మిట్ట మధ్యాహ్నపు మరణం- 4

– గౌరీ కృపానందన్

అమ్మ, నాన్న, మణి మామయ్య, పక్కింటి రామ్ అంకుల్ అందరూ వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు.

“ఊరికి వెళ్ళే వాళ్ళ కన్నా వీడ్కోలు చెప్పడానికి మేము ముందుగా వచ్చేసినట్లున్నాం.”

మణి చేతిలో సూట్ కేస్ కనబడింది. అమ్మ ప్రయాణంలో తినడానికి చక్కిలాలు, చేగోడీలు అన్నీ పాక్ చేసి తీసుకుని వచ్చింది.

“పెళ్లి హడావిడిలో నీ భర్తను నాకు సరిగ్గా పరచయం చెయ్యనే లేదు ఉమా” అన్నాడు మణి.

“ఏమండీ! ఇతను మణి మామయ్య.”

“మామయ్య అంటే?”

“మా అమ్మకి తమ్ముడు. పెళ్ళిలో అన్ని ఏర్పాట్లూ తనే ఛూసుకున్నాడు.”

“ఉమను చేసుకోవడం వల్ల మీరు నన్ను ఓడించేశారు” అన్నాడు మణి.

“అలాగా” అంటూ నవ్వాడు మూర్తి. ఉమ వైపు చూశాడు. ఉమ కళ్ళతోనే మణిని హెచ్చరించింది.

“నేను కూడా బెంగళూరుకి వస్తున్నాను. జి కంపార్ట్ మెంట్ లో నా సీటు.”

“దేనికీ?” అంది ఉమ.

“ఆఫీసులో ఆడిట్. భయపడకండి. మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను.”

‘మణికి ఎప్పడు ఏం మాట్లాడాలో తెలియదు.’ మనస్సులోనే విసుక్కుంది ఉమ.

“ఆరోగ్యం జాగ్రత్త. అత్తగారింట్లో అందరూ ఎలా ఉన్నారు?” తగ్గు స్వరంలో అడిగింది ఉమ తల్లి.

“ఇంకా వాళ్ళతో సరిగ్గా మాట్లాడందే?”

“అక్కడ నిలబడింది నీ మరిదేగా?”

“అవును. ఆనంద్ బి.కాం. చదువుతున్నాడు.”

“మణీ! ఎప్పుడు తిరిగి వస్తున్నావు?”

“రెండు రోజుల్లో అక్కయ్యా.”

నాన్నగారు బుట్ట నిండా పళ్ళు తెచ్చి ఇచ్చారు. “గ్రీన్ సిగ్నల్ వేసేశారు. రైలు ఎక్కు ఉమా.”

“అదిగో. అక్కడ వెళ్తూ ఉన్నది ఎవరూ? దివ్యనే కదూ?” అడిగింది ఉమ.

“ఎక్కడ?” 

ఆమె చూపించిన దిశలో వాళ్ళు చూసినప్పుడు జనం గుంపుగా రావడంతో గుర్తు పట్టలేక పోయారు.

“దివ్య వచ్చిందా? ఎక్కడ?”

“చూడ్డానికి దివ్యలాగా అనిపించింది.”

“సరే సరే. మీరు ఎక్కండి. రైలు బయలు దేర బోతోంది.”

“రా.. ఉమా.” భుజాల చుట్టూ చేయి వేసి  ఉమను రైలు ఎక్కించాడు మూర్తి.

“నేను తరువాత వచ్చి మిమ్మల్ని చూస్తాను” అంటూ మణి తన సీటుకి వెళ్లి పోయాడు.

“ఉమా! క్షేమంగా వెళ్లిరా. ఊర్నించి వచ్చాక అల్లుడి గారితో మన ఇంట్లో నాలుగు రోజులైనా ఉండాలి.”

“సరేనమ్మా. ఆనంద్! వెళ్ళొస్తాం” అంటూ చెయ్యి ఊపింది.

