నువ్వు పరిచిన ముళ్లపానుపు

-గట్టు రాధిక మోహన్

ఉదయాలను,రాత్రులను కట్టగట్టి 
నాకు నేనే అవుతూ 
నీ వాసన లేని ఓ కొత్త ప్రపంచంలో బతకాలనుకొని 
కరిగిపోయే రంగులను ముఖానికి అద్దుకొని
కొన్ని నవ్వులని పూయిస్తాను.
 
ఎందుకోగని… 
ఆ నవ్వులను చూసి కూడా 
నువ్వు అర్థంలేని చూపులతో
పోలికల కోసం వెతుకుతుంటావు
అసూయ లోయలో పడిపోతూ ఉంటావు.
 
సారూప్యం లేని 
ఆ చూపులకి…
ఆ పోలికలకి…
ఆ అసూయలకి…
ఏం చెయ్యాలో తోచని నేను 
నాలోని నేనుతో కలిసి 
ఓ సారి పక్కున నవ్వుకుంటాను.
 
కానీ…
నవ్వులా కనబడే ఆ నవ్వులో 
ఎన్ని మేఘాలు నల్లటి దుప్పటిని కప్పుకొని దాక్కున్నాయనే రహస్యం నీకెప్పటికీ అంతుబట్టదు!
 
ఇప్పుడు ఆ మేఘాల మీది దుప్పటిని దులిపేసి,
నవ్వుల మీద ఇంత ధైర్యపుతనాన్ని చల్లుకొని 
నా పుట్టుక,జాడల కింద నువ్వు పరిచిన 
ముళ్లపానుపులను ఎగదోయాలి.
 
నా అస్తిత్వ సువాసనలను వెదజల్లుకోడానికి
మురిగిపోయిన నీ మనసు నుండి 
పలాయనం చెంది వాడిపోని కొన్ని ఎర్రని రెక్కలను తొడుక్కొని ఓ గులాబిగా మారిపోవాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.