మానవవాదిగా డాక్టర్ గౌరి మాలిక్
-ఎన్.ఇన్నయ్య
డాక్టర్ గౌరి మాలిక్ బజాజ్ మానవవాదిగా రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికను నడిపింది. స్వతహాగా ఆమె ప్రాక్టీసు చేసిన డాక్టర్. ఢిల్లీలో చాలా పేరున్న డాక్టర్. ఆమె ప్రేమనాథ్ బజాజ్ కుమార్తె. విటాస్టాస్ స్త్రీల గురించి బజాజ్ రాసిన పుస్తకాన్ని అంకితం అందుకున్న వారిలో ఆమె వున్నది.
వైద్యవృత్తిలో పేరు తెచ్చుకున్న గౌరి, తండ్రిని, భర్తను కోల్పోయిన తరువాత, స్వయంగా రంగంలోకి దిగి, రాడికల్ హ్యూమనిట్ పత్రికను కొనసాగించింది. ఆ పత్రిక ఎం.ఎన్. రాయ్ స్థాపించి నడిపారు. అది ఆగకుండా నడవడానికి మానవవాదులే కారణం. ఆ కోవలో గౌరి కూడా చేరింది. చాలా శ్రద్ధగా యిష్టంగా రాడికల్ హ్యూమనిస్ట్ మాసపత్రిక ఢిల్లీ నుండి సాగించింది. జయప్రదంగా ప్రామాణికంగా పత్రికను నడిపింది.
శిబ్ నారాయణరే వి.ఎం. తార్కుండే, ఎ.బి.కర్నిక్, జి.డి.పరేఖ్, ఎ.బి.షా వంటి ఉద్దండులు నడిపి పత్రికను డాక్టర్ గౌరి ఎడిటర్ బాధ్యతల నుండి తప్పుకొని, మానవవాద ఉద్యమంలో కొనసాగింది. ఆమె చక్కని ఉపన్యాసకురాలు కూడా. విషయాన్ని విడమరచి చెప్పడంలో నిపుణురాలు.
చివరి రోజులలో ఆమెరికాలో కుమారుడు, కోడలు వద్ద స్థిరపడింది. అక్కడ నుండే మానవవాద కార్యక్రమాలలో సలహాయిస్తూ సాగింది. అప్పుడే అమెరికాలో ప్రసిద్ధ హ్యూమనిస్ట్ ఎడ్ డోర్ ను కలసింది. తరచుగా మానవవాదులు ఆమెను సంప్రదిస్తుండేవారు. పాంపోష్ కుమారుడు డాక్టర్. శకున్ కోడలు మెడికల్ డాక్టర్. ఇరువురూ గౌరి భావాలను ఆదరించి గౌరవించారు. వారి వద్ద చివరవరకూ ఉన్నారు. భారత మానవవాదులతో సంబంధాలు పెట్టుకుని, సందేశాలు యిస్తూ, ప్రోత్సహించారు. ఆమె వృద్ధాప్యంతో చనిపోవడం వలన ఉద్యమంలో లోతు ఏర్పడింది.
****