నెచ్చెలి పత్రిక వ్యవస్థాపక సంపాదకురాలిగా డా. గీత సాహిత్యాభిమానుల మనసులలో తన స్థానం సుస్థిరం చేసుకున్న కవయిత్రి, రచయిత్రి. గీత ఎంతో ప్రేమగా తెచ్చి ఇచ్చిన నాలుగు వందల అరవై పేజీల తన మొదటి నవల “వెనుతిరగని వెన్నెల “ రెండు చేతులతో జాగ్రత్తగా అందుకున్నాను. నన్ను తన ఆత్మీయురాలిగా భావించి ఇచ్చిన బహుమానం అది. నాకు గౌరవంగా భావించాను.
నవల పేరు ఎంత ఆసక్తికరంగా వుందో అట్ట మీదిబొమ్మ అంత అందంగా వుంది. చదవడానికి ఎన్నాళ్ళు పడుతుందో అనుకున్నాను. మొదలు పెట్టడమే మనవంతు. ఆ తరువాత తన్మయి చేయిపట్టుకుని తన వెంట వెళ్ళిపోతాము. విశాఖపట్టణం సముద్రపు ఒడ్డున తడి ఇసుక స్పర్శ , యూనివర్సిటీ దారిలో గాలి సంగీతానికి నాట్యం చేసే రెల్లు గడ్డి పూల అందం , దోసిలి నిండిన చంద్రకాంతం పూల తేలికైన సుగంధం తన్మయితొ బాటు మనం కూడా అనుభవిస్తాము.
చదివించే గుణం పుష్కలంగా వున్న ఈ నవలలో కథానాయిక కష్టాల కడలిలో ఈదుతూ కూడా స్థైర్యం కోల్పోని ధీరోధాత్త. కాలం పెట్టే పరీక్షలకు భయపడక జీవితంలో తను సాధించాలనుకున్న గమ్యం వైపు సాగిపోగల అలసట ఎరుగని పాంథురాలు. ఆమె ఒంటరి పోరాటం,చిన్నవిషయాలకే నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకు పూనుకునే అబలలకు కనువిప్పు కలిగించే కరదీపిక.
తన్మయి కథ మొదలు కాగానే “తెలివెన్నెల వేకువలో తానమాడి” ఉదయపు తొలి పొగమంచు తెరల్లో తనూ ఒక నీహారికై ఆకాశంలో నుంచి అప్పుడే ఉద్భవించినట్టు పరవశించే ఆమె భావుకత్వం చదువరి మనసును తాకుతుంది.
కన్యా వరయతే రూపం అంటారు. శేఖర్ని చూడగానే తన్మయిని ఆకర్షించింది అతని అందమైన రూపం.” పాలుగారే తెలుపు రంగు,అందంగా కొసదేరిన ముక్కు, చక్కని వుంగరాల జుట్టు, ఆపైన గొప్ప అందమైన ఎర్రని పెదవులు అతన్ని చూసి ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా? అనుకుంటుంది.
” బక్క పలచని శరీరం, పల్చని చెంపలు,ఒకమోస్తరు రంగు అనికూడా చెప్పలేని ఒంటి రంగు” గల తన్మయికి అతను రాసిన మొదటి ఉత్తరంలో ” నువ్వు నాకు నచ్చావు ” అన్న వాక్యం చాలా గొప్ప వాక్యంలా తోచింది.శేఖర్ టెంత్ క్లాస్ తో చదువు ఆపేసినా, తన పేరుకూడా సరిగ్గా రాయలేకపోయినా,అంతటి అందగాడు తనమీద ఆసక్తి చూపడం చాలు తొలియవ్వనం లోకి అడుగు పెట్టిన తన్మయి అతనివైపు ఆకర్షితురాలు కావడానికి.
అతడిని ఆమె కోరిన మొదటి కోరిక ” నాకు నీతో కలిసి వెన్నెట్లో గోదారిమీద విహారానికి వెళ్ళాలని వుంది”.
