కనక నారాయణీయం -29

పుట్టపర్తి నాగపద్మిని

   ‘స్వామీ!! మీకు రాధాకృష్ణన్ గారితో పరిచయం ఎట్లా కలిగింది?’

        ‘నా పరిచయానికి ముందే మా అయ్యతో వారికి మంచి స్నేహం ఉండేది రా పీకే!!’ (కృష్ణ మూర్తి అన్న పేరుతో చాలా మంది టీచర్లు ఉండటం వల్ల వారి ఇంటి పేర్లతో కలిపి,సులభంగా పలికేందుకు  వీలుగా   పుట్టపర్తి వారు వారిని  పీకే. వీకే, జీకే, అని పుటాక్షరాలతోనే  సంబోధించేవారు. ఎవరూ నొచ్చుకునేవారు కారు.సరదాగా తీసుకునేవారే అందరూ!!)

         ‘అదెట్లా స్వామీ??

         ‘అదొక పెద్ద కథరా!’

         ‘అసలు, మీ జీవితమంతా కథలు  కథలుగా నడిచిందట గదా స్వామీ!! మీ దగ్గరికి వచ్చి కూచోవడమే మా అదృష్టం. మీ చిన్నప్పటి కథలు కూడ కొన్ని చెప్పండి, మేమూ మాతో పాటూ ఇదిగో యీ భావి దేశ పౌరులు కూడా విని నేర్చుకుంటారు – జీవితమంటే ఎట్లా ఉండాలో!!’

          కృష్ణమూర్తి అలా అడగగానే, అక్కడ కూర్చున్న పిల్లల్లోనూ ఆసక్తి చెలరేగింది. ఔను సార్, చెప్పండి, చెప్పండి..’ అని

 ఏకకంఠంతో అడిగేశారు.

          వాళ్ళ ఉత్సాహం చూసి, పుట్టపర్తికీ ఉత్సాహం పుట్టుకొచ్చింది.

        ‘రాధాకృష్ణన్ గారు, మా అయ్యా – ఇద్దరూ బెంగుళూరు కళాశాలలో కలిసి పనిచేసినారురా!! అప్పట్లో రాళ్ళపల్లి అనంత  కృష్ణ శర్మగారూ, మా అయ్యగారూ, రాధాకృష్ణన్ గారూ, ఎన్నెన్నో పాండిత్య చర్చలు చేసుకుంటూ ఉండేవారట, అక్కడ!! ఆయన సబ్జెక్ట్ ఫిలాసఫీ. మా అయ్యకు తిక్కన భారతం, ప్రబంధ సాహిత్యం, సంస్కృత సాహిత్యాలమీద మాంచి పట్టు ఉండేది. పైగా మంచి గొంతు. నాటకాల్లో దశరథుడి వంటి పాత్రలకు పెట్టింది పేరు మా అయ్యగారు!! ! రంగస్థల పద్యాలు మొదలుపెడితే, ఆ రస ప్రవాహంలో ఎవరైనా సరే కొట్టుకు పోవలసిందే!! ఇక  రాళ్ళపల్లి వారికి సంస్కృతాంధ్ర ప్రాకృత భాషాసాహిత్యాలమీద గొప్ప అధికారం. దానికి తోడు సంగీత శాస్త్రం పైన తిరుగులేని పట్టు. కచ్చేరీలు కూడా చేసేవాడాయన! వయోలిన్ బ్రహ్మాండంగా వాయించేవాడట!! ఈ మూడు భిన్న వ్యక్తిత్వాలూ ఒక చోట చేరి, తమ భిన్న భిన్న అభిరుచుల చర్చల్లో గంటలు గంటలు గడిపేస్తూ ఉండేవాళ్ళట!!’

            అక్కడున్న పిల్లవాడికొక సందేహం వచ్చింది.’స్వామీ!! సంగీత శాస్త్రమంటే ఏంది?’

             పిల్లలందరి ముఖాల్లో ప్రశ్నార్థకం.

             పుట్టపర్తి అందుకున్నారు. ‘ఒరేయ్!! సంగీతమంటే నీ మాటల్లో చెప్పరా!!’

             ఆ పిల్లవాడి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ‘సా పా సాలు అంటారు సార్  మా ఇంట్లో !!’

