కొడవటిగంటి వరూధిని గారికి నివాళిగా!
(ఫిబ్రవరి 9, 2022 న స్వర్గస్థులైన కొడవటిగంటి వరూధిని గారికి నెచ్చెలి కన్నీటి నివాళి సమర్పిస్తూంది!)
-గణేశ్వరరావు
కొడవటిగంటి వరూధిని (29.03.25 – 09.02.22)
కొడవటిగంటి వరూధిని ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు (కొకు) గారి భార్య.
గుంటూరు లో 29.౦౩.25 ప్రముఖ నటి, రచయిత్రి కొమ్మూరి పద్మావతి, పాత్రికేయులు కొమ్మూరి వెంకట్రామయ్య ల ప్రధమ సంతానంగా జన్మించారు. 97 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 9, 2022 ఉదయం హైదరాబాద్ ‘క్షేమాలయం’ లో కొద్ది రోజులుగా అనారోగ్యం వలన బాధ పడుతూ కన్ను మూశారు. వరూధిని పెదనాన్న గుడిపాటి చలం (దత్తతకు పోవడం వలన ‘గుడిపాటి’ అయారు), తమ్ముడు కొమ్మూరి సాంబశివరావు ‘తెలుగు సినిమా’ పత్రికకు, డిటెక్టివ్ నవలలకు సుప్రసిద్ధులు. ఆఖరి చెల్లెలు ఉషారాణి భాటియా, National book trust తెలుగు విభాగం మాజీ సంపాదకురాలు, రచయిత్రి ’20 లో మరణించారు. వరూధిని గారి కూతురు, ప్రముఖ అనువాదకురాలు, సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత శాంత సుందరి (’47) నవంబర్ ’20 లో కాన్సర్ తో మరణించారు, కొడుకు రోహిణి ప్రసాద్(’49) అణుశాస్త్రవేత్త, సైన్స్ రచయిత 2012 లో అనారోగ్యంతో మరణించారు. తల్లి తండ్రి ప్రోత్సాహంతో ఆమె కొన్ని నాటకాలలో నటించారు. గాయని, లలిత సంగీతంలో నిష్ణాతురాలు, దేవులపల్లి లాంటి వారి ప్రోత్సాహంతో పలు ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నారు. సొంతంగా రచనలు చేయకపోయినా, కేవలం కుటుంబరావు అభిమానిగా (తన 16 వ ఏట నుంచి ఆమె కొకు రచనలను అమితంగా ఇష్టపడేవారు) వారిని వివాహమాడారు. నిలకడ లేకుండా ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలు తిరుగుతూ ఉన్న భర్త మద్రాస్ లో స్థిరపడడానికి ఆమె కారణం అనడంలో అతిశయోక్తి లేదు. 1945 లో దుర్గాబాయ్ దేశముఖ్ తమ వివాహం జరిపించినప్పటి నుంచీ, కొకు రాసిన ప్రతీ రచనను భద్ర పరిచారు. కొకు మరణం తర్వాత విశాలాంధ్ర ప్రచురించిన కొకు సమగ్ర సాహిత్యానికి వరూధిని చేసిన సహకారం చెప్పుకోదగ్గది.
****
(సేకరణ: ఫేస్ బుక్ నుండి)
(రచయిత వరూధినిగారి కుమార్తె కొడవటిగంటి శాంతసుందరి గారి భర్త.)