రెండు వియోగాలు ..నాలుగు విషాదాలు
(ఎండ్లూరి సుధాకర్ కి నివాళిగా-)
-ఎ.రజాహుస్సేన్
(ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ జనవరి 28, 2022న కన్నుమూసిన సందర్భంగా వారికి నెచ్చెలి నివాళులు తెలియజేస్తూ ఎండ్లూరి జీవితాన్ని దేవిప్రియ జీవితంతో పోలుస్తూ రజాహుస్సేన్ రాసిన ఈ వ్యాసాన్ని అందజేస్తోంది!)
పులి నోటికి పూర్తిగా చిక్కిన జింకలు…..
ఆ ఇద్దరు ‘కవులు’ ..!!
*రెండు వియోగాలు ..నాలుగు విషాదాలు..అను
Made for Each కథలు….!!
*దేవి ప్రియ..ఎండ్లూరి సుధాకర్ ల జీవన సారూప్యతలు.!
*ఒకరు తారాన్వేషణలో…..
.ఇంకొకరు ‘రాజీ’ లేని పయనంలో …!!
ఎంత చిత్రం? ఎంత విచిత్రం? ఆ విధికెందుకింత పగ.?
ఆ కవులపై ఎందుకింత కక్ష….అక్షర ప్రేమికులంటే…..
ఇంత అలుసా?
ఆప్పుడు ” దేవి ప్రియ “.. ఇప్పుడు ” ఎండ్లూరి సుధాకర్”. ఇద్దరూ విధి కాటుకు బలైన వారే.అంతేనా ఈ ఇరువురి
జీవితాల్లో ఎన్నో సాదృశ్యాలు కనిపిస్తాయి. ఇరువురూ పేద కుటుంబాల నుంచి వచ్చినవారే..ఇరువురూ సామాజికంగా అణగదొక్కబడిన వర్గాలకు చెందిన వారే..జీవిత పోరాటంలో ఇరువురూ ఇబ్బందులు పడిన వారే…ఇవన్నీ పక్కన పెడితే…ఇరువురూ గొప్ప ప్రేమికులు కావడం విశేషం.ఎంతగా అంటే…తమ అర్ధాంగులకోసం ప్రాణం ఇచ్చేంతగా.!
మానవ సంబంధాలు బలహీనమై, వివాహవ్యవస్థ చిన్నా భిన్నమై పోతున్న ఈ కాలంలో తాము బెటర్ హాఫ్ ల…కోసం ఇంతగా కలవరించి,పలవరించిన వారు వుండరేమో ? అనిపిస్తోంది.!!
భార్యంటే వీళ్ళకెంత ప్రేమ..అర్థాంగిటే ఎంత మమకారం. ప్రేమికులు గురించి ఎన్నో కథలు విన్నాం. రోమియో, జూలియట్,లైలా మజ్ను,పార్వతీ దేవదాసు,హీర్ రాంజా.. ఇవన్నీ కథలుగా నే మిగిలిపోయాయి.కానీ అంతకుమించిన ప్రేమను మనకాలంలో,మన కళ్లతోనే చూశాం.ఆర్ధాంగి లేని లోకం నరకప్రాయమని భావించిన నిజ ప్రేమికులు
మన…’దేవి ప్రియ,’ ‘ ఎండ్లూరి సుధాకర్.’ .!!
అర్థాంగి వెళ్ళిపోతే జీవితమే లేదన్న వీళ్ళ ప్రేమకు,ఆప్యా యతకు,అనురాగానికి ఏ పేరు పెడితే సరిపోతుంది..? అర్థాంగి దూరం కావడంవల్ల వీళ్ళు పడిన బాధ,అనుభవించిన చిత్రవధ పగవాళ్ళక్కూడా వద్దు. ఇరువురూ ‘మృత్యువు ‘అనే ..పులినోటికి చిక్కిన జింకలే.ఆ దరిద్రపు డయాబెటిస్ వల్ల ఇరువురూ చెరో కాలు పోగొట్టుకున్నారు. చివరకు మృత్యువాత పడ్డారు…!
