చాతకపక్షులు (భాగం-11)
(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల)
– నిడదవోలు మాలతి
కాలేజీలో ఎలక్షన్ల జ్వరం మొదలయింది. కాలేజీ ఆవరణ దాటి ఇంటింటికీ పాకిపోయింది. గీతకి శ్యాం ఇచ్చిన ఉపన్యాసాలతోపాటు, తోటి విద్యార్థులమూలంగా కూడా చాలా సంగతులు తెలుస్తున్నాయి. కమ్మవారమ్మాయి రెడ్డివారి చిన్నదానితో పోటీ చేస్తే కమ్మవారంతా ఓపార్టీ. నాయుళ్లు రెడ్లతో కలుస్తారు. బ్రాహ్మలు నాయుళ్లతో కలుస్తారు కానీ కమ్మవారికి మద్దతు ఇవ్వరు. ఎంచేత అని గీత అడిగతే మరేదో కారణం చెప్పేరు. కలవారి పిల్లల్తో లేనివాళ్లు కలుస్తారు. లేనివాళ్లతో ఎవరూ కలవరు. షోగ్గా ముస్తాబయే సుకుమారివెంట అందరూ పడతారు. ఏషోకూ లేనివాళ్లు షోకుపిల్లలని పోకిరీలంటారు. గీతకి ఈఎన్నికలు ఉపనిషత్తు బ్రహ్మపదార్థం కంటే దుర్గమంగా వుంది.
ఇంటిదగ్గర గీతాచార్యుడు శ్యాం పోరు మరీ చిరాగ్గా వుంటోంది. మేరీ మేరీ అంటూ సంధి కొట్టినవాడిలా అదేపనిగా కలవరింతలు. అతను గీతచుట్టూ గిరికీలు కొట్టడం కనకమ్మకి నచ్చడంలేదు. ఆవిడ గీతమీద నిఘా పెంచింది. అసలు విషయం చెప్పలేకా, ఎలా చెప్పాలో తెలీకా సతమతమయిపోతోంది గీత.
ఓ రోజు శ్యాంని అడిగింది, “నీకు మేరీ అంటే ఎందుకంత యావ,” అని.
“అదేమిటి అలా అడుగుతావు కాలేజీలో చదువుతూ. ఆమాత్రం తెలీకపోతే ఎలా? అన్ని విషయాలూ అందరం పట్టించుకోవాలి. అది మనబాధ్యత. మనం పౌరహక్కులు కాపాడుకోవాలి. ఇది మనదేశం.” అన్నాడు ఊకదంపుగా.
“కానీ నీ ఆరాటం అంతా మేరీ గురించే.”
“నువ్వు సంకుచితంగా ఆలోచిస్తున్నావు. మేరీ ఆడపిల్ల కాకపోతే నువ్విలా అడిగేదానివా?”
“మేరీ ఆడపిల్ల కాకపోతే నువ్వింత ఆరాటపడేవాడివా?”
శ్యాంకి చురుగ్గానే తగిలింది ఆప్రశ్న. ఛాతీ విరుచుకుని, డంబాలు పోతూ, “చూడు చెల్లెమ్మా! నువ్విలా అమ్మాయిలూ, అబ్బాయిలూ అంటూ గిరి గీసుక్కూర్చోడం తగదు. నీ దృక్పథం విశాలం కావాలి. అప్పుడు కానీ నీకు లోకజ్ఞానం సంపూర్ణంగా కలగదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయివేపు చూస్తేనే మానభంగం చేసినట్టు మాటాడడం అలవాటయిపోయింది మనవాళ్లకి. అది చాలా సంకుచితం. అదే విదేశాల్లో చూడు. హాయిగా ఆడా మగా చెట్టాపట్టాలేసుకు నిర్భయంగా, స్వేచ్ఛగా తిరుగుతారు. నడిబజారులో ముద్దులు పెట్టుకుంటారు.”
గీత అయోమయంగా చూసింది. తను అడిగినదానికీ శ్యాం ఉపన్యాసానికి పొంతన లేదు.