” చీకట్లోపడి గోదారెంట తిరగడమెందుకూ? అన్న అతని సమాధానంతో శేఖర్ తో ఆమె జీవితం ఎలావుంటుందో పాఠకులు ఊహించగలరు.
పై చదువులు చదివి, కాలేజి లెక్చరర్ కావాలనుకునే తన్మయి శేఖర్ తో పెళ్ళి కోసం తహతహలాడి నంతసేపు పట్టదు ఆమె కలలు భగ్నం కావకావడానికి.
తనకోసం తన నేస్తం దోసిలి నిండా దేవగన్నేరు పుష్పాలని బహూకరించాలని కోరుకున్న తన్మయి మనసు మొదటిరాత్రి శేఖర్ చూపిన మొరటుదనం వలన గాయపడుతుంది.
పెళ్ళికి కావలసింది ప్రేమ ఒక్కటే అనుకున్న అమాయకపు ఆడపిల్లకు కట్న కానుకలు, ఆడబడుచు లాంచనాలు, పుట్టింటి సారె వంటివి అల్లుడి హక్కుగా భావించే శేఖర్ మనస్థత్వం జీవిత పాఠం చెబుతుంది.
అలల నురుగుని ధరించి అణువణువు పులకరించాలని తపించే భావుకురాలికి తాగుబోతు, జారుడైన జీవిత భాగస్వామి చూపించిన నరకంతో మనసు విరిగి పోతుంది
అమ్మమ్మ మరణం చూసాక, తనూ చచ్చిపోతే పెళ్ళి అనే నరకం నుండి విముక్తి దొరుకుతుందేమో అన్న నిర్వేదంలో పడిపోయిన తన్మయికి తను తల్లి కాబోతుందన్న కబురు కొత్త ఆశను కలిగిస్తుంది. ఆమె ఆత్మీయ నేస్తం వనజ, ఊహలలోని అజ్ఞాత మిత్రుడు ఆమెకు ఆలంబనలు.
చదువు కొనసాగించడానికి తన్మయి తట్టుకున్న ఎదురుదెబ్బలు ఎన్నో. పసిబిడ్డతో విశ్వవిద్యాలయం క్లాస్ కి హాజరవడంతో మొదలైన ఎదురీత, నిప్పులగుండంపై నడక వంటి వైవాహిక బంధం తెంచుకోవడం, దప్పిక తీర్చె చెలమ అనుకున్న సహాధ్యాయి కరుణ ప్రేమ మృగతృష్ణ అని తేలడం,కన్నతల్లి విసుగు, వంటి కష్టాలతో సాగిపోతుంది.
రామకృష్ణ మిషన్ లో ఉద్యోగం, దివాకర్, మురళి, అనంత , సిద్ధార్థ
వంటి స్నేహితులు, విశ్వవిద్యాలయంలో ఉత్తమ శ్రేణిలో ఉతీర్ణత , జె ఆర్ ఎఫ్ లో ఎంపిక, కాలేజి లెక్చరర్ గా సెలక్షన్ వంటివి తన్మయిని ముందుకు నడిపిస్తాయి. ” జానకి విముక్తి” నవలను రెండు మూడు సార్లు చదివి తన్మయి పోరాట స్ఫూర్తి పొందడం సందర్భోచితంగా వాడుకున్నారు గీత.
జనారణ్యంలో మానవ మృగాల నుండి రక్షించుకోవడానికి అహరహము జాగ్రత్త పడవలసిన తన్మయి జీవితం తన చిన్ననాటి స్నేహితుడైన ప్రభు ప్రేమను స్వీకరించడంతో ఒక ఒడ్దుకు చేరిందనుకుంటాము. కానీ అక్కడా ఆమె ఎదుర్కోవలసిన సవాళ్ళు ఎన్నో. తనను ఎంతో ప్రేమించే ప్రభు తన కొడుకును చేరదీయకపోవడం మొదలుకుని, తనకు పాప పుట్టాక తన కొడుకును దూరంగా పంపించేయాలని చూసే అత్తింటి వారి నిరాదరణనుండి కొడుకును కాపాడుకోవడం, తలితండ్రులను సంతృప్తి పరచడానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభు జీవితంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడం దాకా అన్నీ పోరాటాలే.