“ఎడమ పాదం మీద
ఎంతో అమాయికంగా
ఉదయించిన కొనగోరంతటి
చిట్టి చంద్రవంక అటుసాగి
ఇటు సాగి అటు ఎగిరి ఇటు ఎగిరి
ఇటు పొరలి అటు పొరలి
ఇటు లేచి అటు లేచి
పాదపదపద పత్రతతినొక
భయదకానన హేలచేసి
దష్ట దహనపు కీలచేసి
కాలినిండా కణకణానా
ఢమరుకాలై త్రిశూలాలై
జివ్వు జివ్వున రివ్వున రివ్వున
నొప్పి కణికలు చిందుతుంటే
ఏకమై ఆ ఇనుడు భానుడు
కారు చిక్కని ఏ నిశీథిలో
చిక్కుకున్నారో.?
….దేవీప్రియ.!!
డయాబెటిస్ వల్ల అనారోగ్యం పాలైన దేవిప్రియను నిమ్స్ఆస్పత్రిలో చేర్చారు. గ్యాంగ్రిన్ తో మోకాలు వరకుఆయన ఎడమ కాలును తొలిగించారు. ఇది జరిగిన కొన్నిరోజుల్లోనే ఆయన పరిస్థితి వికటించింది. విషమించింది.
“పులి నోటికి పూర్తిగా చిక్కినట్టే వుంది ఈ జింక.!” అంటూ దేవి ప్రియ తన మరణాన్ని చాలా ముందుగానే
ఊహించారు.
కవుల మాటలు ఊరికే పోవు అంటారు.మరణానికి ముందు ఆయన్ను కలిసిన వారితో ఎంతోతాత్వికంగా మాట్లాడేవారు.. బాధ పడుతూ బతకడం అవసరమా? అన్నారు.. చూస్తూ చూస్తూ వుండగానే…….దేవి ప్రియ గారు మనల్నందరిని ఒదిలి తన ” రాజీ “దగ్గరకు వెళ్ళిపోయారు..ఇప్పుడు ఎండ్లూరి సుధాకర్ గారుకూడా మనల్ని వదిలేసి ” హేమలత ” గారి దగ్గరకెళ్ళి పోయారు. ఎండ్లూరి సుధాకర్ గారు కూడా చివరిరోజుల్లో తాత్వికంగా మాట్లాడేవారట..ఆయన కూడా షుగర్ వ్యాధి పీడితులు…మృత్యువు అనే పులి నోటికి చిక్కిన జింకే..!!
“అప్పుడప్పుడూ చావుచింత
చీకట్లో కుక్కలా
వెంటపడుతూ వుంటుంది
…………….
అపరిచిత యువతిగా
మృత్యు రాణి తారసపడితే
ముద్దుపెట్టుకోడానికి వెనుకాడని
ఆమెకెవరైనా చెప్పండి
నాతో లేచిపోయే ధైర్యాన్ని
సంపాదించుకోవాలని”
..ఎండ్లూరి
ఇక..రాగంలో, సరాగంలో, అనురాగంలో, అర్థాంగిపై
ప్రేమలో ఈ కవులు ….’ ఇద్దరూ ఇద్దరే.’.!!
*హేమలతా” రాగం……ప్రేమ పరాగం..!!
హేమలత గారంటే ఎండ్లూరి సుధాకర్ గారికి ప్రేమ అనేకంటే’ప్రాణం’ అనడం సబబుగా వుంటుందేమో.
ఆమె అర్ధాంగి కాదు….తన శరీరంలో ,మనసులో
ఆమే పూర్తిగా నిండి వుండేది…!.
అలాంటి హేమ గారిని ఆఖరిసారి సుగంధ లేపనాలతో అత్తరు పూతలతో ఆమెకిష్టమైన పింక్ కలర్ శారీతో
ఆమె పార్ధివదేహాన్ని క్లియోపాత్రలా సింగారించి , పెళ్లి కూతురిలా ముస్తాబు చేశారు.అయితే సుధాకర్ మాత్రం
ఆమె తొలి రేయి కట్టిన పెళ్ళినాటి చీరను ఎవరూ….