“అయితే నీకు శ్రద్ధ మేరీ మీదా, ఎన్నికలమీదా?” అంది మళ్లీ మొదటికొస్తూ.
శ్యాం విసుక్కున్నాడు, “అదుగో మళ్లీ నువ్వు మేరీ అమ్మాయి, నేను అబ్బాయిని అన్న ప్రాతిపదికమీదే మాటాడుతున్నావు.”
“కారా?”
“అది కాదు నేననేది. ఎన్నికలు ఈప్రశ్నకి అతీతం. నా అండదండలు ఒక మనిషికి కాదు, ఒక ఆశయానికి.”
“ఓహో” అంది గీత. శ్యాం చాలా గొప్పవాడు కాబోలు, అతని వాదనలు తనలాటి సామాన్యులకి అర్థం కావు కాబోలు అనుకుంది మనసులోనే.
***
ఊళ్లో ఆడపిల్లల కాలేజీలోకంటె ఉధృతంగా సాగుతోంది ఎన్నికల సంరంభం మగపిల్లల కాలేజీలో. నినాదాలతో మొదలయి, వివాదాలు పెరిగి ఒక పార్టీవాళ్లు రెండోపార్టీ నాయకుడిని ఓ అర్థరాత్రి ఒళ్లంతా బ్లేడులతో గీరేసి బ్రిడ్జికింద పారేశారు. ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఎవరో చెప్తే, వాళ్లు పరుగు పరుగున వెళ్లి గుండెలవిసేలా ఏడుస్తూ ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఆస్పత్రిలో పెట్టేరు.
వూళ్లో కలెక్టరు ఈ వుదంతం విని కాలేజీలలో ఎన్నికలు రద్దు చేసేసి, క్లాసు రిప్రజెంటేటివులు ప్రెసిడెంటుని ఎన్నుకోమని ఉత్తరువులు జారీ చేసారు.
ఇది విన్న దగ్గర్నుంచీ గీతకి మనసు మనసులో లేదు. ఎంతో ధైర్యంగా వుండే సత్యం కూడా డీలా పడిపోయింది. ఆస్పత్రిలో వున్న అబ్బాయిని తనకి తెలుసుట. ఇద్దరూ చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారుట.
“నేను వెళ్లి చూసొస్తాను. నువ్వు కూడా వస్తావా?” అని అడిగింది సత్యం.
గీతకి వెళ్లాలని లేదు కానీ సత్యానికి తోడుగా వెళ్తే బాగుంటుందనిపించి సరే నంది.
ఇద్దరూ వెళ్లేరు ఆస్పత్రికి కాలేజినించే నేరుగా.
వరండాలో ఆ అబ్బాయి తల్లీ తండీ కుమిలిపోతూ కూర్చున్నారు. ఒక్కడే కొడుకుట. పుస్తే పూసా అమ్మి చదివిస్తున్నారుట కనీసం బియే అయినా అయితే, తరవాత తమని ఆదుకుంటాడని.
లోపల గదిలో మంచంమీద ఒళ్లు తెలీకుండా పడున్నాడు ఆ అబ్బాయి. ఒంటినిండా కట్లతో. గీత చూడలేక గిరుక్కున తిరిగి బయటికి వచ్చేసింది. మరో రెండు నిముషాల తరవాత సత్యం కూడా వచ్చేసింది. ఇద్దరూ ఆతల్లిదండ్రులదగ్గర శలవు పుచ్చుకుని బయట పడ్డారు.
ఆస్పత్రి ఆవరణలో వేపచెట్టుకింద కూలబడి వెక్కి వెక్కి ఏడిచింది సత్యం. గీతకి ఏడుపు రాలేదు. మెదడూ మనసూ గడ్డ కట్టుకుపోయేయి.
***
హాల్లో కూర్చుని భాగవతం చదువుతున్న కనకమ్మ పాలిపోయిన మొహంతో ఇంట్లో అడుగెట్టిన గీతని చూసి బెదిరిపోయింది ఏమయింది అంటూ.
