అగ్నిశిఖ
–కె.రూపరుక్మిణి
నువ్వు ఏమి ఇవ్వాలో
అది ఇవ్వనే లేదు
తనకేం కావాలో తాను
ఎప్పుడూ చెప్పనే లేదు..!
నువ్వు అడగనూలేదు ..!
నీలో నీతో లేని తనకు ఏమివ్వగలవు?
కొసరి తీసుకోలేని ఆప్యాయతనా..!
కోరి ఇవ్వలేనితనాన్నా.!
మురిపెంగా పంచలేని లాలింపునా.!
నిశీధిలో కలిసిపోయిన
ఆమె చిరునవ్వునా..!!
ఏమివ్వగలవు..??
ఎప్పుడైనా గమనించావా.. ఆమెని
ఆ చిలిపికళ్ళలోని…
లోతైన భావాన్ని….
వర్షించలేని మేఘాలని..
ఆ మాటలలో కలవరపాటుని
నిన్ను ఎడబాయలేక
ఎన్నిసార్లు తనని తాను
వంచించుకున్నదో కదా!!
ప్రేమ రాహిత్యంలో
ఆమెని ఆమె ఎప్పుడో మరిచిన తాను
ఏమి పంచుకోగలదు నీతో
ఆదరణ కరువైన అభిమానమా
నీవు మిగిల్చిన చేదు పలుకులలోని
అపహాస్యపు సవ్వడిలో పగిలిన
గాయాల గుండె గదులలో
ఘనీభవించిన ప్రేమనా
నీ చేయిపట్టి నడిచిన పడతి నిర్జీవమైన దేహాన్ని ఎందుకు తడిమి చూస్తావు
అక్కడ ఇంకా ఏమి మిగిలుందని
రక్తమాంసాలు నిండిన తోలుతిత్తి తప్ప
నీ అహంకారపు జ్వాలలలో
ఏనాడో సమిధైపోయింది
ఎప్పటికీ నిన్ను తిరిగి చూడలేని
నిర్మోహపు దారిలో ఇప్పుడు ఆమె
తనకి తాను కొత్త ఊపిరిలూదుకొని
నిన్ను వదిలి వెళ్లిన స్వేచ్ఛలో
ఆమె ఒక అగ్నిశిఖ
*****
బాగుంది అండి మీ కవిత