చూడకుండా అశ్రు నయనాలతో ముద్దాడి ఆమె పాదాల
దగ్గరజారవిడిచారు.అది ఉత్త నూలు పోగుకాదు.వాడే
సిన వస్త్రము అంతకంటే కాదు. ఆయన మనసు అగ్గిపెట్టెలో మట్టి తగలకుండా, మాసి పోకుండా……
భద్రంగా మడిచిపెట్టారు.
ప్రేమకు ఇంతకంటే మించిన పరాకాష్ట ఏముంటుంది?
ప్రేమ భౌతికమైంది కాదు…అంతకు మించి.
మనిషి వున్నాలేకున్నా,ప్రేమ మాత్రం కలకాలం నిలిచే వుంటుందనడానికి ఎండ్లూరి సుధాకర్ గారే ఓ సజీవ ఉదాహరణ.
“ప్రతి దీపాన్ని
పరీక్షగా చూస్తున్నా
ఏ దీపంలోనైనా
నీ రూపం కనిపిస్తుందోనని
ఆకాశంలో తారావళి
ఆశ్వయుజ మాస
కార్తీక దీపావళి
ఆర్తిగా నన్ను పలకరిస్తున్నాయి
ఎక్కడికీ వెళ్ళలేదు
నీ హేమవల్లి
మీతోనే ఉంది ఆ తల్లి
అనునయిస్తున్నాయి”
…. ఎండ్లూరి సుధాకర్.
దీపావళి పండగొస్తే..ఆ ఇంటల్లా సందడే. హేమ గారులేని దీపావళి ఎండ్లూరి సుధాకర్ ఊహకు కూడా అందనిది..ఒకనాడు ఆరోజు రానేవచ్చింది.హేమ లేని దీపావళి అది..చుట్టూ దీపాల వరుస..దివ్వెల వెలుగున్నా…హేమలేదు..వెలుగూ లేదు..అందుకే”ప్రతి దీపాన్ని పరీక్షగా చూశారు సుధాకర్. ఏ దీపంలోనైనా ఆమె రూపం…..కనిపిస్తుందేమోనన్న ఓ చిన్ని ఆశ.
ఆకాశంలో తారావళి ఆశ్వయుజ మాసకార్తీక దీపావళి
ఆర్తిగా పలకరిస్తూ…నీ హేమవల్లి ఎక్కడికీ వెళ్ళలేదు
మీతోనే ఉంది ఆ తల్లి అంటూ..అనునయిస్తున్నట్లుం
దట. ప్రేమ తారాస్థాయికి చేయడమంటే ఇదే..ఆమె
లేని దీపావళి కూడా అమవాసే..కదా!
“కునుకు పట్టదు
కుతికెల దాకా ఆమె జ్ఞాపకాలే
మనసు ముద్ద ముట్టదు
కంటి నిండా ఆమె సజీవ చిత్రాలే
భౌతికంగా బతుకు
బాగానేవున్నా
ఎవరికీ చెప్పుకోలేని
ఏదో డొల్లతనం
గతించిన స్మృతులు
విడిచి వెళ్లిన మృతులు
అనుకున్నంతనే
ప్రత్యక్షమైతే ఎంత బావుండు “
…..ఎండ్లూరి సుధాకర్..!!
కునుకెలా పడుతుంది..ఆమె లేనిదే.! కుతికెలదాకా వున్న జ్ఞాపకాల్ని ఓ పట్టాన మరువలేం కదా! ముద్దూ,ముచ్చటే కాదు..’ముద్ద’ కూడా ఆమెతోనే..మరి ఆమె లేకుండా ముద్దెలా గొంతు దిగుతుంది? ఓ పక్కన కుతికెల దాకా ఆమె జ్ఞాపకాలే కూరుకుపోయుంటే….ఇక ముద్ద ముట్టినా అదెలా దిగు
తుంది..? ఎంతో వేదన.తీరని శోకం ఇది.రెండు పచ్చని చిలుకల్లో ఒకటి ఎగిరిపోయింది..ఆ రెండో చిలుక ‘ ఒంటరైంది.’!!
