యుద్ధం ఒక గుండె కోత-13
(దీర్ఘ కవిత)
-శీలా సుభద్రా దేవి
శ్వాస ఆడటంలేదు
ఆక్సిజను వాయువంతా ఇగిరిపోయిందేమో
వాతావరణం మంటలతో జ్వలిస్తోంది
ఉక్కుబూట్ల కింద శవాలు విరుగుతున్న చప్పుడు విన్పిస్తోంది
శిబిరాల కింద నిప్పులు దాక్కున్నాయి
పరదాల చాటున ఎండిపోయిన కళ్ళు
ఏడవటం మర్చిపోయాయి
జనమేజయుని సర్పయాగంలోని సమిధల్లా
కందకాలలో సగం కాలిన ఎముకల కుప్పలు
కమురుకంపుల్ని వెదజల్లుతున్నాయి
మృతవాసనల్ని పీల్చుకొని
బొమ్మజెముడు పువ్వు ఎర్రగా విచ్చుకొంది
విస్తరిస్తున్న పిశాచ సామ్రాజ్యాల్ని కీర్తిస్తూ
రాబందులు రాగాలాపనలతో
ఆకాశమైదానం నిండా విన్యాసాలు చేస్తున్నాయి
కోడిపిల్ల కోసం కాపువేసి
ఖర్జూరం చెట్టు మాటున డేగ కూర్చొంది
ఊరపిచ్చుకలు కడుపాకలి తీర్చుకోటానికి
నింగి రాల్చే గింజల కోసం
బేలచూపులతో ఎదురుచూస్తున్నాయి
కలుగుల్లోని చిట్టెలుకలు తొంగిచూస్తూ
పిల్లిని వెక్కిరించి పారిపోతున్నాయి
సేదతీర్చాలని దూదిపింజలని మూటగట్టిన మంచుతెర
క్రోధాగ్నుల వేడి సోకి కరిగి కన్నీరౌతోంది
పర్వత సానువుల చీలికల్లోంచి
కరడు కట్టిన ఛాందసత్వం ప్రవాహమై పారి
పిల్ల సెలయేళ్ళను కలుపుకొంటూ
ఉప్పెనై విజృంభించటానికి వేచివుంది
తల్లి హృదయం శ్వాసించే హక్కు కోల్పోయింది
క్షిపణి పేలుళ్లకు ఛిద్రమౌతోన్న ప్రేమ
శకలాలు శకలాలుగా తల్లిగర్భంలో కూలిపోతోంది
శరీరమంతా శిలాజమైపోయినా
సజీవ నేత్రాలు సుతిమెత్తగా సంచలిస్తూ
అమృత కిరణాల్ని ప్రసరించలేని అశక్తతతో
గుండెలోనే దాచేసుకొని
శిబిరాల మాటున తపోదీక్షలోకి పారిపోయి
తుదిశ్వాస కోసమైనా స్వచ్ఛమైన వాయువు కోసం
నిరీక్షిస్తూ నిశ్చల విగ్రహమైపోయింది తల్లి
*****
(ఇంకా ఉంది)