గీత ఏం లేదంటూనే కుర్చీలో కూలబడింది కానీ ఏడుపు ఆగలేదింక. వెక్కుతూ జరిగిన సంగతీ, తను సత్యంతో ఆస్పత్రికి వెళ్లిన సంగతీ చెప్పింది.
ఆవిడ నిట్టూర్చి గీతని దగ్గరకి తీసుకుని, “మరీ ఇంత బేలమనసయితే ఎలా అమ్మా? వూరుకో. నువ్వసలు ఆస్పత్రికి ఎందుకు వెళ్లేవు,” అంటూ ఆవిడకి తోచిన మాటలేవో చెప్తూ ఓదార్చింది ఆ అమ్మాయిని. సత్యంతో కూడా గట్టిగా చెప్పాలని నిశ్చయించుకుంది ఇలా గీతని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లొద్దని.
ఆరాత్రి గీతకి అన్నం సయించలేదు. కనకమ్మ పక్కన కూర్చుని బలవంతాన నాలుగు ముద్దలు తినిపించింది ఆపిల్లచేత.
ఆతరవాత గీతకి కొంతకాలం పట్టింది కోలుకోడానికి. పుట్టి బుద్ధెరిగి తన సాటి పిల్లల్లో ఇంతటి కక్షలూ, కార్పణ్యాలూ ఎప్పుడూ చూడలేదు ఆ అమ్మాయి. కనకమ్మకి కూడా కడుపు తరుక్కుపోతోంది కానీ ఏం చెయ్యాలో తోచడంలేదు. “నేను చెప్పలేదూ” అంటూ భర్తమీద కూడా విసుక్కుంది ఒకటి, రెండు సార్లు. సినిమాలకి తీసుకెళ్లేరు. ఏదో కల్పించి పండుగ చేసారు నలుగురిని పిలిచి.
వాళ్ల ఆరాటం చూసి గీత చదువుమీద శ్రద్ధ పెంచుకుంది. పుస్తకాలు ముందేసుకు కూచుంటే వాళ్లకీ తనకీ కూడా తెరిపి అనిపించి.
అలాటిరోజుల్లోనే భానుమూర్తి ఫోను చేశాడు శుక్రవారం గీతని ఓమారు ఇంటికి పంపమని. శివరావు ఇంట్లో లేడు. కనకమ్మ ఫోను తీసుకుని “ఏమీ, వదినగారు బెంగ పెట్టుకున్నారేమిటి? అమ్మాయి బాగానే వుందని చెప్పు,” అంది తేలిగ్గా నవ్వుతూ.
“లేదండీ, మీదగ్గరుంటే అమ్మాయి ఇనప్పెట్టెలో వున్నట్టే కదా. పెళ్లిసంబంధం ఒకటి వచ్చింది. పిల్లని చూసుకోడానికి సోమవారం వస్తాం అంటున్నారు” అన్నాడు భానుమూర్తి.
“అదేమిటి? అడుగులోనే హంసపాదు. ఇటు కాలేజీ మొదలయిందో లేదో అప్పుడే పెళ్లిచూపులా?” అంది ఆవిడ. అవిడకి అప్పుడే పిల్లమీద అధికారం వచ్చేసినట్టుంది.
“ఇంకా ఖాయం చేయలేదు కదండీ. చూడగానే అయిపోతాయేమిటి?”
“అయేది కాదనుకుంటూ చూట్టం మాత్రం ఎందుకూ?”
“మాఅన్నయ్యకి కూడా అందరూ మొగపిల్లలే అయితే మేం కూడా ఇలాగే మాట్టాడేవాళ్లమేమో.”
“సరేలే, ఆయన వచ్చేక చెప్తాను” అని ఆవిడ ఫోను పెట్టేసింది. సాయంత్రం శివరావు వచ్చేక భానుమూర్తి సందేశం అందించింది ఆయనకి.
“ఇప్పుడే కదా కాలేజీలో చేరింది” అన్నారు ఆయన కూడా.