“నన్నెవరైనా
దేవలోకం పంపించరా!
హేమసన్నిధిలో
దివ్యజీవితం గడిపేస్తాను “.(ఎండ్లూరి)
హేమ గారు దూరమైనప్పటినుంచీ..ప్రతీ క్షణం రంపపు కోతను ఆనుభవించారు..ఇలాంటి ప్రేమికులు బహు అరు
దుగా వుంటారు. సుధాకర్ వంటి జీవితం భాగస్వామిని
పొందిన హేమగారు ఎంత అదృష్టవంతురాలో కదా!
ఈ దాంపత్య ధర్మoలోపండుటాకుల్లా రాలిపోవాలని
పక్షుల్లా నేలకు కూలిపోవాలని,అమాయకులైన ఆలు
మగలు అనుకుంటారు..కానీ…ఏ చుక్క ఎప్పుడు అదృ
శ్యమవుతుందో ఏ ఆకాశం చెప్పదు..ఏ చిలుకా నోరు
విప్పదు.
ఆమె కోసం ఎంతకాలమైనా..ఎదురు చూస్తానంటూనే..
ఆగలేక వెళ్ళిపోయారు ఎండ్లూరి మేష్టారు..!
ఏదో ఒక క్రిస్మస్ రాత్రి యింటి గుమ్మం ముందు దేహ
ధారిత ధృవతారలా ఉదయిస్తుందని రేబవళ్ళూ….. స్వప్నిస్తూనే వున్నారు.ప్రతి నక్షత్రాన్నీదుర్భిణీ నేత్రాల
తో గగనమండలమంతా …గమనిస్తూనే వున్నారు..
ఇంతలో..”ఎండ్లూరి సుధాకర్ గారు ఇకలేరన్న ” వార్త “
వినాల్సి వచ్చింది.
*రాజీ ” లేని….”దేవి” ప్రియ…!!
తాను నలభై యేళ్ళ పాటు ముద్దుగా ‘ రాజీ ‘‘..అనీ,
‘దే ‘ అనీ, ‘ఎంకీ’ అని పిలుచుకున్న అర్థాంగి “ఆమె”.
అబ్బూరి..తాడికొండ..రాజ్యలక్ష్మి “.అరవై అయిదేళ్ళ
( 2014 )జీవితంలో:“ఆమె” దూరమైన రోజు నుంచి “దేవిప్రియ” జీవితంలో మసకచీకటి కమ్ముకుంది.
చెప్పలేని శూన్యత ఆవరించింది.
దేవి ప్రియకు ” రాజీ ” వియోగం శాపమైంది.రాజీ నిష్క్రమణ ఒంటరితనాన్ని మిగిల్చింది.మనిషితనం ఇంకని వారెవరికైనా ఇటువంటి రంపపుకోత తప్పదేమో? గుండె తడి ఉన్న మనిషిలోని బాధను * ప్రేమ ” డామినేట్ చేస్తుంది.! స్మృతి కావ్యమై (ఇంకొకప్పుడు) మున్ముందు నిలుస్తుంది..
*అప్పుడు
ఇక్కడ కొన్ని నక్షత్రాలు
పగలూ రేయీ కూడా వేలాడుతూ వుండేవి
అప్పుడు
ఈ గుమ్మానికి
కొన్ని మెరుపు తీగల తోరణాలు
రుతువులతో పనిలేకుండా
చమ్కీలద్దుతూ
ఊగుతూ వుండేవి
అప్పుడు
మన పడక గదిలో నీకిష్టమైన నిశ్శబ్దాలు
చిరుగజ్జెల వెండి పట్టాలతో తియ్యని
సవ్వడి చేస్తూ పానుపు చుట్టూ
తిరుగుతూ వుండేవి …!.” (చోరిణి )
మనిషి లేకున్నా…ఆ మనిషి తాలూకు జ్ఞాపకాలు వైఫై లాగే మన చుట్టే తిరుగుతుంటాయి.అర్థాంగి తాలూకు ఆకుపచ్చని జ్ఞాపకాలు దేవిప్రియను చుట్టుముట్టి మళ్ళీ గడిచిన కాలంలోకి చేయి పట్టుకొని తీసుకు వెళ్ళాయి.
