పేషంట్ చెప్పే కథలు
అభినందన & ముందుమాట
–ఆలూరి విజయలక్ష్మి
డాక్టర్లకీ, లాయర్లకీ, పోలీసులకి కూడా జీవితం గురించి చాలా విషయాలు తెలుస్తాయి. పచ్చిగా ఉండే నిజాలు ఎన్నో బయటకు వస్తాయి వాస్తవ జీవితం నుంచి వచ్చే కథలు “కన్నీళ్లు,నెత్తురు” కలిపిన టానిక్ లా ఉంటాయి.చాలా మంది డాక్టర్లు పేషెంట్ ల తో తమ అనుభవాలు చెప్పగలరు.
కానీ పేషెంట్ తమ కష్టసుఖాలను డాక్టర్ గారితో చెప్పుకున్నట్లు మరొకరితో చెప్పుకోరు. ఆ నమ్మకం అటువంటిది. డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి విజయలక్ష్మి గారిని అటువంటి కథలు గుర్తు చేసుకుని రాయమని కోరాను.
అందుకు అంగీకరించి రకరకాల జీవితాల నుంచి వాస్తవ గాధలను వారంవారం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక లో రాసి “-ఇదీ జీవితం ఇంత దుర్భరంగా ఉంటుంది. దీనిని బట్టి మీకు మీరే జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకోండి” అన్నట్లు స్పష్టంగా కథల్లో తెలియజెప్పారు.ఆస్కార్ వైల్డ్ యదార్థ గాధలు కాల్పనిక గాధల కంటే విచిత్రంగా ఉంటాయి అని అన్నారు. నేను అవి ఆలోచింపజేస్తాయి అని కూడా నమ్ముతాను.
– పురాణం సుబ్రహ్మణ్య శర్మ
ఎడిటర్ ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక
*****
కీర్తిశేషులు శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి అభినందన
ప్రియ సోదరి విజయలక్ష్మికి,
ఉత్తరం అందింది. మూడో తేదీ ఇక్కడకు చేరాము. చాలావరకూ వస్తువులు పాడవకుండానే వచ్చాయి. ఇంకా సర్దుబాటు పూర్తి కాలేదు. మేడ మీద కొన్ని పనులు మిగిలినవి. కొత్త జీవితం ప్రారంభం.
ఇక్కడికి వచ్చాక Unpack చేసి మొన్ననే మీ పుస్తకం తీశాను. ఇంతవరకు చదవడానికి తీరికలేదు! నిన్ననే పూర్తి చేశాను.
రచయిత్రి అమృత హృదయం ప్రతి కథలోనూ కనిపిస్తుంది. కానీ ఇక్కడ నాకు ప్రత్యేకంగా ఆనందాన్ని ఇచ్చిన విషయాల్నే పేర్కొంటాను.
- చాలా కథల ప్రారంభంలో ప్రకృతి దృశ్య వర్ణన హృదయంగమం గా, కవిత్వపు కొత్తదనాన్ని గుబాళిస్తూ ఉంటోంది. .ఇరవై నాలుగు గంటలూ పేషెంట్ల తో గడిపే డాక్టర్ కి డాక్టర్ ఇంత ప్రకృతి పరిశీలన ఎలా వచ్చిందబ్బా !
అని కొంత ఆశ్చర్యం. కానీ ఇలాంటి వాటిల్లోనే ఒక వ్యక్తి వైశిష్ట్యం అనుభూతమౌతూ ఆనందాన్నిస్తుంది! “పొగ మంచు తెర వెనుక మెరుస్తున్న ఆకాశపు వెండి చాందినీ… యవ్వనభారంతో వంగుతున్న కన్నెపిల్లల్లా కొబ్బరి చెట్ల సమూహం…” (ఉషస్సు), “ఆకాశం జాలి తలచి జారవిడిచిన వెన్నెల తనక రూపుదిద్దుకుని…” (జ్వాల) “తెల్ల మబ్బులు, నీలి మబ్బులు కబాడీ ఆడుతున్నాయి” (విరిగిన కెరటం), “వర్షపు ధారల్లో చీకటి కాటుకలా కరుగుతోంది” (చిరుదీపం), “సంధ్య అధరాలపై విరిసిన నవ్వులు నక్షత్రాలై ఆకాశం మీద పరుచుకుంటున్నాయి” ( ప్రతిఫలం). ఇవన్నీ నాకెంత ఆహ్లాదాన్నిచ్చే ఎలా చెప్పను?you have not lost your dreams- what a fortune!