“వాళ్ల పిల్ల, వాళ్ల ఇష్టం,” అంది కనకమ్మ చిరాకును దాచుకుంటూ. భానుమూర్తి ఎత్తిపొడుపు ఇంకా బాధిస్తూనే వుంది.
“అది సరేలే. అంతేనా, ఇంకా ఏమయినా చెప్పేరా?”
“త్వరగా పిల్లని ఓ అయ్యచేతిలో పెట్టి బరువు దింపుకోవాలని ఎవరికి వుండదు? వాళ్లని అనడానికి మాత్రం ఏముంది?”
“ఇప్పట్నుంచీ పెళ్లిచూపులంటూ మొదలెడితే ఆపిల్లకి చదువుమీద శ్రద్ధ ఏముంటుంది?”
“పదహారు వెళ్లి పదిహేడు నడుస్తోంది. వాళ్ల ఆత్రం వాళ్లది. మనమేమైనా ఆరుస్తామా తీరుస్తామా?”
శివరావు ఆలోచిస్తూ, గీతని పిలిచి, “మీ బాబాయి ఫోను చేశాడు. ఇంటికి వెళ్తావా?” అని అడిగేడు.
చేటంత మొహం చేసుకుని తలాడించింది గీత.
కనకమ్మ మనసు చివుక్కుమంది. తామెంత గోముగా చూసినా తల్లి సాటి కాదు.
“ఇక్కడ నేను బస్సెక్కిస్తాను. మీబాబాయి వచ్చి అక్కడ దింపుకుంటాడు” అన్నాడు శివరావు.
గీత సరేనంది కానీ కనకమ్మ “పొరుగూరు ఒక్కదాన్నీ పంపిస్తే వాళ్లేం అనుకుంటారో, మీరు కూడా వెళ్లి దింపరాదూ” అంది.
“నాకు కుదరదు. పోనీ శ్యాంని తోడిచ్చి పంపుదామా?”
“వాడెందుకు?” అంది కనకమ్మ వెంటనే. ఈమధ్య శ్యాం గీతచుట్టూ తెగ తిరుగుతున్నాడు. అది ఆవిడకి నచ్చడంలేదు.
ఆఖరికి నాలుగోఅబ్బాయి జగదీశుని తోడిచ్చి పంపడానికి నిశ్చయం అయింది. తనకంటే పదేళ్లు చిన్నవాడు తనకి తోడు ఎలా అవుతాడో గీతకి అంతుబట్టలేదు కానీ ఆమాట పైకి అనలేదు.
ఆరాత్రి శివరావు భానుమూర్తికి ఫోను చేసి గీత జగదీశుతో శనివారం ఉదయం మొదటి బస్సులో వస్తోందనీ, బస్టాండుకి వచ్చి తీసుకెళ్లమనీ చెప్పేడు.
***
విజయవాడలో బస్సు ఆగుతూనే, చిన్నాన్నా, చిట్టీ, బుజ్జీ తనకోసం ఎదురుచూస్తూ కనిపించేరు గీతకి. వాళ్లని చూడగానే మనసు పరవశించిపోయింది. బస్సు దిగీ దిగకముందే తమ్ముడూ, చెల్లెలూ “అక్కా” అంటూ కాళ్ల చుట్టేశారు. జగదీశు గజందూరంలో నిలుచున్నాడు వాళ్లని చూస్తూ. గీత రమ్మని దగ్గరికి పిలిచి, పరిచయాలు చేసింది. ఆక్షణంలో వాడు తనకి అంగరక్షకుడుగా కాక మరో చిట్టితమ్ముడిలా తోచేడు.
గీత మానసికంగా ఓ చూపువాసి ఎదిగింది ఆపూట.
భానుమూర్తి వెళ్లి రిక్షా మాటాడి తీసుకొచ్చాడు. చిట్టీ, బుజ్జీ గీతతో రిక్షా ఎక్కేరు. జగదీశుని సైకిలుమీద వెనకసీటులో ఎక్కించుకున్నాడు భానుమూర్తి. రధాలు కదిలేయి ఇంటివేపు.