ఇంట్లో ఏ మూల చూసినా…. ఆమె కాలి అలికిడే ,ఆమె చిరుగజ్జెల సవ్వడే వినిపించడం ఆమెతో కవి ఎంతగా మమేకమయ్యాడో అర్థమవుతుంది.అవును మరి ఆమె అతని మానస చోరిణి.
“ఈ దిగులు
భూమికన్నా బరువు
ఈ వగపు
ఏటికన్నా లోతు
ఈ కోత
కత్తికన్నా పదును
ఈఅదును
క్షణంకన్నా కురుచ”
‘రాజీ’ శారీరకంగా దూరం కావచ్చు గానీ,మానసికంగా ఆమె దేవీప్రియ తోనే వుంది.ఆయనశరీరంలోనే కాదు,
గుండెల్లో కూడా అర్థభాగమై అలానే వుంది. అప్పుడే కాదు..ఇప్పుడూ.. ఎప్పుడూ అలానే వుంటుంది కూడా.!!
అందుకే “భూమిలో అంతర్థానమైపోయిన ‘ఆమె ‘ దేవిప్రియ అంతర్యవనిక మీద ఎప్పటికీ అనుక్షణం సాక్షాత్క
రిస్తూనే వుంటుంది.అనాఛ్ఛాదితమయిన తన ఛాతీ…. చర్మానికి పిన్నీసుతో గుచ్చిన నల్ల రిబ్బను ముక్కలా
రెప రెప లాడుతూ…”.!!
“ఎన్ని జీవితాలు పాటు ఇంకా ఇలా
ఎంత ఏడ్చినా,వెక్కిళ్లు పెట్టినా
రాజీ నా కోసం మరలి వస్తావా!”(దేవిప్రియ)
దిగులు..దిగులు..ఒకటే దిగులు…దిగులు మేఘం
హృదయాన్ని కప్పేసింది.మనిషిలో దిగులుమేఘం
వర్షించ సాగింది.వాన కాస్తా జోరు వానగా మారింది.
మనిషిని అల్లకల్లోలం చేసింది.హృదయాన్ని అతలా
కుతలం చేసి కుదిపేసింది..ఎంత బాధ…ఎంత బాధ..!!
అర్థాంగి లేని దిగులు భూమికన్నా బరువు..
ఈ వగపు ఏటికన్నా లోతు..
ఈ గుండె కోత కత్తికన్నా పదును…
ఈ అదును క్షణంకన్నా కురుచ.”!!
మనిషతనం ఇంకని వారెవరికైనా రంపపు
కోత తప్పదు…
*గుప్పెడు గుండెల్లో ..సముద్రమంత ప్రేమను
దాచుకోవడం ఈ ఇద్దరు… (దేవి ప్రియ, ఎండ్లూరి
సుధాకర్.. ) కవులకే చెల్లింది.!!
*****
ఎ.రజాహుస్సేన్… పుట్టింది .పెరిగింది..ఇంటర్ వరకు చదివింది..మంగళగిరిలో.. డిగ్రీ.గుంటూరు హిందూ కాలేజ్. ఎమ్ఏ, నాగార్జున యూనివర్సిటీ. డిగ్రీ కళాశాల లెక్చరర్ గా ప్రారంభమై.. జర్నలిస్టు(ఈనాడు) గా కొంతకాలం పనిచేసి, ఆతర్వాత రాష్ట్రప్రభుత్వ సర్వీసు.. అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ లో జాయింట్ డైరెక్టర్ గా పదవీ విరమణ.50యేళ్ళుగా రచనా జీవితం.ప్రచురించిన పుస్తకాలు (10) తక్కువే.ఓ 100 పుస్తకాలకు సరిపడా రచనలు. ప్రస్తుతం ఫేస్బుక్ వేదికగా సాహిత్య వ్యాసంగం.