రాగో
భాగం-18
– సాధన
ఊళ్ళో సైతం జంగ్లాత్ వారికి అడిగింది సమర్పించుకొని కాళ్ళు, కడుపులు పట్టుకొని వారి దయా దాక్షిణ్యాలపైన బతికేవారు. దొడ్డికెళ్ళి ఆకు తెంపుకున్నా జంగలోడు (గార్డు) చూస్తే ఎంత గుర్రు గుర్రంటడోనన్న భయంతోనే వెన్నులో జ్వరం పుట్టేది. కూలి నాలి ఇచ్చినంతే తీసుకోవాలి. చెప్పినంత చేయాలి. ఊళ్ళో ఉద్యోగస్తులకు, పై నుండి వచ్చే అధికారులకు నచ్చేవన్నీ ఊరివాళ్ళంతా ఇచ్చుకోవలసిందే – కల్లు దించినా భయమే. ఇప్పపూలు ఇంట్లో ఉన్నా ఇబ్బందే.
పట్టాలేని తుపాకులు ఇంట్లో ఉంటే ఎప్పుడు పోలీసులు మీద పడి గుంజుకుంటరో, ఎంత దండుగేసి ఎన్నేళ్ళు జైలుపాలు చేస్తరో అన్న భయమే. చెప్పరాని పన్నులు వసూలు చేసేవారు. నాగటి పన్ను, మేక, గొడ్డు, దున్నపోతు, ఎడ్లకు, ఇంటికి, భూమికి, ఇలా జంగలోళ్ళు, రెవిన్యూ వాళ్ళు కలసి తమ ఇష్టం వచ్చినట్లు పన్నులతో ముంచేవారు.
అలాంటి ధీకొండ ఈ రోజు ఎంత మారిపోయింది? నిజంగా ఈ ముగ్గురి కృషి ఎంతో ఉంది. ఊరంతా ఒక పట్టు కావడానికి, ఊళ్ళో సంఘం ఏర్పడడానికి, గ్రామరక్షణ దళం నిర్మాణానికి ఇలా ప్రతిదానిలో వీరు ముగ్గురే ప్రధాన పాత్రధారులు. ఊళ్ళో ఏ న్యాయం గావాలన్నా, ఏ దండుగ చెల్లించాలన్నా, ఏ పనులకు పోవాలన్నా, ఏం చేయాలన్నా, ఏం చేయకూడదన్నా ఇవాళ సంఘమే అన్నీ నిర్ణయించాలి. ఊళ్ళో షావుకార్లు రూపాయికి పది పైసల లాభం ఉంచుకొని సంఘం చెప్పిన రేట్లకు సరుకులు అమ్ముకోవలసి వస్తుంది. ఎగిరే దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర ప్రతి కట్టుబాటు రివాజు విషయంలోనూ ప్రజలు సంఘం మాటకోసమే చూస్తున్నారు. ‘ఎంత మార్పు’ అనుకుంటూ రుషి ఈ ఆడవాళ్ళ రివాజుల విషయంలో కూడ అక్కలతోనే క్యాంపెయిన్ చేయించి సంఘం చొరవ పెంచితే తప్పనిసరిగానే మార్పు త్వరగా వస్తుందని ఊహించుకుంటున్నాడు.
“ఈ నడుమ పోలీసులు తిరుగుడు ఎక్కువైంది దాదా!” లెబుడు కొత్త విషయం మొదలెట్టాడు .
