగ మంటల భాధ .. అపరాధిలా నిలబడ్డది. 

నెర్రలిచ్చిన జీవితపు కన్నీటి చారికలు పైకి కనపడనివ్వదు.

గుండెన రంపపు కోత చప్పుడు విననివ్వదు. 

అయినా.. ఒక్క మాట చెప్పుకోదు.  

దుఃఖంతో నానిన కండ్లలో నీళ్లు కండ్లలో ఇగురబెట్టి బిడ్డకోసం జీవమున్న కట్టెలాగా బతుకుతున్న కావేరిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది. 

ఆమె ఆశలను అడియాశలు చేసేసింది కాలం. 

పోగొట్టుకున్న ఆ జీవితానికి చిగురంత ఆశ పొత్తిళ్లలో బిడ్డ.

కన్నీటి కుప్పలను గంపలకొద్దీ ఎత్తి పారబొయ్యకపోయె..

ఒక్కసారి గుండె పగిలేలా ఏడ్చి బరువు దించుకుంటే గానీ జీవితం కొత్తగా చిగురించదేమో .. అన్నది రామవ్వ . 

కావేరి మౌనంలో చాలా వినిపిస్తున్నాయి వాళ్లకి.

నిజమే.. ఘర్షణ, అణువణువునా సంఘర్షణ బిగబట్టి లోపలే సమాధి చేయాలని లోలోపల తలపుల్లో .. ఎవరికీ చెప్పుకోలేని ఆమె బాధ.. కన్నీటి సుడిగుండాలు..

కావేరి మౌనంలో చాలా వినిపిస్తున్నాయి శోభ, రామవ్వలకు 

ఆమె తప్పు చేసిందా..? అందుకే ఓడిపోయిందా..? జీవితాన్ని కోల్పోయిందా..? 

అనేకానేక ప్రశ్నలు 

తప్పు ఆమెదా.. ? ఆమె ప్రేమదా?  

ఆమె ప్రేమను అంగీకరించలేని కులాలదా..?  

పిల్లల మనసు అర్థం చేసుకోలేని పెద్దలదా..?  

పురుగుపట్టి కుళ్లిన సమాజానిదా?

అంతరాల ఆర్ధిక వ్వవస్థదా..?

కూలిపోవలసింది ఆమె జీవితం కాదు కదా..!

తిష్ట వేసుకు కూర్చున్న కులమతవర్గ వ్యవస్థ కదా..

పునాదులతో సహా కూలాల్సింది అర్థం చేసుకోని పెద్దల ధోరణి కదా.. 

నేరం ఆమెది కాకపోయినా తప్పు చేసినట్టు ఇనప ముళ్ల పై తలదించుకు నిలబడింది. 

అట్లా ఎందుకు నిలబడాలి ? 

ఫీనిక్స్ పక్షిలా మళ్లీ ఆమె జీవితం ఎగరాలి. 

అంటే..ముందు ఆమెతో ఆమె యుద్ధం చేయాలి . తాను దోషి కాదు నిర్దోషి అని తనకు తాను నిరూపించుకోవాలి. తనకు తాను మెప్పించుకోవాలి.  

పలకరింపులు, పరామర్శలకోసం తన్లాడడం కాదు. 

ఆక్రందనలు పెడుతున్న  ప్రాణాన్ని, నిషేధాన్ని ఎదుర్కోవాలి .  

దారి పొడవు మేకులు కొట్టి నడిపించే వారి చర్మం ఊడిపోయేలా, వారి దిమ్మ తిరిగిపోయేలా నిలదొక్కుకోవాలి. 

ఆవిరైపోతున్న ప్రాణాన్ని నిలబెట్టుకోవాలంటే తమ చేయూత కొంతకాలం అవసరం అని తలపోసింది శోభ.  

కావేరి, రమేష్ ల రాకతో ఆమె ఆలోచనల ప్రవాహానికి గండి పడింది.  

అక్కా.. పెర్కపల్లి వాళ్ళు ఫోన్ చేసారు. బయలుదేరారా అంటూ అని చెప్పాడు రమేష్. 

వాచీ చూసుకుంది. వాళ్లకు ఇచ్చిన సమయం దగ్గర పడుతున్నది.  ఇక ఇక్కడినుండి బయలు దేరాలి అనుకున్న శోభ కావేరి దగ్గరకు నడిచింది. 

 ఆమెను దగ్గరకు తీసుకుని “చీకటితో పోరాటం తప్పదు. వసంతం నీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ నువ్వు నీ కోసం, నీ బిడ్డ కోసం ఇప్పటినుండి నిలబడాలి.

దుఖాన్ని మింగిన కాలాన్ని జయించాలి. 

 తలవంచుకుని భరించడం కాదు తలెత్తుకు నిలబడాలి. 

