ఎడారి స్వప్నం
-డి. నాగజ్యోతి శేఖర్
నేను కొన్ని పూలఉదయాలను దోసిట పట్టి ఎదనింగికి పూయాలనుకుంటా….
అంతలో…
ఓ చీకటి చూపుడువేలేదో ముల్లై దిగుతుంది!
పూల రెక్కల నిండా నెత్తుటి
చారికలు!
కొన్ని కలల తీగల్నీ
కంటిపొదరింటికి అల్లాలనుకుంటా….
ఓ మాటల గొడ్డలేదో
పరుషంగా నరుకుతుంది!
తీగల మొదళ్లలో గడ్డకట్టిన వెతల కన్నీరు!
కొన్ని ఆశల చైత్రాలను మూటకట్టి స్మృతుల అరల్లో దాచాలనుకుంటా…!
ఓ ఉష్ణ శిశిరమేదో జ్వాలయి మండుతుంది…!
పచ్చటి జ్ఞాపకాల ఒడిలో గాయాల బూడిద!
కొన్ని శ్వాసల్ని ఉత్తేజ స్వరాలుగా కూర్చి
గెలుపు పాటను రాయాలనుకుంటా..!
ఓ అహాల అపశృతేదో ఆవహించి కర్కశంగా ధ్వనిస్తుంది!
ఊపిరిగీతం గొంతులో సమాధి రాళ్లు!
స్వేచ్చా స్వప్న వనంలో విహరిస్తూ…
“సాధికార వర్ణాలను” ప్రభవించాలనుకుంటా…!
ఎక్కడి నుండో ఒక డేగ నీడ
నా అస్తిత్వ దేహాన్ని ఆక్రమిస్తూ….
నా రెక్కలను తెగ్గోస్తూ….
నాది కాని మరో రూపమేదో
నాకు అతికించి….
ప్రత్యామ్నాయ మార్గం దొరకని …
బంధాల బంధిఖానాలోకి విసిరేసిపోతుంది!
నన్నో నిశినీడను చేసి
నాపై స్వారీ చేస్తూ
వికటాట్టహాసం చేస్తుంది!
తెగని సంకెళ్ళ మధ్య కొట్టుకులాడుతూ…
విరిగిన ఊహల్ని నలిగిన ఆత్మలో స్థాపితం చేసి
నా స్వాతంత్ర్యం ఎడారి స్వప్నమై తరాలుగా ఇలా పొడారిపోతూనే ఉంది!
ఈ దాహం తీరాలంటే
కోట్ల సంస్కార ఒయాశీస్సులు కావాలి!
అసలు ఎడారవ్వని
ఆకుపచ్చటి మస్తిష్క మైదానాలు జనించాలి.
*****
ఆకుపచ్చని మస్తిష్క మైదానాలకోసం ఎదురు చూస్తున్న ఎడారి స్వప్నం చాలా చాలా హృద్యంగా ఉంది నాగజ్యోతి శేఖర్ గారు. ఆ మైదానాల మొలకల్ని ప్రభవింపచేసి,పెంచే తల్లులు,తండ్రులు ప్రేమజలాలతో తడిపితే తప్ప చల్లని మనసులు రావు కదా. మంచి అంశం సఖీ🤝🏻🤝🏻🌹🌹