2.అన్ని కథల్లో డాక్టరు పేరు శృతి. “పారిజాతాలు” కథలో మాత్రం డాక్టర్ విజయ. ఎందుకని ఆ ఒక్క కథలో ఆ మార్పు? ఈ విశేషమూ నాకెందుకో ఆనందాన్నిచ్చింది! ఎందుకో ఎలా చెప్పను? నేను రాస్తున్నది సాహిత్య విమర్శ కాదు,రివ్యూ కాదు. మా చెల్లెలి మధురమైన వ్యక్తిత్వం నాకెలా అనుభూతమౌతున్నదో చెబుతున్నాను.
- కథలన్నీ పేషెంట్ల రుగ్మతను గూర్చి కాదు, సామాజిక రుగ్మతల గురించి! చెప్పడంలో economy , ఎత్తుగడ, ప్రతి వాక్యమూ అందంగా ,స్పష్టంగా సూటిగా ఉండటం- ఎంత చక్కని తెలుగు వ్రాస్తుందో తనకే తెలియదు మా డాక్టరు గారికి!
4.అన్ని కథల్లోకి నేను మెచ్చుకునే కథ – “కొత్తగాలి” అందులోని New Woman -అమరేశ్వరి- చాలా గొప్ప వ్యక్తిత్వం గల ఆధునిక స్త్రీగా చిత్రించారు. ఈమె Post Chalam Woman . చలం రొమాంటిసిజం ద్వారా స్త్రీకి స్వేచ్ఛనూ ,వ్యక్తిత్వాన్ని ప్రతిపాదించాడు. అమరేశ్వరి existentialist -నాట్ merely a realist – అలాంటి వ్యక్తిత్వాన్ని సరిగా అవగాహన చేసుకొని కథలో చిత్రించినందుకు ఈ రచయిత్రి నా సోదరి అని సగర్వంగా చెప్పగలను.
- భయం కథలోని కరుణ (the pity and the tragedy of it ) నన్ను చాలా సేపు కలచివేసింది. మూడు పేజీల కథలో జీవితాన్ని both its porfundity and absurdity – ఎంత గొప్పగా చిత్త్రించావమ్మా!Congratulations!
మీ నవలలోని ఆర్ద్రత, సౌకుమార్యం- ఈ కథల్లో పరిణతికి వచ్చి గాంభీర్యంగా, గొప్ప అవగాహనగా, హృదయంగమం గా నన్ను ఆకట్టుకున్నది.
– ఆర్.ఎస్.
*****
ప్రయోజనాత్మక కథలు
వైద్య వృత్తిలో వృత్తి ధర్మం అడుగంటిపోతూ , వ్యాపార ధోరణి అంతకంతకూ పెరిగిపోతున్న ఈ కాలంలో ఆదర్శప్రాయురాలైన డాక్టర్ . ఆలూరి విజయలక్ష్మి వంటి ఒక వైద్యురాలు ఇంకా మానవత్వానికి ప్రతీకగా నిలిచి ఉన్నారు అంటే అందరూ ప్రశంసించ తగిన తగిన విషయం. దానికి తోడు డాక్టర్ విజయలక్ష్మి గారు భావుకురాలు,సున్నిత మనస్కురాలు అయిన కథా రచయిత్రి కావడం విశేషం.
రోగులు తమ శారీరక బాధలను వివరంగా చెప్పుకుంటుంటే పూర్తిగా వినడానికి తగిన సమయం,సహనం ఉండవు కొంత మంది వైద్యులకు. ఆ రోగుల శారీరక బాధల వెనుక ఎటువంటి కౌటుంబిక, సామాజిక ,రాజకీయ సమస్యలుంటాయో తెలుసుకోవలసిన అవసరం ఉందనుకోరు చాలామంది వైద్యులు. అటువంటి బాధల్ని చెప్పబోతే, మానసిక మైనవిగానూ రోగులు ఊహించుకుంటున్నవి గానూ, వైద్యానికి సంబంధించని సమస్యలు గానూ కొట్టిపారేస్తారు.
డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి కథల్లో ఆమెకి ప్రతిరూపంగా సృష్టించిన డాక్టర్ శృతి. తన దగ్గరికి వచ్చే పేషెంట్స్ పట్ల శ్రద్ధ ఆప్యాయత చూపించగల మానవి. మనోధైర్యాన్ని ఇవ్వగల కరుణామయి. వారికి సంబంధించిన కుటుంబ సమస్యలు గానీ,ఆర్థిక సమస్యలు గాని, పరిష్కరించడంలోనూ, ఆ సమస్యల్ని సృష్టించే సామాజిక ,రాజకీయ పరిస్థితుల్ని సంస్కరించడం లోనూ వైద్యురాలిగా ఆమె రోగులకు పూర్తిగా సహాయపడలేకపోయినా ,వారి సమస్యలు శ్రద్ధగా వినడమే ముందుగా వారికి కావలసిన ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆమెకి తెలుసు. ఆమె ఇచ్చే సలహాలు సూచనలు రోగులకు కావలసిన మనోధైర్యాన్ని అందిస్తాయి.