ఆతరవాత అరగంటలో పెళ్లిసంబంధంగురించి చెప్పింది కామాక్షి గీతని పక్కన కూచోపెట్టుకుని.
గీత కొంచెంసేపూరుకుని, తలొంచుకుని, “చదువుకుంటున్నాను కదా” అంది సందేహిస్తూ.
“పెళ్లయితే చదువుకోకూడదేమిటి?”
“వాళ్లు చదువుకోనిస్తారో లేదో!”
“మీ చిన్నత్తయ్య కూతురు పెళ్లయింతరవాత బియే చేసి, యమ్మే కూడా చెయ్యలేదూ?”
“పెద్దత్తయ్యకూతురు చదువు చెట్టేక్కేసింది పెళ్లిమూలానే కదా.”
“సరేలే. కనుక్కుందాం వాళ్ల ఆలోచనలేమిటో. సాంప్రదాయకమయిన కుటుంబం. అబ్బాయి బుద్ధిమంతుట్ట. డాక్టరీ చదువుతున్నాడు. బాగా సంపాదిస్తాడు. కట్నం అక్కర్లేదంటున్నారు. పిల్ల నచ్చితే చాలుట.”
డాక్టరీ చదువుతూ, బుద్ధిమంతుడయిన, బాగా సంపాదించే. కట్నంఅక్కర్లేని పెళ్లికొడుకుగురించి ఆలోచిస్తూ గడిపింది ఆరాత్రంతా గీత.
అనుకున్న ఆదివారం వచ్చింది. తెల్లార్తూనే ఇల్లంతా ఒహటే సందడీ, వేళాకోళాలూ …
“ఫీజిచ్చుకోలేను. ఈ బీద బాబాయిని ఓకంట కనిపెట్టి వుండేం.”
“అక్కా, నువ్వు మరి పెళ్లి చేసుకు వెళ్లిపోతే మళ్లీ ఇక్కడికి రావా?”
“ఏవమ్మా, పెళ్లికూతురా, మాలాటివాళ్లం కనిపిస్తామా ఇక” పక్కింటి దొరమ్మ పంచదార అప్పుకొచ్చి మేలమాడింది.
“మాపిల్ల శుక్కురారప్పూటా పుట్టింది, సాక్షాత్తు శ్రీమహాలక్ష్మే. అది మెట్టినింట సిరులొలకవా,” అంది బామ్మ కణతలు పుణికి.
గీతకి వాళ్లమాటలు వింటుంటే ఏదోగా వుంది – పిరికితనమో, ఆనందమో. వెగటో – ఏదీ సరిగా తెలీడంలేదు. లేచి వెళ్లి పెరట్లో పారిజాతం చెట్టుకింద నిలబడి కొమ్మమీద చెయ్యేసింది. పారిజాతాలు జలజల రాలేయి. దూరంగా ఏదో పిట్టకూత తీయగా చెవుల సోకింది. తలెత్తి చూస్తే కొమ్మల్నంటుకుని గొంగళీపురుగులు! ఒళ్లు జలదరించింది. గీత వెనక్కి తిరిగి అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వచ్చింది.
కామాక్షి కేకేసింది, “ఇంకా అలానే వున్నావేమిటి? పద, మొహం కడుక్కుని ఆ వూదారంగు జార్జెట్ చీరె కట్టుకో. మల్లెలూ, కనకాంబరాలూ దండ కట్టి పెట్టేను దేవుడిమంటపం దగ్గర. గౌరిదేవికి దణ్ణం పెట్టుకుని చెండు జడలో తురుముకో. వాళ్లు వచ్చే వేళవుతోంది.”
“ఇంకా ఎక్కడమ్మా మూడేనా కాలేదు. అప్పుడేం ఏం తొందర. అయిదు దాటేక కానీ రాం అన్నారు కదా. వర్జ్యం అని.” అంది గీత బాత్రూంవేపు నడుస్తూ.