నిన్ను నీవుగా నిలబెట్టుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు ముద్దాడాలి.  

నిన్ను  వేలెత్తి చూపిన చేతులే నిన్ను గొప్పగా చెప్పుకునే స్థితికి ఎదగాలి.  

అందుకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది అని చెప్పింది. 

రామవ్వ ను చూస్తూ అమ్మా మళ్ళీ తీరిక చేసుకుని వస్తా .   మీ నీడన కావేరి  కొత్త జీవితం వెలుగుతుందని ఆశతో ఉన్నానని  చెప్పి బయలుదేరుతున్న శోభను అకస్మాత్తుగా వచ్చి అల్లుకుపోయింది కావేరి.

కావేరినలా చూస్తుంటే శోభ మనసు మూగగా రోధిస్తున్నది.  ఎవరు ఎంత చేసిన తల్లిదండ్రులం కాలేం. 

భయంకరమైన లోన్ యాప్ లకు తోడు అక్కడ  ప్రేక్షక పాత్ర వహిస్తున్న ప్రజలు. ఏం చెయ్యాలో వాళ్ళని ??? 

 ఏ పేపర్ లోనో …న్యూస్ చానల్స్ లోనో ఈ చావు గురించి  వచ్చినప్పుడు …ఇది మా కళ్ళ ముందే జరిగింది…అలా జరిగింది ..ఇలా జరిగింది అని ..కళ్ళకు కట్టినట్లు ..ఓ కాలక్షేపంగా గంటలు గంటలు చర్చ పెట్టడంలోనే ఉన్న శ్రద్ధ తోటివారి ప్రాణాలపై ఉండదు. 

పాపం రెండు నిమిషాలు లోక్ నాథ్ కోసం కేటాయించి అతనికి మానసిక స్థైర్యం నింపగలిగితే  ఆ  ప్రాణం ఆగిపోకుండా నిలిచి ఉండేది కదా… 

అలా చేయకపోగా అతని మానసిక స్థితిని ఛిద్రంచేశారు.  వక్రభాష్యం చెప్పారు.

అంతా అయిపోయాక అయ్యో.. అని గొంతు చించుకున్నా, మొసలి కన్నీరు కార్చినా ఏం లాభం?

మనిషిలో ఎంత కాలుష్యం? మరెంత దుర్గంధం?

ఇంకెంత దుర్మార్గం !! 

బిడ్డా ఏడికో పోవాలన్నావు కదా పోయిరా .. కావేరికి నేనున్నా.. నాకు కావేరి ఉన్నది. అన్న రామవ్వకు కావేరిని వదిలింది .  రమేష్ ని తన బండిపైనే ఎక్కించుకుని ముందుకు కదిలింది శోభ.  ఆమె ఆలోచనల్లో రామవ్వ.   

గిచ్చి, గిల్లి, రక్కి, రెక్కలిరిచి పీకనులిమే సమాజంలోనే బతుకుపై ఆశల విత్తనాలు చల్లిన రామవ్వ లాంటి దయామయిలు కూడా ఉన్నారు.

 బతుకుని కుదించుకు బతికే కావేరిలాంటి వారికి చేయూతనివ్వడమే కాదు సమాజానికి వైద్యం చేయగల ధీశాలి రామవ్వ అనుకుంది శోభ  

***

కూతురు వాట్సాప్ చేసిన ఫొటో చూసి షాక్ అయింది సారా తల్లి.  

ఎలా .. ఎలా సాధ్యం ?

తన కూతురు శక్తి సామర్ధ్యాలు తెలుసు.  అనుకున్నది సాధిస్తుందని తెలుసు .  

కానీ ఆమె ఊహల్లో, తలపుల్లో ఉన్నట్టే తెలియని విషయం ఇది.  

అంతలో, గతంలో ఒకటి రెండు సార్లు తండ్రి వైపు బంధువుల గురించి కూతురు అడిగిన విషయం గుర్తొచ్చింది ఆమెకు. 

ఎప్పుడో మరచిపోయింది అనుకున్నది కానీ మరచిపోలేని ఇప్పుడు అర్ధమవుతున్నది. 

అంటే .. తన మూలలను తవ్వి తెలుసుకునే పనిలో ఉన్నదా ..

పరిపరి విధాల పోతున్నాయి ఆమె ఆలోచనలు..

అంటే అసలు విషయం వాళ్లకు తెలిసినట్లేగా… 

అయ్యో… ఇప్పుడెలా..

అంతలో , మరో మెసేజ్.. సారా నుంచి. 

చేతులు వణుకుతుండగా మెసేజ్ చూడడం మొదలు పెట్టింది సారా తల్లి .

(మళ్ళీ కలుద్దాం )

* * * * *

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.