వివిధ సామాజిక స్థాయి చెందిన రకరకాల రోగులు డాక్టర్ విజయలక్ష్మి గారితో మనసువిప్పి చెప్పుకున్న బాధల్ని, కష్టాల్ని చిన్న చిన్న కథలు రాసి పాఠకులకు అందించమని ప్రముఖ పత్రికా సంపాదకులు పురాణం సుబ్రమణ్య శర్మ గారు దాదాపు రెండు దశాబ్దాల క్రితం డాక్టర్ విజయలక్ష్మి గారిని ప్రోత్సహించడం వల్ల తెలుగు పాఠకులకు ఎంతో మంచి జరిగింది. ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ధారావాహికంగా “పేషెంట్ చెప్పే కథలు” శీర్షికతో అచ్చయిన వాటిని 1987లో అదే శీర్షికతో గ్రంథంగా ప్రచురించడం జరిగింది. అందులో 28 కథలున్నాయి ఆ తరువాత రాసిన మరికొన్ని కథల్ని జత చేసి ఇప్పుడు మరొక సంపుటంగా ప్రచురించటం ప్రయోజనకరమైన అభినందించదగిన కృషి.
వైద్యులు రోగి నాడి పట్టుకుని చూడటం, స్టెతస్కోప్ పెట్టి ఛాతి పరీక్షించడం, నోరు తెరిపించి నాలుకని పరీక్షించడం, వంటివి పాతకాలపు పద్ధతులైపోయాయి. రోగ పరీక్షలు,రోగ నిర్ణయాలు, యాంత్రికంగా జరుగుతున్న (స్కానింగ్ )ద్వారా జరుగుతున్న ఈ రోజుల్లో, రోగుల్ని స్వయంగా పరీక్షించి వారి కష్టసుఖాలు వినిపించుకోని వారి గురించి ఆలోచించే డాక్టర్ శృతి వంటి వైద్యురాలి చేతి చలవ ఎంతగా ఉంటుందో మనం ఊహించవచ్చు.
పేషెంట్ చెప్పే కథల్ని తాము విన్నవి విన్నట్లుగా అంటే డాక్టర్ శృతి విన్నట్లుగా యధాతధంగా రాయలేదు డాక్టర్ విజయలక్ష్మి గారు, ఒక కథకురాలిగా శృతి వైపు నుంచి ,రోగుల వైపు నుంచి వారి వారి ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని, వారి చుట్టూ ఉన్న పరిసరాల్ని , పరిస్థితుల్ని సంక్షిప్తంగా ,ఆసక్తికరంగా మూడు నాలుగు పేజీల చొప్పున రాశారు. ఈ కథల్లోని ముఖ్య లక్షణం సమస్యల్ని చిత్రించడమే- పరిష్కారాన్ని చూపడం కాదు . రోగుల శారీరక బాధలకు వైద్యం చేస్తూ, వారి బాధలకు కారణమైన సమస్యల్ని రోగులూ ,పాఠకులూ అవగాహన చేసుకునేట్లు చేశారు డాక్టర్ విజయలక్ష్మి గారు. రోగులు చెప్పే కథల్ని డాక్టర్ శ్రద్ధగా వినడం వల్ల వారి సమస్యలకు పరిష్కారాలు ఏమిటో కొన్ని సందర్భాల్లో వారికే స్ఫురించేటట్లు చేయగలిగారు.
ఈ కథలు చెప్పుకున్న పేషెంట్స్ చాలా మంది స్త్రీలే . మధ్యతరగతికి, బడుగు వర్గానికీ చెందిన స్త్రీలు.రోగులు చెప్పే కథలు వింటూ డాక్టర్ శృతి స్పందించిన తీరు లో రచయిత్రి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి అభిప్రాయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆమె మొదటి నుంచి సమాజంలోని పురుషాధిపత్యాన్ని , స్త్రీల అణచివేతనీ నిరసిస్తూనే ఉన్నారు. స్త్రీలు పురుషాధిపత్యం సహిస్తూ,కష్టాలు అనుభవిస్తూ నిస్సహాయంగా బలహీనులుగా ఉండకూడదని,సంయమనాన్ని , సామరస్య ధోరణిని వదులు కోకుండానే ఉన్న పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోమని స్నేహపూర్వకంగా ఉద్బోధిస్తూనే ఉన్నారు. స్త్రీలను హింసించే నీచ ధోరణి మానుకుని,పురుషులు తమ మనస్తత్వాన్ని,ప్రవర్తననీ మార్చుకోవాల్సిన అగత్యాన్ని సూచిస్తూనే వున్నారు.