మొహం కడుక్కొచ్చి ముస్తాబయి, మరోమారు అద్దంలో చూసుకుంది. తీర్చి దిద్దుకున్న తిలకం, కళ్లని కాటుకా, అప్పుడే మొహం కడుక్కోడంచేత మెరుస్తున్న పెదాలూ, జారిపోతున్న జార్జెట్ చీరా, .. సిగ్గు ముంచుకొచ్చి కొత్త అందాల్ని తెచ్చిపెట్టేయి. నాగమ్మత్త రావడం గమనించనేలేదు.
ఆవిడ వస్తూనే గీతగదిలోకి వచ్చి, చూసి, “అదేం చీరె కట్టడమే పిల్లా, కాలేజిపిల్లలా కట్టాలి గానీ,” అంటూ ద్రౌపదీవస్త్రాపహరణంలో దుశ్శాసనుడిలా ఆచీరె లాగేసి మళ్లీ కట్టసాగింది గీత గోల పెడుతున్నా వినిపించుకోకుండా.
“ఇప్పుడు చూడు. ఏమాత్రం కళ్లున్నవాడేనా దాసోహం అనడో” అంది ఆవిడ ఆ చీరె కట్టడం అయేక.
“ఫో అత్తా” అంది గీత సిగ్గు పడిపోతూ.
“పోక వుండిపోతానేమిటి. నాకే ఈడయిన కొడుకుంటే ఇలా పొమ్మందువా అసలు?” నాగమ్మత్త నవ్వుకుంటూ అమ్మాయి బుగ్గ గిల్లి వంటింట్లో కామాక్షిని పలకరించడానికి వెళ్లింది.
భానుమూర్తి హడావుడిగా వచ్చి పెళ్లివారు వస్తున్నారని చెప్పేడు. పరమేశం రొప్పుకుంటూ వచ్చి చేతిసంచీ కామాక్షికి అందించారు. పళ్లూ, ఆకులూ, వక్కపొట్లాలూ అంటూ. ఆవెంటనే వెనుదిరిగి ఎదురేగి పెళ్లివారిని ‘రండి, రండి’ అంటూ ఆహ్వానించేరు సగౌరవంగా.
పెళ్లికొడుకూ, తల్లిదండ్రులూ, మూడు సంఖ్య మంచిది కాదని అతని అన్నగారూ, మరో ఆడతోడుంటే బాగుంటుందని వదినగారితో పాటు మధ్యవర్తీ, మేమూ వస్తాం అంటూ వెంటబడిన ఇద్దరు పిల్లలూ – వెరసి ఎనిమిదిమంది వేంచేశారు పిల్లని చూడ్డానికి.
“బాగుంది. మొత్తం మగపెళ్లివారంతా వచ్చేసినట్టున్నారు. ఇప్పుడే పెళ్లి చేసేస్తే సరి” అంది వంటింట్లో నాగమ్మ కామాక్షితో.
“ఊరుకో వదినా. వాళ్లు వింటే బాగుండదు,” అంది కామాక్షి ఫలహారాలపళ్లెంతో హాల్లోకి వస్తూ.
కాఫీలవుతుండగా, గీతని పిలుచుకొచ్చింది తల్లి. గీత తలొంచుకు కూర్చుంది.
“మరీ అంత సిగ్గయితే ఎలా అమ్మా! కాస్త తలెత్తు. అంతా మనవాళ్లేలే. తప్పులేదు తల్లీ” అన్నాడు మధ్యవర్తి.
పెళ్లికొడుకు తల్లి అడిగింది, “ఏం చదివింది అన్నారూ?”
“యస్సెల్సీ పాసయిందిండీ. టైపు కూడా నేర్చుకుంది. హిందీ విశారద పాసయింది. ఇప్పుడు ఇంటరు చదువుతోంది గుంటూరులో” అన్నారు పరమేశం కూతురి అర్హతలు ఏకరువు పెడుతూ.
“గుంటూరులో ఎందుకు పెట్టేరు ఊళ్లో కాలేజీ వుండగా?”