అమ్మ కొంగుతో కళ్ళు తుడుచుకోవడం చూసిన ఉమకి బాధగా అనిపించింది. ఎందుకు ఈ కన్నీళ్లు? పదిహేను రోజుల్లో తిరిగి వచ్చేస్తానుగా అనుకుంది. ఎందుకో గుండెలో బరువుగా అనిపించింది.

రైలు కదిలింది. ఏ.సి. కంపార్ట్ మెంట్ లో కిటికీ ప్రక్కన కూర్చుని ఉమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మూర్తి. ప్రక్కనే వెళ్లి కూర్చుంటూ అతని వైపు చూసింది.

“ఏమిటలా చూస్తున్నారు?”

“రివిషన్ ! ఎలా ఉండింది?”

“ఏది?”

“నిన్న రాత్రి…”

“ఛీ … మీకు సిగ్గు లేదు.”

“ఇంకో ఐదు గంటల్లో బెంగళూరు చేరుకుంటాము.”

“చాలా ఫాస్ట్ ట్రైన్ కదండీ?”

“ఈ అండీ గిండీలన్నీ వదిలేయ్.”

“మరెలా పిలవనూ?”

“పేరు పెట్టి పిలు.”

“నా వల్ల కాదు బాబు” అంది ఉమ.

“మా ఇంట్లో అందరూ నన్ను బాబ్జీ అని పిలుస్తారు. నిన్ను ఎలా పిలుస్తారు?”

“నా పేరు చిన్నదేగా. మణి మాత్రం ఎప్పుడైనా ఉమీ అంటాడు.”

“మణికి నిన్ను ఇవ్వాలని  మీ ఇంట్లో వాళ్ళు అనుకున్నారా?”

“చిన్నప్పుడు అనుకున్నారు. కాని దగ్గరి బంధుత్వంలో పెళ్లి చేయడం నాన్నగారికి ఇష్టం లేదు. అందుకే ఆ ప్రపోజల్ అలాగే ఆగిపోయింది. మిమ్మల్ని చూశాక అన్నీ మరిచి పోయారు.”

“ఎలా?”

“మీరు చాలా అందంగా ఉన్నారని, హీరోలా ఉన్నారని మా ఇంట్లో అందరూ పొగుడుతూనే ఉన్నారు.”

“మణి కాస్త బాధ పడ్డాడేమో?” 

“ఉండచ్చు. కానీ అతను దేన్నీ సీరియస్ గా తీసుకోడు. మంచి మనిషి.”

“బెంగళూరు వెళ్ళగానే మాట్నీ షో.”

“ఏ సినిమా?”

“సొంత సినిమా! హోటల్ గదిలో.”

ఆమె ముఖం ఎర్ర బడింది. కిటికీ వైపు తిరిగి బయట కనబడుతున్న దృశ్యాలను చూస్తూ ఉండి పోయింది. మళ్ళీ అతను చనువు తీసుకోబోయాడు.

“పబ్లిక్ ప్లేసులో కాస్త బుద్దిగా ఉండండి. హోటల్ కి వెళ్ళాక మీ యిష్టం.”

“సరే మాట్లాడుకుందాం. దివ్యను నువ్వు స్టేషన్ లో చూశావా?”

“నాకెందుకో ఆమెను చూస్తే దివ్యలాగా అన్పించింది.”

“అంటే ఈ రైల్లో మన పెళ్లి వల్ల బాధ పడిన వ్యక్తులు మణి, దివ్య ఇద్దరూ ఉన్నారన్న మాట.”

“దివ్య ఇంటికి మీరు పెళ్ళిచూపులకి వెళ్ళారు కదా.”

“అవును. నిన్ను చూడడానికి ముందు.”

“చూసి?”

“నచ్చిందని చెప్పాను.”

“దివ్య మీకు నచ్చిందా?”

“అప్పుడు నచ్చింది.”

“బైక్ మీద హోటల్ కి, బీచ్ కి వెళ్లారట కదా.”