  వాడికి తెలిసినదింతే మరి!! పామర భాషలో క్లుప్తంగా సంగీతమంటే ఏమిటో  వాడు చెప్పిన తీరుకు పుట్టపర్తి పెద్దపెట్టున నవ్వేశారు.     పిల్లలూ, కృష్ణమూర్తి సారూ కూడా గొంతు కలిపారు.

            ‘ఒరేయ్!! సా పా సా లు కాదు రా!! స, రి, గ, మ, ప,ద, ని,అన్న ఏడు స్వరాలమీద ఆకాశ పర్యంతమూ నిర్మింపబడిన మహా విశాలమైన భవనం రా సంగీతం!! వేదాలలో సంగీత ప్రసక్తి ఉంది. నారదుడూ, తుంబురుడూ  మొదలైనవాళ్ళు – యీ సంగీత శాస్త్రంలో ఆరితేరినవారు.’

           ఇంకో పిల్లవాడందుకున్నాడు,’సార్, నారదుడంటే, తంబూరా పట్టుకోని, నారాయణ నారాయణ అని పాడుకుంటూ, లోకాలన్నీ తిరుగుతూ ఉంటాడు, అందరి ఇళ్ళకూ  పోయి, ఇక్కడి మాటలు అక్కడా, అక్కడి మాటలిక్కడ చెప్పి,  కొట్లాటలు తెచ్చి పెట్టుతా ఉంటాడు. ఆయనేనా సార్? ఆయప్ప సంగీతంలో కన్నా సంసారాల్లో తంటాలు పెట్టడంలో గొప్పోడని మా అమ్మ అంటా ఉంటాది సార్!’

          మళ్ళీ క్లాసులో నవ్వుల వరదలు!!

         నవ్వాపుకుంటూ, పుట్టపర్తి అన్నారు,’తప్పురా భడవా!! నారదుడి పని అది కాదురా!! ఆయన పనులన్నీ లోక కల్యాణం కోసమే!! ఆయన కూడా విష్ణుమాయలో ఒక భాగంగా, లోకాలను చుట్టివస్తూ, యెక్కడెక్కడి సమస్యలకూ ఒక పరిష్కార మార్గాన్ని సులువు చేస్తూ ఉంటాడు. అంతే!! ఇంతకూ సంగీతం గురించి ఆయన ఎన్నెన్నో విషయాలు చెప్పినాడు. తెలుసా?’   నీవిప్పుడన్నావే సా పా సా అని! అవన్నీ సప్త స్వరాలు. ఈ సా పా సా ల మధ్యా సప్త వర్ణ యుతమైన సప్త సాగర పర్యంతమైన సంగీతమనే అద్భుత లోకం ఉంది తెలుసా!!

          ‘వర్ణమంటే? ఒక విద్యార్తి ప్రశ్న!!

          పుట్టపర్తి అన్నారు.’రంగురా!!’

           ‘ సా పా సా లకు రంగులుంటాయా సార్??

          ‘విను మరి. షడ్జమము అంటే స (పాడుతూ చెబుతున్నారు పుట్టపర్తి) దీని రంగు, పద్మ పత్రము, లేత తామర పూవు వంటిదట!! ఋషభము – అంటే, రి – దీని రంగు చిలుక పచ్చ!! ఇక గ – గాంధారం – దీని రంగు బంగారు వర్ణం. మ – మధ్యమము – మల్లె పూవు రంగు. ప – పంచమము – కృష్ణ వర్ణం. నీలి లేదా కాస్త నలుపు కూడా!! దైవతం – ద. దీని రంగు పీత వర్ణము – పసుపు. ని – నిషాదం. దీని రంగు – అన్ని రంగుల కలయిక. నారద పురాణంలో చెప్పబడింది.’

         ‘ ఓహో!!భలే ఉందే!! ఎవరైనా యీ స్వరాలు పాడుతూ ఉంటే, యీ రంగులన్నీ కనిపిస్తూ ఉంటాయా సార్??

  ‘కళ్ళుమూసుకుని, మనసుతో వింటే, రంగుల అందమైన ప్రపంచమే కాదు, యీ స్వరాలను వింటూ మైమరచిపోతున్న సకల లోక ప్రాణులూ కనిపిస్తారురా పిల్ల నాయాలా!!’ నవ్వుతూ అన్నారు పుట్టపర్తి.

            ‘అంటే? మరో కుర్రవాడి సందేహం.

  ‘స అంటే, షడ్జమం. ఈ స్వరం వింటే, దేవతలు మహా ఆనందపడిపోతారట!! రి అంటే ఋషభం. ఈ రిషభం అంటే ఋషులకు ప్రాణం. ఇక గ అంటే గాంధారం. ఇది వింటే పైలోకాల్లో ఉన్న మన పితృదేవతలు మైమరచిపోతారట!! ఇక మ అంటే మధ్యమం. గంధర్వులకు చాలా ఇష్టమైన స్వరం. ప – పంచమం. ఈ స్వరం, అటు దేవతలకూ, ఆ పై పితృదేవతలకూ, ఋషులకూ కూడా చాలా ప్రాణప్రదమైనదట!! ఇక ప్రాణలందరికీ ధైవతం అంటే, ద అనే స్వరం, యక్షులకు నిషాదము అంటే ని అనే స్వరమూ ప్రీతిపాత్రమైనవట!!’

         కృష్ణమూర్తికి కూడా యీ సమాచారం చాలా ఆసక్తికరంగా తోచింది. ఉన్నపాటున సంగీతంలోని సప్తస్వరాల గొప్పదనాన్ని అలవోకగా చెబుతున్న పుట్టపర్తిని చూస్తుంటే అతనికనిపించింది, యీ ధీర గంభీర మూర్తి మేధస్సులోని పొరల్లో ఇంకా ఎన్నెన్ని అపురూపమైన నిధులున్నాయో? వాటిని వెలికి తీయగల సత్తా ఎవరికుంటుంది యీ చిన్న పాఠశాలలో??’ అని!!  తానూ అందుకున్నాడు.    ‘స్వామీ, రాధాకృష్ణన్ గారి నుండీ, సంగీతం మీదికి మళ్ళింది మన  టాపిక్, యీ పిల్లల సందేహాలవల్ల!! పోనీలేండి!! అన్నీ మంచి విషయాలే!! నాదీ ఒక సందేహం.  ప్రాణులు అన్నారు కదా!!మరి జంతువులు కూడా వస్తాయా యీ లెక్కలోకి??’

       ‘ఎందుకు లేదు?? ఇదిగో యీ శ్లోకం విని.

   షడ్జం మయూరో వదతి, గానో రంభంతి చర్షభం,

   అజావికేతు గాంధారం, క్రౌంచో వదతి మధ్యమం,

   పుస్ప సాధారణ కాలే కోకిలా వక్తి పంచమం,

   అశ్వస్తు దైవతం వదతి, నిషాదం వదతి కుంజర:’

    మయూరము, అంటే, నెమలి షడ్జమాన్ని పలుకుతుందట!! వృషభం, అంటే, ఎద్దు రిషభాన్ని ఆలపిస్తుందట!! గ – గాంధారం, మేక గొంతులోనూ, మ మధ్యమం క్రౌంచ పక్షి  అరుపులోనూ బాగా వినిపొస్తుందట!! పంచమం ప స్వరానికి మన కోకిలమ్మ పెట్టింది పేరు. అశ్వము – అంటే గుర్రము, దైవతానికీ, ని నిషాద స్వరానికి గజము అంటే ఏనుగు ప్రసిద్ధాలు. ‘

     పుట్టపర్తి యీ మాటలని ఆగగానే, అక్కడ కూర్చుని వున్న పిల్లల్లో ఎవడో ఒకడు, మే..మే..అంటూ మేకలాగా అరిచాడు. వాణ్ణి చూసి మరొకడు, కోకిల వలె కూ కూ అనటం మొదలు పెట్టాడు. మరొకడెవడో గుర్రం వలె సకిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటే, తక్కిన వాళ్ళు ఒకటే నవ్వులు!!  వాళ్ళతో పాటూ పుట్టపర్తీ, కృష్ణమూర్తీ కూడా గట్టిగా నవ్వేశారు!!   

***** 

  (సశేషం)

(ఫోటో మరియు అప్పటి ఉపాధ్యాయుల పేర్లు అందించటంలో సహకరించిన నా బాల్య స్నేహితురాలు శ్రీమతి కైపా (డీ) రామసుబ్బ లక్ష్మికి అనేక నెనరులు)            

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.