అయితే డాక్టర్ విజయలక్ష్మి గారు ఏకపక్షంగా ఆలోచించలేదు.కొందరు స్త్రీలలో ని చెడు లక్షణాల్ని, కొందరు పురుషులు మంచితనాన్ని , కూడా తమ కథల్లో కొన్ని పాత్రల ద్వారా చూపించారు. ఉదాహరణకి ఈ కథా సంపుటం లో మొదటి కథే -”వీరనారి “-ఒక “గయ్యాళి “భార్య గురించి.
‘ “మా ఆవిడ కొట్టింది “అని సిగ్గు పడుతూ చెప్పాడు గోపాలం.” అనే వాక్యంతో మొదలవుతుంది కథ. “నా భార్య ఎప్పుడూ ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది . సినిమాల్లోలా చెట్టాపట్టాలు వేసుకుని చెట్లు, గుట్టలు పట్టుకొని తిరిగితే ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్లేదెలా? అని ఆ భర్త చెప్పినదాన్ని బట్టి అసలు వ్యాధికి మూలం ఎక్కడ ఉందో అర్థమవుతుంది . సినిమాల్లో “ప్రేమ” పేరుతో చూపిస్తున్న యువతీ యువకుల వెర్రి చేష్టలు , అనేక సందర్భాల్లో పురుషులు అనుసరించే హింసాత్మక ధోరణులు సమాజంలో స్త్రీ పురుషుల్ని, పిల్లల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో చాలాకాలంగా చూస్తున్నాం. ఈనాడు టీవీలో బూతు సినిమాలు చూసి యువతీ యువకులు ప్రభావితమై కొందరు పెడదారులు తొక్కడం,మనోవైకల్యం కి గురి కావడం చూస్తున్నాం. ఆ విధంగా ప్రభావితుడైన ఒక భర్త అమాయకురాలైన భార్యని హింసించడం తో భయ విహ్వలురాలైన ఆ అమ్మాయి చెప్పిన కథని “పొగచూరిన సంస్కృతి” అనే కథగా కొత్తగా రాశారు డాక్టర్ విజయలక్ష్మి గారు.
ఆధిపత్య ప్రదర్శన,ఆత్మన్యూనతా భావం, వైద్య విధానం పట్ల అజ్ఞానం, కులవివక్ష, లింగవివక్ష,ధన కాంక్ష, బాలికలపై అత్యాచారాలు ,పరస్త్రీ వ్యామోహం, డబ్బు కోసం బలవంతంగా వ్యభిచారం చేయించడం, పిల్లల్ని పెంచి పోషించలేని గర్భ దారిద్ర్యం,పెళ్లిళ్లు కావేమో నని ఉన్న జబ్బు ని కప్పెట్టి సరి అయిన వైద్యం చేయించక పోవడం,యువకులు నీతి నియమాలను లెక్కచేయకుండా,కష్టపడి పని చేయకుండా, సోమరితనాన్ని అలవరచుకోవడం, చదువు మీద శ్రద్ధ చూపించకుండా దైవభక్తిని పట్టుకుని భవిష్యత్తు అంటే భయపడటం ,ఆడపిల్ల సంపాదన మీద ఆధార పడుతూ కుటుంబ సభ్యులు ఆమెని దోపిడీ చేయడం, ఒకవైపు డబ్బుకోసం రక్తాన్ని అమ్ముకుంటూ, అయిన వారికి రక్తం ఇప్పించుకోలేని దారిద్య్రం,వస్తు వ్యామోహానికి లోబడి స్త్రీలు అవినీతి మార్గాన్ని అవలంబించి డబ్బు సంపాదించడం, మొదలైన అనేక సమస్యల్ని చిత్రిస్తూ, అవి స్త్రీ పురుషుల్లోనూ పిల్లల్లోనూ ఎటువంటి శారీరక ,మానసిక వ్యాధులకు దారితీస్తున్నాయో , సమాజం ఎటువంటి దుస్థితికి దిగజారుతుందో తెలుపుతూ వాటి గురించి అందరూ సంస్కరణాత్మకంగా ఆలోచించాలానే పెద్ద ప్రయోజనం తో రాసిన చిన్న కథలు “ఈ పేషెంట్ చెప్పే కథలు”.
రోగుల బాధలకు కారణాలు చూపిస్తూ,ఈ అసాధారణమైన సామాజిక ప్రయోజనంతో కూడిన కథలు ఆలోచనాత్మకంగా రాసిన డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
–అబ్బూరి ఛాయాదేవి
*****
డా.ఆలూరి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి, వైద్యులు, సంఘసేవకులు. దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రచించారు. అనువాదాలు కూడా చేసారు. వీరి రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. వనిత మాసపత్రికలో ‘ఆరోగ్య విజయాలు’ అనే శీర్షికను నిర్వహించారు.