“ఎవరు చెప్పారు?”

“దివ్య చెప్పింది.”

“బీచ్ రోడ్ లో బస్ స్టాప్ లో నిలబడినప్పుడు చూసి లిప్ట్ ఇచ్చాను.”

“మీరు నాకెందుకు లిప్ట్ ఇవ్వలేదు?”

“నువ్వు ఆ బస్ స్టాప్ లో నిలడలేదుగా?”

“మా ఇంటికి రావచ్చుగా?”

“నీకు దివ్య మీద ఈర్ష్యగా ఉందా?”

“దివ్యా …. మీరు..”

“ఊం.. దివ్యా నేను?”

“వదిలెయ్యండి.”

“నేను … ఆమె… ఏమిటి? అడగదలచుకున్నదేమిటో సూటిగా అడుగు.”

“వద్దు లెండి. నేనేదో ఎరగక పోయి అన్నాను.”

“లేదు. నీకు ఏదో సందేహం ఉంది.”

“మీరు మాత్రం మణి గురించి అలా అడగవచ్చా?”

ముఖం తిప్పుకుంది. రెండు నిమిషాల తరువాత ఇద్దరూ నవ్వుకున్నారు.

“అది సరే. మీరు దివ్యను ఎందుకు పెళ్లి చేసుకోలేదు?”

“జాతకాలు కుదరలేదట. ఆమె జాతకంలో ఏదో దోషం ఉందట.”

“జాతకాలను మీరు నమ్ముతారా?”

“పెద్దగా నమ్మకం లేదు. కాని అమ్మకి పట్టింపు ఎక్కువ. ససేమిరా కూడదని చెప్పేసింది.”

“అమ్మ మాటకి ఎక్కువ విలువ ఇస్తారనుకుంటాను.”

“ఏదో అమ్మ ఉన్నంతవరకు ఆమె మనసు నొచ్చుకోకూడదని. మా తమ్ముడికి అమ్మ దగ్గర చనువు ఎక్కువ.”

“జాతకాలు సరిగ్గా కుదిరాయో లేదోనని ముందుగానే చూసుకుని ఆతరువాత పెళ్లి చూపులకి వెళ్లి ఉండవచ్చు కచా? దివ్య నా దగ్గర ఈ  ప్రశ్నే అడిగింది.”

“మొదట ఒక జోస్యుడు బాగా కుదిరాయి అని చెప్పాడు.  ఆ తరువాత మా ఫ్యామిలీ జోస్యులు  అస్సలు పొత్తు కుదరలేదని చెప్పేశాడు. ఆ రెండింటికీ మధ్యలో నేను పెళ్లిచూపులకు వెళ్ళడం … దివ్యను చూడడం జరిగింది. ఆ పాత కధ అంతా ఇప్పుడు ఎందుకు? “

“బ్రహ్మ ఆమె నొసట వేరే ఎవరినో రాసి ఉంటాడు, మిమ్మల్ని నాకు ముడి పెట్టినట్లు.”

మాటల మధ్యలో మణి వచ్చాడు.

“నాకు టి. టి. తెలుసు. లేకపోతే ఏ.సి. కంపార్ట్ మెంటులోకి రానివ్వరు. ఎలా ఉన్నారు పెళ్ళికొడుకు గారూ? ఉమ మాయింటి అమ్మాయి. ఆమె కంట నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.”

“ఏమిటీ? సినిమా అన్నయ్యలాగా డైలాగు చెబుతున్నారు?”

“ఎగతాళి చేయకండి. సీరియస్ గానే చెబుతున్నాను.”

“సరే, నేనూ సీరియస్ గానే చెబుతున్నాను. కంట తడి పెట్టనివ్వను.”

“ఇక మీద ఆమె నాకు చెల్లెలు లాంటిది.”

“సంతోషం! కాఫీ తాగుతారా?”

అప్పుడు ఉన్నట్టుండి ఉమ కళ్ళ ముందు ఒక దృశ్యం కదలాడింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.