“మొగిలాయి (ఆదిలాబాదు)లో మన అన్నలు పోలీసులను చంపి తుపాకులు లాక్కెళ్ళినప్పటి నుండి ఇది మరీ పెరిగింది. కొత్త కొత్త పద్ధతుల్లో తిరుగుతున్నారు. రెండేసి జీపుల్లో మంది లేనిదే రావడం లేదు. నలిగిన దారులు విడిచిపెట్టి, వచ్చిన జాడ తెల్వకుండ అడవిలో నడుస్తూ వస్తున్నారు. నలభై, యాభైకి తగ్గకుండా కట్ట కట్టుక తిరుగుతున్నారు. ఏ మాత్రం అలికిడి అయినా వెంటనే పొజిషన్స్ తీసుకుంటున్నారు. ఒక్కొక్కసారి దారుల వెంట, ఖేతుల్ల దగ్గర కూడ పూట పూటంతా మాటు కాస్తున్నారు. మన దళాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు ఎన్నెన్నో చేస్తున్నారు. ఊరి బందుకు వచ్చి గాలిలోకి తుపాకులు కాల్చి ఏమో అయ్యిందన్నట్లు గాభరా పుట్టిస్తున్నారు. రకరకాల తుపాకులు, పెద్ద పెద్ద వైర్ లెస్లు మోసుకొస్తున్నరు. ఒక్కొక్కసారి కుక్కలను కూడ తీసుకొస్తున్నరు. ఎదురైనవారిని తీరొక్క ప్రశ్నలడిగి వేధిస్తున్నరు. కాల్చేస్తం – నక్సలైట్లంటము, ఆంధ్రలో చేసి నట్లే చేస్తం. జాగ్రత్త అని బెదిరిస్తున్నారు. తెలుగు, మరాఠి, హిందీ, మాడియా అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళలో మా గొట్టెవాళ్ళు కూడ ఉన్నరు. అచ్చు మీలాగే డ్రెస్సు లేసుకొని, అడవిలో వండుక తింటూ ఎవరు కలిసినా ‘లాల్ సలాం’ అంటున్నారు. కొందరు గుర్తుపట్టక మోసపోతున్నారు. మాది కొత్త దళం ఇక్కడి అన్నలకు సామాను లివ్వడానికి వచ్చామని అంటూ మీ దగ్గరేమైనా డంపు సామానుందా అంటూ ఆరాలు తీస్తున్నారు. క్యాంపు చుట్టూ కందకాలు కూడ తవ్వించారు. కన్నూర్ క్యాంపులో కూడ ఈ మధ్య మందిని బాగా పెంచారు. జీపు ఎప్పటికి అక్కడ ఉంటుంది. చుట్టు పహరా ఉంటున్నరు.
ఒక్క బొందలోనే పది మంది పడుకొని కాల్చేంత పెద్దగా అది తవ్వారు. రోజు రోజుకు మన సంఘం బలపడే కొద్దీ వారి తిరుగుడు కూడ పెరుగుతుంది.”
ఎండాకాలం పోయినా ఇంకా తగ్గని నిర్బంధం గూర్చి తనకు తెలిసిందంతా చెప్పాడు లెబుడు.
“ఊరూరికి ఇదే రిపోర్టు వింటున్నాం దాదా! మరి మనం ఏం చేద్దాం అంటారు” అంటూ, రుషి దళం కూచున్న వైపు దృష్టి పోనిచ్చాడు.
ముగ్గురు నలుగురు పుస్తకాలు పట్టుకొని పార్టీ లో కూరుకుతున్నా డుంగ మాత్రం తుపాకీని తుడుచుకుంటూ అలర్ట్ గానే ఉన్నాడు.
జైని సెంట్రీ పోస్టులో ఉంది. ఒక దొడ్డు మద్ది చెట్టు చాటుకు నిలబడి చుట్టు పరికించి చూస్తూ ఉంది. గంట దాటుతుంది. కుడిపక్కనున్న నారేప చెట్టు బోలు దగ్గర ముసురీగలు (కన్నె బుల్లలు) జుమ్మంటూ కంటపడ్డాయి. “అబ్బ తేనే” అంటూ లొట్టలు వేసుకుంటూ జైని నెమ్మదిగా నెమలి పిట్టలాగ లోగొంతులో కీఁప్… కీఁవ్ అని కేకేసింది. పిలుపు విని డుంగ లేచి సెంట్రీ వైపు బయలుదేరాడు.
ఇంతలోనే ఎడమ వైపున ఫల్లున కొమ్మ విరిగినట్టు, వెనువెంటనే అడుగుల చప్పుడు విని జైని సడెన్ గా అలర్టయ్యింది. ఒకే క్షణంలో రెండు వైపుల నుండి చూపులు తారసపడ్డాయి. అప్పటికే అలర్ట్ పొజిషన్లో ఉండి సేఫ్టీ కేచ్ తొలగించి రడిగా ఉన్న జైని వెంటనే చెట్టును ఆసరా చేసుకొని ఒక రౌండు ఫైర్ చేసింది.
అంతే! ఎదురుగుండా వస్తున్న పోలీసులు వెంటనే దబదబ లైయింగ్ పొజిషన్లో పడిపోయారు. దడ దడ తూటాలు పేలాయి.
జైని కూత విని వచ్చిన డుంగ అకస్మాత్తుగా ఎదురైన పరిస్థితిని క్షణంలో ఆకళించుకొని దార్లోనే ఓ పూసుగు చెట్టు వెనుక నీలింగ్ పొజిషన్ తీసుకొని వెంటనే జైనితో పాటు ఫైరింగ్ చేయసాగాడు. వరసగా పది రౌండ్లు పేలాయి.
సమావేశంలో ఉన్న రుషి వెంటనే వెపన్ తీసుకొని, సభ్యులందరిని సెంట్రీ పోస్టు వైపు కదలమని కాషన్ ఇస్తూ లెబుడు, డోలు, డోబిలకు చేతి బాంబులిచ్చి తొమ్మిది మందితో సెంట్రీ వైపు బెండ్ పొజిషన్లో కవరు టు కవరు పరుగు తీశాడు. ఐదు నిముషాల్లో సెంట్రీతో సెమీ సర్కిల్ గా ఏర్పడి ఎదురుగా వచ్చిన కాల్పుల్ని గురిపెట్టి గుళ్ళవర్షం కురిపించారు. అనువైన కవర్లుండి సరైన పొజిషన్ కుదరడంతో నిబ్బరంగానే ఫైర్ చేస్తున్నారు.
పోలీసులు గందరగోళంలో పడ్డారు. ఎదురుగా ఎందరున్నరో తెల్వడం లేదు. కానీ, ఫైరింగ్ ను బట్టి తమకన్నా ఎక్కువ మందే ఉంటారని అనుకున్నారు. కాషన్స్, అరుపులను బట్టి ఫైరింగ్ పార్టీ మెల్ల మెల్లగా అడ్వాన్స్ అవుతున్నట్లు కూడ అర్థమవుతూంది. ముగ్గురిని ఊళ్ళోనే వదలి పెట్టి ఇలా నలుగురే రావడంతో పీకల మీదికి వచ్చిందన్న గందరగోళం ఎక్కువయ్యింది. అంతే! ఉన్నట్లుండి వారికి అతి దగ్గరలో చెవులు చిల్లులు పడే శబ్దంతో చేతి గ్రెనేడు పేలింది. భూమి దద్దరిల్లింది. చావు మూడిందనుకున్న పోలీసులు కల్లుకు ఆశపడి ఊర్లోనే ఉండిపోయిన సాహెబు తల్లిని, ఆలిని తిట్టుకుంటూ కాలులేపారు. ‘బతుకు జీవుడా’ అని వాళ్ళు కాలికి బుద్ధి చెప్పడంతో అటు నుండి ఫైరింగ్ ఆగిపోయింది.
పరుగందుకున్న పోలీసులు దళం కంట్లో పడ్డారు. పది నిమిషాలు గడిచాయి. అంతటా నిశ్శబ్దం. ఎవరి ఊపిరి వారికే బరువుగా వినపడుతుంది.
“డుంగ, మూర మీరిద్దరు బెండింగ్ లో జాగ్రత్తగా ముందుకు వెళ్ళి ఇంకా ఎవరైనా ఉన్నారేమో కిల్లింగ్ గ్రౌండ్ ను వెరిఫై చేయండి. కవర్ టు కవర్ జాగ్రత్తగా పొండి” అంటూ రుషి కాషన్ ఇవ్వడంతో మళ్ళీ చలనం ప్రారంభమైంది.
రెండు నిమిషాల తర్వాత అంతా క్లియర్ అంటూ డుంగ కేకేసి చెప్పగానే రుషి లేచి నిలబడ్డాడు .
“కామ్రేడ్స్ అందరూ రండి” అంటూ గట్టిగా కేకేశాడు రుషి.
సెంట్రీ డ్యూటీలో మిగిలిపోయిన జైని మినహా అందరూ కమాండర్ చుట్టు చేరారు.
‘కామ్రేడ్స్! అందరూ చాలా ధైర్యంగా నిలబడి ప్రతిఘటించినందుకు సంతోషం. సెంట్రీ కామ్రేడ్ అలర్జుగా ఉండి దళాన్ని కాపాడడంలో మంచి చొరవ చూపి తన డ్యూటీ నెరవేర్చింది. ఇక్కడ మన పనులు కూడ ముగిసాయి. మనం వెంటనే ఇక్కడి నుండి కదలాలి” అంటూ దళాన్ని రడీ కమ్మని చెబుతూ రుషి డోలువైపు చూశాడు.
వారి చిరునవ్వుల్లో విజయోత్సాహం తొణికిసలాడుతుంది. “
కామ్రేడ్స్! మీరు చాలా సాహసంగా నిలబడ్డారు. ధైర్యంగా పోట్లాడితే తప్పనిసరిగా గెలుపు మనదే. మనం తర్వాత కలుద్దాం. ఊళ్ళో జాగ్రత్త. జరిగిందంతా చెప్పి, అందర్ని ధైర్యంగా ఉండమని చెప్పండి” అంటూ వారికి చేతిలో చేయి కలిపాడు. ఇంతలోనే ఊరి దాదలు ఇటు రావడం కనపడింది.
భూమ్యల్ సన్నో అందరికి ముందున్నాడు. మొస కొడుతున్న వారి ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కానవస్తుంది. .
“ఏమైంది దాదా! ఎట్లయింది. తుపాకి చప్పుళ్ళు విని మేము ఇటు ఊరికి వచ్చినం. పోలీసోల్లు నలుగురు అడ్డం పడి పరిగెడుతున్నారు. మనవాళ్ళ కేమన్నా అయ్యిందా దాదా” అంటూ గుక్క తిప్పుకోకుండా అరిచాడు సన్నో.
“లేదు. దాద మనకేం కాలేదు. వాళ్ళకేమన్న దెబ్బలు తాకాయో లేదో తెల్వదు” అంటూ రుషి చెప్పాడు. –
“లంజకొడుకులు. కల్లు ఆశకు ముగ్గురు ఊర్లెనే ఉండి పోయినరు గాని మొత్తం మంది వచ్చిండ్రు. ఊళ్ళె ఎవలు కనబడకుంటే వెతుక్కుంటు బయలెల్లిండ్రు మంచిగ బుద్ది చెప్పిండ్రు దాదా” అని సన్నో అనే సరికి అందరు ఒక్కసారి గొల్లున నవ్వారు.
“సెంట్రీ ఎవలున్నరు దాదా” – అంటూ గుంపులో నుండి అడిగింది ఓ ముసలమ్మ. “జైనక్క” – అంది సీదో.
“దాదా మేము పోవాలి, మళ్ళీ కలుస్తాం. ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఊరిమీద పడరేమో గట్టిగ నిలబడండి” అంటూ అందరి చేతుల్లో చేయి కలిపిన రుషిని దళ సభ్యులందరు అనుసరించారు.
గ్రామస్తులు సెంట్రీ పోస్టులో ఉన్న జైని వద్దకెళ్ళి అభినందన పూర్వకంగా చేతులు కలిపి వచ్చిన దారి పట్టారు.
దళం మడికొండకు బయల్దేరింది.
* * * * *
(ఇంకా ఉంది)
సాధన కమ్యూనిస్టు పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు. అడవి కడుపులో ఆయుధంతో అనునిత్యం కత్తి అంచుమీద నడుస్తూనే మిగుల్చుకోవడానికి కాలం వ్యాకోచించదు కనుక క్రమశిక్షణకు లోబడి ఓవర్ టైం పనిచేసి సృజనశీలియైన సాధన రాసిన రెండో నవల రాగో. అడవిలో మనుషులుంటారని, ఆ మనుషులకు అభిమానాలు, అభిజాత్యాలు ఉంటాయని – ఆ మనుషులు, వాళ్ళ మధ్యన మరో ప్రపంచపు మనుషులు కలిసి అనురాగాల, అభిమానాల, ఆదర్శాల ఒక స్వాప్నిక ప్రపంచం కొరకు ఒక కఠోర సాయుధ పోరాటం చేస్తున్నారని సాధన నవలలు ‘సరిహద్దు’, ‘రాగో’ సాధికారికంగా ప్రతిఫలిస్తాయి.