ప్రభుకు అమెరికా అవకాశం రావడం, తన్మయి అతన్ని అనుసరించి వచ్చి, అమెరికాలో చదువుకుని, ఉద్యోగం సంపాదించి, నలుగురికి సహాయ పడుతూ ఆదర్శ ప్రాయంగా జీవించడంతో, ఆలస్యం అయినా ఆమెకు అందవలసిన న్యాయం అందిందన్న తృప్తి పాఠకులకు దొరుకుతుంది.
నవల ప్రారంభంలో “మీ గమ్యస్థానం చేరారు” అన్న సూచనతో తన అమ్మ స్నేహితురాలైన ఉదయిని ఇంటిలోకి అడుగు పెడుతుంది సమీర. తన తలిదండ్రుల ఇష్టప్రకారమే తన భార్య నడుచుకోవాలని అనుకునే భర్త సాయితో జీవితం సాగించడం సాధ్యంకాదని, కడుపుతో వున్నా కూడా విడాకులే పరిష్కారం అనుకుంటూ ఉదయిని ఇంటికి వచ్చిన సమీర, ఉదయిని చెప్పిన తన్మయి కథ విని పునరాలోచనలో పడుతుంది. తన భర్త సాయి, తన్మయి భర్త శేఖర్ వంటి దుర్మార్గుడు కాదు, ప్రభులా అమ్మానాన్నలకు విధేయుడు మాత్రమే గనుక వివాహం విఛ్చిన్నం చేసుకోకుండానే తన పోరాటాన్ని సాగించాలని సమీర నిర్ణయించుకుంటుంది. తప్పనిసరి పరిస్థితిలో తప్ప, విడాకులు విబేధాలకు పరిష్కారం కాదని తన్మయి కథ విన్నాక సమీర గ్రహించడం శుభసూచకం.
ఈ నవల ఆరు సంవత్సరాల పాటు ధారావాహిక నవలగా కిరణ్ ప్రభ గారి సంపాదకత్వంలో వెలువడుతున్న కౌముది అంతర్జాల పత్రికలో వచ్చి పాఠకుల మనసులను చూరగొంది. డెబ్బై రెండు నెలల పాటు తన్మయి ఆలోచనలోనే గడిపిన రచయిత్రి ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేసినంత సహానుభూతి కనబడుతుంది ఆ పాత్రచిత్రణలో.
తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ డిగ్రీ పొందిన తన్మయి జీవిత ప్రయాణంలో కవిత్వము, సాహిత్యము ఆమెతో చెట్టపట్టాలు వేసుకుని నడిచాయి నవల పొడుగునా.
రచయిత్రి గీతగారికి సాహిత్యంలో గల అభినివేశం అడుగడుగునా కనబడుతుంది ఈ కథనంలో. కథానుగుణంగా తన్మయి ఆలోచనలు నడిచే మార్గంలో రచయిత్రి అలంకరించిన కవితా పుష్పాలు కథానాయిక తన్మయి భావుకతకు అద్దం పడతాయి.
సుదీర్ఘమైన తన్మయి కథను బిగి సడలకుండా నడిపించి, పాఠకులు కథలో లీనమై తన్మయితో బాటు ముందుకు పయనించే విధంగా కథనం అల్లిన రచయిత్రి రచనా నైపుణ్యానికి అభినందనలు. కవయిత్రిగా కీర్తిపొందిన గీత, నవలా రచయిత్రిగానూ ప్రశంసలు అందుకొవడంలో సందేహం లేదు. ఆమె నుండి మరిన్ని నవలలు రావాలని ఆకాంక్షిస్తున్నాను .
వంగూరి ఫౌడేషన్ వారి ప్రచురణగా పుస్తకరూపం దాల్చిన ” వెనుతిరగని వెన్నెల ” రచయిత్రికి మరొకసారి హార్థిక అభినందనలు.