దానం
-ఆదూరి హైమావతి
అనగా అనగా ముంగమూరులోని ప్రభుత్వపాఠశాలలో ఏడోతరగతి చదువు తున్నది ఊర్మిళ. ఊర్మిళ తండ్రికి ఆఊర్లో చాలా మామిడి ఇతర పండ్ల తోటలూ ఉన్నాయి.
వాళ్ళ సైన్స్ పంతులుగారు పిల్లలను వృక్షా ల గురించిన పాఠం బోధిం చే ప్పుడు తోటల్లోకీ ,పంటపొలా ల్లోకీ తీసుకెళ్ళి చూపిస్తూ వివరంగా బోధించేవారు.
ఆరోజున మామిడి చెట్టు, పండులోని విటమిన్లూ, వ్యాపార పంటగా ఎలా మామిడి పెంచుకుంటారో వివరంగా చెప్పాలని ఊర్మిళ తండ్రి గారి అనుమతితో వారి మామిడి తోటకు తీసుకెళ్లారు పిల్ల లందరినీ.
వారితోట చుట్టూతా రేగు మొక్కలు కంచెలాగా వేసి ఉన్నారు. మనిషి ఎత్తున గుట్టల్లా పెరిగి ఉన్నాయి. నిండా రేగుపండ్లే, పెద్ద రేగు, ఖర్జూరం పండ్లంత పెద్దవి. పిల్లలు తోటలో ప్రవేశిస్తూనే క్రిందపడ్ద రేగు పండ్లు ఏరుకుంటూ మహాసంతోషంగా అరుచు కుంటూ తోటంతా తిరగసాగారు.
పంతులుగారు “పిల్లలూ! మీకు అర్థ గంట సమయం ఇస్తున్నాను. తోటంతా తిరిగి చూసి మీరు గ్రహించిన విషయాలు వచ్చి చెప్పాలి. అంతా అర్థగంట తర్వాత ఈ అరుగు దగ్గరకు చేరాలి. చెట్లకాయ లేవీ కోయకండి. క్రిందపడ్డవి ఏరుకోవచ్చు.” అని సూచించారు.
అంతా జట్లు జట్లుగా వెళ్ళి క్రిందపడ్డ రేగు పండ్లన్నీ ఏరుకుని తుడు చుకుని తినసాగారు. క్రింద మామిడి పండ్లూ చిలుకలు కొట్టినవి పడి ఉన్నాయి.
తోటమాలి” పిల్లలూ! నేను క్రిందపడ్డ మామిడి పండ్ల న్నీ కడిగి కోసి ఉప్పూకారం వేసి ఇస్తాను తిందురుకాని, క్రింద పడ్దవాటిని అలాగే తినకండి, మట్టి అయి ఉంటుంది. ” అనిచెప్పి క్రిందపడ్ద మామిడి పండ్లన్నీ కడిగి చెక్కుతీసి,కోసి, పిల్లలు అరుగు వద్దకు చేరే సరికి 5,6 ప్లేట్లలో పెట్టి ఉప్పూకారం కూడా కప్పుల్లో ఉంచాడు.
అంతా గుండ్రంగా జట్లుగా కూర్చొని మామిడి ముక్కలు తియ్యగా ఉండేవి అలాగే తినసాగారు. పుల్లముక్కలు ఉప్పూ కారం అద్దుకుని తినసాగారు.
పంతులుగారు మామిడి లోని విటమున్స్ , చెట్టు ఎదిగి కాయలు కాయను పట్టే సమయం, వ్యాపార పంటగా ఎలా పెంచాలి, ఎలాజాగ్రత్త చేయాలి,ఏసమయంలో కొయ్యాలి మొదలైన విషయాలు చెప్పారు. అంతా వారి లంచ్ బాక్సులు తెరిచి తినేసి తోట మధ్యగా పారు తున్న గచ్చు కాలువలోని నీటిలో బాక్సులు కడుక్కుని తిరుగు పయాణమ య్యారు.
ఊర్మిళ తాను ఏరిన రేగుపండ్లన్నీ కడిగి దార్లో అందరికీ పంచింది. తియ్య తియ్యగా ఉన్న ఆపండ్లు తింటూ అంతా పాఠశాలకు చేరాక వారి స్కూల్ డెస్కుల్లో వారు ఏరుకున్న పండ్లు పెట్టుకున్న సంచులు, రేపు తిన వచ్చని దాచుకుని ఇళ్ళకెళ్లారు.
అనుకోకుండా స్కూలుకు 5 రోజులు సెలవులు వచ్చాయి. మరునాడు అంతా తమ సొరుగుల్లో దాచు కున్న పండ్ల సంచులు విప్పి చూడగా అన్నీ మురిగి పోయి కంపుకొడుతున్నాయి . వారి దిగులుముఖాలు చూసిన పంతులు గారు “ఏమైంది?”అని అడిగారు.
“మాసంచుల్లో పండ్లన్నీ మురిగి వాసనేస్తున్నాయి.”అని చెప్పారు పిల్లలు. పంటులుగారు నవ్వి “వాటిని ఇంటికి తీసుకెళ్ళి మీ వాళ్ళకు ఇచ్చి ఉంటే ఎంత బావుండేది. దాచుకున్న వన్నీ మట్టిపాలు, పంచినవి మనపాలు.” అని చెప్పారు.
అందుకే పెద్ద లంటారు ‘ ఉన్నదాంట్లో కొంత దానం చేస్తే అవి మనవెంట మరో జన్మకు వస్తాయి. మనమే ఉంచుకుంటే నేల పాలవుతాయి. ధనం కూడా దాచుకుంటే దొంగలకో, దొరలకో, ప్రభుత్వానికి పన్ను రూపంలోనో వెళ్ళకతప్పదు.అందుకే పసితనం నుండే ఉన్నదాంట్లో కొంత ఇతరుల కు ఇవ్వడం నేర్చుకోవాలి.
*****