“ఆడపిల్లల కాలేజీ అనీ”
“ఇక్కడ కూడా వుంది కదండీ?” పెళ్లికొడుకు తండ్రి అడిగేడు.
అన్నగారు అందుకున్నాడు, “దానికేం గానీ. పెళ్లిమాట తలపెట్టేరు. మరి చదువు మానేస్తుందా అమ్మాయి?”
“దాన్దేవుందండీ. మీరెలా అంటే అలాగే. మాటవరసకి అబ్బాయి యంబీబీయస్సయేవరకూ మీరు తీసుకెళ్లం అంటే అమ్మాయి మాదగ్గరే వుండి బియే పూర్తి చేస్తుంది. లేదంటారా మానేస్తుంది.” అన్నారు పరమేశంగారు.
ఈ “మాటవరస” కామాక్షికి చిరాకేసింది కానీ తమాయించుకుంది. గీతకి ఏమనిపించిందో ఎవరికీ పట్టలేదు.
“ఆమాట ఇప్పుడే ఎందుకులెండి” అన్నాడు పెళ్లికొడుకు నీళ్లు నముల్తూ.
“అవునవును. తరవాత చూసుకోవచ్చు,” అంది వదినగారు.
“మరి పెళ్లి వెంటనే చేసేయగలరా? ఈనెల దాటితే మూఢం” అంది పెళ్లికొడుకు తల్లి.
“మేం చేసేసే వుద్దేశంలోనే వున్నామండీ. పెద్దది మాపిన్ని కళ్లముందే ఆముచ్చట తీరాలని మాకోరిక” అన్నారు పరమేశంగారు.
మరో అరగంట ఆమాటా ఈమాటా మాటాడి మొగపెళ్లివారు కదిలేరు. పరమేశంగారు వాళ్లని కారెక్కించి వెనక్కి వచ్చేరు.
“ఏం అన్నారు?” కామాక్షి అడిగింది.
“త్వరలోనే ఉత్తరం రాస్తాం అన్నారు”.
గీత “సరోజా వాళ్లింటికి వెళ్లొస్తానమ్మా” అని బయల్దేరబోతుంటే కామాక్షి “ఇప్పుడెందుకూ? రేపెళ్లొచ్చులే” అంటూ గీతని కదల్నియ్యలేదు.
గీత మూతి ముడుచుకుని, కట్టుకున్న జార్జెట్ చీరె విప్పి పారేసి, సాదా నూలుచీరె కట్టుకుని మంచం ఎక్కింది ఓ పాతపత్రిక పుచ్చుకుని.
* * * * *
(ఇంకా ఉంది)
చిత్రకారుడు: ఆర్లె రాంబాబు
నిడదవోలు మాలతి ఏడు దశాబ్దాలుగా కథలు రాస్తున్నారు. 2001లో తూలిక.నెట్ ప్రారంభించి, మంచి కథలు ఇంగ్లీషులోకి అనువాదాలు చేసేరు.. ప్రధానంగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను విదేశీయులకి కథలద్వారా తెలియజేయాలన్న ఆశయంతో మొదలుపెట్టిన సైట్ అది. 2009లో తెలుగు తూలిక బ్లాగు ప్రారంభించి తమ కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు ప్రచురిస్తున్నారు. ఆమెసాహిత్యం ఆమెబ్లాగు www.tethulika.wordpress.comలో చూడవచ్చు. కథాసంకలనాలు, వ్యాససంకలనాలు అన్నీ తెలుగు తూలిక బ్లాగులో e-Book formatలో ఉచితంగా లభ్యం. స్వాతంత్ర్యానంతరం, తెలుగు రచయిత్రులు అసామాన్యమైన ప్రాముఖ్యం సంపాదించుకున్నారు. ఆ ప్రాముఖ్యతకి వెనుక గల సాహిత్య, సామాజిక, ఆర్థిక, కౌటుంబిక పరిస్థితులను విశ్లేషిస్తూ రాసిన పుస్తకం Women writers, 1950-1975. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ.